సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం చేపట్టిన భూసేకరణలో భూములు కోల్పోయిన ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులకు అందాల్సిన పరిహారం చివరి రూపాయి అందేంత వరకు వారి భూముల్లో అడుగుపెట్టొద్దని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. పునరావాసం, పునర్నిర్మాణ ప్రయోజనాలను అందించకుండానే ఆ భూములను స్వాధీనం చేసుకొని వాటిని భారీ యంత్రాల సాయంతో చదువును చేస్తున్నారనేందుకు ఆధారాలున్నాయని తెలిపింది. అందువల్ల ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో ఏ ఒక్క అధికారి ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసింది. బాధితులకు పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాలను వర్తింపజేయాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ. రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన అధికారులపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
పోలీసుల సాయంతో ఖాళీ చేయిస్తున్నారు...
భూ నిర్వాసితులకు కల్పించాల్సిన ప్రయోజనాలను కల్పించకుండానే అధికారులు వారి భూములను స్వాధీనం చేసుకొని ఖాళీ చేయిస్తున్నారని పిటిషనర్లు కోర్టుకు చెప్పారు. పోలీసులను సైతం ఉపయోగిస్తూ బాధితులపై బలప్రయోగం చేస్తున్నారని నివేదించారు. బాధితుల భూముల్లోకి భారీ యంత్రాలను తీసుకొచ్చి చదును చేస్తున్నారని తెలిపారు. ఈ పనులకు సంబంధించిన ఫొటోలను న్యాయవాది ధర్మాసనానికి సమర్పించారు. ఫొటోలను పరిశీలించిన ధర్మాసనం ఆ భూముల్లోంచి అధికారులందరినీ బయటకు పంపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె. రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ బాధితులకు ఇప్పటికే రూ. 500 కోట్లు ఇచ్చామని, మరో రూ. 350 కోట్లకు చెక్కులు సిద్ధం చేశామని, పట్టాలు కూడా ఇచ్చామన్నారు. చట్టం చెబుతున్న దానికన్నా ఎక్కువ ఇస్తున్నామన్నారు.
లక్ష్మీదేవి వస్తుంటే ఎవరైనా వద్దంటారా?
ప్రభుత్వం చెబుతున్న దానిని గుడ్డిగా నమ్మడం సాధ్యం కాదన్న హైకోర్టు... బాధితులకు చేసిన సాయంపై పూర్తి ఆధారాలను సమర్పించాలని ఆదేశించింది. కొందరు బాధితులు ఏఏజీ తీసుకోకుండా రాజకీయ కారణాలతో ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ ఏఏజీ చేసిన వాదనతో ధర్మాసనం విభేదించింది. ‘లక్ష్మీదేవి వస్తుంటే ఎవరైనా వద్దంటారా? మీరు ఎవరికి పరిహారం ఇవ్వాలనుకుంటున్నారో వారిని మా సమక్షానికి తీసుకొచ్చి ఇవ్వండి. వారు ఎందుకు తీసుకోరో మేమూ చూస్తాం. కోర్టు ధిక్కారణ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను సమర్థించొద్దు. ఇది వారికి సమస్యలు సృష్టిస్తుంది’అని వ్యాఖ్యానిస్తూ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.
చివరి రూపాయి ఇచ్చేదాకా అడుగుపెట్టొద్దు
Published Thu, May 2 2019 2:48 AM | Last Updated on Thu, May 2 2019 2:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment