Mallana Sagar Reservoir
-
ఏరియల్ వ్యూలో మల్లన్నసాగర్‌ను వీక్షించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏరియల్ వ్యూ ద్వారా మల్లన్నసాగర్ జలాశయాన్ని వీక్షించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రయాన్ని సందర్శించిన అనంతరం ఆయన హెలికాప్టర్ ద్వారా గజ్వేల్‌లోని నివాసానికి బయల్దేరి వెళ్లారు. మార్గమధ్యలో మల్లన్నసాగర్‌ను ఏరియల్ వ్యూ ద్వారా సీఎం వీక్షించారు. -
‘మల్లన్న’ చెంతకు గోదారి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతలు పథకంలో భాగంగా మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి భారీ సామర్థ్యంతో చేపడుతున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నెల 18 లేదా 20న వేదపండితుల పూజలు, ఆశీర్వచనాల మధ్య తుక్కాపూర్ పంప్‌హౌస్‌లోని మోటార్లను ఆన్ చేయడం ద్వారా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎత్తిపోతలు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు ప్రభుత్వం ప్రాథమిక సమాచారం అందించింది. ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించింది. రంగనాయక్‌సాగర్ టు మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ఈ ఏడాది జూన్ నాటికే సిద్ధంచేయాలని భావించినా కరోనా లాక్డౌన్, తొలకరి వర్షాల కారణంగా పనులు కాస్త ఆలస్యమయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ చేసేలా పనులు పూర్తయిన నేపథ్యంలో, ఈ ఏడాది మొదట 10 టీఎంసీలు నిల్వ చేయనున్నారు. ఆ తర్వాత ఐదేసి టీఎంసీల చొప్పున నిల్వ పెంచనున్నారు. రంగనాయక్‌సాగర్‌లోని నీటిని తుక్కాపూర్ వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌లోని 8 మోటార్ల ద్వారా మల్లన్నసాగర్‌కు తరలించేలా ఇప్పటికే పనులన్నీ మొదలయ్యాయి. ప్రస్తుతం రంగనాయక్‌సాగర్‌లో 3.5 టీఎంసీలకు గానూ 3 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ఇక్కడి నిల్వలు ఖాళీ అయితే మిడ్‌మానేరు నుంచి నీటిని తరలిస్తూ మల్లన్నసాగర్ నింపనున్నారు. మిడ్‌మానేరులో ప్రస్తుతం 27.50 టీఎంసీలకు గానూ 25 టీఎంసీల మేర నిల్వలున్నాయి. అత్యంత ఎత్తున.. భారీ సామర్థ్యంతో.. ►కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఒడిసి పట్టుకొని రెండు సీజన్లలోనూ ఆయకట్టుకు నీటి లభ్యత పెంచే లక్ష్యంతో మొత్తం 141 టీఎంసీల సామర్థ్యంతో 18 రిజర్వాయర్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో అత్యంత భారీగా ఏకంగా 50 టీఎంసీల సామర్థ్యంతో, సముద్ర మట్టానికి 555 మీటర్ల ఎత్తున.. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను రూ.6,805 కోట్లతో చేపట్టారు. ►ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ఏకంగా 22.60 కిలోమీటర్ల పొడవైన కట్ట నిర్మాణం చేయాల్సి ఉండగా, కట్ట గరిష్ట ఎత్తు 58.5 మీటర్లుగా ఉంది. ►కట్ట నిర్మాణానికి 13.58 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పని, 2.77 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాల్సి ఉండగా ఇందులో ఇప్పటికే 96 శాతం పనులు పూర్తి చేశారు. ►ఈ రిజర్వాయర్ నుంచే కొండపోచమ్మ సాగర్, గంధమల, బస్వాపూర్‌లతో పా టు, సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ స్టేజ్–1 ఆయకట్టుకు నీళ్లు చేరనున్నాయి. ►మొత్తంగా ఈ రిజర్వాయర్‌పై ఆధారపడిన కొత్త ఆయకట్టు 8.33 లక్షల ఎకరాలు ఉండగా, స్థిరీకరణ ఆయకట్టు మరో 7.37 లక్షల ఎకరాలు ఉంది. ►ఈ ప్రాజెక్టుకు అవసరమైన 17,871 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించారు. ►ఈ రిజర్వాయర్ నిర్మాణంతో రాంపూర్, బ్రాహ్మణబంజేరుపల్లి, లక్ష్యాపూర్, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్, సింగారం, ఎర్రవెల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతుండగా, 4,298 కుటుంబాలు ప్రభావితం అయ్యాయి. ►మట్టి పనుల్లో ఎక్కడా నాణ్యత లోపాలు తలెత్తకుండా ప్రతి రీచ్‌కు ఐదుగురు ఇంజనీర్లతో పర్యవేక్షణ ఉండేలా గజ్వేల్ కేంద్రంగా ప్రత్యేక క్వాలిటీ కంట్రోల్ డివిజన్ ఏర్పాటు చేశారు. -
ఘోరం: చితి పేర్చుకుని రైతు సజీవదహనం
దుబ్బాకటౌన్ / తొగుట (దుబ్బాక): ఏళ్లుగా ఉన్న ఊరిని, సొంత ఇంటిని విడిచి పోతున్నానని తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా భావిస్తున్న ఓ రైతు.. కూల్చివేసిన తన ఇంట్లోనే చితిలో సజీవ దహనమై కన్పించాడు. ఈ హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్నసాగర్ ముంపు గ్రామం వేములఘాట్‌లో చోటుచేసుకుంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇల్లు కేటాయించలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తుండగా.. అధికారులు మాత్రం ఆయనకు భూమి, ఇల్లుకు సంబంధించిన నష్టపరిహారంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన చెక్కులను కూడా అందజేసినట్లు చెప్పారు. రెండు నెలలుగా అద్దె ఇంట్లో.. తొగుట ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు .. వేములఘాట్ గ్రామానికి చెందిన తూటుకూరి మల్లారెడ్డి (70) రైతు. అతని భార్య అమృతమ్మ కొన్ని నెలల క్రితం చనిపోయింది. మల్లారెడ్డికి వివాహాలైన ముగ్గురు కుమార్తెలు ఉండగా.. ఇల్లరికం ఉన్న పెద్ద అల్లుడు భగవాన్‌రెడ్డి, కుమార్తె కొన్నేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించారు. వీరికి ఉన్న ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు మల్లారెడ్డితోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి మనవరాళ్లకు సైతం వివాహం జరిపించి అత్తగారింటికి పంపించాడు. అయితే 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం.. ముంపు గ్రామమైన వేములఘాట్‌ను ఖాళీ చేయించే పనికి పూనుకుంది. దీంతో మల్లారెడ్డి కూడా మిగతా గ్రామస్తుల మాదిరిగానే తనకున్న వ్యవసాయ భూమిని, ఇంటిని అప్పగించాడు. సాగర్ నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకోవడంతో అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అధికారులు మల్లారెడ్డి ఇంటిని కూల్చివేశారు. దీంతో రెండు నెలల క్రితం చిన్న కూతురు భాగ్యలక్ష్మి, అల్లుడితో కలిసి గజ్వేల్ మండలం పిడిచెడ్ గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఇల్లు చూసి వస్తానని చెప్పి.. ఈ నేపథ్యంలోనే.. కూల్చిన ఇల్లు పరిస్థితి ఏ విధంగా ఉందో చూసి వస్తానని కుమార్తెతో చెప్పిన మల్లారెడ్డి పిడిచెడ్ నుంచి గురువారం మధ్యాహ్నం వేములఘాట్ చేరుకున్నాడు. రాత్రి 9.30 వరకు చుట్టు పక్కల ఇళ్ల వారితో మాట్లాడాడు. రాత్రి 10.00 గంటలకు కుమార్తె ఫోన్ చేస్తే.. మోకాళ్లు నొప్పిగా ఉన్నాయి, ఉదయం అల్లుడిని పంపిస్తే బైక్‌పై వస్తానని చెప్పాడు. అర్ధరాత్రి చుట్టుపక్కల వారు నిద్రపోయాక కూల్చివేసిన తన ఇంట్లోనే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం కూతురు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె చుట్టు పక్కల వారికి ఫోన్ చేసింది. వారు వెళ్లి చూడగా కట్టెల్లో కాలిపోయి కన్పించాడు. దీనిపై మల్లారెడ్డి మనవడు తిరుపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొగుట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట ఆర్డీఓ అనంతరెడ్డి మాట్లాడుతూ పుట్టి పెరిగిన గ్రామం నుంచి, ఇంటి నుంచి వెళ్లిపోతున్నాననే మనస్తాపంతో మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని తెలిపారు. పోలీసులు కూడా ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఇల్లు కేటాయించలేదని..! అయితే పరిహారం కింద మల్లారెడ్డికి గజ్వేల్ శివారులో నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలో అధికారులు ఇల్లు కేటాయించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇల్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో పాటు సర్పంచ్‌ను మల్లారెడ్డి పలుమార్లు వేడుకున్నా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితం అధికారులు ఇళ్ల కోసం తయారు చేసిన లిస్టులో 715 నంబర్‌గా మల్లారెడ్డి పేరు ఉన్నప్పటికీ ఇల్లు మాత్రం కేటాయించలేదని తెలిపారు. తనకు ఇల్లు లేకుండా పోయిందనే మనస్తాపంతోనే కట్టెలతో చితిని పేర్చుకొని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు. -
‘మల్లారెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే’
సాక్షి, సిద్ధిపేట: మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని షర్మిల పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఆరోపించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాకపోవడంతో సిద్ధిపేట జిల్లా తోగుట మండలం వేములఘాట్‌కు చెందిన వృద్ధుడు తుటుకూరి మల్లారెడ్డి మనోవేదనతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టాడన్నారు. ప్రభుత్వం కూల్చివేసిన ఇంట్లోనే చితి పేర్చుకుని మల్లారెడ్డి చనిపోవడం గమనార్హం. తన భార్య పేరు మీద ఇల్లు ఉందని.. ఆమె ఇటీవల మరణించడంతో మల్లారెడ్డికి ఇల్లు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడాన్ని ఇందిరాశోభన్ తప్పుబట్టారు. భార్య మృతి చెందితే భర్తకు ఇల్లు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఆమె ప్రశ్నించారు. కన్నతల్లి లాంటి ఊరును వదిలి వెళ్తున్న వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం అన్ని వసతులు సమకూర్చాల్సిన ప్రభుత్వం.. నిర్వాసితుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించడమేంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులే ఇందుకు బాధ్యత వహించాలన్నారు. మల్లన్న సాగర్ కింద భూ సేకరణ జరిగిన అన్ని గ్రామాల్లో ఇంకా పూర్తి స్థాయిలో నష్ట పరిహారం అందలేదని ఆందోళనలు జరుగుతున్న విషయాన్ని ఇందిరా శోభన్ గుర్తు చేశారు. తన ఫాంహౌస్ కోసం, కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్.. మల్లన్న సాగర్ ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేశారని ఆరోపించారు. మల్లారెడ్డి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ సాధ్యమైనంత త్వరగా పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. నిర్వాసితులకు తమ పార్టీ నాయకురాలు షర్మిల అక్క అండగా ఉంటారని, వారి పక్షాన న్యాయ పోరాటం చేస్తారని తెలిపారు. చదవండి: నిరుద్యోగంపై వైఎస్ షర్మిలకు తొలి విజయం -
ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్ ధర్నా
సాక్షి, సిద్దిపేట : జిల్లాలోని తొగుట మండలం మల్లన్న సాగర్ భూబాధితులు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న వారి వద్దకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మిడ్ మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు 300 మీటర్ల వెడల్పుతో కాలువ నిర్మాణంకు ఎన్జీటి అనుమతులు లేకుండా అక్రమంగా కాలువ నిర్మించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు కేవలం లక్షా యాభై వేల రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని నిరసిస్తూ దుబ్బాక కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధర్యంలో ధర్నా చేపట్టారు. దీనిని పోలీసులు భగ్నం చేయడంతో ధర్నా ఉద్రిక్తంగా మారింది. ధర్నాలో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డితో పాటు తుక్కాపూర్ గ్రామస్తులను కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ రెడ్డిని బేగంపేట పోలీస్ స్టేషస్‌కు తరలించినట్లు తెలిసింది. -
రైతు కల్లాల నిర్మాణంలో సిద్దిపేట ప్రథమ స్థానం
గజ్వేల్: మల్లన్నసాగర్ ముంపు బాధితుల కోసం నిర్మిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీని సకల హంగులతో సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆదేశించారు. శనివారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలీటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లిలో నిర్మిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీ పనుల ప్రగతిపై సైట్ వద్ద సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ ఆర్అండ్ఆర్ కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణంపై ఆరా తీశారు. సమీక్షలో ట్రైనీ కలెక్టర్ దీపక్ తివారీ, గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ కనకరత్నం, మిషన్ భగీరథ ఈఈ రాజయ్య, ఈడబ్ల్యూఐడీసీ డీఈ రాంచంద్రం, పీఆర్ డిప్యూటీ ఈఈ ప్రభాకర్, తహశీల్ధార్లు అన్వర్, అరుణ తదితరులు పాల్గొన్నారు. రైతు కల్లాల నిర్మాణంలో జిల్లా ప్రథమం ములుగు(గజ్వేల్): రైతు కల్లాల నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, పల్లె ప్రకృతి వనాలతోగ్రామాల్లో పచ్చదనం వెల్లి విరుస్తుందని కలెక్టర్ వెంకట్రావిమిరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో శనివారం కల్లం నిర్మాణంతో పాటు పల్లె పకృతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు, కేబీఆర్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచీలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ అధికారులను, గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు కొన్యాల మమత, సర్పంచ్ కాయితి యాదమ్మ, కేబీఆర్ పౌండేషన్ చైర్మన్ కొన్యాల బాల్‌రెడ్డిలను అభినందించారు. ట్రైనీ కలెక్టర్ దీపక్‌తివారీ, డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి కలెక్టర్ ప్రకృతి వనంలో మొక్కను నాటి నీరు పోశారు. కార్యక్రమంలో ములుగు ఎంపీపీ లావణ్యఅంజన్‌గౌడ్, వైస్ ఎంపీపీ దేవేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి, ఉపాథిహామి ఏపీడీ కౌసల్యాదేవి, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
భార్య పిటిషన్.. భర్త మరణించాడన్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్ : కరోనా బారిన పడిన తన భర్తను వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారని, అయితే ఇప్పటి వరకు తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నగరంలోని వనస్థలిపురంకు చెందిన మధుసూదన్ భార్య మాధవి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం అసలు మధుసూదన్ బ్రతికి ఉన్నాడా? లేడా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టు ప్రశ్నకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సమాధానిస్తూ.. కొద్ది రోజుల క్రితమే అతని కరోనాతో మరణించాడని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ సమాధానంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రోగి చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. కనీసం కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీసింది. దీనిపై పూర్తి వివరాలతో శుక్రవారంలోగా అఫిడవిట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి (శుక్రవారం) వాయిదా వేసింది. (పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో విచారణ) ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల సమస్యలపై హైకోర్టు విచారణ చేపట్టింది. రిజర్వాయర్ నిర్మాణంలో ముంపుకు గురవుతున్న ఏటిగడ్డ కిస్తాపూర్ గ్రామం ఖాళీ విషయంపై గురువారం వాడీవేడి వాదనలు జరిగాయి. భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండా ఇళ్లను ఖాళీ చేయించడం సరైనది కాదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు చెల్లించిన నష్టపరిహారాలపై పూర్తిస్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే తదుపరి తీర్పు వెలువరించే వరకు గ్రామాన్నిఖాళీ చేయించొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. -
వర్షాకాలం నుంచి కాళేశ్వరం మూడో టీఎంసీ
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరంలో మూడో టీఎంసీ ఎత్తిపోసే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. వచ్చే వర్షాకాలం నుంచి మూడో టీఎంసీని వాడుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలోని అన్ని పంపుల నిర్మాణం మే నెలాఖరు నాటికి పూర్తి చేసి కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని పంప్ చేయాలి. మల్లన్న సాగర్ ద్వారా తపాస్‌పల్లి రిజర్వాయర్ నింపి అక్కడి నుంచి మోత్కూరు, అడ్డగూడూరు, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, చిల్పూర్ మండలాలకు నీరందించాలి. ఈ వానాకాలంలో ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో 16,41,284 ఎకరాలకు సాగునీరు అందించాలి. గోదావరిలో ఎగువ నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఎస్సారెస్పీని కాళేశ్వరం ద్వారా నింపాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. (17 రోజులు.. 93 రైళ్లు.. 1.18 లక్షల మంది ) గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంబించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్ ప్రారంభించిన వెంటనే మొదట ఆయా ప్రాజెక్టుల పరిధిలో గల చెరువులన్నింటినీ నింపాలన్నారు. దీనికోసం ప్రాజెక్టుల కాల్వల నుంచి అవసరమైన తూములు (ఓటీలు), డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అన్ని ప్రాజెక్టుల వద్ద రివర్ గేజ్‌లు ఏర్పాటు చేయాలని, నీటి నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రియల్ టైమ్ డేటా ఆపరేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రూ. వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సాగునీటి వ్యవహారమంతా ఒకే శాఖ గొడుగు కిందకు రావాలని, ప్రాజెక్టుల భౌగోళిక స్థితిని బట్టి నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరించుకోవాలని ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకు నిర్వహణ (ఓ అండ్ ఎం) మ్యాన్యువల్ రూపొందించాలన్నారు. నీటిపారుదల శాఖకు చెందిన భూములు, కట్టల ఆక్రమణను తీవ్రంగా పరిగణించాలని ఆదేశించారు. గోదావరి బేసిన్‌లోని ప్రతి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, ఈ వానాకాలంలో ఎంత ఆయకట్టుకు నీరందించగలిగే అవకాశం ఉందన్న అంశాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మంత్రులు కె. తారక రామారావు, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. సమీక్షలో సీఎం కేసీఆర్ అధికారులకు జారీ చేసిన ఆదేశాలు, సూచనలు ⇒ వర్షాకాలంలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ప్రారంభం కాగానే మొదట అన్ని చెరువులు, కుంటలు నింపాలి. దీనికోసం అవసరమైన ఓటీలను, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను వెంటనే నిర్మించాలి. చెరువులు, కుంటలు ఏడాదంతా నిండి ఉండే వ్యూహం అవలంబించాలి. చెరువులకు నీరు అందించడానికి ఉన్న అడ్డంకులపై చర్చించేందుకు ఆయా జిల్లాల మంత్రులు, అధికారులు 2–3 రోజుల్లోనే సమావేశం కావాలి. ⇒ చెరువులు నింపడం ద్వారా భూగర్భ నీటిమట్టం పెరుగుతుంది. ఫలితంగా బోర్ల ద్వారా కూడా వ్యవసాయం సాగుతుంది. ⇒ చెరువుల నుంచి రైతులు స్వచ్ఛందంగా మట్టిని తీసుకెళ్లడానికి అవకాశం ఇవ్వాలి. అధికారులు రైతులపై ఆంక్షలు పెట్టరాదు. ⇒ ఎల్ఎండీ నుంచి దిగువకు నీరందించడానికి ప్రస్తుతమున్న కాలువ కేవలం 6 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో ఉంది. దీని సామర్థ్యాన్ని 9 వేల క్యూసెక్కులకు పెంచాలి. ప్రస్తుతమున్న కాల్వ సామర్థ్యం పెంచడమా లేక సమాంతరంగా మరో కాలువ నిర్మించాలా అనే విషయాన్ని ఈఎన్సీల కమిటీ తేల్చాలి. ⇒ తోటపల్లి కాలువ ద్వారా 77 వేల ఎకరాలకు నీరందించాలి. ⇒ గౌరవల్లి లిఫ్టు పనులను వెంటనే పూర్తి చేసి ఈ సీజన్లోనే నీళ్లు అందించాలి. ⇒ దేవాదుల ప్రాజెక్టు ద్వారా వరంగల్ జిల్లాలోని అన్ని చెరువులు నింపాలి. సమ్మక్క బ్యారేజీ పనులను వేగవంతం చేయాలి. దేవాదుల ప్రాజెక్టు ద్వారా 365 రోజులూ నీటిని లిఫ్టు చేయాలి. ⇒ వరద కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలి. వరద కాలువలపై ఓటీల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. ⇒ జగిత్యాల జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని ముక్కట్రావుపేట గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలి. ⇒ భారీ, మధ్యతరహా, చిన్నతరహా నీటిపారుదల, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోని విభాగాలు, ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందకు రావాలి. అన్నీ నీటిపారుదల శాఖ పరిధిలోనే ఉండాలి. ప్రాజెక్టులు, వాటి భౌగోళిక స్థితి ఆధారంగా నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరించాలి. సీఈ/ఈఎన్సీ పరిధులు నిర్ణయించి నీటిపారుదల జోన్లు ఏర్పాటు చేయాలి. అత్యవసరమైన సాగునీటి పనులకు కావాల్సిన అనుమతులు ఇవ్వడానికి సీఈ నుంచి ఈఈ వరకు అధికారాలను ప్రభుత్వం బదిలీ చేస్తుంది. సీఈ రూ. 50 లక్షల వరకు ఎస్ఈ రూ. 25 లక్షల వరకు, ఈఈ రూ. 5 లక్షల వరకు పనులకు అనుమతులు ఇవ్వొచ్చు. ⇒ 15 రోజుల్లోగా అన్ని ప్రాజెక్టులపై కొత్తగా గేజ్ మీటర్లు ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతమున్న గేజ్‌లు చాలా కాలం క్రితం ఏర్పాటు చేసివని. చాలా ప్రాజెక్టుల్లో పూడిక వల్ల గేజ్‌లు సరిగ్గా పనిచేయట్లేదు. కొత్తగా గేజ్‌లు ఏర్పాటు చేసి కచ్చితమైన అంచనా వేయాలి. ⇒ నీటిపారుదల శాఖ భూములు, ఆస్తుల వివరాలతో ఇన్వెంటరీ తయారు చేయాలి. నీటిపారుదల శాఖ సేకరించిన భూములను వెంటనే మ్యుటేషన్ చేయించాలి. ⇒ ప్రాజెక్టుల భూములను ఆక్రమించిన వారిపై సీరియస్‌గా ఉండాలి. సేకరించిన భూమిని మ్యుటేషన్ చేయాలి. ⇒ కాల్వ కట్టలపై నివాసం ఉండే వారు తక్షణం ఖాళీ చేసేలా కఠినంగా వ్యవహరించాలి. అక్రమ నిర్మాణాలను తొలగించాలి. ⇒ ప్రాజెక్టుల నిర్వహణ కూడా ముఖ్యం. ప్రతి ప్రాజెక్టు నిర్వహణ కోసం ఓఅండ్ఎం మ్యాన్యువల్ రూపొందించాలి. ఏటా బడ్జెట్లోనే నిర్వహణ వ్యయం కేటాయించి ప్రభుత్వం విడుదల చేస్తుంది. ⇒ ఎక్కడైనా భూసేకరణ మిగిలి ఉంటే పూర్తి చేయాలి. దీనికి కావాల్సిన నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. -
ఇక కరువన్న మాట ఉండదు
సాక్షి, సిద్దిపేట: కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణలో ఇక ముందు కరువన్నమాట ఉండబోదని, గోదావరి జలాలతో బీడు భూములన్నీ సస్యశ్యామలం అవుతాయని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్ ప్రధాన కాల్వల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గోదావరి నుంచి మల్లన్న సాగర్ వరకు జలాలు వచ్చాయని, త్వరలో కాల్వల ద్వారా చెరువులు, కుంటల్లోకి నింపుతామని పేర్కొన్నారు. ఇందుకోసం కాల్వల నిర్మాణాలు త్వరగా చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కాలంతో పని లేకుండా కాల్వల ద్వారా వ్యవసాయం చేసుకునే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. రైతులు నీటి వనరులను సద్వినియోగం చేసుకొని లాభసాటి పంటలు పండించాలని సూచించారు. గతంలో మాదిరిగా అందరూ ఒకే రకం పంటలు సాగు చేసి ఆగం కావద్దని కోరారు. సన్న రకం ధాన్యానికి మంచి డిమాండ్ ఉందని చెప్పారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న ప్రాంతాల్లో కూరగాయలు, పండ్ల తోటలు పెంచాలన్నారు. వ్యవసాయంతో పాటు, అనుబంధ పశుపోషణ, మత్స్య పరిశ్రమ కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. రైతులు వినూత్నంగా ఆలోచించినప్పుడే ఆర్థిక ప్రగతికి బాటలు పడతాయని పేర్కొన్నారు. ఇక ముందు ధనవంతులైన రైతులు తెలంగాణలో ఉన్నారనే సమాధానం రావాలని.. అప్పుడే నిజమైన మార్పు వచ్చినట్లని హరీశ్‌రావు అన్నారు. మంత్రి వెంట ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం మల్లన్నసాగర్ ప్రధాన కాల్వల పనులను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు, తదితరులు -
మల్లన్న నుంచే సింగూరుకు గోదారి!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు తరలించే విషయంలో ఇన్నాళ్లూ ఉన్న సందిగ్ధత తొలగింది. కాళేశ్వరంలో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచే నీటిని గతంలో ప్రతిపాదించిన మాదిరి సింగూరుకు గోదావరి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో సింగూరుకు తరలించేలా చేపట్టిన పనులను తిరిగి ఆరంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టు ఇంజనీర్లను ఆదేశించారు. దీంతో గత కొన్నేళ్లుగా ఆగిన ప్యాకేజీ–17, 18, 19 పనులు తిరిగి ఆరంభమయ్యాయి. విద్యుత్, భూసేకరణ ఖర్చులు ఆదా.. మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ పద్ధతిన హల్దీ వాగు ద్వారా సింగూరుకు నీటిని తరలించే ప్రక్రియను గతంలోనే చేపట్టారు. మల్లన్న సాగర్‌లో నీటిని తీసుకునే లెవల్ 557 మీటర్లు ఉండగా, సింగూరు లెవల్ 530 మీటర్లు ఉంది. గ్రావిటీ పద్ధతిన నీటిని కొంతదూరం తీసుకెళ్లి, మధ్యన 32 మీటర్ల లిఫ్టు ద్వారా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగూరుకు పంపేలా రూ.2,500 కోట్లతో ప్యాకేజీ–17, 18, 19లను చేపట్టారు. ప్యాకేజీ–17లో ఉన్న 18 కి.మీల టన్నెల్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటం, ఆ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలని ప్రభుత్వం మూడేళ్ల కింద నిర్ణయించింది. 627 మీటర్ల కొండపోచమ్మ లెవల్ నుంచి 530 మీటర్ల లెవల్ ఉన్న సింగూరుకు పూర్తి గ్రావిటీ ద్వారా నీటిని తరలించవచ్చని నిర్ణయించి దీనికి అనుగుణంగా ప్రణాళికలు వేసింది. అయితే కొండపోచమ్మ ద్వారా నీటిని తరలిస్తే, సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్, ఇస్నాపూర్ పారిశ్రామిక ప్రాంతాలతో పాటు ఎన్‌హెచ్–65ని కూడా దాటాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎకరా భూమి ధర రూ.5 కోట్లకు పైగా ఉండటంతో భూసేకరణ భారం కానుంది. అదీగాక కొండపోచమ్మ సాగర్ నుంచి పైప్‌లైన్ ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న కేశవపూర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సింగూరుకు, అటు నుంచి నిజాంసాగర్‌కు నీటి తరలింపు అనుకున్న మేర సరఫరా చేయడం సాధ్యం కాదు. దీనికి బదులు మల్లన్న సాగర్ ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని హల్దీ వాగు ద్వారా సింగూరుకు, అటు నుంచి నిజాంసాగర్‌కు తరలిస్తే మేలని ప్రభుత్వం ఇటీవల ఇంజనీర్లతో జరిపిన చర్చల సందర్భంగా తేల్చింది. విద్యుత్ ఖర్చు రూ.67 కోట్లు.. మల్లన్న సాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలిస్తే విద్యుత్ ఖర్చు కేవలం రూ. 67 కోట్లు మాత్రమే ఉంటుందని, అదే కొండపోచమ్మ ద్వారా అయితే రూ. 352 కోట్లు అవసరం ఉంటుందని రిటైర్డ్ ఇంజనీర్లు సైతం తేల్చి చెప్పారు. దీంతో పాటు ఇప్పటికే సేకరించిన భూమి అవసరాలపై వెచ్చించిన రూ.500 కోట్లు మేర ఆదా ఉంటుందని తెలిపారు. దీంతో ఏకీభవించిన ముఖ్యమంత్రి మల్లన్న సాగర్ ద్వారానే సింగూరుకు నీటిని తరలించాలని సూచించారు. దీంతో ఇప్పుడిప్పుడే మూడు ప్యాకేజీల పనులను ఏజెన్సీలు తిరిగి ఆరంభించాయి. -
దేవాదులకు కాళేశ్వరం జలాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాల వినియోగం విషయంలో మరో కొత్త ప్రతిపాదనను సీఎం కేసీఆర్ తెరపైకి తెచ్చారు. గోదావరి జలాల ఆధారంగా చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకంలో నీరందని చివరి ఆయకట్టు ప్రాంతాలకు కాళేశ్వరం ద్వారా ఎత్తిపోస్తున్న జలాలను తరలించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా నీటిని దేవాదుల ఆయకట్టుకు తరలించే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రగతిభవన్‌లో శనివారం కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదులను ఇన్‌టేక్ పాయింట్ గంగాపురానికి 187 కిలోమీటర్ల దూరంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్ వరకు కాళేశ్వరం జలాలు తరలింపు, తపాస్‌పల్లి కింద ఉన్న 92వేల ఎకరాల ఆయకట్టుకు మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించేలా అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి పది కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ నిర్మించి కనీసంగా 10 టీఎంసీల నీటిని తపాస్‌పల్లికి నీటిని అందించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఈ ప్రతిపాదనకు రూ.100 కోట్ల మేర ఖర్చు అవుతుందని, మల్లన్నసాగర్లో కనీసంగా 30 టీఎంసీల నీటి లభ్యత ఉంటేనే గ్రావిటీ ద్వారా నీటి లభ్యత సాధ్యపడుతుందని అధికారులు వివరించారు. ఇదే సందర్భంగా ఫ్రెషర్ మెయిన్ ద్వారా నీటిని తరలించేలా రెండో ప్రతిపాదనను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పద్ధతిన నీటిని తరలించేందుకు గరిష్టంగా రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఖర్చు జరిగే అవకాశం ఉంటుందని, మల్లన్నసాగర్లో 12 టీఎంసీల నీటి తరలింపు సాధ్యమవుతుందని తెలిపారు. ఈ రెండు ప్రతిపాదనలను ఏది ఉపయుక్తంగా ఉంటుందో తెలపాలని సీఎం సూచించారు. వచ్చే ఏడాది నవంబర్ నాటికి దేవాదుల మూడో దశను పూర్తి చేయాలని, మల్లన్నసాగర్‌ను వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేయాలని సూచించారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనులను ప్యాకేజీ వారీగా సమీక్షించిన సీఎం..భూసేకరణ అంశాలపై రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మార్గదర్శకం చేశారు. వచ్చే ఖరీఫ్ నాటికి సీతారామ ద్వారా గరిష్ట నీటి వినియోగం జరిగేలా చూడాలని చెప్పారు. దీంతో పాటు కాళేశ్వరం పనులపైనా సీఎం సమీక్షించారు. -
నీటి ప్రాజెక్టుల్ని అడ్డుకోం
సాక్షి, హైదరాబాద్ : ‘ఒకరిద్దరి కోసం ప్రాజెక్టుల నిర్మాణాల్ని ఆపలేం. ప్రాజెక్టుల నిర్మాణం ప్రజల కోసమే. కోట్ల మంది దాహార్తిని శాశ్వతంగా తీరుస్తాయి. పైగా పర్యావరణ సమస్య పరిష్కారానికి ప్రాజెక్టులు దోహదపడతాయి. కొద్ది మంది కోసం ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోజాలం. అదే సమయం లో ప్రాజెక్టుల కోసం భూములిచ్చే రైతులకు సకాలంలో చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అని నీటి పారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దాఖలైన పలు కేసుల విచారణ సమయంలో హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రాజెక్టుల నిర్మాణాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ధిక్కార కేసులకు మినహాయింపు... ‘పునరావాసం, పునర్నిర్మాణం, పరిహారం చెల్లింపులను విచారిస్తాం. నీటి పారుదల ప్రాజెక్టులపై దాఖలైన 177 వ్యాజ్యాలన్నీ కలిపి విచారిస్తాం. అంతే కాకుండా ఇకపై వ్యాజ్యాలు దాఖలైతే వాటిని కూడా ఇక్కడికే నివేదించేలా హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం. అయితే సింగిల్ జడ్జి వద్ద తీర్పు వెలువరించాల్సిన మూడు కోర్టు ధిక్కార కేసులను మాత్రం మినహాయింపు ఇస్తున్నాం’అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం గురువారం ప్రకటించింది. భూమిని సేకరించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఎవరి అంగీకారంతోనో రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేదని, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని చట్టం కూడా చెబుతోందని ధర్మాసనం తేల్చి చెప్పింది. సింగిల్ జడ్జి తీర్పును ఉల్లంఘిస్తూ ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో ప్రభుత్వం పనులు చేస్తోందంటూ దాఖలైన కోర్టు ధిక్కార వ్యాజ్యాలను, దీనిపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలను, నీటిపారుదల ప్రాజెక్టులపై దాఖలైన ఇతర కేసుల్ని, మొత్తం 177 కేసులన్నింటినీ కలిపి ఒకేసారి విచారించాలని ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను గురువారం ధర్మాసనం విచారించింది. ప్రాజెక్టుల నిర్మాణం జరగాల్సిందే... ‘వాతావరణంలో ప్రతికూల మార్పులు కనబడుతున్నాయి. వర్షాలు పడటం లేదు. నూరు శాతం వర్షాలు పడతాయని శాస్త్రవేత్తలు చెప్పడం లేదు. ఈసారి 93 శాతం రుతుపవనాలు వస్తాయని చెప్పడం అదృష్టమే. రాజస్తాన్ ఎడారిగా మారకుండా ఉండాలంటే నీటిని ఒడిసిపట్టే చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల నిర్మాణాలు జరగాల్సిందే. రాజస్తాన్‌లోని బనాస్ ప్రాజెక్టుపై దాఖలైన న్యాయ వివాదాల్ని పరిష్కరించిన ధర్మాసనంలో నేనున్నాను. ఆ ప్రాజెక్టుతో తొమ్మిది జిల్లాలకు నీరు అందింది’అని అదనపు ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. పరిహార ఒప్పంద పత్రాలు తెలుగులో ఉండేలా చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులకు వాటిని అందజేసే ముందు వాటిలోని విషయాల్ని తెలుగులోనే వివరించాలని పేర్కొంది. దీంతో బాధిత రైతులకు అన్నీ తెలుసుకునేందుకు వీలవుతుందని చెప్పింది. పరిహారం తీసుకుని పోరాడండి... ‘భూ సేకరణ ప్రజల సమస్య. చట్టపరమైనది కాదు. పదేళ్ల కిత్రం అందుకోవాల్సిన రూ.5 లక్షల పరిహారాన్ని తీసుకుని న్యాయపోరాటం చేస్తే బాధితుడు నష్టపోడు. ఆ పరిహారం తీసుకోకుండా ఇప్పుడు రూ.8 లేదా 9 లక్షలు పరిహారం తీసుకుంటే అది రూ.5 లక్షలతో సమానం అవ్వదు. పరిహారం పెంపు కోసం పాతికేళ్ల వరకూ న్యాయపోరాటం చేయవచ్చు. ప్రాజెక్టు నిర్మాణం జరిగిపోతుంటే భూమి ఇవ్వకుండా ఎంతకాలం ఉంటారు. భూమిని సర్కార్ తీసుకోవాలని అనుకుంటే ఎవ్వరూ అడ్డకోలేరు’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఓ కథను ధర్మాసనం ఉదహరించింది. ‘గంగా నదిలో ఓ రైతు గొడ్డలి పడిపోయింది. గంగా మాత ప్రత్యక్షమై బంగారం, వెండి, రాగి గొడ్డళ్లు తెచ్చి ఇచ్చింది. అవి నావి కావని రైతు చెప్పాడు. దీంతో గంగా మాత పోయిన ఇనపు గొడ్డలితోపాటు బంగారు, వెండి, రాగి వాటిని కూడా రైతుకు ఇచ్చేస్తుంది. ఇక్కడ కూడా రైతులు తమకు ఏది కావాలో కోరాలి. కానిది అడగొద్దు. ఇచ్చింది తీసుకోవాలి. పట్టుదలకు పోవద్దు. హైకోర్టు మీకు న్యాయపరంగా అండగా నిలుస్తుంది’అని ధర్మాసనం హితవు చెప్పింది. ‘భూ సేకరణ కోసం రైతులు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. కుటుంబం కోసం వ్యక్తి. గ్రామం కోసం కుటుంబం. పట్టణం కోసం గ్రామం. రాష్ట్రం కోసం పట్టణం. చివరికి దేశం కోసం ఒక రాష్ట్రం త్యాగం చేయాలి. ఇది ఇప్పటి హితోపదేశం కాదు. మహాభారతంలోనే ఉంది. అయిదారు ఎకరాల కోసం ప్రాజెక్టుల్ని అడ్డుకోవడం ధర్మం కాదు. ప్రాజెక్టులు కూడా లక్షలాది మంది ప్రజల కోసమేనని గుర్తించాలి’అని వ్యాఖ్యానించింది. పరిహారం అందజేత... హైకోర్టులో 93 మంది పిటిషన్లు దాఖలు చేస్తే పరిహారం తీసుకోని 33 మందికి, కోర్టు ధిక్కార వ్యాజ్యాలు వేసిన ఆరుగురి చెందిన పరిహారాన్ని రూ.7.5 లక్షల చొప్పున వారి తరఫున వాదించే న్యాయవాది, న్యాయమూర్తుల సమక్షంలో అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు అందజేశారు. దీంతో మొత్తం 93 మందికి పరిహారం అందజేసినట్లు అయింది. ఇళ్ల నిర్మాణాలకు రూ.5 లక్షలు వద్దని చెప్పి తిరిగి తీసుకోడానికి సమ్మతిని తెలిపిన ఇద్దరికీ కూడా కోర్టులోనే చెక్కుల్ని అందజేశారు. అనసూయ అనే పిటిషనర్ భర్తతో విభేదించి పదేళ్లుగా విడిగా ఉంటున్నారని, భర్తకు పరిహారం ఇచ్చారని, ఆమెకు ఏదీ అందలేదని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించగా, ఈ అంశాన్ని పరిశీలిస్తామని అదనపు ఏజీ బదులిచ్చారు. ఏటిగడ్డ కిష్టాపూర్‌లో 2,500 ఎకరాల రైతులకు పరిహారం చెల్లించామని, ఆర్ఆర్ ప్యాకేజీ నోటీసులు ఇచ్చామని తెలిపారు. గృహాల సేకరణ అంశంపై ప్రాథమిక నోటీసు ఇచ్చామని వివరించారు. డిక్లకేషన్ ఇచ్చేందుకు రైతులు సహరించలేదని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు అదనపు ఏజీ బదులిచ్చారు. విచారణ జూన్ 18కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. -
చకచకా ఆర్అండ్ఆర్ పనులు
గజ్వేల్: మల్లన్నసాగర్ ముంపు బాధితుల కోసం సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లి–సంగాపూర్ గ్రామాల పరిధిలో చేపట్టిన ఆర్అండ్ఆర్ (రిహాబిలిటేషన్ అండ్ రీ–సెటిల్మెంట్) కాలనీ పనులు వేగంగా సాగుతున్నాయి. ఒక్కో ఇంటిని రూ.5.04 లక్షల వ్యయంతో 5 వేల ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇందుకు సుమారు 450 ఎకరాల భూ సేకరణను యుద్ధ ప్రాతిపదికన జిల్లా యంత్రాంగం చేపట్టింది. అవసరమైతే మరో 50 ఎకరాలను సేకరించడానికి సన్నద్ధమవుతుంది. గతంలో సేకరించిన 300 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉండగా.. ఇటీవల మరో 150 ఎకరాల భూ సేకరణ పూర్తిచేశారు. వాటిల్లోనూ ప్లాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 5 వేల ఇళ్లకు లే–అవుట్ సిద్ధం చేశారు. ఎకరా విస్తీర్ణంలో 11 ఇళ్ల చొప్పున ఒక్కొక్కరికి 250 గజాల స్థలంలో ఇళ్ల నిర్మాణం, విశాలమైన రోడ్లు, ఇతర వసతులతో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం 800 ఇళ్లు పూర్తి కావస్తుండగా... మరో 1,200 ఇళ్ల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. ఎవరైనా నిర్వాసితులు ఇళ్లు వద్దనుకుంటే... ఇంటి స్థలంతో పాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందజేయనున్నారు. ఈ పనులు సుమారు రూ.400 కోట్లకు పైగా వ్యయంతో సాగుతున్నాయి. అవసరమైతే మరికొంత భూమిని కూడా సేకరించి కాలనీని అన్ని సౌకర్యాలతో ఆదర్శవంతంగా నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించడంతో అధికారులు ఆ దిశగా పనుల్లో వేగం పెంచారు. గజ్వేల్–సంగాపూర్–వర్గల్ రోడ్డు నుంచి గజ్వేల్–ముట్రాజ్‌పల్లి–రాజీవ్ రహదారుల మధ్య ఉన్న ఈ స్థలం అత్యంత విలువైందిగా మారడంతో మల్లన్నసాగర్ భూనిర్వాసితులు సైతం ఇదే స్థలాన్ని ఎంచుకున్నారు. అధునాతన సౌకర్యాలు... ఆర్అండ్ఆర్ కాలనీకి ఇప్పటికే గజ్వేల్–వర్గల్, గజ్వేల్ రాజీవ్ రహదారి ప్రధాన రోడ్లు ఇరువైపులా ఉండగా.. అంతర్గత రోడ్లను సైతం విశాలంగా నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటి వరుసకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. డ్రైనేజీ, మంచినీరు, విద్యుదీకరణ తదితర పనులు కూడా వెంటవెంటనే పూర్తి చేయనున్నారు. గజ్వేల్‌లో ‘రియల్ భూమ్’... గజ్వేల్ పట్టణంలో ఆర్అండ్ఆర్ కాలనీతో పాటు రాబోయే రోజుల్లో రీజినల్ రింగురోడ్డు రాబోతున్న నేపథ్యంలో ప్లాట్ల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రత్యేకించి ఐవోసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) మార్గం, ముట్రాజ్‌పల్లి మార్గాల్లోనే కాకుండా పట్టణంలోని ప్రధాన కాలనీల్లో భారీగా ప్లాట్ల ధరలు పెరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానికంగా ప్రాతినిధ్యం వహించడంతో నలువైపులా విస్తరిస్తున్న గజ్వేల్ పట్టణం సంగాపూర్, ముట్రాజ్‌పల్లి వైపు మరో నూతన పట్టణంగా ఏర్పాటు కాబోతుంది. ఇప్పటికే ఈ వైపు బాలుర, బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లు నిర్మాణం కాగా.. 1,250 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు దాదాపు పూర్తి కావస్తున్నాయి. మరోమైపు జర్నలిస్టుల ఇళ్ల కాలనీ కూడా పూర్తి కావస్తోంది. అన్ని వసతులతో ఆర్అండ్ఆర్ కాలనీ.. మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు దేశంలోనే ఆదర్శంగా గజ్వేల్‌లో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణం జరుగుతోంది. తమ విలువైన భూములను ఇచ్చి గ్రామాలను వదులుకున్న నిర్వాసితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందువల్లే మంచి ప్రమాణాలతో కాలనీ నిర్మిస్తున్నాం. వసతుల కల్పనకు పెద్దపీట వేశాం. – విజయేందర్‌రెడ్డి, గజ్వేల్ ఆర్డీవో -
చివరి రూపాయి ఇచ్చేదాకా అడుగుపెట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం చేపట్టిన భూసేకరణలో భూములు కోల్పోయిన ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులకు అందాల్సిన పరిహారం చివరి రూపాయి అందేంత వరకు వారి భూముల్లో అడుగుపెట్టొద్దని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. పునరావాసం, పునర్నిర్మాణ ప్రయోజనాలను అందించకుండానే ఆ భూములను స్వాధీనం చేసుకొని వాటిని భారీ యంత్రాల సాయంతో చదువును చేస్తున్నారనేందుకు ఆధారాలున్నాయని తెలిపింది. అందువల్ల ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో ఏ ఒక్క అధికారి ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసింది. బాధితులకు పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాలను వర్తింపజేయాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ. రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన అధికారులపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పోలీసుల సాయంతో ఖాళీ చేయిస్తున్నారు... భూ నిర్వాసితులకు కల్పించాల్సిన ప్రయోజనాలను కల్పించకుండానే అధికారులు వారి భూములను స్వాధీనం చేసుకొని ఖాళీ చేయిస్తున్నారని పిటిషనర్లు కోర్టుకు చెప్పారు. పోలీసులను సైతం ఉపయోగిస్తూ బాధితులపై బలప్రయోగం చేస్తున్నారని నివేదించారు. బాధితుల భూముల్లోకి భారీ యంత్రాలను తీసుకొచ్చి చదును చేస్తున్నారని తెలిపారు. ఈ పనులకు సంబంధించిన ఫొటోలను న్యాయవాది ధర్మాసనానికి సమర్పించారు. ఫొటోలను పరిశీలించిన ధర్మాసనం ఆ భూముల్లోంచి అధికారులందరినీ బయటకు పంపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె. రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ బాధితులకు ఇప్పటికే రూ. 500 కోట్లు ఇచ్చామని, మరో రూ. 350 కోట్లకు చెక్కులు సిద్ధం చేశామని, పట్టాలు కూడా ఇచ్చామన్నారు. చట్టం చెబుతున్న దానికన్నా ఎక్కువ ఇస్తున్నామన్నారు. లక్ష్మీదేవి వస్తుంటే ఎవరైనా వద్దంటారా? ప్రభుత్వం చెబుతున్న దానిని గుడ్డిగా నమ్మడం సాధ్యం కాదన్న హైకోర్టు... బాధితులకు చేసిన సాయంపై పూర్తి ఆధారాలను సమర్పించాలని ఆదేశించింది. కొందరు బాధితులు ఏఏజీ తీసుకోకుండా రాజకీయ కారణాలతో ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ ఏఏజీ చేసిన వాదనతో ధర్మాసనం విభేదించింది. ‘లక్ష్మీదేవి వస్తుంటే ఎవరైనా వద్దంటారా? మీరు ఎవరికి పరిహారం ఇవ్వాలనుకుంటున్నారో వారిని మా సమక్షానికి తీసుకొచ్చి ఇవ్వండి. వారు ఎందుకు తీసుకోరో మేమూ చూస్తాం. కోర్టు ధిక్కారణ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను సమర్థించొద్దు. ఇది వారికి సమస్యలు సృష్టిస్తుంది’అని వ్యాఖ్యానిస్తూ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. -
మల్లన్నసాగర్ సామర్థ్యం పెంపు పిల్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు పెంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. రిజర్వాయర్ సామర్థ్యం పెంపు సమంజసమా? కాదా? అన్నది నిపుణుల పరిధిలోని అంశమని తెలిపింది. ఈ అంశాలపై న్యాయ సమీక్ష చేయడం సాధ్యం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రాజెక్టు ఎక్కడ కట్టాలి.. ఎలా కట్టాలి.. ఎంత విస్తీర్ణంలో కట్టాలి.. ఎంత సామర్థ్యంతో కట్టాలి.. తదితర అంశాలన్నీ సాంకేతికపరమైనవని పేర్కొంది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ సామర్థ్యం పెంపును సవాల్ చేస్తూ విశ్రాంత ఇంజనీర్ దొంతు లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.రామారావు వాదనలు వినిపిస్తూ, రిజర్వాయర్ సామర్థ్యం పెం పు అవసరం లేదన్నారు. 50 టీఎంసీ మేర నీరు లభ్యత సాధ్యం కాదని వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఈ విషయాలను తేల్చేందుకు తాము నిపుణులం కాదని స్పష్టం చేసింది. అయినా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్లు అనిపిస్తోందని, రాజకీయ క్రీడలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకునేందు కు తాము ఎంత మాత్రం అంగీకరించబోమని వ్యాఖ్యానించింది. -
మల్లన్నసాగర్ టెండర్లపై స్టేకు హైకోర్టు నో
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న మల్లన్నసాగర్ రిజర్వా యర్ పనుల టెండర్ ప్రక్రియను నిలిపేసేం దుకు ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిం ది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు గురువారం ఉత్తర్వులిచ్చారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రాకుం డానే ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని, ఇది చట్ట విరుద్ధమంటూ వేముల ఘాట్‌కు చెందిన జి.లక్ష్మి, మరో ఐదుగురు హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భం గా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, కాళేశ్వరం భారీ ప్రాజెక్టని, దీని కోసం 17వేల ఎకరాల భూమిని సేకరిస్తున్నామన్నారు. పిటిషనర్లది చిన్న చిన్న పరిమాణంలో ఉన్న భూమి మాత్రమేనని, విస్తృత ప్రజా ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును పిటిషనర్లు అడ్డుకోవాలని చూస్తున్నారని తెలిపారు. పిటిషనర్లకు కావా ల్సింది పరిహారమని, ఈ విషయంలో చట్ట నిబంధనలకు లోబడి వ్యవహరిస్తామని చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది సీహెచ్ రవికుమార్ స్పందిస్తూ... పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేప ట్టడం చట్ట విరుద్ధమన్నారు. తాము కూడా విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టు కునే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశామన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, ఐదారుగురి కోసం ఇంత భారీ ప్రాజెక్టును ఆపడం సరికాదన్నారు. ప్రాజెక్టు పనులపై స్టే ఇవ్వడం సాధ్యం కాదంటూ, ఈ వ్యవహా రంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయితే పిటిషనర్లను వారి భూముల నుంచి ఖాళీ చేయించవద్దని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.