వర్షాకాలం నుంచి కాళేశ్వరం మూడో టీఎంసీ | Third TMC In Kaleshwaram Should Be Used From This Rainy Season | Sakshi
Sakshi News home page

వర్షాకాలం నుంచి కాళేశ్వరం మూడో టీఎంసీ

Published Mon, May 18 2020 3:40 AM | Last Updated on Mon, May 18 2020 10:01 AM

Third TMC In Kaleshwaram Should Be Used From This Rainy Season - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కాళేశ్వరంలో మూడో టీఎంసీ ఎత్తిపోసే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. వచ్చే వర్షాకాలం నుంచి మూడో టీఎంసీని వాడుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలోని అన్ని పంపుల నిర్మాణం మే నెలాఖరు నాటికి పూర్తి చేసి కొండపోచమ్మ సాగర్‌ వరకు నీటిని పంప్‌ చేయాలి. మల్లన్న సాగర్‌ ద్వారా తపాస్‌పల్లి రిజర్వాయర్‌ నింపి అక్కడి నుంచి మోత్కూరు, అడ్డగూడూరు, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, చిల్పూర్‌ మండలాలకు నీరందించాలి. ఈ వానాకాలంలో ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో 16,41,284 ఎకరాలకు సాగునీరు అందించాలి. గోదావరిలో ఎగువ నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఎస్సారెస్పీని కాళేశ్వరం ద్వారా నింపాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. (17 రోజులు.. 93 రైళ్లు.. 1.18 లక్షల మంది )

గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంబించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్‌ ప్రారంభించిన వెంటనే మొదట ఆయా ప్రాజెక్టుల పరిధిలో గల చెరువులన్నింటినీ నింపాలన్నారు. దీనికోసం ప్రాజెక్టుల కాల్వల నుంచి అవసరమైన తూములు (ఓటీలు), డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.

అన్ని ప్రాజెక్టుల వద్ద రివర్‌ గేజ్‌లు ఏర్పాటు చేయాలని, నీటి నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రియల్‌ టైమ్‌ డేటా ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. రూ. వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సాగునీటి వ్యవహారమంతా ఒకే శాఖ గొడుగు కిందకు రావాలని, ప్రాజెక్టుల భౌగోళిక స్థితిని బట్టి నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరించుకోవాలని ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకు నిర్వహణ (ఓ అండ్‌ ఎం) మ్యాన్యువల్‌ రూపొందించాలన్నారు.

నీటిపారుదల శాఖకు చెందిన భూములు, కట్టల ఆక్రమణను తీవ్రంగా పరిగణించాలని ఆదేశించారు. గోదావరి బేసిన్‌లోని ప్రతి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, ఈ వానాకాలంలో ఎంత ఆయకట్టుకు నీరందించగలిగే అవకాశం ఉందన్న అంశాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మంత్రులు కె. తారక రామారావు, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

సమీక్షలో సీఎం కేసీఆర్‌ అధికారులకు జారీ చేసిన ఆదేశాలు, సూచనలు
వర్షాకాలంలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ప్రారంభం కాగానే మొదట అన్ని చెరువులు, కుంటలు నింపాలి. దీనికోసం అవసరమైన ఓటీలను, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను వెంటనే నిర్మించాలి. చెరువులు, కుంటలు ఏడాదంతా నిండి ఉండే వ్యూహం అవలంబించాలి. చెరువులకు నీరు అందించడానికి ఉన్న అడ్డంకులపై చర్చించేందుకు ఆయా జిల్లాల మంత్రులు, అధికారులు 2–3 రోజుల్లోనే సమావేశం కావాలి.
చెరువులు నింపడం ద్వారా భూగర్భ నీటిమట్టం పెరుగుతుంది. ఫలితంగా బోర్ల ద్వారా కూడా వ్యవసాయం సాగుతుంది.
చెరువుల నుంచి రైతులు స్వచ్ఛందంగా మట్టిని తీసుకెళ్లడానికి అవకాశం ఇవ్వాలి. అధికారులు రైతులపై ఆంక్షలు పెట్టరాదు. 
ఎల్‌ఎండీ నుంచి దిగువకు నీరందించడానికి ప్రస్తుతమున్న కాలువ కేవలం 6 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో ఉంది. దీని సామర్థ్యాన్ని 9 వేల క్యూసెక్కులకు పెంచాలి. ప్రస్తుతమున్న కాల్వ సామర్థ్యం పెంచడమా లేక సమాంతరంగా మరో కాలువ నిర్మించాలా అనే విషయాన్ని ఈఎన్సీల కమిటీ తేల్చాలి.
తోటపల్లి కాలువ ద్వారా 77 వేల ఎకరాలకు నీరందించాలి. 
గౌరవల్లి లిఫ్టు పనులను వెంటనే పూర్తి చేసి ఈ సీజన్‌లోనే నీళ్లు అందించాలి. 
దేవాదుల ప్రాజెక్టు ద్వారా వరంగల్‌ జిల్లాలోని అన్ని చెరువులు నింపాలి. సమ్మక్క బ్యారేజీ పనులను వేగవంతం చేయాలి. దేవాదుల ప్రాజెక్టు ద్వారా 365 రోజులూ నీటిని లిఫ్టు చేయాలి. 
వరద కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలి. వరద కాలువలపై ఓటీల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. 
జగిత్యాల జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని ముక్కట్‌రావుపేట గ్రామంలో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలు చేయాలి.
భారీ, మధ్యతరహా, చిన్నతరహా నీటిపారుదల, ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని విభాగాలు, ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందకు రావాలి. అన్నీ నీటిపారుదల శాఖ పరిధిలోనే ఉండాలి. ప్రాజెక్టులు, వాటి భౌగోళిక స్థితి ఆధారంగా నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరించాలి. సీఈ/ఈఎన్సీ పరిధులు నిర్ణయించి నీటిపారుదల జోన్లు ఏర్పాటు చేయాలి. అత్యవసరమైన సాగునీటి పనులకు కావాల్సిన అనుమతులు ఇవ్వడానికి సీఈ నుంచి ఈఈ వరకు అధికారాలను ప్రభుత్వం బదిలీ చేస్తుంది. సీఈ రూ. 50 లక్షల వరకు ఎస్‌ఈ రూ. 25 లక్షల వరకు, ఈఈ రూ. 5 లక్షల వరకు పనులకు అనుమతులు ఇవ్వొచ్చు.
15 రోజుల్లోగా అన్ని ప్రాజెక్టులపై కొత్తగా గేజ్‌ మీటర్లు ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతమున్న గేజ్‌లు చాలా కాలం క్రితం ఏర్పాటు చేసివని. చాలా ప్రాజెక్టుల్లో పూడిక వల్ల గేజ్‌లు సరిగ్గా పనిచేయట్లేదు. కొత్తగా గేజ్‌లు ఏర్పాటు చేసి కచ్చితమైన అంచనా వేయాలి.
నీటిపారుదల శాఖ భూములు, ఆస్తుల వివరాలతో ఇన్వెంటరీ తయారు చేయాలి. నీటిపారుదల శాఖ సేకరించిన భూములను వెంటనే మ్యుటేషన్‌ చేయించాలి.
ప్రాజెక్టుల భూములను ఆక్రమించిన వారిపై సీరియస్‌గా ఉండాలి. సేకరించిన భూమిని మ్యుటేషన్‌ చేయాలి.
కాల్వ కట్టలపై నివాసం ఉండే వారు తక్షణం ఖాళీ చేసేలా కఠినంగా వ్యవహరించాలి. అక్రమ నిర్మాణాలను తొలగించాలి.
ప్రాజెక్టుల నిర్వహణ కూడా ముఖ్యం. ప్రతి ప్రాజెక్టు నిర్వహణ కోసం ఓఅండ్‌ఎం మ్యాన్యువల్‌ రూపొందించాలి. ఏటా బడ్జెట్లోనే నిర్వహణ వ్యయం కేటాయించి ప్రభుత్వం విడుదల చేస్తుంది. 
ఎక్కడైనా భూసేకరణ మిగిలి ఉంటే పూర్తి చేయాలి. దీనికి కావాల్సిన నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement