
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తొలిసారి కొత్త ఆయకట్టుకు నీరందనుంది. ఇప్పటివరకు ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగానే ఎత్తిపోతలు కొనసాగగా.. మొదటిసారి 2.70 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు గోదావరి పారనుంది. అన్నీ కుదిరితే వచ్చే నెల చివరి నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసేలా సాగునీటి శాఖ ప్రణాళికలు వేస్తోంది. ఇందులో ఈ ఏడాది నుంచి పాక్షికంగా అందుబాటులోకి రానున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద సైతం 55వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందనుంది.
అన్ని రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు..
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 18.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు మరో 18.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మొదలైన కాళేశ్వరం ఎత్తిపోతలు ద్వారా రెండేళ్లుగా కేవలం స్థిరీకరణ అవసరాల నిమిత్తమే నీటి వినియోగం జరిగింది. ముఖ్యంగా ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 పరిధిలో ఉన్న 13 లక్షల ఎకరాలకు గానూ లోయర్ మానేరు దిగువున ఉన్న ఆయకట్టు సుమారు 8 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారానే నీరందిస్తున్నారు. మిడ్‌మానేరు దిగువున కొండపోచమ్మ సాగర్ వరకు ఉన్న రిజర్వాయర్లన్నింటినీ నింపినా వాటి చెరువులు నింపేందుకు మాత్రమే నీటిని వదిలారు. అయితే ఈ ఏడాది వానాకాలంలో మాత్రం తొలిసారి కాళేశ్వరంలోని అన్ని రిజర్వాయర్ల కింద కొత్త ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తి చేశారు.
మిడ్‌మానేరు కింద 50 వేల ఎకరాలు..
మిడ్‌మానేరు కింద 50 వేల ఎకరాలకు నీరిచ్చేలా ఇటీవలే నిర్ణయించగా, దీనితో పాటు అనంతగిరి రిజర్వాయర్ కింద 20 వేల ఎకరాలు, రంగనాయక్ సాగర్ కింద 55 వేల ఎకరాలు, మల్లన్నసాగర్ కింద 55 వేల ఎకరాలు, కొండపోచమ్మ సాగర్ కింద 70 వేల ఎకరాలకు కొత్తగా నీరివ్వాలని నిర్ణయించారు. ఇందులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు చివరి దశలో ఉన్నాయి. 95 శాతం మేర పనులు ఇప్పటికే పూర్తవగా, జూలై 20 నాటికి మిగతా పనులు పూర్తి చేయనున్నారు. ఇందులో 50 టీఎంసీలకు గానూ మొదట 10 టీఎంసీలు నింపి, తర్వాత ప్రతి మూడు నెలలకు మరో 10 టీఎంసీలు నింపుతూ వెళ్లనున్నారు. తొలిసారిగా నింపే నీటి నుంచే సుమారు 55 వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా కాల్వల పనులు పూర్తి చేస్తున్నారు. ఇక 15 టీఎంసీల సామర్ధ్యం గల కొండపోచమ్మ కింద తొలి ఏడాదిలో 7.8 టీఎంసీలు మాత్రమే నింపగా, ఈ ఏడాది పూర్తి స్థాయిలో నింపనున్నారు. దీనికింద సంగారెడ్డి, గజ్వేల్, రామాయంపేట, కిష్టాపూర్, జగదేవ్‌పూర్, తుర్కపల్లి, ఎం.తుర్కపల్లి, రావెల్ కోల్ వంటి కాల్వలు ఉండగా, 2.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో జగదేవ్‌పూర్, గజ్వేల్, రామాయంపేట, తుర్కపల్లి కాల్వల పనులు పూర్తయ్యాయి. వీటికింద కనీసంగా 70 వేల ఎకరాలకు సాగు నీరందించేలా పనులు జరిగాయి. ఇక కాళేశ్వరంలోని ప్యాకేజీ–21 కింద చేపట్టిన పైప్‌లైన్‌న్ వ్యవస్థ నిర్మాణాలు పాక్షికంగా పూర్తవడంతో ఈ వానాకాలంలోనే తొలిసారి దీనికింద నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 20 వేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లివ్వనున్నారు. ఆయకట్టుకు నీటిని ఇవ్వడంతో ఈ రిజర్వాయర్ల కింద కనీసంగా 300 వరకు చెరువులు నింపే ప్రణాళిక సైతం సిద్ధమైంది. వానాకాలం, యాసంగిలో నీటి లభ్యత పెంచేలా చెరువులను పూర్తి స్థాయిలో నింపి ఆయకట్టును స్థిరీకరించనున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతలు ద్వారా రెండేళ్లుగా కేవలం స్థిరీకరణ అవసరాల నిమిత్తమే నీటి వినియోగం జరిగింది. అయితే తొలిసారిగా ఈ సీజన్‌లో ప్రాజెక్టు పరిధిలోని అన్ని రిజర్వాయర్ల కింద కొత్త ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తి చేశారు.
మిడ్‌మానేరు కింద 50 వేల ఎకరాలు,
అనంతగిరి 20 వేల ఎకరాలు
రంగనాయక్ సాగర్- 55 వేల ఎకరాలు
మల్లన్న సాగర్ - 55 వేల ఎకరాలు
కొండపోచమ్మ సాగర్- 70 వేల ఎకరాలు
కాళేశ్వరం ప్యాకేజీ-21 కింద - 20 వేల ఎకరాలు కలిపి మొత్తం 2.70 లక్షల ఎకరాలకు సాగు నీళ్లివ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment