Telangana Irrigation projects
-
ప్రాజెక్టుల అప్పగింతపై హామీ ఇవ్వలేం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్క పెద్దవాగు మినహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల అప్పగింతపై ఎలాంటి హామీ ఇవ్వలేమని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కి తెలంగాణ నీటిపారుదల శాఖ మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టుల డీపీఆర్‌లు, ప్లాంట్లు, యంత్రాలు, పరికరాలు, కార్యాలయాలు, ఫర్నిచర్, వాహనాలు, మంజూరైన పోస్టులు, ఇతర రికార్డులను బోర్డులకు అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాల్లేవని పేర్కొంది. తెలంగాణలోని రెండు, ఏపీలోని రెండు నీటి విడుదల పాయింట్లను బోర్డుల చేతికి అప్పగించే అంశంపై గోదావరి బోర్డు సబ్ కమిటీ బుధవారం జలసౌధలో సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు రాష్ట్ర వాదనను వినిపించారు. దేవాదుల పథకానికి సంబంధించిన ఇన్‌టెక్ పంపుహౌజ్ వద్ద గోదావరి బోర్డు జరిపిన క్షేత్రస్థాయి పర్యటనలో సబ్‌కమిటీని దూరంగా ఉంచిన నేపథ్యంలో.. ఆ ప్రాజెక్టు అప్పగింతకు సంబంధించిన నివేదికను తెలంగాణ అధికారులు వ్యతిరేకించారు. గోదావరిపై రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులేవీ లేనందున.. ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాల(సీఐఎస్ఎఫ్)ను మోహరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దానివల్ల రాష్ట్ర ఖజానాపై అనవసర భారం పడుతుందని వివరించారు. ‘‘గోదావరి ట్రిబ్యునల్ తీర్పులోని క్లాజ్–4 ప్రకారం.. తమ వాటాలోని ఏదైన భాగాన్ని ఇతర బేసిన్లకు బదిలీ చేసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, దేవాదుల పథకాలు ఉమ్మడి రాష్ట్రంలో కట్టినవే. గోదావరి నీటిని కృష్ణాబేసిన్ ప్రాంతాలకు తరలించడంపై అప్పట్లో ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ లేవనెత్తుతున్న అభ్యంతరాలు తెలంగాణకు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు. గోదావరి ట్రిబ్యునల్ తీర్పుకు సైతం అది వ్యతిరేకం’’ అని వివరించారు. ఇక ప్రాజెక్టుల అప్పగింతపై గోదావరి బోర్డు రూపొందించిన నివేదికపై అధ్యయనం కోసం కొంత సమయం కావాలని రాష్ట్ర అధికారులు కోరగా.. ఇందుకు బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. అప్పగింత నివేదికపై చర్చను తదుపరి సమావేశానికి వాయిదా వేశారు. సమావేశంలో తెలంగాణ తరఫున సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఇంటర్‌స్టేట్ విభాగం ఎస్ఈ కోటేశ్వరరావు, ఈఈ సుబ్రమణ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘కాళేశ్వర ఫలం’: 2.70 లక్షల ఎకరాలకు తొలి తడి
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తొలిసారి కొత్త ఆయకట్టుకు నీరందనుంది. ఇప్పటివరకు ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగానే ఎత్తిపోతలు కొనసాగగా.. మొదటిసారి 2.70 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు గోదావరి పారనుంది. అన్నీ కుదిరితే వచ్చే నెల చివరి నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసేలా సాగునీటి శాఖ ప్రణాళికలు వేస్తోంది. ఇందులో ఈ ఏడాది నుంచి పాక్షికంగా అందుబాటులోకి రానున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద సైతం 55వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందనుంది. అన్ని రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 18.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు మరో 18.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మొదలైన కాళేశ్వరం ఎత్తిపోతలు ద్వారా రెండేళ్లుగా కేవలం స్థిరీకరణ అవసరాల నిమిత్తమే నీటి వినియోగం జరిగింది. ముఖ్యంగా ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 పరిధిలో ఉన్న 13 లక్షల ఎకరాలకు గానూ లోయర్ మానేరు దిగువున ఉన్న ఆయకట్టు సుమారు 8 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారానే నీరందిస్తున్నారు. మిడ్‌మానేరు దిగువున కొండపోచమ్మ సాగర్ వరకు ఉన్న రిజర్వాయర్లన్నింటినీ నింపినా వాటి చెరువులు నింపేందుకు మాత్రమే నీటిని వదిలారు. అయితే ఈ ఏడాది వానాకాలంలో మాత్రం తొలిసారి కాళేశ్వరంలోని అన్ని రిజర్వాయర్ల కింద కొత్త ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తి చేశారు. మిడ్‌మానేరు కింద 50 వేల ఎకరాలు.. మిడ్‌మానేరు కింద 50 వేల ఎకరాలకు నీరిచ్చేలా ఇటీవలే నిర్ణయించగా, దీనితో పాటు అనంతగిరి రిజర్వాయర్ కింద 20 వేల ఎకరాలు, రంగనాయక్ సాగర్ కింద 55 వేల ఎకరాలు, మల్లన్నసాగర్ కింద 55 వేల ఎకరాలు, కొండపోచమ్మ సాగర్ కింద 70 వేల ఎకరాలకు కొత్తగా నీరివ్వాలని నిర్ణయించారు. ఇందులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు చివరి దశలో ఉన్నాయి. 95 శాతం మేర పనులు ఇప్పటికే పూర్తవగా, జూలై 20 నాటికి మిగతా పనులు పూర్తి చేయనున్నారు. ఇందులో 50 టీఎంసీలకు గానూ మొదట 10 టీఎంసీలు నింపి, తర్వాత ప్రతి మూడు నెలలకు మరో 10 టీఎంసీలు నింపుతూ వెళ్లనున్నారు. తొలిసారిగా నింపే నీటి నుంచే సుమారు 55 వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా కాల్వల పనులు పూర్తి చేస్తున్నారు. ఇక 15 టీఎంసీల సామర్ధ్యం గల కొండపోచమ్మ కింద తొలి ఏడాదిలో 7.8 టీఎంసీలు మాత్రమే నింపగా, ఈ ఏడాది పూర్తి స్థాయిలో నింపనున్నారు. దీనికింద సంగారెడ్డి, గజ్వేల్, రామాయంపేట, కిష్టాపూర్, జగదేవ్‌పూర్, తుర్కపల్లి, ఎం.తుర్కపల్లి, రావెల్ కోల్ వంటి కాల్వలు ఉండగా, 2.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో జగదేవ్‌పూర్, గజ్వేల్, రామాయంపేట, తుర్కపల్లి కాల్వల పనులు పూర్తయ్యాయి. వీటికింద కనీసంగా 70 వేల ఎకరాలకు సాగు నీరందించేలా పనులు జరిగాయి. ఇక కాళేశ్వరంలోని ప్యాకేజీ–21 కింద చేపట్టిన పైప్‌లైన్‌న్ వ్యవస్థ నిర్మాణాలు పాక్షికంగా పూర్తవడంతో ఈ వానాకాలంలోనే తొలిసారి దీనికింద నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 20 వేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లివ్వనున్నారు. ఆయకట్టుకు నీటిని ఇవ్వడంతో ఈ రిజర్వాయర్ల కింద కనీసంగా 300 వరకు చెరువులు నింపే ప్రణాళిక సైతం సిద్ధమైంది. వానాకాలం, యాసంగిలో నీటి లభ్యత పెంచేలా చెరువులను పూర్తి స్థాయిలో నింపి ఆయకట్టును స్థిరీకరించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలు ద్వారా రెండేళ్లుగా కేవలం స్థిరీకరణ అవసరాల నిమిత్తమే నీటి వినియోగం జరిగింది. అయితే తొలిసారిగా ఈ సీజన్లో ప్రాజెక్టు పరిధిలోని అన్ని రిజర్వాయర్ల కింద కొత్త ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తి చేశారు. మిడ్‌మానేరు కింద 50 వేల ఎకరాలు, అనంతగిరి 20 వేల ఎకరాలు రంగనాయక్ సాగర్- 55 వేల ఎకరాలు మల్లన్న సాగర్ - 55 వేల ఎకరాలు కొండపోచమ్మ సాగర్- 70 వేల ఎకరాలు కాళేశ్వరం ప్యాకేజీ-21 కింద - 20 వేల ఎకరాలు కలిపి మొత్తం 2.70 లక్షల ఎకరాలకు సాగు నీళ్లివ్వనున్నారు. -
కాళేశ్వరంలో పడవ ప్రయాణం
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో అధునాతమైన బోటు అందుబాటులోకి రానుంది. ఈ బోట్‌ను రూ.2 కోట్ల వ్యయంతో సిద్ధం చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మహదేవపూర్ మండలం మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీ నుంచి కాలేశ్వరం వరకు 22 కిలోమీటర్ల దూరం బ్యాక్ వాటర్ నిల్వ ఉంటోంది. దీంతో ఇక్కడ గోదావరి సముద్రాన్ని తలపిస్తోంది. ఆ నీటి ఉధృతిలో అతిపెద్ద బోటు ఏర్పాటు చేస్తే టూరిస్టులను ఆకర్షించవచ్చనే ఉద్దేశంతో పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మూడు నెలల్లో అందుబాటులోకి.. ఫిబ్రవరి మొదటి వారం నుంచి కాళేశ్వరంలోని గోదావరి తీరంవద్దే 300 మంది కూలీలతో బోటును తయారు చేయించనున్నారు. ఇందుకోసం ఏపీ నుంచి కార్మికులను రప్పించే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నట్లు సమాచారం. అధునాతన పరిజ్ఞానంతో సిద్ధం చేయించనున్న ఈ బోట్లో ఏసీ, నాన్ ఏసీ గదులు ఉంటాయని తెలిసింది. వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి పర్యాటకులు వచ్చే అవకాశం ఉండడంతో పర్యాటక శాఖ ఆ వైపుగా దృష్టి సారించింది. బోట్ సిదమయ్యాక కాళేశ్వరం నుంచి లక్ష్మీ బ్యారేజ్ వరకు ప్రయాణం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాదారం. మూడు నెలల్లో బోట్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని టూరిజం శాఖ ఉద్యోగులు తెలిపారు. చిన్నచిన్న వేడుకలతో పాటు విందులు చేసుకునేలా 200 మంది ప్రాణం చేసేందుకు వీలుగా బోట్ ఉంటుంది. బోటు కాళేశ్వరంలో తిరగడం ఆరంభిస్తే ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. -
నువ్వా దీక్ష చేసేది
నిండా అవినీతిలో మునిగిన * వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు * ‘అనంత’లో రెండోరోజు రైతుభరోసా యాత్ర సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘నవ నిర్మాణ దీక్ష పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దీక్ష చేయాలని చెబుతున్నారు. దీక్షపై పత్రికల్లో వచ్చిన ప్రకటనలను చదివితే, చంద్రబాబు ప్రజలను ఎంత ఘోరంగా అవహేళన చేస్తున్నారో అర్థమవుతోంది. అవినీతిరహిత రాష్ట్రం కోసం అంతా పాటుపడాలని ఆయన చెబుతున్నారు. నిండా అవినీతిలో మునిగి, ఆ సొమ్ముతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో సహా అడ్డంగా దొరికిపోయారు. ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చింది. అయినా ఆ మనిషి ఇంకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడమంటే ప్రజలను అవహేళన చేయడమే. చంద్రబాబు కంటే దారుణమైన ముఖ్యమంత్రి ఇంకెవరూ ఉండరు’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న ఐదో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా రెండోరోజు గురువారం ఆయన తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో పర్యటించారు. యాడికి మండలం నగరూరులో ఆత్మహత్య చేసుకున్న రైతులు దాసరి కోదండరాముడు, రామసుబ్బారెడ్డి, పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడులో చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాలను జగన్ పరామర్శిం చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు ‘‘నవ నిర్మాణ దీక్షపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు ఉందా? సూట్‌కేసులను నల్లడబ్బుతో నింపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఇంతకంటే దారుణమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా? ఈ రెండేళ్లలో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు. ప్రజలు గమనిస్తున్నారనే జ్ఞానం లేకుండా ఏపీలో కూడా ఒక్కో ఎమ్మెల్యేకు రూ.40 కోట్ల దాకా ఇచ్చి ఇప్పటివరకూ 17 మందిని కొనుగోలు చే శారు. ఇంకా కొనుగోలు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇటీవల ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు కూడా ఇస్తారని వింటున్నాం. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోంది? నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను కొనేస్తున్న మనిషి అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఇసుక నుంచి బొగ్గు కొనుగోళ్ల దాకా... కాంట్రాక్టుల నుంచి రాజధాని భూముల వరకూ ప్రతిదీ అవినీతే. చివరకు దేవుడి భూములను సైతం తక్కువ రేట్లకు బినామీలకు ఇచ్చి రూ.వందల కోట్లు జేబులోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిలోని సదావర్తి సత్రానికి తమిళనాడులో ఉన్న రూ.వెయ్యి కోట్ల విలువైన భూములను రూ.22 కోట్లకే దారాదత్తం చేశారు. గుడిని, గుడిలోని లింగాన్ని మింగేస్తున్నారు. ఇలాంటి మనిషి నవ నిర్మాణ దీక్ష పేరుతో అందరూ ప్రమాణం చేయాలని చెబుతున్నారు. నిజంగా నవ నిర్మాణ దీక్ష జరగాలంటే... చంద్రబాబు ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో కొట్టాలి. అప్పుడే ఆయనకు తెలిసొస్తుంది’’ అని వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. రెండేళ్లలో చేయని మోసం లేదు ‘‘ఈ రెండేళ్ల పాలనలో చంద్రబాబు చేయని మోసం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పారు. ఎన్నికలు అయిపోయాయి. మాఫీ మాట మరిచారు. రుణాలు మాఫీ కాక రైతులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. రూ.87 వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చెప్పారు. మాఫీ చేయకపోవడంతో రూ.87 వేల కోట్లకు వడ్డీనే రూ.25 వేల కోట్లు అయ్యింది. ఈ వడ్డీలో మూడోవంతుకు కూడా సరిపోని విధంగా మాఫీ వర్తింపజేశారు. మాట తప్పిన మనిషికి నవ నిర్మాణ దీక్ష చేసే హక్కు ఉందా? పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడులో నాగరాజు అనే చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లి పరామర్శించా. వారికి రూ.40 వేలుఅప్పుంది. మాఫీ కాక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. కష్టపడి పనిచేస్తే తప్ప కడుపు నిండని పరిస్థితి డ్వాక్రా మహిళలది. వీరి రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికల్లో చంద్రబాబు చెప్పారు. కానీ చేయలేదు. దీంతో డ్వాక్రా మహిళలు బ్యాంకులకు రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్తున్నారు. ఇప్పుడు ముష్టి వేసినట్లు రూ.3 వేల రుణం ఇస్తానంటున్నారు. ఇలాంటి వ్యక్తికి నవ నిర్మాణ దీక్ష పేరిట ప్రతిజ్ఞ చేయించే నైతిక హక్కు ఉందా?’’ అని విపక్ష నేత నిలదీశారు. నిలదీస్తే అరెస్టు తప్పదని బాబు భయం ‘‘ఇంటికో ఉద్యోగం.. లేదంటే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పుడు ఉద్యోగమూ ఇవ్వలేదు, భృతీ చెల్లించలేదు. చంద్రబాబు పాలన అంతా మోసం, అబద్ధాలు తప్ప ఏమీ లేదు. చంద్రబాబు దగ్గరుండి ఓటు వేయించి రాష్ట్రాన్ని విడగొట్టారు. అప్పట్లో ఐదేళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్‌ను నీరుగారుస్తున్నారు. కేంద్రంలోని తన మంత్రులతో ప్రత్యేక హోదాపై అడిగించడం లేదు. ప్రధాని మోదీకి అల్టిమేటం జారీ చేస్తే.. రెండేళ్లలో జరిగిన తన అక్రమాలతోపాటు కేసులను బయటికి తీసి అరెస్టు చేయిస్తారని చంద్రబాబు భయపడుతున్నారు. అలాగే కృ ష్ణా, గోదావరి నదులపై తెలంగాణ సీఎం కేసీఆర్ అ డ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నారు. అవి పూర్తయితే మనకు నీళ్లు రావని తెలిసినా కేసీఆర్‌ను ప్రశ్నించే పరిస్థితి లేదు. గట్టిగా నిలదీస్తే ఓటుకు కోట్లు కేసును బయటికి తీసి జైల్లో పెట్టిస్తారనే భయంతోనే కేసీఆర్‌ను చంద్రబాబు పల్లెత్తు మాట అనడం లేదు. ఇలాంటి వ్యక్తికి ప్రజలతో ప్రమాణం చేయించే హక్కు లేదు’’ అని ప్రతిపక్ష నేత జగన్ దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనపై ఆయనకే నమ్మకం లేదు ‘‘చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం లేదు. ఉంటే.. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన 17 మంది ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయడం లేదు? ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎందుకు ప్రజాతీర్పు కోరడం లేదు? మరోపార్టీ బీ-ఫాంపై గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన చంద్రబాబు తిరిగి ఎన్నికలకు వెళ్లలేకపోతున్నారంటే ఆయన పాలనపై ఆయనకే నమ్మకం లేదనే విషయం తెలుస్తోంది’’ అని జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నేతలు తెలంగాణలో ప్రాజెక్టుల కాంట్రాక్టులు తీసుకున్నారు కదా? అని ఓ విలేకరి ప్రశ్నించగా... ‘‘సీపీఐతోపాటు అన్ని పార్టీల్లో కాంట్రాక్టర్లు ఉన్నారు. వారే వేర్వేరు ప్రాంతాల్లో పనులు చేస్తుంటారు. నేను ప్రాజెక్టులు కట్టొద్దన్నానంటే, వారికి వ్యతిరేకంగా మాట్లాడినట్లే కదా! ప్రాజెక్టులు నిర్మించకపోతే కాంట్రాక్టర్లకు నావల్ల మేలు కాకుండా నష్టమే జరుగుతుంది. పది మందికి మేలు జరగడం ముఖ్యం, ఒకరికి నష్టం వస్తుందని వెనకడుగు వేయకూడదు’’ అని జగన్మోహన్రెడ్డి బదులిచ్చారు. -
అంత దమ్ము చంద్రబాబుకు లేదు: వైఎస్ జగన్
అనంతపురం : ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్లే దమ్ము, ధైర్యం చంద్రబాబు నాయుడికి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజల దగ్గరకు వెళితే ఎవరేంటో తెలుస్తుందని ఆయన సవాల్ విసిరారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ గురువారమిక్కడ మాట్లాడుతూ వేరే పార్టీ బీఫామ్లపై గెలిచిన ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో కొంటున్నారని మండిపడ్డారు. ఈ చర్య చూస్తుంటే చంద్రబాబుకు తన పాలన మీద తనకే నమ్మకం లేదనిపిస్తోందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయించడం లేదని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ఇక నవ నిర్మాణ దీక్ష పేరుతో ఆయన ప్రజలను హేళన చేస్తున్నారని అన్నారు. అవినీతి రహిత రాష్ట్రమని చెబుతున్న ఆయన నిండా అవినీతిలో మునిగారన్నారు. ఓటుకు కోట్ల కేసు భయంతోనే తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజక్టుల గురించి చంద్రబాబు మాట్లాడటం లేదని వైఎస్ జగన్ విమర్శించారు. సీబీఐ విచారణ జరుపుతుందేమోననే శంకతో అక్రమ ప్రాజెక్టుల విషయంలోనూ మోదీని కూడా నిలదీయలేకపోతున్నారన్నారు. అందువల్లే కేంద్రం రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదన్నారు. -
అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా
విజయవాడ: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద సోమవారం ఉదయం నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ రఘువీరా, కనుమూరి బాపిరాజు, దేవినేని రాజశేఖర్(నెహ్రూ) పెద్దసంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం పోరాడాలని నేతలు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల ధర్నాలకు టీడీపీ సర్కారు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోంది. మహా ధర్నాకు వెళుతున్న కాంగ్రెస్ నాయకులను తెనాలిలో పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
గలగలల గోదావరి.. పరవళ్లకు సంకెళ్లు!
► ఎగువన అరడజను అక్రమ ప్రాజెక్టులు.. ► అనుమతులు లేకుండా శరవేగంగా కడుతున్న తెలంగాణ సర్కారు ► అదనంగా 165 టీఎంసీలు వాడుకునే ఎత్తుగడ ► ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో చుక్కనీరు కిందకు రాకుండా తెలంగాణ ప్రణాళికలు ► అవి పూర్తయితే గోదావరి డెల్టా రైతుకు కన్నీరే ► ఇక వరదల సమయంలోనే డెల్టాకు నీరు ► అన్నపూర్ణ లాంటి గోదావరి ప్రాంతంలో ఉప్పుకయ్యలుగా మిగలనున్న పచ్చని భూములు ► వరద సమయంలో నీటిని నిల్వచేసే ► పోలవరాన్ని నిర్మించకుండా కమీషన్ల కక్కుర్తితో పట్టిసీమ వైపు బాబు మొగ్గు ► బాబు మౌనం.. గోదావరి రైతుకు శాపం ► ‘ఓటుకు కోట్లు’ భయంతో అదేమని ప్రశ్నించలేని సీఎం చంద్రబాబు దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచిన గోదావరి జిల్లాల్లోని పొలాలు బీడు భూములుగా మారే ప్రమాదం ముంచుకొస్తోంది. అనుమతుల్లేకుండా తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులతో డెల్టాకు చుక్కనీరు రావడం ఇక కష్టమే. వరద వస్తేనే డెల్టాలో వరికి నీరు వచ్చే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంత ఉపద్రవం పొంచి ఉన్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడంలేదు. ‘గోదావరి జిల్లా రైతుల ప్రయోజనాలు కాపాడతాను’ అని చెప్పిన ఆయన.. తెలంగాణ ప్రాజెక్టులపై స్పందించలేని స్థితిలో ఉన్నారు. ఓటుకు కోట్లు కేసు భయంతో డెల్టా రైతులను నిలువునా ముంచేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులు గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైనింగ్ పూర్తయితే.. కరువన్నదే ఎరుగని మన డెల్టా భూములు కన్నీళ్లతో తడవక తప్పని దుస్థితి ఏర్పడటం ఖాయం. ఎప్పుడో వరదలొచ్చినప్పుడు తప్ప మిగతా రోజుల్లో గోదావరి నుంచి చుక్కనీరు కూడా మనకు రాకుండా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు అడ్డుకోబోతున్నాయి. సాధారణంగా జూన్ నాలుగో వారం నుంచి అక్టోబర్ 15 వరకూ వర్షాకాలంలో గోదావరిలో వరద ఉంటుంది. నదిలో మొత్తంగా 3000 టీఎంసీల(గోదావరి ట్రిబ్యునల్ అంచనా ప్రకారం) ప్రవాహం ఉంటే.. సింహభాగం ఈ వరదల సమయంలోనే అందుబాటులో ఉంటుంది. మిగతా సమయాల్లో వచ్చే ప్రవాహాన్ని తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు ఎక్కడికక్కడ అడ్డుకుని లిఫ్టుల ద్వారా తోడేసుకుంటాయి. పోనీ వర్షాకాలంలో వచ్చే వరదను నిల్వ చేసుకుందామంటే.. ఆ నిల్వ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌లో లేవు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఉంటే 301 టీఎంసీలను వినియోగించుకునే అవకాశం ఉండేది. పోలవరాన్ని విస్మరించి కమీషన్ల కోసం పట్టిసీమను చేపట్టడం, తెలంగాణ కొత్త ప్రాజెక్టులు కడుతున్నా నోరెత్తని సీఎం చంద్రబాబు నాయుడు వైఖరితో గోదావరి రైతులు కష్టాల్లో కూరుకుపోనున్నారు. హైదరాబాద్: నాసిక్‌లో పురుడుపోసుకునే గోదావరి నది ప్రధాన స్రవంతిపై ఆ రాష్ట్రంలో అసంఖ్యాకంగా నిర్మించిన చిన్న, పెద్దా ప్రాజెక్టుల వల్ల తెలంగాణలోకి ప్రవేశించే సరికి ఖాళీ కుండను తలపిస్తున్నది. ఆ తర్వాత కాళేశ్వరం క్షేత్రం వద్ద ప్రాణహిత నది కలిసేంత వరకూ గోదావరి నది నిర్జీవంగానే ఉంటుంది. ప్రాణహిత కలిసిన దగ్గర నుంచి ఆ తర్వాత ఇంద్రావతి, కిన్నెరసాని, మంజీరా, శబరి, సీలేరుల సంగమంతో అంతర్వేది వరకూ జీవకళతో గోదావరి పారుతోంది. అంటే.. ఇప్పుడు గోదావరిలో ధవళేశ్వరం వరకు ప్రవహించే జలాల్లో ఈ ఉప నదుల వాటానే ప్రధానం. ప్రాణహిత సంగమం నుంచి ధవళేశ్వరం వరకు మధ్యలో ఎక్కడా ప్రాజెక్టులు లేని కారణంగా అన్ని కాలాల్లోనూ ఈ ప్రాంతంలో గోదావరి జీవనదిలా సాగింది. ఏపీ నెత్తిన మేడిగడ్డ అయితే రీడిజైన్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ‘ప్రాణహిత–చేవెళ్ల’ను రూపు మార్చి కాళేశ్వరం పేరుతో ప్రాణహిత, ఇంద్రావతిల సంగమం తర్వాత మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్నది. దాని దిగువన దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, భక్త రామదాస ప్రాజెక్టులను చేపట్టింది. వర్షాకాలం వరద ఉన్న సమయం మినహా మిగతా సమయాల్లో ఈ ప్రాజెక్టులను దాటుకుని వచ్చే జలాలు ఎన్ని ఉంటాయన్నది సందేహమే. శబరి, సీలేరులే ఇక శరణ్యం. పోలవరం పూర్తయి ఉంటే.. పరిస్థితి కొంత భిన్నంగా ఉండేది. పునర్విభజన చట్టం ప్రకారం గోదావరి, కష్ణా నదులపై కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా కేంద్ర జల సంఘం.. ప్రధానమంత్రి నేతత్వంలోని అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి. ఎలాంటి అనుమతులు తీసుకోకున్నా తెలంగాణ సర్కారు గోదావరి నదిపై అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు నిర్మించి.. తమకు గోదావరి జలాల్లో 954.23 టీఎంసీల వాటా ఉందంటూ వాదిస్తున్నా చంద్రబాబు ఉలకడం లేదు.. పలకడం లేదు. ‘ఓటుకు కోట్లు’ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. రీడిజైన్ పేరుతో అదనపు జలాలు.. గోదావరి ఉప నది ప్రాణహితపై తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మించి.. అక్కడ నుంచి ఎల్లంపల్లి(శ్రీపాదసాగర్) ప్రాజెక్టు, మధ్య మానేరు ప్రాజెక్టుల మీదుగా చేవెళ్ల వరకూ నీటిని తరలించడానికి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 160 టీఎంసీలే. కానీ.. తాజాగా రీడిజైన్ పేరుతో ఆ ప్రాజెక్టు పేరును కాళేశ్వరంగా మార్చారు. ప్రాణహిత నదిపై 15 టీఎంసీల సామర్థ్యంతో తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మించి.. గోదావరి నదిలో ఇంద్రావతి కలిసిన 15 కిమీల దూరంలో మేడిగడ్డ వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించి.. అక్కడి నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 180 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 215 టీఎంసీలను వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రణాళిక రచించింది. ప్రాణహిత–చేవెళ్ల కన్నా ఈ ప్రాజెక్టు సామర్థ్యం 65 టీఎంసీలు అధికం. ► తెలంగాణ వరంగల్ జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని గతంలో 35 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించారు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 60 టీఎంసీలకు పెంచింది. అంటే.. అదనంగా 25 టీఎంసీలను వినియోగించుకోవడానికి ప్రణాళిక రచించింది. ► దేవాదుల ప్రాజెక్టుకు దిగువన వరంగల్ జిల్లా కంతన పల్లి వద్ద 50 టీఎంసీల సామర్థ్యంతో ఓ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును వరంగల్ జిల్లా తుపాకులగూడెం వద్దకు మార్చి.. 100 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. అంటే.. కంతనపల్లి ప్రాజెక్టు కన్నా 50 టీఎంసీలను అధికంగా వినియోగించుకోవడానికి తుపాకులగూడెం ప్రాజెక్టును చేపట్టినట్లు స్పష్టమవుతోంది. ► కంతనపల్లి ప్రాజెక్టుకు దిగువన ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వద్ద ఓ బ్యారేజీని నిర్మించి.. అక్కడి నుంచి 25 టీఎంసీల నీటిని టెయిల్‌పాండ్‌కు తరలించి.. నాగార్జునసాగర్ ఆయకట్టును స్థిరీకరించడానికి దుమ్ముగూడెం–టెయిల్‌పాండ్ ప్రాజెక్టును ప్రతిపాదించారు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం టెయిల్‌పాండ్‌ను తొలగించి.. అదనంగా సీతారామ, భక్త రామదాసు పేరుతో రెండు ప్రాజెక్టులను చేపట్టి 25 టీఎంసీలను వినియోగించుకోవడానికి ప్రణాళిక రూపొందించింది. వీటిలో ఏ ప్రాజెక్టుకు కూడా పాలనాపరమైన అనుమతులు లేవు. వాటిని తెచ్చుకోనూ లేదు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు తెలంగాణను ప్రశ్నించకుండా మౌనం వహిస్తున్నారు. ధాన్యాగారంలో ఇక ‘వర్రీ’నే.. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై నీటి నిల్వ చేసే ఏకైక ప్రాజెక్టు ధవళేశ్వరం బ్యారేజీ. దీని సామర్థ్యం కూడా 2.93 టీఎంసీలే. గోదావరి నదిలో ఎప్పటికప్పుడు వచ్చే ప్రవాహం(ఇన్‌ఫ్లో) ద్వారా లభించే నీటిని కాలువల ద్వారా మళ్లించి ఆయకట్టుకు నీళ్లందిస్తారు. తక్కిన ఎత్తిపోతల పథకాలకూ గోదావరి నదిలో ప్రవహించే నీళ్లే ఆధారం. వాటికి నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు లేవు. ధవళేశ్వరం బ్యారేజీతోపాటూ ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు నీళ్లందించాలంటే ఏడాదికి 254.28 టీఎంసీలు అవసరం. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో జూన్ నాలుగో వారం నుంచి అక్టోబరు 15 వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయి. సుమారు 60 రోజులపాటు గోదావరికి వరద వస్తుంది. ఆ 60 రోజులూ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల కింద ఆయకట్టుపై ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ.. అక్టోబరు 15 తర్వాత గోదావరి నదిలో ప్రవాహం తగ్గినప్పుడు తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను దాటుకుని చుక్క నీరు కూడా రాష్ట్ర సరిహద్దుకు చేరే అవకాశం ఉండదు. వరద వచ్చినప్పుడు నీటిని నిల్వ చేసుకునేలా పోలవరం ప్రాజెక్టును నిర్మించకపోవడం వల్ల డెల్టాకు కష్టాలు తప్పవని సాగునీటి రంగ నిపుణులు స్పషీ్టకరిస్తున్నారు. అదే సమయంలో గోదావరి, కష్ణా డెల్టాల్లో ఖరీఫ్ వరి పంట పొట్ట దశలో ఉంటుంది. ఆ సమయంలో అధికంగా నీళ్లు అవసరం. గోదావరి డెల్టాకు రోజుకు కనిష్టంగా 16 వేల క్యూసెక్కులు.. పుష్కర, తాడిపూడి, చాగల్నాడు, వెంకటనగరం, చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలకు కనిష్టంగా 20 వేల క్యూసెక్కుల నీళ్లు అవసరం అవుతాయి. అంటే.. కనిష్టంగా రోజూ మూడు టీఎంసీలకుపైగా నీళ్లు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో రబీకి కష్టాలు తప్పవని సాగునీటి రంగ నిపుణులు స్పషీ్టకరిస్తున్నారు. 2013, 2014, 2015లలో వర్షాభావ పరిస్థితుల వల్ల గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటలను ఎలాగోలా కాపాడుకోగలిగినా.. రబీలో ఆయకట్టు విస్తీర్ణాన్ని సగానికిపైగా తగ్గించినా ప్రభుత్వం పంటలను కాపాడలేకపోవడాన్ని ఎత్తిచూపుతున్నారు. రబీ పంటలకు శబరి, కిన్నెరసాని నుంచి లభించే నీళ్లు, సీలేరు, బలిమెల రిజర్వాయర్ల నుంచి విద్యుదుత్పత్తి చేసి కిందకు వదిలే నీళ్లే దిక్కు. అవన్నీ కలిపినా ఆరేడువేల క్యూసెక్కులకు మించవు. ఆ నీటికితోడు ఎక్కడికక్కడ డ్రైన్ల నుంచి నీటిని భారీ ఎత్తున ఎత్తిపోసినా రబీ పంటలను కాపాడటం సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు. డెల్టాలో వరి సాగు తగ్గిపోవడంతో భూగర్భ జలమట్టం తగ్గి.. ఆ మేరకు ఉప్పు నీరు పైకి ఉబికి రావడం వల్ల డెల్టా ఉప్పుబారి పోయి సాగుకు పనికి రాకుండా పోతుందని.. ధాన్యాగారంలో ఆకలికేకలు తప్పవని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► ధవళేశ్వరం(సర్ ఆర్ధర్ కాటన్) బ్యారేజీ ద్వారా గోదావరి డెల్టా పరిధిలోని 10,13,161 ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. డెల్టాలో ఖరీఫ్ పంటకు కనిష్టంగా 127 టీఎంసీలు.. రబీ పంటకు కనిష్టంగా 95 టీఎంసీల మొత్తం ఏడాదికి 222 టీఎంసీల నీళ్లు అవసరం అవుతాయి. ► పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా 11.80 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి తూర్పుగోదావరి జిల్లాలో 1,85,906 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఇప్పటికే 85 వేల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. ► తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 12.14 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి పశ్చిమ గోదావరి జిల్లాలో 2,06,572 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే 50 వేల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. ► చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా 2.845 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి తూర్పుగోదావరి జిల్లాలో 35 వేల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా 14,500 ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. ► వెంకటనగరం ఎత్తిపోతల పథకం ద్వారా 3.62 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి తూర్పుగోదావరి జిల్లాలో 34 వేల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. ► చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 15.50 టీఎంసీలను ఎత్తిపోసి నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టులో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ► పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రకాశం బ్యారేజీకి 80 టీఎంసీలను మళ్లించి.. కష్ణా డెల్టా పరిధిలోని 13.54 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించారు. గోదావరి ప్రస్థానం ఇదీ... మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో నాసిక్‌కు సమీపంలో త్రయంబకేశ్వర్ వద్ద పురుడు పోసుకునే గోదావరి 1465 కిమీల దూరం ప్రవహించి.. అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 770 కిమీల దూరం ప్రవహిస్తుంది. గోదావరి నదిలో మూడు వేల టీఎంసీల నీటి లభ్యత ఉందని లెక్క కట్టిన గోదావరి ట్రిబ్యునల్.. మహారాష్ట్రకు 888.90, కర్ణాటకకు 19.90, మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గఢ్‌కు 625.46, ఒడిశాకు 292.46 ఆంధ్రప్రదేశ్‌కు 1172.78 టీఎంసీల(భూపాలపట్నం విద్యుత్ కేంద్రం నీటిని పునర్వినియోగంతో కలిపి 1480 టీఎంసీలు) నీటిని కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటాలను ఇప్పటిదాకా తేల్చలేదు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం గోదావరి జలాల్లో తమ రాష్ట్రానికి 954.23 టీఎంసీల వాటా ఉందని వాదిస్తోంది. గోదావరి నదిపై ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా 433.042 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించుకుంటోంది. ప్రస్తుతం చేపట్టి.. పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా 475.797 టీఎంసీలు.. కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల ద్వారా 45.387 టీఎంసీలు వెరసి 954.23 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి వ్యూహం రచించింది. ఓటుకు కోట్లు కేసులో బేరసారాలు జరిపిన ఆడియో టేపుల్లో సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ ఏసీబీ అధికారులకు ప్రత్యక్షంగా దొరికిపోయిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రాజెక్టులను ప్రశ్నించలేని పరిస్థితికి దిగజారారు. తెలంగాణ వాదనను పరిగణనలోకి తీసుకుంటే.. గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 525.77 టీఎంసీలకే పరిమితం అవుతుంది. గోదావరి నది, ఉప నదులపై 282 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, 921 జలాశయాలు, 46 బ్యారేజీలు, 162 ఎత్తిపోతల పథకాలను ఇప్పటికే నిర్మించారు. ఇందులో అత్యధిక ప్రాజెక్టులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గఢ్‌లలో ఉండటం గమనార్హం. గతంలోనూ చంద్రబాబు మౌనం గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే 2003లో బాబ్లీ సహా 12 ప్రాజెక్టులను చేపట్టింది. తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గర్భంలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంది. మహారాష్ట్ర సర్కారు అడ్డగోలుగా ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నా అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ప్రేక్షకపాత్ర వహించారు. మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీతోపాటూ 12 ప్రాజెక్టుల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి.. టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడే.. అప్పటి సీఎం చంద్రబాబు స్పందించి కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసి ఉన్నా.. సుప్రీంకోర్టు దష్టికి తీసుకెళ్లి ఉన్నా.. ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవి కాదు. ఈ అక్రమ ప్రాజెక్టులపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో సుప్రీంకోర్టు దష్టికి తీసుకెళ్లారు. అధికారంలో ఉన్నప్పుడు చేష్టలుడిగిన చంద్రబాబు.. విపక్షంలోకి మారాక రాజ కీయ ప్రయోజనాల కోసం బాబ్లీ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమించడం ఆయన రెండునాల్కల ధోరణికి పరాకాష్ట. సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతూ 12 అక్రమ ప్రాజెక్టులను పూర్తి చేసిన మహారాష్ట్ర సర్కారు.. వాటికి అనుబంధంగా 60కిపైగా ఎత్తిపోతల పథకాలను చేపట్టి.. సుమారు ఆరు లక్షల ఎకరాలకుపైగా నీళ్లందిస్తోంది. ఫలితంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు చేరడం లేదు. గత ఐదేళ్లలో శ్రీరాం సాగర్ ఆయకట్టుకు ఏడాదికి సగటున ఒక్క పంటకు కూడా నీళ్లందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు మహారాష్ట్ర సర్కారు బాటలోనే తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. గతంలో చేపట్టిన ప్రాజెక్టులనే రీడిజైన్ పేరుతో పేరు మార్చి.. సామర్థ్యాన్ని పెంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అడ్డదిడ్డంగా శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణ పనులను చేపడుతోంది. పోలవరమే శరణ్యం... గోదావరి, కష్ణా డెల్టాలకు సాగునీళ్లు అందించాలన్నా.. ఉభయగోదావరి, విశాఖపట్నం, రాజధాని జిల్లాల(కష్ణా, గుంటూరు) ప్రజల దాహార్తి, పారిశ్రామిక నీటి అవసరాలు తీర్చాలన్నా పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడం ఒక్కటే మార్గం. రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు వరదాయిని అని కేంద్రం గుర్తించి.. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. పునర్విభజన చట్టంలోనూ జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని గుర్తించి.. దాన్ని తామే పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. సీఎం చంద్రబాబునాయుడు కమీషన్ల కోసం ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారు. కమీషన్ల కక్కుర్తితోనే ఎలాంటి అనుమతులు లేకున్నా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి అస్త్రంగా మారింది. అదే సమయంలో ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై నిలదీయలేకపోతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెడుతున్నారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతలపై పెట్టిన శ్రద్ధ పోలవరంపై పెట్టి ఉంటే.. ఈపాటికి ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఓ కొలిక్కి వచ్చేవి. ఆ ప్రాజెక్టు పూర్తయితే.. 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక ఏడాదిలో 301 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. పోలవరంలో నీటిని నిల్వ చేయడం వల్ల గోదావరి డెల్టా, కష్ణా డెల్టాలకు నీటిని అందించి.. పంటలను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని సాగునీటి నిపుణులు స్పషీ్టకరిస్తున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్లే తోడేస్తారు.. మహారాష్ట్రలో గోదావరి నదిపై పైథాన్ సమీపంలో జైక్వాడ్ ప్రాజెక్టును 102.73 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. గోదావరి ఉప నది వరకు ఎగువన కురిసిన వర్షం ద్వారా లభించే జలాలన్నీ జైక్వాడ్ ప్రాజెక్టులోకి చేరుతాయి. జైక్వాడ్ నుంచి వరుసగా నిర్మించిన మజల్‌గాబ్, దుద్నా, మంజీర, తెర్నా, విష్ణుపురి ప్రాజెక్టుల సామర్థ్యం 60 టీఎంసీలు.. వాటికి అనుబంధంగా 50కిపైగా ఎత్తిపోతల పథకాలను మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. విష్ణుపురి రిజర్వాయర్ దిగువన బాబ్లీతోపాటూ 12 ప్రాజెక్టులను నిర్మించింది. వీటికి అనుబంధంగా 60కిపైగా ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే రీతిలో గోదావరి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి.. ఒడిసి పట్టడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రాజెక్టుల రీడిజైన్ ద్వారా అదనంగా 165 టీఎంసీల నీటిని తెలంగాణ సర్కారు వినియోగించుకోనుంది. గోదావరికి వరద వచ్చే 60 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. ఆ తర్వాత తొమ్మిది నెలలు ఇబ్బందులు తప్పవు. తెలంగాణ సరిహద్దు దాటి చుక్క నీరు కూడా రాష్ట్ర సరిహద్దును చేరే అవకాశం ఉండదు. పోలవరం ప్రాజెక్టును నిర్మించి వరద నీటిని నిల్వ చేస్తే.. ఇబ్బందులను అధిగమించవచ్చు. తెలంగాణ కొత్త ప్రాజెక్టులు ఇవే 1. తమ్మిడిహెట్టి బ్యారేజీ 2.కాళేశ్వరం ఎత్తిపోతల 3. దేవాదుల ఎత్తిపోతల 4. తుపాకులగూడెం లిఫ్ట్ 5. సీతారామ లిఫ్ట్ 6. భక్తరామదాస లిఫ్ట్ గోదావరి నదిపై మహారాష్ట్ర చేపట్టిన ప్రాజెక్టులు ప్రాజెక్టు సామర్థ్యం (టీఎంసీల్లో) 1.జైక్వాడ్ 102.73 2.మజల్‌గాబ్ 12.4 3.దుద్నా 14.0 4.మంజీర 11.2 5.తెర్నా 11.0 6.విష్ణుపురి 11.4 7.అప్పెగావ్ 0.24 8.హిరోద్పూర్ 0.90 9.జోగల్దేవీ 0.32 10.మంగ్రూల్ 0.83 11.రాజా తకిల్ 0.83 12.దహ్లేగావ్ 0.42 13.ముద్గల్ 0.36 14.మూలి 0.32 15.లోని సవాంగి 1.00 16.డిగాస్ 1.70 17.అందూర 0.32 18.బాబ్లి 2.74 -
నోటికాడి ముద్దను తన్నుకు పోయే కుట్ర
♦ టీ ప్రాజెక్టులపై ఏపీ కాంగ్రెస్ నేతల తీరుపై హరీశ్ మండిపాటు ♦ పాలమూరు, డిండి ప్రాజెక్టులకు గత ప్రభుత్వమే జీవోలు ఇచ్చింది సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్ర ప్రాంత పార్టీల కుట్రలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఏపీ నేతలు నోటికాడి ముద్దను తన్నుకుపోయే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వారి ప్రకటనలను తిప్పికొడుతూ మంత్రి హరీశ్ ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇన్నాళ్లూ లేనిపోని ఆరోపణలు చేస్తూ తెలంగాణ ప్రజల నోట్లో మట్టిగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. కానీ ప్రాజెక్టుల మీద అపార అనుభవం కలిగిన సీఎం కేసీఆర్ ఆ కుట్రలను లెక్క చేయకుండా, తనదైన శైలిలో సాగునీటి రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా టీడీపీతో జతకట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అవి గత ప్రభుత్వ ప్రాజెక్టులే.. వాస్తవానికి పాలమూరు, డిండి ప్రాజెక్టులను అనుమతిస్తూ గత ప్రభుత్వ హయాంలోనే ఉత్తర్వులు విడుదలైనట్లు మంత్రి హరీశ్ గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో గత పాలకులు చేపట్టిన ప్రాజెక్టులను తెలంగాణకు అనుకూలంగా మార్చుకొని.. కట్టుకుంటామంటే అక్రమ ప్రాజెక్టులని ఎలా అంటారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో జీవో నం.72 విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. డిండి ఎత్తిపోతల పథకానికి ఏపీ ప్రభుత్వం 2007 జూలై7న జీవో నం. 159 జారీ చేసిన విషయం మరిచారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు లేనిపోని విమర్శలు చేస్తూ ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నీళ్ల విషయంలో గతంలో జరిగిన అన్యాయాలను సరిచేసుకుంటూ తమ వాటాను తాము ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే అడ్డుపడుతూ కేంద్రానికి లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. ఏపీ కాంగ్రెస్ నేతల ధర్నాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతల వైఖరేంటో స్పష్టం చేయాలని మంత్రి హరీశ్ డిమాండ్ చేశారు.