గలగలల గోదావరి.. పరవళ్లకు సంకెళ్లు! | Special story on telangana Irrigation Projects on Godavari river | Sakshi
Sakshi News home page

గలగలల గోదావరి.. పరవళ్లకు సంకెళ్లు!

Published Sat, May 14 2016 9:11 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

గలగలల గోదావరి.. పరవళ్లకు సంకెళ్లు! - Sakshi

గలగలల గోదావరి.. పరవళ్లకు సంకెళ్లు!


ఎగువన అరడజను అక్రమ ప్రాజెక్టులు..
అనుమతులు లేకుండా శరవేగంగా కడుతున్న తెలంగాణ సర్కారు

అదనంగా 165 టీఎంసీలు వాడుకునే ఎత్తుగడ
ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌ పేరుతో చుక్కనీరు

        కిందకు రాకుండా తెలంగాణ ప్రణాళికలు
అవి పూర్తయితే గోదావరి డెల్టా రైతుకు కన్నీరే
ఇక వరదల సమయంలోనే డెల్టాకు నీరు
అన్నపూర్ణ లాంటి గోదావరి ప్రాంతంలో
     ఉప్పుకయ్యలుగా మిగలనున్న పచ్చని భూములు
వరద సమయంలో నీటిని నిల్వచేసే
    పోలవరాన్ని నిర్మించకుండా కమీషన్ల
    కక్కుర్తితో పట్టిసీమ వైపు బాబు మొగ్గు
బాబు మౌనం.. గోదావరి రైతుకు శాపం
‘ఓటుకు కోట్లు’ భయంతో అదేమని
    ప్రశ్నించలేని సీఎం చంద్రబాబు దౌర్భాగ్యం

ఆంధ్రప్రదేశ్‌ అన్నపూర్ణగా పేరుగాంచిన గోదావరి జిల్లాల్లోని పొలాలు బీడు భూములుగా మారే ప్రమాదం ముంచుకొస్తోంది. అనుమతుల్లేకుండా తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులతో డెల్టాకు చుక్కనీరు రావడం ఇక కష్టమే. వరద వస్తేనే డెల్టాలో వరికి నీరు వచ్చే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంత ఉపద్రవం పొంచి ఉన్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడంలేదు. ‘గోదావరి జిల్లా రైతుల ప్రయోజనాలు కాపాడతాను’ అని చెప్పిన ఆయన.. తెలంగాణ ప్రాజెక్టులపై స్పందించలేని స్థితిలో ఉన్నారు. ఓటుకు కోట్లు కేసు భయంతో డెల్టా రైతులను నిలువునా ముంచేస్తున్నారు.


తెలంగాణలో ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులు
గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పూర్తయితే.. కరువన్నదే ఎరుగని మన డెల్టా భూములు కన్నీళ్లతో తడవక తప్పని దుస్థితి ఏర్పడటం ఖాయం. ఎప్పుడో వరదలొచ్చినప్పుడు తప్ప మిగతా రోజుల్లో గోదావరి నుంచి చుక్కనీరు కూడా మనకు రాకుండా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు అడ్డుకోబోతున్నాయి. సాధారణంగా జూన్‌ నాలుగో వారం నుంచి అక్టోబర్‌ 15 వరకూ వర్షాకాలంలో గోదావరిలో వరద ఉంటుంది. నదిలో మొత్తంగా 3000 టీఎంసీల(గోదావరి ట్రిబ్యునల్‌ అంచనా ప్రకారం) ప్రవాహం ఉంటే.. సింహభాగం ఈ వరదల సమయంలోనే అందుబాటులో ఉంటుంది.

మిగతా సమయాల్లో వచ్చే ప్రవాహాన్ని తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు ఎక్కడికక్కడ అడ్డుకుని లిఫ్టుల ద్వారా తోడేసుకుంటాయి. పోనీ వర్షాకాలంలో వచ్చే వరదను నిల్వ చేసుకుందామంటే.. ఆ నిల్వ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌లో లేవు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఉంటే 301 టీఎంసీలను వినియోగించుకునే అవకాశం ఉండేది. పోలవరాన్ని విస్మరించి కమీషన్ల కోసం పట్టిసీమను చేపట్టడం, తెలంగాణ కొత్త ప్రాజెక్టులు కడుతున్నా నోరెత్తని సీఎం చంద్రబాబు నాయుడు వైఖరితో గోదావరి రైతులు కష్టాల్లో కూరుకుపోనున్నారు.

హైదరాబాద్: నాసిక్‌లో పురుడుపోసుకునే గోదావరి నది ప్రధాన స్రవంతిపై ఆ రాష్ట్రంలో అసంఖ్యాకంగా నిర్మించిన చిన్న, పెద్దా ప్రాజెక్టుల వల్ల తెలంగాణలోకి ప్రవేశించే సరికి ఖాళీ కుండను తలపిస్తున్నది. ఆ తర్వాత కాళేశ్వరం క్షేత్రం వద్ద ప్రాణహిత నది కలిసేంత వరకూ గోదావరి నది నిర్జీవంగానే ఉంటుంది. ప్రాణహిత కలిసిన దగ్గర నుంచి ఆ తర్వాత ఇంద్రావతి, కిన్నెరసాని, మంజీరా, శబరి, సీలేరుల సంగమంతో అంతర్వేది వరకూ జీవకళతో గోదావరి పారుతోంది. అంటే.. ఇప్పుడు గోదావరిలో ధవళేశ్వరం వరకు ప్రవహించే జలాల్లో ఈ ఉప నదుల వాటానే ప్రధానం. ప్రాణహిత సంగమం నుంచి ధవళేశ్వరం వరకు మధ్యలో ఎక్కడా ప్రాజెక్టులు లేని కారణంగా అన్ని కాలాల్లోనూ ఈ ప్రాంతంలో గోదావరి జీవనదిలా సాగింది.

ఏపీ నెత్తిన మేడిగడ్డ
అయితే రీడిజైన్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ‘ప్రాణహిత–చేవెళ్ల’ను రూపు మార్చి కాళేశ్వరం పేరుతో ప్రాణహిత, ఇంద్రావతిల సంగమం తర్వాత మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్నది. దాని దిగువన దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, భక్త రామదాస ప్రాజెక్టులను చేపట్టింది. వర్షాకాలం వరద ఉన్న సమయం మినహా మిగతా సమయాల్లో ఈ ప్రాజెక్టులను దాటుకుని వచ్చే జలాలు ఎన్ని ఉంటాయన్నది సందేహమే. శబరి, సీలేరులే ఇక శరణ్యం. పోలవరం పూర్తయి ఉంటే.. పరిస్థితి కొంత భిన్నంగా ఉండేది.

పునర్విభజన చట్టం ప్రకారం గోదావరి, కష్ణా నదులపై కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా కేంద్ర జల సంఘం.. ప్రధానమంత్రి నేతత్వంలోని అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తప్పనిసరి. ఎలాంటి అనుమతులు తీసుకోకున్నా తెలంగాణ సర్కారు గోదావరి నదిపై అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు నిర్మించి.. తమకు గోదావరి జలాల్లో 954.23 టీఎంసీల వాటా ఉందంటూ వాదిస్తున్నా చంద్రబాబు ఉలకడం లేదు.. పలకడం లేదు. ‘ఓటుకు కోట్లు’ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు.

రీడిజైన్‌ పేరుతో అదనపు జలాలు..
గోదావరి ఉప నది ప్రాణహితపై తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మించి.. అక్కడ నుంచి ఎల్లంపల్లి(శ్రీపాదసాగర్‌) ప్రాజెక్టు, మధ్య మానేరు ప్రాజెక్టుల మీదుగా చేవెళ్ల వరకూ నీటిని తరలించడానికి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 160 టీఎంసీలే. కానీ.. తాజాగా రీడిజైన్‌ పేరుతో ఆ ప్రాజెక్టు పేరును కాళేశ్వరంగా మార్చారు. ప్రాణహిత నదిపై 15 టీఎంసీల సామర్థ్యంతో తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మించి.. గోదావరి నదిలో ఇంద్రావతి కలిసిన 15 కిమీల దూరంలో మేడిగడ్డ వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించి.. అక్కడి నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 180 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 215 టీఎంసీలను వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రణాళిక రచించింది. ప్రాణహిత–చేవెళ్ల కన్నా ఈ ప్రాజెక్టు సామర్థ్యం 65 టీఎంసీలు అధికం.

► తెలంగాణ వరంగల్‌ జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని గతంలో 35 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించారు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం     తాజాగా ఆ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 60 టీఎంసీలకు పెంచింది. అంటే.. అదనంగా 25 టీఎంసీలను వినియోగించుకోవడానికి ప్రణాళిక రచించింది.
►    దేవాదుల ప్రాజెక్టుకు దిగువన వరంగల్‌ జిల్లా కంతన పల్లి వద్ద 50 టీఎంసీల సామర్థ్యంతో ఓ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును వరంగల్‌ జిల్లా తుపాకులగూడెం వద్దకు మార్చి.. 100 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. అంటే.. కంతనపల్లి ప్రాజెక్టు కన్నా 50 టీఎంసీలను అధికంగా వినియోగించుకోవడానికి తుపాకులగూడెం ప్రాజెక్టును చేపట్టినట్లు స్పష్టమవుతోంది.
►  కంతనపల్లి ప్రాజెక్టుకు దిగువన ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వద్ద ఓ బ్యారేజీని నిర్మించి.. అక్కడి నుంచి 25 టీఎంసీల నీటిని టెయిల్‌పాండ్‌కు తరలించి.. నాగార్జునసాగర్‌ ఆయకట్టును స్థిరీకరించడానికి దుమ్ముగూడెం–టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టును ప్రతిపాదించారు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం టెయిల్‌పాండ్‌ను తొలగించి.. అదనంగా సీతారామ, భక్త రామదాసు పేరుతో రెండు ప్రాజెక్టులను చేపట్టి 25 టీఎంసీలను వినియోగించుకోవడానికి ప్రణాళిక రూపొందించింది. వీటిలో ఏ ప్రాజెక్టుకు కూడా పాలనాపరమైన అనుమతులు లేవు. వాటిని తెచ్చుకోనూ లేదు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు తెలంగాణను ప్రశ్నించకుండా మౌనం వహిస్తున్నారు.

ధాన్యాగారంలో ఇక ‘వర్రీ’నే..
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై నీటి నిల్వ చేసే ఏకైక ప్రాజెక్టు ధవళేశ్వరం బ్యారేజీ. దీని సామర్థ్యం కూడా 2.93 టీఎంసీలే. గోదావరి నదిలో ఎప్పటికప్పుడు వచ్చే ప్రవాహం(ఇన్‌ఫ్లో) ద్వారా లభించే నీటిని కాలువల ద్వారా మళ్లించి ఆయకట్టుకు నీళ్లందిస్తారు. తక్కిన ఎత్తిపోతల పథకాలకూ గోదావరి నదిలో ప్రవహించే నీళ్లే ఆధారం. వాటికి నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు లేవు. ధవళేశ్వరం బ్యారేజీతోపాటూ ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు నీళ్లందించాలంటే ఏడాదికి 254.28 టీఎంసీలు అవసరం. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో జూన్‌ నాలుగో వారం నుంచి అక్టోబరు 15 వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయి. సుమారు 60 రోజులపాటు గోదావరికి వరద వస్తుంది. ఆ 60 రోజులూ ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుల కింద ఆయకట్టుపై ఎలాంటి ప్రభావం ఉండదు.

కానీ.. అక్టోబరు 15 తర్వాత గోదావరి నదిలో ప్రవాహం తగ్గినప్పుడు తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను దాటుకుని చుక్క నీరు కూడా రాష్ట్ర సరిహద్దుకు చేరే అవకాశం ఉండదు. వరద వచ్చినప్పుడు నీటిని నిల్వ చేసుకునేలా పోలవరం ప్రాజెక్టును నిర్మించకపోవడం వల్ల డెల్టాకు కష్టాలు తప్పవని సాగునీటి రంగ నిపుణులు స్పషీ్టకరిస్తున్నారు. అదే సమయంలో గోదావరి, కష్ణా డెల్టాల్లో ఖరీఫ్‌ వరి పంట పొట్ట దశలో ఉంటుంది. ఆ సమయంలో అధికంగా నీళ్లు అవసరం. గోదావరి డెల్టాకు రోజుకు కనిష్టంగా 16 వేల క్యూసెక్కులు.. పుష్కర, తాడిపూడి, చాగల్నాడు, వెంకటనగరం, చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలకు కనిష్టంగా 20 వేల క్యూసెక్కుల నీళ్లు అవసరం అవుతాయి. అంటే.. కనిష్టంగా రోజూ మూడు టీఎంసీలకుపైగా నీళ్లు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో రబీకి కష్టాలు తప్పవని సాగునీటి రంగ నిపుణులు స్పషీ్టకరిస్తున్నారు.
2013, 2014, 2015లలో వర్షాభావ పరిస్థితుల వల్ల గోదావరి డెల్టాలో ఖరీఫ్‌ పంటలను ఎలాగోలా కాపాడుకోగలిగినా.. రబీలో ఆయకట్టు విస్తీర్ణాన్ని సగానికిపైగా తగ్గించినా ప్రభుత్వం పంటలను కాపాడలేకపోవడాన్ని ఎత్తిచూపుతున్నారు.

రబీ పంటలకు శబరి, కిన్నెరసాని నుంచి లభించే నీళ్లు, సీలేరు, బలిమెల రిజర్వాయర్ల నుంచి విద్యుదుత్పత్తి చేసి కిందకు వదిలే నీళ్లే దిక్కు. అవన్నీ కలిపినా ఆరేడువేల క్యూసెక్కులకు మించవు. ఆ నీటికితోడు ఎక్కడికక్కడ డ్రైన్ల నుంచి నీటిని భారీ ఎత్తున ఎత్తిపోసినా రబీ పంటలను కాపాడటం సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు. డెల్టాలో వరి సాగు తగ్గిపోవడంతో భూగర్భ జలమట్టం తగ్గి.. ఆ మేరకు ఉప్పు నీరు పైకి ఉబికి రావడం వల్ల డెల్టా ఉప్పుబారి పోయి సాగుకు పనికి రాకుండా పోతుందని.. ధాన్యాగారంలో ఆకలికేకలు తప్పవని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

► ధవళేశ్వరం(సర్‌ ఆర్ధర్‌ కాటన్‌) బ్యారేజీ ద్వారా గోదావరి డెల్టా పరిధిలోని 10,13,161 ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. డెల్టాలో ఖరీఫ్‌ పంటకు కనిష్టంగా 127 టీఎంసీలు.. రబీ పంటకు కనిష్టంగా 95 టీఎంసీల మొత్తం ఏడాదికి 222 టీఎంసీల నీళ్లు అవసరం అవుతాయి.
► పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా 11.80 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి తూర్పుగోదావరి జిల్లాలో 1,85,906 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఇప్పటికే 85 వేల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు.
► తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 12.14 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి పశ్చిమ గోదావరి జిల్లాలో 2,06,572 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే 50 వేల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు.
► చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా 2.845 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి తూర్పుగోదావరి జిల్లాలో 35 వేల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా 14,500 ఎకరాలకు నీళ్లందిస్తున్నారు.
► వెంకటనగరం ఎత్తిపోతల పథకం ద్వారా 3.62 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి తూర్పుగోదావరి జిల్లాలో 34 వేల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు.
► చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 15.50 టీఎంసీలను ఎత్తిపోసి నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టులో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు.
► పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రకాశం బ్యారేజీకి 80 టీఎంసీలను మళ్లించి.. కష్ణా డెల్టా పరిధిలోని 13.54 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించారు.

గోదావరి ప్రస్థానం ఇదీ...
మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో నాసిక్‌కు సమీపంలో త్రయంబకేశ్వర్‌ వద్ద పురుడు పోసుకునే గోదావరి 1465 కిమీల దూరం ప్రవహించి.. అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 770 కిమీల దూరం ప్రవహిస్తుంది. గోదావరి నదిలో మూడు వేల టీఎంసీల నీటి లభ్యత ఉందని లెక్క కట్టిన గోదావరి ట్రిబ్యునల్‌.. మహారాష్ట్రకు 888.90, కర్ణాటకకు 19.90, మధ్యప్రదేశ్‌–ఛత్తీస్‌గఢ్‌కు 625.46, ఒడిశాకు 292.46 ఆంధ్రప్రదేశ్‌కు 1172.78 టీఎంసీల(భూపాలపట్నం విద్యుత్‌ కేంద్రం నీటిని పునర్వినియోగంతో కలిపి 1480 టీఎంసీలు) నీటిని కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటాలను ఇప్పటిదాకా తేల్చలేదు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం గోదావరి జలాల్లో తమ రాష్ట్రానికి 954.23 టీఎంసీల వాటా ఉందని వాదిస్తోంది.

గోదావరి నదిపై ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా 433.042 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించుకుంటోంది. ప్రస్తుతం చేపట్టి.. పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా 475.797 టీఎంసీలు.. కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల ద్వారా 45.387 టీఎంసీలు వెరసి 954.23 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి వ్యూహం రచించింది. ఓటుకు కోట్లు కేసులో బేరసారాలు జరిపిన ఆడియో టేపుల్లో సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ ఏసీబీ అధికారులకు ప్రత్యక్షంగా దొరికిపోయిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రాజెక్టులను ప్రశ్నించలేని పరిస్థితికి దిగజారారు. తెలంగాణ వాదనను పరిగణనలోకి తీసుకుంటే.. గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా 525.77 టీఎంసీలకే పరిమితం అవుతుంది.  గోదావరి నది, ఉప నదులపై 282 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, 921 జలాశయాలు, 46 బ్యారేజీలు, 162 ఎత్తిపోతల పథకాలను ఇప్పటికే నిర్మించారు. ఇందులో అత్యధిక ప్రాజెక్టులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌–ఛత్తీస్‌గఢ్‌లలో ఉండటం గమనార్హం.

గతంలోనూ చంద్రబాబు మౌనం
గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే 2003లో బాబ్లీ సహా 12 ప్రాజెక్టులను చేపట్టింది. తెలంగాణలో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు గర్భంలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంది. మహారాష్ట్ర సర్కారు అడ్డగోలుగా ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నా అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ప్రేక్షకపాత్ర వహించారు. మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీతోపాటూ 12 ప్రాజెక్టుల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి.. టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసినప్పుడే.. అప్పటి సీఎం చంద్రబాబు స్పందించి కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసి ఉన్నా.. సుప్రీంకోర్టు దష్టికి తీసుకెళ్లి ఉన్నా.. ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవి కాదు. ఈ అక్రమ ప్రాజెక్టులపై దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో సుప్రీంకోర్టు దష్టికి తీసుకెళ్లారు.

అధికారంలో ఉన్నప్పుడు చేష్టలుడిగిన చంద్రబాబు.. విపక్షంలోకి మారాక రాజ కీయ ప్రయోజనాల కోసం బాబ్లీ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమించడం ఆయన రెండునాల్కల ధోరణికి పరాకాష్ట. సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతూ 12 అక్రమ ప్రాజెక్టులను పూర్తి చేసిన మహారాష్ట్ర సర్కారు.. వాటికి అనుబంధంగా 60కిపైగా ఎత్తిపోతల పథకాలను చేపట్టి.. సుమారు ఆరు లక్షల ఎకరాలకుపైగా నీళ్లందిస్తోంది. ఫలితంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి నీళ్లు చేరడం లేదు. గత ఐదేళ్లలో శ్రీరాం సాగర్‌ ఆయకట్టుకు ఏడాదికి సగటున ఒక్క పంటకు కూడా నీళ్లందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు మహారాష్ట్ర సర్కారు బాటలోనే తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. గతంలో చేపట్టిన ప్రాజెక్టులనే రీడిజైన్‌ పేరుతో పేరు మార్చి.. సామర్థ్యాన్ని పెంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అడ్డదిడ్డంగా శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణ పనులను చేపడుతోంది.

పోలవరమే శరణ్యం...
గోదావరి, కష్ణా డెల్టాలకు సాగునీళ్లు అందించాలన్నా.. ఉభయగోదావరి, విశాఖపట్నం, రాజధాని జిల్లాల(కష్ణా, గుంటూరు) ప్రజల దాహార్తి, పారిశ్రామిక నీటి అవసరాలు తీర్చాలన్నా పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడం ఒక్కటే మార్గం. రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు వరదాయిని అని కేంద్రం గుర్తించి.. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. పునర్విభజన చట్టంలోనూ జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని గుర్తించి.. దాన్ని తామే పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. సీఎం చంద్రబాబునాయుడు కమీషన్‌ల కోసం ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారు. కమీషన్ల కక్కుర్తితోనే ఎలాంటి అనుమతులు లేకున్నా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి అస్త్రంగా మారింది. అదే సమయంలో ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై నిలదీయలేకపోతున్నారు.

సీఎం చంద్రబాబునాయుడు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెడుతున్నారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతలపై పెట్టిన శ్రద్ధ పోలవరంపై పెట్టి ఉంటే.. ఈపాటికి ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఓ కొలిక్కి వచ్చేవి. ఆ ప్రాజెక్టు పూర్తయితే.. 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక ఏడాదిలో 301 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. పోలవరంలో నీటిని నిల్వ చేయడం వల్ల గోదావరి డెల్టా, కష్ణా డెల్టాలకు నీటిని అందించి.. పంటలను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని సాగునీటి నిపుణులు స్పషీ్టకరిస్తున్నారు.

వచ్చిన నీటిని వచ్చినట్లే తోడేస్తారు..
మహారాష్ట్రలో గోదావరి నదిపై పైథాన్‌ సమీపంలో జైక్వాడ్‌ ప్రాజెక్టును 102.73 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. గోదావరి ఉప నది వరకు ఎగువన కురిసిన వర్షం ద్వారా లభించే జలాలన్నీ జైక్వాడ్‌ ప్రాజెక్టులోకి చేరుతాయి. జైక్వాడ్‌ నుంచి వరుసగా నిర్మించిన మజల్‌గాబ్, దుద్నా, మంజీర, తెర్నా, విష్ణుపురి ప్రాజెక్టుల సామర్థ్యం 60 టీఎంసీలు.. వాటికి అనుబంధంగా 50కిపైగా ఎత్తిపోతల పథకాలను మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. విష్ణుపురి రిజర్వాయర్‌ దిగువన బాబ్లీతోపాటూ 12 ప్రాజెక్టులను నిర్మించింది. వీటికి అనుబంధంగా 60కిపైగా ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే రీతిలో గోదావరి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి.. ఒడిసి పట్టడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రాజెక్టుల రీడిజైన్‌ ద్వారా అదనంగా 165 టీఎంసీల నీటిని తెలంగాణ సర్కారు వినియోగించుకోనుంది. గోదావరికి వరద వచ్చే 60 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. ఆ తర్వాత తొమ్మిది నెలలు ఇబ్బందులు తప్పవు. తెలంగాణ సరిహద్దు దాటి చుక్క నీరు కూడా రాష్ట్ర సరిహద్దును చేరే అవకాశం ఉండదు. పోలవరం ప్రాజెక్టును నిర్మించి వరద నీటిని నిల్వ చేస్తే.. ఇబ్బందులను అధిగమించవచ్చు.



తెలంగాణ కొత్త ప్రాజెక్టులు ఇవే

1. తమ్మిడిహెట్టి బ్యారేజీ
2.కాళేశ్వరం ఎత్తిపోతల
3. దేవాదుల ఎత్తిపోతల
4. తుపాకులగూడెం లిఫ్ట్‌
5. సీతారామ లిఫ్ట్‌
6. భక్తరామదాస లిఫ్ట్‌


గోదావరి నదిపై  మహారాష్ట్ర చేపట్టిన ప్రాజెక్టులు

ప్రాజెక్టు                      సామర్థ్యం
                                 (టీఎంసీల్లో)

1.జైక్వాడ్‌                    102.73
2.మజల్‌గాబ్‌               12.4
3.దుద్నా                     14.0
4.మంజీర                    11.2
5.తెర్నా                       11.0
6.విష్ణుపురి                  11.4
7.అప్పెగావ్‌                  0.24
8.హిరోద్‌పూర్‌               0.90
9.జోగల్‌దేవీ                 0.32
10.మంగ్రూల్‌               0.83
11.రాజా తకిల్‌             0.83
12.దహ్లేగావ్‌                0.42
13.ముద్గల్‌                  0.36
14.మూలి                   0.32
15.లోని సవాంగి        1.00
16.డిగాస్‌                   1.70
17.అందూర               0.32
18.బాబ్లి                     2.74

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement