సాక్షి నెట్‌వర్క్: గోదావరి నదిలో ప్రవాహం మహోగ్ర రూపం దాల్చడంతో లంక గ్రామాల్లో ముంపు తీవ్రత మరింత పెరిగింది. లంకలను పూర్తిస్థాయిలో వరద ముంచెత్తగా.. విలీన మండలాల్లోని పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాలైన వేలేరుపాడులో 10 గ్రామాలు, కుక్కునూరు మండలంలో 9 గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో అక్కడి ప్రజలను అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వేలేరు–బూర్గుంపాడు, వేలేరు–సీతానగరం రహదారులు నీట మునిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరి ఉధృతికి శబరి నది ఎగపోటుకు గురికావడంతో చింతూరు మండలంలోనూ వరద పెరుగుతోంది.
ముందుగా ముంపునకు గురయ్యే గ్రామాలను గుర్తించిన అధికారులు ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద బాధిత కుటుంబాలకు కేజీ చొప్పున కందిపప్పు పంపిణీ చేశారు. శుక్రవారం శబరి నది కొంత తగ్గడంతో ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు కొనసాగాయి.
దిగువన లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతున్న వరద
గోదావరికి దిగువన గల అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ముంపు తీవ్రత మరింత పెరిగింది. నదీ పరీవాహక ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లను, రోడ్లను, కాజ్‌వేలను వరద ముంచెత్తుతోంది. పి.గన్నవరం మండలంలోని నాలుగు లంకలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోగా.. మరో నాలుగు లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఈ గ్రామాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయినవిల్లి మండలంలో ఎదురు బిడియం, మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వేపై ముంపు తీవ్రత పెరగడంతో ట్రాక్టర్లు, పడవల మీద ప్రయాణికులు, రైతులను దాటిస్తున్నారు.
కోనసీమ జిల్లాలోని పది మండలాల పరిధిలోని 48 గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు వరద నీరు వచ్చి చేరింది. సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు భోజనాలను అందిస్తున్నారు. అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లిపాలెంలో వరద ముంపు మరింత పెరిగింది. 50 వరకు ఇళ్లు నీట మునిగాయి. ఎదురుబిడియం కాజ్‌వే వద్ద వరద తీవ్రతను గృహ నిర్మాణ శాఖమంత్రి జోగి రమేష్, బోడసకుర్రు వద్ద ముంపు ప్రాంతాలను రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పరిశీలించారు.
ఏటిగట్ల పరిరక్షణకు ప్రతి అర కిలోమీటర్‌కు ఒక వలంటీర్ చొప్పున 740 మంది వలంటీర్లను రక్షణగా ఏర్పాటు చేశామని కోనసీమ కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక, పుచ్చల్లంక వద్ద వరద ఉధృతి మరింతగా పెరిగింది. యలమంచిలి మండలం కనకాయలంక, ఆచంట మండలం అయోధ్యలంక గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వాగులో కొట్టుకుపోయి వృద్ధురాలి దుర్మరణం
అల్లూరి జిల్లా కూనవరం మండలం దూగుట్టకు చెందిన మడకం భద్రమ్మ (65) అనే వృద్ధురాలు పశువులను మేపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది. అదే జిల్లాలోని ఎటపాక మండలంలో రాయనపేట వద్ద ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న వరద నీటిలో కారును దాటించేందుకు ప్రయత్నించగా.. ప్రవాహ ఉధృతికి కారు గల్లంతైంది. అందులో ప్రయాణిస్తున్న భద్రాచలం వాసులు ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. స్థానికుల సాయంతో నడుచుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. కాగా.. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో బలివే అడ్డరోడ్డు వద్ద తమ్మిలేరుపై గల రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది.
వరద విధుల్లో వలంటీర్లు
అల్లూరి జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో 873 మంది గ్రామ వలంటీర్లు ఉండగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో 550 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ముంపు ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా వారి అవసరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తున్నారు.
ఐతవరం వద్ద రాకపోకలు పునరుద్ధరణ
ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో మున్నేటి వరద ఉధృతి క్రమేపి తగ్గుముఖం పడుతోంది. 65వ నంబర్ జాతీయ రహదారిపై ఐతవరం సమీపంలో విజయవాడ వైపు వెళ్లే భారీ వాహనాలను గురువారం సాయంత్రం నిలిపివేయగా.. శుక్రవారం 7 గంటల నుంచి వాటి రాకపోకలను అనుమతిస్తున్నారు. ముందుగా కేవలం విజయవాడ వైపు వెళ్లే భారీ వాహనాలను మాత్రమే పంపుతున్నట్టు ఏసీపీ జనార్ధన్ నాయుడు తెలిపారు. పూర్తి స్థాయిలో వరద తగ్గిన తర్వాతే రెండు వైపులా అనుమతిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment