
సాక్షి, అమరావతి/సాక్షి, అమలాపురం/ధవళేశ్వరం/చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/పోలవరం రూరల్/యలమంచిలి: నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడం.. ఉప నదుల్లో వరద ఉధృతి తగ్గడంతో గోదావరిలో వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. ఫలితంగా భద్రాచలం వద్దకు వస్తున్న వరద శుక్రవారం రాత్రి 7 గంటలకు 8.50 లక్షల క్యూసెక్కులకు.. వరద మట్టం 41 అడుగులకు తగ్గింది. దీంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. అలాగే, భద్రాచలం నుంచి అఖండ గోదావరి మీదుగా పోలవరం ప్రాజెక్టులోకి 7,75,079 క్యూసెక్కులు చేరుతోంది.
వరద మట్టం స్పిల్ వేకు ఎగువన 32.5, దిగువన 24.22, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 33.35, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 23.65 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా 7,75,079 క్యూసెక్కులను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 9,84,970 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 11,100 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 9,73,870 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మరోవైపు.. ఎగువ నీటి మట్టాలు తగ్గుతుండడంతో ధవళేశ్వరం వద్ద రాత్రి 8గంటలకు కూడా నీటిమట్టం 11.70 అడుగులు ఉంది.
వరద నీటిలో గండిపోచమ్మ గుడి
దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం శుక్రవారం పూర్తిగా వరద నీటలో మునిగిపోయింది. విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ స్థానిక ఐటీడీఏలో ఉంటూ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారికి నిత్యావసరాలు అందజేయాలని ఆయన ఆదేశించారు.
నాలుగు మండలాల్లో 12 లాంచీలు, మర పడవలను సిద్ధంగా ఉంచారు. శబరి నది కూడా శాంతించింది. ఇక.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నదీపాయల మధ్య ఉన్న లంకలకు బాహ్య ప్రపంచంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో లంకవాసులు పడవల మీదనే రాకపోకలు సాగిస్తున్నారు. ఎగువున తగ్గినా దిగువున వరద పెరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక వద్ద కాజ్‌వేపై నుంచి నాలుగు అడుగుల వరద నీరు ప్రవహిస్తోంది.