మల్కనగిరి నుంచి పాండురంగాపురం రైల్వేలైనుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
ఒడిశా, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ నిర్మాణం
ఆంధ్రాలో చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల్లో నాలుగు స్టేషన్లు
ఇప్పటికే సర్వే పూర్తి చేసిన రైల్వే అధికారులు
చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఒడిశాలోని మల్కనగిరి నుంచి భద్రాచలం సమీపంలోని పాండురంగాపురం వరకు సుమారు 173 కిలోమీటర్ల కొత్త రైల్వే లైను ఇటీవల మంజూరైంది. ఈ లైనుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది.
ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఈ రైల్వేలైను నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. ఒడిశాలోని మల్కనగిరి నుంచి ఆంధ్రాలోని విలీన మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల మీదుగా తెలంగాణలోని పాండురంగాపురం వరకు కొత్త లైను నిర్మించనున్నారు. లైను నిర్మాణంలో భాగంగా 213 వంతెనలు నిర్మించనున్నారు. వీటిలో 48 పెద్ద వంతెనలు, 165 చిన్న వంతెనలున్నాయి.
ముంపు మాటేంటి?
విలీన మండలాల్లో ప్రతిపాదించిన రైల్వేలైను పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవనుంది. చింతూరు మండలం కన్నాపురం, కూనవరం మండలం కూటూరుగట్టు, పల్లూరు, ఎటపాక మండలం నందిగామలో నిర్మించనున్న స్టేషన్లు సైతం ముంపునకు గురయ్యే అవకాశముంది. దీంతోపాటు శబరినదిపై నిర్మించే వంతెన సైతం ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్వే చేసిన మార్గం గుండా కాకుండా ముంపునకు గురికాని మార్గంలో లైను నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. లైనుతో పాటు స్టేషన్లు ముంపు పరిస్థితిపై రైల్వే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని స్థానికులు వేచి చూస్తున్నారు.
విలీన మండలాల మీదుగా..
మల్కనగిరి నుంచి భద్రాచలం వరకు నిర్మించనున్న రైల్వేలైను విలీన మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక గుండా సాగనుంది. దీనిలో భాగంగా ఒడిశాలోని మల్కనగిరి, కోవాసిగూడ, బదలి, రాజన్‌గూడ, మహరాజ్‌పల్లి, లూనిమన్‌గూడలో, ఆంధ్రాలోని అల్లూరి జిల్లా చింతూరు మండలం కన్నాపురం, కూనవరం మండలం కూటూరు గట్టు, పల్లూరు, ఎటపాక మండలం నందిగామలో స్టేషన్లు నిర్మించనున్నారు.
అనంతరం నందిగామ నుంచి తెలంగాణలోని భద్రాచలం అక్కడి నుంచి పాండురంగాపురం వరకు ఈ రైల్వేలైను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయిలో సర్వే పనులు పూర్తి చేశారు. దీనిలో భాగంగా కూనవరం మండలం జగ్గవరం వద్ద మహరాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ నుంచి వచి్చన ప్రత్యేక బృందాలు 50 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి మట్టి శాంపిల్స్ పంపారు. కాగా ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించేందుకు శబరి నదిపై ఒడిశాలోని మోటు, చింతూరు మండలం వీరాపురం నడుమ వంతెన నిర్మించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment