నంబూరు–ఎర్రుపాలెం రైల్వే భూసేకరణకు గెజిట్ విడుదల
తాడికొండలో గ్రామసభ ఏర్పాటు చేసి వ్యతిరేకించిన రైతులు
తాడికొండ: అమరావతిలో కేంద్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నంబూరు–ఎర్రుపాలెం రైల్వేలైన్‌కు భూములిచ్చేందుకు తామంతా వ్యతిరేకమని, సమీకరణకైతే సిద్ధమని రైతులు స్పష్టం చేశారు. తాడికొండలో ఆదివారం గ్రామసభ నిర్వహించి ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. సర్పంచ్ తోకల సరోజినీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రైల్వేలైన్ పేరుతో తాము సాగుచేసుకుంటున్న భూములను తీసుకుంటే ఒప్పుకోమన్నారు.
తమకు జీవనాధారమైన భూములను కోల్పోతే కుటుంబాలు రోడ్డున పడతాయని, ప్రభుత్వం స్పందించి అమరావతికి సంబంధించిన ఏ ప్రాజెక్టు చేపట్టినా భూ సేకరణ ద్వారా కాకుండా భూ సమీకరణ ద్వారా తీసుకొని రాజధాని రైతులకు వర్తింపజేసిన ప్రయోజనాలే తమకూ కల్పించాలని డిమాండ్ చేశారు.
దీనిపై ఇప్పటికే కలెక్టర్, ఆర్డీవోల దృష్టికి తీసుకెళ్లామని, వారు సానుకూలంగా స్పందించలేదని, భూములు కోల్పోతున్న రైతులంతా గ్రామసభ ఏర్పాటు చేసి మాకుమ్మడి తీర్మానంతో పాటు వ్యక్తిగతంగా కూడా వ్యతిరేకిస్తున్నట్లు అంగీకార పత్రాలను సంతకాలు చేసి ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో అంతా కలిసి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment