land accquisition
-
భూములిచ్చేందుకు వ్యతిరేకం... సమీకరణకైతే సిద్ధం
తాడికొండ: అమరావతిలో కేంద్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నంబూరు–ఎర్రుపాలెం రైల్వేలైన్‌కు భూములిచ్చేందుకు తామంతా వ్యతిరేకమని, సమీకరణకైతే సిద్ధమని రైతులు స్పష్టం చేశారు. తాడికొండలో ఆదివారం గ్రామసభ నిర్వహించి ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. సర్పంచ్ తోకల సరోజినీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రైల్వేలైన్ పేరుతో తాము సాగుచేసుకుంటున్న భూములను తీసుకుంటే ఒప్పుకోమన్నారు. తమకు జీవనాధారమైన భూములను కోల్పోతే కుటుంబాలు రోడ్డున పడతాయని, ప్రభుత్వం స్పందించి అమరావతికి సంబంధించిన ఏ ప్రాజెక్టు చేపట్టినా భూ సేకరణ ద్వారా కాకుండా భూ సమీకరణ ద్వారా తీసుకొని రాజధాని రైతులకు వర్తింపజేసిన ప్రయోజనాలే తమకూ కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్, ఆర్డీవోల దృష్టికి తీసుకెళ్లామని, వారు సానుకూలంగా స్పందించలేదని, భూములు కోల్పోతున్న రైతులంతా గ్రామసభ ఏర్పాటు చేసి మాకుమ్మడి తీర్మానంతో పాటు వ్యక్తిగతంగా కూడా వ్యతిరేకిస్తున్నట్లు అంగీకార పత్రాలను సంతకాలు చేసి ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో అంతా కలిసి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. -
ఆర్ఆర్ఆర్.. 4,400 ఎకరాలు.. కసరత్తు మొదలైంది
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీని కసరత్తు మొదలైంది. 158.6 కి.మీ. ఈ భాగానికి సమీకరించాల్సిన భూమి ఏయే సర్వే నంబర్లలో ఎంతెంత ఉందన్న వివరాల నమోదు పూర్తయింది. గెజిట్ జారీకి వీలుగా దీన్ని ఈ నెల 15న ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ ప్రధాన కేంద్రంలో అందజేయనున్నట్లు సమాచారం. భూసేకరణలో ఇదే తొలి ప్రక్రియ. ఆ వివరాలను పరిశీలించి, కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకున్నాక గెజిట్ విడుదల చేయనున్నారు. ఆ తర్వాత భూసేకరణ వివరాలు ప్రజల ముంగిటికి అధికారికంగా రానున్నాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి కేంద్రం అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో, ఇటీవలే దాని అలైన్‌మెంట్‌ను కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ రోడ్డుకు దాదాపు 4,400 ఎకరాల భూమి అవసరమవుతుందని గుర్తించారు. అలైన్మెంట్ ఆధారంగా ఈ భూమి ఏయే గ్రామాల పరిధిలో ఎంత అవసరమో ఆ వివరాలతో ఓ నివేదికను తాజాగా సిద్ధం చేశారు. అభ్యంతరాలకు 21 రోజులు.. గెజిట్ విడుదల తర్వాత పత్రికా ముఖంగా ప్రచురించి ప్రజల ముంగిట ఉంచుతారు. ఈ జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు ప్రజలకు 21 రోజుల గడువు ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కాంపిటెంట్ అథారిటీ ముందు అభ్యంతరాలను వ్యక్తం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. మండలాలవారీగా (ఇంకా తేల్చలేదు) పబ్లిక్ హియరింగ్ సమావేశాలు (గ్రామసభ తరహా) ఏర్పాటు చేసి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆ మేరకు కాంపిటెంట్ అథారిటీ మార్పుచేర్పులకు అవకాశం కల్పించేందుకు దాదాపు నెల రోజుల సమయమివ్వనున్నారు. ఆ తర్వాత రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో హద్దుల నిర్ధారణతో పాటు భూ వివరాలను నమోదుచేస్తారు. దీని కోసం ఒక్కో గ్రామానికి 10 మంది వరకు రెవెన్యూ సిబ్బందిని నియమించనున్నట్లు ఆ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ లెక్కన దాదాపు 2వేల మందిని ఈ అథారిటీకి అప్పగించనున్నారు. దీని అధారంగా మరో జాబితాను ప్రచురించి పత్రికాముఖంగా ప్రజల ముందు ఉంచుతారు. దీనిపైనా ప్రజా అభ్యంతరాలకు 2 నెలల గడువు ఇవ్వనున్నారు. ఆ అభ్యంతరాల ఆధారంగా పొరపాట్లను సరిదిద్దుతారు. ఆ తర్వాత.. ఆ భూమిలోని చెట్లు, పైపులైన్లు, ఇతర ఆస్తుల వివరాలు సేకరించి ప్రచురిస్తారు. ఇక ఏ పట్టాదారుకు ఎంత పరిహారం ఇవ్వనున్నారో లెక్కించి ఆ వివరాలను కూడా బహిరం గంగా ప్రచురిస్తారు. దీనిపై కూడా అభ్యంతరాలు స్వీకరిస్తారు. పరిష్కరించగలిగినవి పరిష్కరించి.. వారికి రావాల్సిన పరిహారం వివరాలు పొందు పరుస్తూ (భూమి, అందులోని ఇతర ఆస్తులు కలిపి) అవార్డు పాస్ చేస్తారు. ఈ సందర్భంగా ఆ భూ యజమానుల లిఖితపూర్వక అంగీకారాన్ని అధికారులు సేకరిస్తారు. అంగీకరించని వారికి కూడా రెవెన్యూ అధికారులతో ఓ జాయింట్ ఖాతా తెరిచి అందులో పరిహారాన్ని జమచేస్తారు. వారి అభ్యంతరాలు వీగిపోయిన తర్వాత నిర్బంధంగా భూమిని సమీకరించి పరిహారాన్ని చెల్లిస్తారు. ఏడాది నుంచి రెండేళ్లు పట్టే అవకాశం.. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో ఇదే అత్యంత కీలక ప్రక్రియ. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు ఏడాది నుంచి రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. అనుకున్నది అనుకున్నట్లు సవ్యంగా సాగితే 6 నెలలు పడుతుందని అంచనా. కానీ.. న్యాయపరంగా, ఇతర ఇబ్బందులను అధిగమించేందుకు రెండేళ్ల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. కాంపిటెంట్ అథారిటీ.. భూసేకరణ ప్రక్రియకు ప్రత్యేకంగా ఓ కాంపిటెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం 4 జిల్లాల పరిధిలో ఉండనుంది. సాధారణంగా జిల్లా అదనపు కలెక్టర్ (పరిపాలన) ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి భూ సేకరణను పర్యవేక్షిస్తారు. ఈ రోడ్డు విషయంలో జాప్యం ఉండకూడదని అథారిటీని ఏర్పాటు చేస్తు న్నారు. ఇందులో ఆర్డీఓ స్థాయి (ఖరారు కాలేదు) ముగ్గురిని నియమించనున్నట్లు సమాచారం. దీని అనుమతి కోసం ఇటీవలే అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఒక్కో అధికారికి 50 కి.మీ. నిడివి అప్పగించనున్నట్లు ఓ రెవెన్యూ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఒక్కో అధికారికి మూడునాలుగు మండలాల పరిధి రానుంది. పరిహారం.. ప్రభుత్వ విలువపై 3 రెట్ల విలువను పరిహారంగా లెక్కగట్టనున్నారు. లేదా స్థానికంగా ఇటీవల ఏదైనా ప్రాజెక్టు కోసం జరిగిన భూసేకరణలో లెక్కగట్టిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకునే వీలుంది. ఏడాదిలోపు పరిహారం అందివ్వలేని పక్షంలో 12 శాతం వడ్డీ కలుపుకొని చెల్లిస్తారు. -
ఆర్ఆర్ఆర్.. భూసేకరణకు సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్‌రోడ్డుకు సంబంధించి కసరత్తు ప్రారంభం కాబోతోంది. కేంద్రం అధికారికంగా అనుమతి మంజూరు చేయబోతోంది. ఈ నేపథ్యంలో.. తొలిసారి అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి సర్వేకు సిద్ధమైంది. ఆ పనులను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) చేపట్టబోతోంది. తాజాగా భూసేకరణ కసరత్తు ప్రారంభించేందుకు ఎన్హెచ్ఏఐ నడుం బిగించింది. ఇందుకు బెంగళూరుకు చెందిన ఫీడ్‌బ్యాక్ బిజినెస్ కన్సల్టింగ్ సర్వీస్ సంస్థను కన్సల్టెన్సీగా నియమించింది. త్వరలో ఈ సంస్థ క్షేత్రస్థాయి సర్వే ప్రారంభించనుంది. నెలరోజుల్లో అలైన్మెంట్.. రోడ్డు నిర్మాణానికి సంబంధించి జాతీయ రహదారుల విభాగం గతంలో కేంద్రానికి ప్రాథ మిక అలైన్‌మెంట్‌ను సమర్పించింది. గూగుల్ మ్యాప్ ఆధారంగా.. ఏయే ప్రాంతాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరగనుందో మ్యాప్ రూపొందించింది. అప్పట్లో దానికి అక్షాంశ రేఖాంశాలను ఫిక్స్ చేసింది. ఇప్పుడు ఆ రూట్లో భాగంగా ఏయే సర్వే నంబర్ భూముల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుందో క్షేత్రస్థాయిలో పర్యటించి మార్కింగ్ చేస్తారు. ఆ అలైన్మెంట్లో 100 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించనున్నారు. ఈ కసరత్తుకు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. భూసేకరణకు ఏడాది గడువు.. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన భూమిని జాతీయ రహదారిగా నిర్మితమవుతున్నందున కొత్త భూసేకణ చట్టం–2013 ప్రకారం సేకరించనున్నారు. ఇందులో కచ్చితంగా భూమి ఇవ్వాల్సిందే. ఆ మేరకు అందులో ప్రతిపాదించిన విధంగా భూ పరిహారాన్ని అందిస్తారు. ఇప్పటికే ఎన్హెచ్ఏఐ అధికారులు ఆ చట్టంలోని అన్ని అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నారు. అభ్యంతరాల గడువు, వివాదాల పరిష్కార సంప్రదింపులు.. తదితరాల గడువు కలుపుకొంటే ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుందని సమాచారం. 158 కి.మీ. తొలి భాగానికి సంబంధించి దాదాపు 4,350 ఎకరాలు సేకరించాల్సి ఉంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట ప్రత్యేకంగా నిర్మించే క్లోవర్ లీవ్ ఇంటర్‌చేంజెస్‌కు అదనంగా మరింత భూమి అవసరమవుతుంది. పరిహారం ఇలా.. రిజిస్ట్రేషన్ విలువకు 3 రెట్ల మొత్తాన్ని నిర్ధారించి పరిహారంగా అందిస్తారు. గత మూడేళ్లలో ఆ ప్రాంతంలో జరిగిన భూ రిజిస్ట్రేషన్లను పరిశీలించి ఎక్కువ మొత్తం ధరలు ఉన్న వాటిల్లోంచి 50 శాతం లావాదేవీలు పరిగణనలోకి తీసుకుంటారు. వాటి ధరల్లోంచి సగటు ధరను తేల్చి దాన్ని పరిహార ధరగా నిర్ధారిస్తారు. నిర్మాణాలు, చెట్లకు విడిగా ధరలు నిర్ణయిస్తారు. గుర్తించిన పట్టణాలు/ ఊళ్లు ఇవీ.. సంగారెడ్డి చేరువలోని పెద్దాపూర్, శివంపేట, లింగోజీగూడ, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, ప్రజ్ఞాపూర్, నరసన్నపేట, ఎర్రవల్లి, మల్కాపూర్, రాయగిరి, ఎర్రబెల్లి, సంగెం, చౌటుప్పల్ తుర్కపల్లి మీదుగా.. జగదేవ్‌పూర్–భువనగిరి మధ్య రెండు మార్గాలను తాత్కాలికంగా రూపొందించారు. భవనగిరి-ఆలేరు మధ్య జాతీయ రహదారిని దాటేలా ఓ మార్గాన్ని, తుర్కపల్లి మీదుగా మరో మార్గాన్ని ప్రతిపాదించారు. ఇప్పుడు తుర్కపల్లి మీదుగా ప్రతిపాదించిన మార్గాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. పీర్లపల్లి, తిరుమలాపురం, వాసాలమర్రి, తుర్కపల్లి మీదుగా ఉన్న ప్రస్తుత మార్గానికి చేరువగా ఈ రోడ్డు నిర్మితమవుతుంది. త్వరలో రెండో భాగానికి పచ్చజెండా.. సంగారెడ్డి–చౌటుప్పల్ మధ్య తొలి భాగానికి కేంద్రం అనుమతినివ్వగా, రింగులో రెండో సగం అయిన ఆమన్‌గల్-కంది వరకు నిర్మితమయ్యే 181.8 కి.మీ. రెండో భాగానికి కూడా త్వరలో అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉంది. కొన్ని సాంకేతిక అంశాలపై స్పష్టత రావటంతో జరిగిన జాప్యం వల్ల దానికి అధికారికంగా అనుమతి ఇవ్వలేదు. మరికొద్ది రోజుల్లోనే దీనికి కూడా కేంద్రం ఓకే చెబుతుందని రాష్ట్రప్రభుత్వం ఆశాభావంతో ఉంది. -
భయపెట్టి అనంతగిరి భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో భాగమైన అనంతగిరి జలాశయం నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించేందుకు ప్రభుత్వాధికారులు వ్యవహరించిన తీరు చట్ట వ్యతిరేకంగా ఉందని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయకుండానే భూముల్ని సేకరిస్తున్నారంటూ దాఖలైన మూడు వేరువేరు వ్యాజ్యాలపై న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణలతో కూడిన ధర్మాసనం 52 పేజీల తీర్పును శుక్రవారం వెలువరించింది. హైకోర్టు 2016లో ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయని... సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి, ఆర్డీవో, భూసేకరణ అధికారి అనంతరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, చిన్నకొండూరు తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, పూర్వపు తహసీల్దార్ పరమేశ్వర్ల సర్వీస్ రికార్డుల్లో కోర్టు ఆదేశాలను ఉల్లఘించినట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నమోదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘ఉద్ధేశపూర్వకంగా హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయలేదు. భూసేకరణ చట్టాలను అమలు చేయకుండా రైతులను భయపెట్టి వారితో భూ విక్రయ ఒప్పందపత్రాలపై సంతకాలు చేయించారు. రాజ్యాంగంలోని 14వ అధికరణ స్ఫూర్తిని దెబ్బతీశారు. రాత్రి వేళ ఖాళీ చేయించిన వారిలో 11 మంది ఎస్సీలు ఉన్నారు. ఇలా చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు. దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలి. భూములకు ధరల్ని నిర్ణయించడంలోనూ పద్ధతి లేకుండా వ్యవహరించారు. 2019 జనవరి 15న రైతుల నుంచి తీసుకున్న భూములకు వాటి ధర ప్రకారం పరిహారాన్ని ఖరారు చేసే ముందు రైతుల వాదనలు తెలుసుకోవాలి. ఇప్పటికే ఇచ్చిన పరిహారాన్ని రైతుల నుంచి తీసుకోకుండా... మూడు నెలల్లోగా చెల్లించబోయే పరిహారంలో సర్దుబాటు చేయాలి. హైకోర్టును ఆశ్రయించిన 61 మంది రైతులకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.5 వేల చొప్పున చెల్లించాలి. 2016లో వ్యవసాయ భూములకు, ఈ ఏడాది పిటిషనర్ల ఇళ్లను సేకరించేందుకు నోటిఫికేషన్లు వేరువేరుగా ఇచ్చారు కాబట్టి వాటికి వేరువేరుగానే పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్ఆర్ ప్యాకేజీ) ఇవ్వాలి. ఆర్ఆర్ చట్టంలోని నిబంధన ప్రకారం 18 సంవత్సరాలు నిండిన పెళ్లి కాని వారిని మరో కుటుంబంగా పరిగణించి వారికి కూడా పరిహారం చెల్లించాలి’అని హైకోర్టు తీర్పు చెప్పింది. -
టీడీపీలోని మాజీ ఎమ్మెల్యేలే సూత్రధారులు
సాక్షి, మహారాణిపేట(విశాఖ దక్షిణ): గత ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన విశాఖ భూముల కుంభకోణంపై విచారణలో కీలక ఘట్టానికి శుక్రవారం తెరలేచింది. నగరం, పరిసర ప్రాంతాల్లో జరిగిన భూకుంభకోణాలు, రికార్డుల తారుమారు మీద వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాపు కమిటీ(సిట్) దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. మొదటి రోజు 19 కౌంటర్ల ద్వారా 79 వినతులను స్వీకరించింది. ఇందులో సిట్‌కు 14, నాన్ సిట్‌కు 65 ఫిర్యాదులందాయి. కాగా.. ఈ నెల 7వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్న భూ అక్రమాలను గుట్టురట్టు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ విజయ్‌కుమార్, మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి వైవీ అనురాధ, విశ్రాంత న్యాయమూర్తి టి.భాస్కరరావులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. సిరిపురంలోని వుడా చిల్డ్రన్స్ థియేటర్ (చిల్డ్రన్ ఎరీనా)లో చేపట్టిన ఈ ప్రక్రియకు తొలిరోజు సిట్ చైర్మన్ డాక్టర్ విజయ్‌కుమార్ హాజరుకాలేదు. విశాఖపట్నం రెవెన్యూ డివిజన్లోని ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం, పెందుర్తి, పరవాడ, సబ్బవరం, గాజువాక, పెదగంట్యాడ, విశాఖపట్నం రూరల్, సీతమ్మధార, మహారాణిపేట, ములగాడ, గోపాలపట్నం మండలాల పరిధిలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూ అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే తెలుగుదేశం నేతలు, ప్రజాప్రతినిధులపై బాధితులు ఫిర్యాదులు చేశారు. తొలిరోజు అందిన 79 దరఖాస్తుల్లో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులుండటం గమనార్హం. సిరిపురం చిల్డ్రన్స్ ఎరీనాలో హెల్ప్‌డెస్క్‌లో మాట్లాడుతున్న ఫిర్యాదుదారులు రికార్డుల తారుమారు– మాజీ ఎమ్మెల్యే వర్మ పాత్ర తెలుగుదేశం నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ, అతని అనుచరులు రెవెన్యూ అధికారుల సహకారంతో తమ స్థలాన్ని ఆక్రమించారని పిళ్లా పాపయ్య పాత్రుడు ఆరోపించారు. ఆనందపురం మండలం మామిడిలోవ పంచాయతీలో తమ తాతలు నరసింహపాత్రుడు, సీతారామ పాత్రుడులకు అప్పటి రాజులు 30 ఎకరాల సర్వీస్ ఇనాం భూములు ఇచ్చారని తెలిపారు. ఈ భూములను కొంత మంది రైతులు తమ పేరు మీద మార్చుకున్నారని, వారికి రెవెన్యూ అధికారులు సహకరించారన్నారు. అప్పటి ఆనందపురం తహసీల్దార్ నెహ్రూ బాబు, ఆర్డీవో వెంకటేశ్వర్లు అడంగల్, ఎఫ్ఎంబీ తదితర వాటిలో తమ తాత, తండ్రుల పేర్లు మార్పు చేశారని ఆరోపించారు. ఎప్పటి నుంచో ఈ భూములు తమ ఆధీనంలో ఉన్నాయని, తమ కుటుంబ సభ్యుల పేర్లు మార్పు వెనుక రెవెన్యూ అధికారులు పాత్ర ఉందన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వెనుక ఉండి కథ నడిపించారని, సర్వీస్ ఇనాం భూముల రికార్డులు తారుమారు చేశారన్నారు. గత సిట్‌లో ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదని, మళ్లీ ఫిర్యాదు చేస్తున్నామని పాత్రుడు వెల్లడించారు. రెవెన్యూ అధికారుల వల్ల తమ కుటుంబం ఎంతో నష్టపోయిందని వాపోయారు. దరఖాస్తులు సమర్పిస్తున్న ఫిర్యాదుదారులు మాజీ ఎమ్మెల్యే బండారు అన్యాయం చేశారు తన భూములు తనకు చెందకుండా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, తెలుగుదేశం నాయకులు అడ్డుతగిలారని పరవాడ మండలం ఈదులపాక బోనంగికి చెందిన జంగాల రమేష్ ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నియమించిన సిట్‌తో తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. సిట్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన తన సమస్యను విలేకరులకు వివరించారు. ‘పరవాడ మండలం ఈదులపాక బోనంగిలో జమీందారు జంగాల నారాయణమూర్తి పేరున 1000 ఎకరాలు ఉండేది. అందులో 610 ఎకరాలకు డబ్బులు చెల్లించి మా తాత కొనుగోలు చేశాడు. 1951లో కొంత మంది రెవెన్యూ అధికారులు వచ్చి ఎకనాల్జెమెంట్ ఇచ్చిన రెవెన్యూ రికార్డు తీసుకుని వెళ్లారు. నేటికీ ఆ రికార్డులు ఇవ్వలేదు. రికార్డుల కోసం అడిగితే లేవని సమాధానం చెబుతున్నారు. ఈ విషయమై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను కలిశాం. తమ భూమి ఏపీఐఐసీలో భూసేకరణలో పోయిందని కొంత మంది అధికారులు తెలిపారు. దానికి నష్టపరిహారం ఇవ్వకుండా తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, మరో మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉంది. సెటిల్మెంట్ ద్వారా ఈ సమస్య పరిష్కారానికి అధికారులు సహకరించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో మా భూముల వ్యవహారంలో తలదూర్చవద్దని అప్పటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అందుకే ఏ అధికారి సహకరించలేదు.’అని రమేష్ వాపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చక్కగా పరిపాలన సాగిస్తున్నారని, ఆయన మీద నమ్మకంతో న్యాయం జరుగుతుందని భావించి.. సిట్‌కు దరఖాస్తు చేసినట్టు వివరించారు. గజం కూడా లేకుండా చేశారు పరవాడ మండలం రావాడలో మాకు 40 ఎకరాల స్థలం ఉండేది. ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాల్లో ఉండేవాళ్లం. రికార్డులు ఉన్నాయి కదా అని ధీమా ఉండేది. కాని అన్ని రికార్డులు తారుమారు చేశారు. సర్వే నంబర్ 170, 171లో 8 ఎకరాలు, సర్వే నంబర్ 494లో 23 ఎకరాలు, సర్వే నంబర్ 115లో 6.50 ఎకరాలు, 471 సర్వే నంబర్లో నాలుగు ఎకరాల స్థలం ఉండేది. కొంత స్థలం ఎన్టీపీసీ భూ సేకరణలో పోయింది. తర్వాత కాలంలో రికార్డులు తారుమారు చేసి ఈ భూములను ఆక్రమించేశారు. ఇప్పుడు గజం కూడా లేకుండా పోయింది. – వి.సూర్యనారాయణ, రావాడ, పరవాడ న్యాయం చేయండి పెందుర్తి మండలం చీమాలపల్లిలో సర్వే నంబర్ 24/3డీ2లో 200 చదరపు గజాలు స్థలం గంటా సత్యవతి వద్ద కొనుగోలు చేశాం. జిరాయితీ అనడంతో స్థలం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. కొద్ది రోజుల తర్వాత అది ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదైంది. ఎలా చేరిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. మాలాగే మరో 100 మంది కొనుగోలు చేసి ఇబ్బంది పడుతున్నారు. న్యాయం చేయండి. – ఎక్కిరాల రామానుచారి, పెందుర్తి రాత్రికిరాత్రే పేర్లు మార్చేశారు పరవాడ మండలం పెదముషిడివాడలో 20 ఎకరాల భూమి మా ఆధీనంలో ఉంది. కానీ రాత్రికి రాత్రే వెబ్‌ల్యాండ్‌లో పేర్లు మారిపోయాయి. ఎలా మారాయో.. ఎందుకు మారాయో ఇప్పటికీ అర్థం కావడం లేదు. గత సిట్‌లో ఫిర్యాదు చేశాం. ఫలితం లేకపోయింది. మారిన పేర్లు, వారి ఆధార్ నంబర్లతో సహా ఫిర్యాదు చేశాం. పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఫలితం లేకపోయింది. – జి.నాగమణి బాబు, పెదముషిడివాడ, పరవాడ మండలం ఒకే భూమి.. రెండు పాస్ పుస్తకాలు ఒకే భూమిపై ఇద్దరికి పాసు పుస్తకాలు ఇచ్చారు. పద్మనాభం మండలం అనంతవరంలో 9/1, 5/11, 5/19, 22/11, 26/7 సర్వే నంబర్లలో నా భార్య చలుమూరు ముత్యమాంబ పేరు మీద రెండు ఎకరాల స్థలానికి పాసు పుస్తకాలున్నాయి. ఈ భూమిపై ఎస్బీఐ నుంచి రుణం కూడా పొందాం. స్థానిక తహసీల్దార్ ఈ భూమికి మరొకరి పేరు మీద పాసు పుస్తకాలు మంజూరు చేశారు. రెవెన్యూ అధికారుల వల్ల తాము నష్టపోయాం. న్యాయం చేయండి. – చలుమూరు ఎర్నంనాయుడు, అనంతవరం, పద్మనాభం మండలం స్థలాన్ని ఆక్రమించేశారు నా తండ్రి ఏవై రత్నం లంకెలపాలెంలో విశాఖ వేలీ బిల్డింగ్ సొసైటీ వద్ద 153 సర్వే నంబర్లో 1198ఏ ఫ్లాటు కొనుగోలు చేశారు. రెవెన్యూ అధికారులు కూడా సర్వే చేసి ఆ స్థలం ఏవై రత్నానికే చెందుతుందని స్పష్టం చేశారు. కానీ స్థానిక వ్యక్తి ఒకరు ఆ స్థలం తనదంటూ బెదిరిస్తున్నారు. – వైఎస్ మణి, లంకెలపాలెం అధికారులు సమాధానం చెప్పాలి పెందుర్తి మండలం పులగానిపాలెం సర్వే నంబర్ 175/1లో నరవ పైడమ్మ పేరున 2.36 సెంట్ల భూమి రికార్డుల్లో చూపిస్తోంది. పులగానిపాలెం కొండ అంతా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆక్రమణకు గురైంది. నరవ పైడమ్మ పేరున ఇనాం భూమి ఎలా వచ్చింది. రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలి. – జి.అప్పారావు, న్యాయవాది, విశాఖ దేవాలయ భూమి హాంఫట్ రాంబిల్లి మండలం, ధారపాలేంలో కొలువైన ఉమారామలింగేశ్వర స్వామి ఆలయానికి చెందిన 113 ఎకరాల భూమి వేరే వారి పేర్ల మీద మారిపోయింది. కొంత మంది రికార్డులు తారుమారు చేసి తమ పేరున మార్పు చేసుకున్నారు. ఆలయానికి ఒక రూపాయి కూడా వారు శిస్తు చెల్లించడం లేదు. గతంలో ఉన్నతాధికారులు, లోకయుక్తాకు ఫిర్యాదు చేశాం. ఫలితం లేకపోయింది. సిట్ అధికారులు చర్యలు చేపట్టాలి. – సత్యనారాయణ, ధారపాలెం, రాంబిల్లి -
క్వారీ..సర్కారు మారినా స్వారీ
సాక్షి, ప్రొద్దుటూరు: నిన్న మొన్నటి వరకూ ఇసుకతో కోట్లు కొల్లగొట్టిన ఓ టీడీపీ నేతకు కొత్త ప్రభుత్వం రావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎలాగైనా ఇసుక క్వారీని తన గుప్పిట్లోనే ఉంచుకోవాలని ఇప్పటికీ వ్యూహాలు పన్నుతున్నాడు. పెన్నానదీ తీరంలో 50 ఎకరాలను ఆధీనంలోనే పెట్టుకుని కొత్త నాటకాలకు తెర లేపుతున్నాడు. ప్రొద్దుటూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడొకరు ఇసుక డాన్‌గా గత ప్రభుత్వ హయాంలో చెలరేగిపోయాడు. ఇతను మాజీ ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడు. దీంతో అతను ఆడిందే ఆట..పాడిందే పాటగా సాగింది. అధికారులూ మిన్నకుండిపోయారు. యథేచ్ఛగా ఇసుకను రాశులుగా పోసి ఇతర ప్రాంతాలకు భారీగా తరలిస్తూ అక్రమార్జన చేస్తున్నా ఏమీ చేయలేకపోయారు. క్వారీలో జేసీబీ, ట్రాక్టర్లను ఈ ప్రాంతంలో ఇందుకు వినియోగించుకునేవాడు. అడ్డుపడిన తహసీల్దార్లను అంతు చూస్తానని బహిరంగంగా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకాలం అతని ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడంతో ఇతడు కంగు తిన్నాడు. ఇసుక పెత్తనానికి ఎక్కడ ఆటంకం కలుగుతుందోనని భయంతో ఇప్పుడు కొత్త ప్రణాలికలు రచిస్తున్నాడు. అధికారుల కళ్లు గప్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. 50 ఎకరాలకుపైగా సాగు రామాపురానికి చెందిన ఇసుక డాన్ టీడీపీ ప్రభుత్వ హయాంలో పెన్నానది తీరాన సుమారు 50 ఎకరాల్లో ఇసుక క్వారీని ఆక్రమించాడు. సమయాన్ని బట్టి క్వారీ లేదా పక్కనే నదిలో ఉన్న ఇసుకను తరలించేవాడు. ఆయన ప్రొద్దుటూరులో ఈ కార్యకలాపాల నిర్వహణకు ఏకంగా ఓ కార్యాలయాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. కొత్త ప్రభుత్వంలో న ఆగడాలు చెల్లవని గ్రహించాడు. అందుకే తన ఆధీనంలోని ఇసుక క్వారీని సాగుభూమిగా మారుస్తున్నాడు. ట్రాక్టర్ల ద్వారా మట్టిని తెచ్చి ఇసుకను కప్పేశాడు. మొక్కలు కూడా పెంచుతున్నాడు. సుమారు 5 అడుగుల మేర ఇప్పటికీ ఇక్కడ ఇసుక నిల్వలున్నాయి. ప్రభుత్వం క్వారీని ఇక్కడి నుంచి ప్రారంభిస్తే కొన్నేళ్లపాటు ఈ నిల్వలు సరిపోతాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల రూరల్ ఎస్ఐ సునీల్‌కుమార్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించి ఇసుక రవాణా చేయకుండా పెన్నానదిలో గోతులు తవ్వించారు. తహసీల్దార్ పి.చెండ్రాయుడును సాక్షి వివరణ కోరగా ప్రభుత్వం కొత్తగా ప్రొద్దుటూరు ప్రాంతంలో ఇసుక క్వారీని మంజూరు చేసిందని తెలిపారు. మైనింగ్ అధికారులు సర్వే చేసి క్వారీ ప్రదేశాన్ని నిర్ణయిస్తారన్నారు. ఇసుక డాన్ పెన్నానది భూమిని ఆక్రమించడంతోపాటు సమీపంలో అటవీభూమిని కూడా సాగు చేస్తున్నాడు. బోరు వేసి సాగు చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. -
కోర్టు ధిక్కార కేసులో శిక్షల అమలు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి హైకోర్టు జారీచేసిన ఆదేశాలు అమలు చేయలేదన్న కేసుల్లో (రెండు వేర్వేరు) సింగిల్ జడ్జి నలుగురికి విధించిన జైలుశిక్ష అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. పునరావాసం, పునర్నిర్మాణం అమలు చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఆదేశాల్ని అమలు చేయలేదని రైతుల కోర్టు ధిక్కార వ్యాజ్యాలను సింగిల్ జడ్జి ఆమోదిస్తూ నలుగురికి జైలు శిక్ష విధించారు. ఈ తీర్పులను సవాల్ చేస్తూ రెండు వేర్వేరు వ్యాజ్యాలను బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం విచారించింది. సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేసిన ధర్మాసనం ప్రతివాదు లకు నోటీసులు జారీ చేసింది. ఒక కేసులో తొగుట ఎస్సై ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు రెండో డివిజన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ టి.వేణులకు 2నెలలు జైలు, 2వేలు జరిమానా, మరో కేసులో కాళేశ్వరం ప్రాజెక్టు కనస్ట్రక్షన్ డివిజన్–7 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.బదరీనారాయణ, రాఘవ కనస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టు మేనేజర్ బి.శ్రీనివాస్‌రెడ్డిలకు 3 నెలలు జైలు శిక్ష, 3వేలు చొప్పున జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఆ నలుగురు సవాల్ చేశారు. ధర్మాసనం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. -
కదిరి కోర్టు చారిత్రక తీర్పు
సాక్షి, అనంతపురం : పేదల ఇళ్ల పట్టాల కోసం భూమి ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులకు కదిరి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. నల్లచెరువు తహశీల్దార్ కార్యాలయం వేలం వేసి రైతులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 1987లో జరిగిన భూ సేకరణలో భాగంగా రామిరెడ్డి, నరసింహారెడ్డి అనే ఇద్దరు రైతులకు చెందిన రెండు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఎకరాకు కేవలం 3 వేల రూపాయలు మాత్రమే పరిహారంగా చెల్లించారు. దీంతో భూసేకరణలో తమకు అన్యాయం జరిగిందంటూ వారిద్దరు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బుధవారం ఈ కేసును విచారించిన కదిరి కోర్టు తహశీల్దార్ కార్యాలయ్యాన్ని వేలం వేసి రైతులకు పరిహారం అందజేయాలని తీర్పునిచ్చింది. దీంతో 30 ఏళ్ల తర్వాత రైతులకు సరైన పరిహారం దక్కింది. కాగా తహశీల్దార్ కార్యాలయాన్ని 10.25 లక్షల రూపాయలకు వేలం వేసినట్లు సమాచారం. -
పరిహారంపై పరిహాసం
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు అనుమానమే నిజమైంది! ఓవైపు భారీస్థాయిలో భూసేకరణ చేస్తూ.. మరోవైపు చెల్లించాల్సిన పరిహారాన్ని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువగా చూపడంతో సందేహం వ్యక్తం చేసిన కోర్టు తమ రిజిస్ట్రార్ జనరల్ నుంచి అసలైన గణాంకాలు తెప్పించుకుంది. ఇందులో ప్రభుత్వాలు సమర్పించిన గణాంకాలకు, రిజిస్ట్రార్ జనరల్ సమర్పించిన గణాంకాలకు పొంతనే లేదని తేలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము చెల్లించాల్సిన పరిహారం కేవలం రూ.93.59 కోట్లు మాత్రమేనని చెప్పగా.. రిజిస్ట్రార్ జనరల్ లెక్కల ప్రకారం అది రూ.867 కోట్లుగా ఉంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం రూ.457 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పగా.. రిజిస్ట్రార్ జనరల్ వివరాల ప్రకారం ఆ మొత్తం రూ.906 కోట్లుగా తేలింది. ప్రభుత్వాలు చెప్పిన వివరాలకు, రిజిస్ట్రార్ జనరల్ సమర్పించిన వివరాలకు ఇంత భారీ స్థాయిలో వ్యత్యాసం ఉండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమానం వచ్చిందిలా.. భూ సేకరణ పరిహారం విషయంలో తాము ఇస్తున్న ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ అమలు చేయడం లేదని, దీంతో బాధితులు దాఖలు చేస్తున్న ఎగ్జిక్యూషన్ పిటిషన్లు (ఈపీ)లు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా పేరుకుపోతున్నాయంటూ అప్పటి మహబూబ్‌నగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.వెంకటకృష్ణయ్య ఉమ్మడి హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించింది. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ వ్యాజ్యం మొదట విచారణకు రాగా.. ఆయా ప్రభుత్వాలు ఎంతెంత పరిహారం చెల్లించాలో చెప్పాలంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఏపీ సర్కారు తాము రూ.93.59 కోట్లు మాత్రమే చెల్లించాలని చెప్పగా, తెలంగాణ ప్రభుత్వం రూ.457.78 కోట్లు చెల్లించాలని తెలిపింది. ఒకవైపు ఇరు ప్రభుత్వాలు భారీ ఎత్తున భూ సేకరణ జరుపుతుండటం, మరోవైపు చెల్లించాల్సిన పరిహారం తక్కువగా ఉండటంతో ధర్మాసనానికి అనుమానం కలిగింది. ఉభయ రాష్ట్రాల్లోని కింది కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న ఎగ్జిక్యూషన్ పిటిషన్లు, చెల్లించాల్సిన మొత్తాల వివరాలను తమ ముందుంచాలని రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్‌ను ఇటీవల ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు ఆయన ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికలోని వివరాలను, ప్రభుత్వాలు సమర్పించిన వివరాలను పోల్చి చూసిన ధర్మాసనానికి భారీ వ్యత్యాసాలు కనిపించాయి. ఏపీ ప్రభుత్వం చెప్పిన దానికి, రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన వివరాలకు మధ్య ఏకంగా ఎనిమిది రెట్ల వ్యత్యాసం ఉండటాన్ని కోర్టు గుర్తించింది. -
పరిహారం మింగిన గద్దలు.. పెద్దలే
పోలవరం ప్రాజెక్టు భూసేకరణ.. నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ అమలులో ప్రభుత్వ కీలక నేతలు, అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధులు.. నలుగురు ఐఏఎస్ అధికారుల ద్వారా సాగించిన దోపిడీ దందా ఇదీ. వీరందరూ కలిసి గిరిజనుల హక్కులను కాలరాశారు. భూసేకరణ చట్టం–2013, భూ బదలాయింపు చట్టం–1979, పీసా చట్టాలను తుంగలో తొక్కారు. భూసేకరణ నుంచీ పునరావాసం కల్పించే వరకూ అన్ని విభాగాల్లోనూ అనుకూలురైన అధికారులను నియమించుకున్నారు. ముంపు మండలాలు.. పునరావాసం కల్పించే మండలాలకు ఏరికోరి తమకు విధేయులైన అధికారులను రప్పించుకున్నారు. సొంత పార్టీ నేతలను దళారీలుగా మార్చేశారు. గిరిజనులకు దక్కాల్సిన పరిహారాన్ని కాజేసి.. పర్సంటేజీలను పంచుకుతిన్నారు. పోలవరం ముంపు గ్రామాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు: రాష్ట్రం రూపురేఖలను సమూలంగా మార్చేస్తుందని భావిస్తున్న పోలవరం జలాశయంలో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏడు మండలాల పరిధిలోని 287 గ్రామాలు ముంపునకు గురవుతాయి. 1,05,601 కుటుంబాలవారు నిర్వాసితులుగా మారతారు. ఇందులో అధిక శాతం మంది గిరిజనులే. ముంపునకు గురయ్యే 1,39,859.68 ఎకరాల భూమిని సేకరించాలి. భూసేకరణ చట్టం–2013 అమలులోకి రాక ముందే లక్ష ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వం సేకరించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన భూమిని 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరించాలి. ఆది నుంచి వ్యూహాత్మకంగా.. విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏడు ముంపు మండలాలను రాష్ట్రంలో విలీనం చేశారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముంపు మండలాల రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేశారు. ఆ తర్వాత భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూమిని సేకరిస్తామని.. అదే చట్టం ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని సర్కార్ ప్రకటించింది. ఇదే సమయంలో ముంపు మండలాలు, పునరావాసం కల్పించే మండలాలకు చెందిన టీడీపీ కీలక నేతలు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ ఎంపీ, మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ ముఖ్య నేతను, మరో చినబాబును కలిశారు. భూ బదలాయింపు నిషేధ చట్టం (ఎల్టీఆర్)–1970 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూమిపై ఎలాంటి హక్కు ఉండదు. 1969కి ముందు పట్టా ఉన్న భూములకు ఈ చట్టం వర్తించదు. కౌలు రైతుల రూపంలో ఏజెన్సీలో చొరబడి గిరిజనుల భూములను కౌలుకు తీసుకుని.. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒకొక్కరు వందల ఎకరాల భూములను సొంతం చేసుకున్నారు. ఆ భూములకు పరిహారం ఇప్పించాలన్న ప్రతిపాదనకు ముఖ్య నేత అంగీకరించారు. తొలుత పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో భూములు సేకరించాలని నిర్ణయించారు. అదే క్రమంలో పశ్చిమగోదావరి కలెక్టర్‌గా కాటంనేని భాస్కర్‌ను, కేఆర్‌పురం ఐటీడీఏ పీవోగా షాన్మోహన్ను, భూసేకరణ అధికారిగా సీహెచ్ భానుప్రసాద్‌ను నియమించారు. ముంపు, పునరావాస మండలాల్లో అనుకూలమైన రెవెన్యూ అధికారులను నియమించుకున్నారు. వీరితోపాటు సీఆర్డీఏ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ సెక్రటేరియట్లో పనులన్నీ చక్కబెట్టారన్న ఆరోపణలున్నాయి. గిరిజనుల హక్కులు అపహాస్యం ఏజెన్సీ ప్రాంతాల్లో భూములు సేకరించాలంటే భూసేకరణ చట్టం–2013, ఎల్టీఆర్–1970, పీసా చట్టాల ప్రకారం గ్రామసభలు నిర్వహించాలి. సేకరించే భూముల వివరాలను సర్వే నెంబర్లు, నిర్వాసితుల పేర్లతో సహా వెల్లడించాలి. సభకు హాజరైన వారితో సంతకాలు తీసుకోవాలి. హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది అంగీకారం తీసుకుని భూమిని సేకరించాలి. భూములపై ఏవైనా కేసులు విచారణలో ఉంటే.. అలాంటి అంశాన్ని కూడా ప్రకటించాలి. కానీ.. సర్కార్ అటు ముంపు మండలాల్లోనూ ఇటు పునరావాసం కల్పించే మండలాల్లోనూ భూసేకరణపై గ్రామసభలు నిర్వహించిన దాఖలాలు లేవు. గ్రామసభలు నిర్వహిస్తే వాస్తవాలు బహిర్గతమవుతాయని అక్రమాలపై గిరిజనులు తిరుగుబాటు చేస్తారనే భయం వల్లే గ్రామసభలు నిర్వహించలేదు. భూసేకరణ నోటిఫికేషన్ (డీఎన్)ను, దాన్ని ఖరారు చేస్తూ జారీచేసే డ్రాఫ్ట్ డిక్లరేషన్ (డీడీ)లనూ పంచాయతీ కార్యాలయాల్లో ఉంచలేదు. గిరిజనుల భూముల పరిహారం.. పచ్చచొక్కాలకు రెవెన్యూ రికార్డులను తారుమారు చేసిన సర్కార్.. కౌలు రూపంలో గిరిజనుల భూములను కాజేసిన పచ్చచొక్కాలకే భూసేకరణ పరిహారం ఇచ్చేసింది. హైకోర్టు, గిరిజన న్యాయస్థానం (ట్రైబల్ ట్రిబ్యునల్)లో విచారణలో ఉన్న భూములకు కూడా గిరిజనేతరులకు పరిహారం ఇచ్చేశారంటే టీడీపీ నేతలు, అధికారులు ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారంలో అమరావతి సీఆర్డీఏ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ తోడల్లుడు కాకర్ల సురేశ్ (ఈయన బుట్టాయిగూడెం మండలం దొరమామిడికి చెందిన తెలుగుదేశం నాయకుడు, బుట్టాయిగూడెం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కూడా) అటు ప్రభుత్వ ముఖ్యనేతలకూ ఇటు ఉన్నతాధికారుల మధ్య దళారీగా వ్యవహరించారు. ముంపు మండలాలైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో 3,673 ఎకరాల గిరిజనుల భూములకు సంబంధించిన పరిహారాన్ని అధికార పార్టీకి చెందిన వారికి అప్పనంగా ఇచ్చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి ఎంపిక చేసిన పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ఏజెన్సీ మండలాల్లోనూ అదే రీతిలో వ్యవహరించారు. - జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంలో 316.62 ఎకరాల భూమిని సేకరిస్తే.. ఇందులో 298 ఎకరాల భూమి గిరిజనులదే. కానీ.. కాకర్ల సురేశ్ సన్నిహితుడైన మండల టీడీపీ అధ్యక్షుడు ఉండవల్లి సోమసుందర్ ద్వారా భారీఎత్తున మామూళ్లు దండుకున్న ఉన్నతాధికారులు చినబాబు దన్నుతో అధికార పార్టీకి చెందినవారికి పరిహారం ఇచ్చేశారు. ఈ మండలంలో సేకరించిన 2,621.2 ఎకరాల భూమిలో 2,461 ఎకరాల భూమి గిరిజనులదే. కానీ.. ఇందులో 1,956 ఎకరాల పరిహారం నిధులను పచ్చచొక్కాలకు పంచేశారు. - అలాగే, జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి రెవెన్యూ పరిధిలో సేకరించిన 711 ఎకరాల్లో 600 ఎకరాలకు పైగా భూమి గిరిజనులదే. కోర్టుల విచారణ పరిధిలో ఉన్న భూములతోపాటు గిరిజనుల భూములకు సంబంధించిన పరిహారాన్ని అధికార పార్టీ నేతలకు చెల్లించేశారు. కౌలులోనూ కొల్లగొట్టారు భూములు కోల్పోయిన గిరిజన రైతులకు ఒక్కొక్కరికి గరిష్టంగా ఐదు ఎకరాల భూమికి బదులుగా భూమిని సర్కార్ ఇవ్వాలి. దీని కోసమే బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లో 7,459 ఎకరాల భూమిని సేకరించారు. ఈ భూములను వేలేరుపాడు, కుకునూరు మండలాల్లో నిర్వాసితులకు కేటాయించారు. దాన్ని ముందే పసిగట్టిన టీడీపీ నేతలు.. ముంపు గ్రామాల్లో వాలిపోయారు. ఆ భూములను తమకు కౌలుకు ఇవ్వాలని.. ఎకరానికి రూ.7,500 చొప్పున కౌలు ఇస్తామని ఆశచూపారు. దానికి గిరిజనులు అంగీకరించడంతో ఆ డబ్బులు వారికి ఇచ్చేశారు. వర్జీనియా పొగాకు పండే ఆ భూములను తిరిగి ఎకరానికి రూ.30వేల చొప్పున ఇతరులకు కౌలుకు ఇచ్చారు. అంటే ఒక్కో ఎకరానికి రూ.22,500 పొందారు. ఎల్టీఆర్–1970 చట్టానికి ఇది విరుద్ధం. ఆ చట్టాన్ని అమలుచేయాల్సిన అధికారులే అధికార పార్టీ నేతలకు చుట్టాలుగా మారడంతో గిరిజనులు నిస్సహాయ స్థితిలో తల్లడిల్లుతున్నారు. టీడీపీ నేతలు, అధికారులు కుమ్మక్కై దోచేశారు సీఆర్డీఏ కమిషనర్ సీహెచ్ శ్రీధర్, బుట్టాయిగూడెం మండలం దొరమామిడికి చెందిన టీడీపీ నేత కాకర్ల సురేశ్ ఇద్దరూ తోడల్లుళ్లు. శ్రీధర్ ద్వారా కాకర్ల సురేశ్ ఐటీడీఏ పీవో షాన్‌మోహన్‌తో కుమ్మక్కై గిరిజనుల భూములను దోచుకుని.. పరిహారం మింగేశారు. అదీ చాలక ఆ భూములు కేటాయించిన నిర్వాసితుల గిరిజనులను దోచుకుంటున్నారు. వేలేరుపాడు, కుకునూరు మండలాలకు చెందిన గిరిజనులకు కేటాయించిన భూములను వారి వద్ద నుంచి ఎకరం రూ.7,500 చొప్పున కౌలుకు తీసుకుని.. రైతులకు రూ.30 వేలకు కౌలుకు ఇచ్చి దోచుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని గిరిజనులకు న్యాయం చేయాలి. –కారం వాసు, జిల్లా కార్యదర్శి, గిరిజన కౌలు రైతుల సంఘం గిరిజనుల హక్కులను కాలరాశారు గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే వారిని దోపిడీ చేసింది. ప్రభుత్వ ముఖ్య నేతలు, టీడీపీ నేతలు గిరిజనులను దోచుకున్నారు. బుట్టాయిగూడెం మండలం కాకర్ల సురేశ్ సీఆర్డీ కమిషనర్ శ్రీధర్ తోడల్లుడు. ఆయనకు జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంకు చెందిన ఉండవల్లి సోమసుందర్ వంటి వారు జతకలిశారు. టీడీపీ ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యేల దన్నుతో టీడీపీ నేతలను దళారీలుగా మార్చుకుని.. ‘పశ్చిమ’ జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఐటీడీఏ పీవో షాన్మోహన్ల ద్వారా పరిహారం నిధులను కాజేశారు. –టి.సుధాకర్, జిల్లా కార్యదర్శి, సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ దోపిడీకి కారణం ప్రభుత్వం నిర్వాసితులనూ.. ఇటు వారికి పునరావాసం కల్పించే మండలాల్లోనూ భూసేకరణలో ప్రభుత్వం భారీ దోపిడీకి తెరతీసింది. గిరిజనులకు దక్కాల్సిన పరిహారాన్ని టీడీపీ నేతలు, షాన్మోహన్ వంటి ఐఏఎస్ అధికారులు మింగేస్తున్నారు. కాకర్ల సురేశ్ గిరిజనుల నుంచి ఎకరం భూమిని రూ.7,500లకు కౌలుకు తీసుకుని.. ఇతరులకు రూ.30 వేలకు కౌలుకు ఇస్తున్నారు. –ధర్ముల సురేశ్, జిల్లా కార్యదర్శి, అఖిల భారత రైతు కూలీ సంఘం ఎకరం రూ.30 వేలకు కౌలుకు తీసుకున్నా దొరమామిడిలో సేకరించిన 737 ఎకరాల భూమిని వేలేరుపాడు మండలం కాచారం, చిగురుమామిడిలకు చెందిన నిర్వాసితులైన గిరిజనులకు కేటాయించారు. వారి వద్ద కాకర్ల సురేశ్ ఎకరం రూ.7,500 చొప్పున గంపగుత్తగా కౌలుకు తీసుకుని ఎకరా రూ.30 వేల చొప్పున ఇతరులకు కౌలుకు ఇస్తున్నాడు. నేను కూడా ఆయన వద్దే ఎకరా రూ.30 వేల చొప్పున ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నా. –బొండుబాబు, రైతు, దొరమామిడి, బుట్టాయిగూడెం - బుట్టాయిగూడెం మండలం దొరమామిడిలో సర్వే నెంబర్ 183/1లో 11.80, 465లో 8.89, 178లో 8.28, 471లో 6.03, 181లో 5.24, 464లో 8.55, 182లో 11.57, 187లో 4.89 ఎకరాల భూములపై గిరిజనులకు గిరిజనేతరులకు మధ్య ట్రైబల్ ట్రిబ్యునల్ వివాదం నడుస్తున్నా ఐటీడీవో పీవో షాన్మోహన్ భూసేకరణ అధికారి హోదాలో వాటిని పట్టించుకోకుండా పరిహారం ఇచ్చేచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మండలంలో దొరమామిడి రెవెన్యూ పరిధిలో సేకరించిన 737.96 ఎకరాల్లో అధిక శాతం భూములు హైకోర్టు, ట్రైబల్ ట్రిబ్యునల్ విచారణ పరిధిలో ఉన్నవే కావడం గమనార్హం. కానీ.. వాటిని అధికారులు పట్టించుకోలేదు. -
భూముల సేకరణకు ఆదేశించాం
కాకినాడ రూరల్: పట్టణం, రూరల్ ప్రాంతా ల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రాధాన్యం ఇచ్చేలా భూములను సేకరించాలని ఆర్డీవోలను, తహసీల్దార్లను ఆదేశించినట్టు జాయింట్ కలñ క్టర్ ఎ.మల్లికార్జున వివరించారు. మంగళవారం అమరావతి నుంచి సీసీఎల్ఏ అనిల్‌చంద్ర పునేఠా స్పెషల్ ప్రాజెక్టులకు ఇళ్ల స్థలాలు, భూసేకరణ, నీటి పన్ను వసూలు, మీకోసంలో వచ్చిన సమస్యల పరిష్కారం, ఆర్థికేతర సమస్యల పరిష్కారం, జన్మభూమిలో వచ్చిన అర్జీల పరిష్కారం తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీ కోసంలో వచ్చిన సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పునేఠా మాట్లాడుతూ భూమికి సంబంధించి వచ్చిన సమస్యలు పరిష్కరించడానికి తూర్పుగోదావరి, కృష్ణా, విజయనగరం, కర్నూలు జిల్లాల జాయింట్ కలెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఆర్అండ్ఆర్ రిజిస్టరు డాట్ లేండ్ వెంటనే పరిష్కరించాలన్నారు. రాజోలు బైపాస్ 216కి సేకరించిన భూములకు చెల్లింపులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జేసీ మల్లికార్జున రంపచోడవరం నుంచి పాల్గొనగా కాకినాడ కలెక్టరేట్ నుంచి ఇన్చార్జి డీఆర్వో ఎం.జ్యోతి, ఏవో జి.భీమారావు, ల్యాండ్ సర్వే ఏడీ నూతన్‌కుమార్, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ప్రజాసాధికార సర్వేలో నమోదుకండి ప్రజాసాధికార సర్వేలో అందరూ వివరాలు నమోదు చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. 2016లో నిర్వహించిన సర్వేలో కొంతమంది ఇంటిలో లేకపోవడం, గ్రామం నుంచి పాక్షికంగా వలస వెళ్లటం, ఇతర కారణాల వల్ల వారి వివరాలు నమోదు కాలేదన్నారు. అలాంటి వారి వివరాలు సేకరించే నిమిత్తం వీఆర్వోవో, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ సిబ్బంది ద్వారా గ్రామాల్లో నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించినట్టు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాల్లో వారం రోజులు నమోదు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. -
పోలవరం భూసేకరణలో అక్రమాల పర్వం
-
అదిగో తోట... ఇవిగో చెట్లు
పోలవరం ప్రాజెక్టు భూసేకరణకు బినామీల రూపంలో టీడీపీ ముఖ్య నేతలు ఓ వైపు ఫోర్జరీలతో చెలరేగిపోగా.. మరోవైపు గిరిజనుల ‘భూమికి బదులు భూమి’ విషయంలో మరోలా రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారు. ఈ బాగోతంలో.. లేని తోటలను ఉన్నట్లు రికార్డుల్లో చిత్రీకరించారు. అంతేకాదు.. భారీఎత్తున ఫలసాయం వస్తున్నట్లు నమ్మించారు. రూ. వందల కోట్ల ప్రజాధనాన్ని మింగేసిన ఈ తతంగంలో ‘పచ్చ’ నేతల దోపిడీ పర్వం ఇలా సాగింది.. ఇదిగో ఈ ఫొటో చూశారా.. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి చెరువు ఇది. సర్వే నెంబరు 371/1లో 11.80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇది చెరువు కాదట. ఆ భూమిలో కొబ్బరితోట ఉందట. పెద్దల ఒత్తిడితో చెరువును కొబ్బరితోటగా మార్చేసిన అధికారులు.. ఆ భూమి టీడీపీ నేత కాకర్ల చంద్రశేఖర్‌కు చెందినట్లుగా రికార్డులు మార్చారు. దానితోపాటు సర్వే నెంబరు 372/1లో 5.42, 372/2లో 3.32, 422లో 7.16 ఎకరాలు వెరసి 27.7 ఎకరాల భూమికి, లేని కొబ్బరి చెట్లకు, బోరు బావులకు కలిపి మొత్తం రూ.3,67,69,669లను పరిహారంగా మంజూరు చేశారు. పోలవరం ముంపు గ్రామాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు: ఐదు కోట్ల మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం తమ జీవితాల్లో చీకట్లు నింపుకున్న గిరిజనుల త్యాగాలను అధికార పార్టీ కీలక నేతల అక్రమార్జన అపహాస్యం చేస్తోందనడానికి ఇది మరో తార్కాణం. భూ సేకరణ చట్టం–2013, పీసా (పంచాయత్స్ ఎక్సెటెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్) చట్టం–1996 ప్రకారం.. భూములు కోల్పోయిన గిరిజనులకు గరిష్ఠంగా ఐదు ఎకరాల భూమిని సర్కార్ ఇవ్వాలి. గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచడం కోసం వారు కోల్పోయిన భూములకు బదులు మామిడి తోటలు.. కోకో తోటలు.. పామాయిల్ తోటలు.. మూడు పంటలు పండే సారవంతమైన మాగాణి భూములను సేకరించి వారికి కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వీసమెత్తు నిజంలేదు. అధికార పార్టీ కీలక నేతలు, ఉన్నతాధికారులు కుమ్మక్కై మామిడి తోటలు.. కోకో తోటలు.. పామాయిల్ తోటలు లేకపోయినా ఉన్నట్లు రికార్డులు సృష్టించి.. అధిక మొత్తంలో పరిహారం పొందుతూ.. కమీషన్లు దండుకుంటున్నారు. అవే భూములను గిరిజనులకు కేటాయిస్తున్నారు. కానీ.. తమకు కేటాయించిన భూముల్లో మామిడి తోటలు కాదు కదా కనీసం ఒక్క చెట్టు కూడా కన్పించకపోవడంతో గిరిజనులు నిర్ఘాంతపోతున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే రూ.150 కోట్లకుపైగా ప్రజాధనాన్ని అధికార పార్టీ కీలక నేతలు కొల్లగొట్టేశారు. మాటలకు చేతలకు పొంతనేదీ? పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 1,61,857.01 ఎకరాల భూమి అవసరం. ఇందులో 1,39,859.68 ఎకరాల భూమి జలాశయంలో ముంపునకు గురవుతుంది. పోలవరం భూసేకరణ పరిహారం ఎలా అందిస్తారంటే.. ఒక గిరిజనుడికి 7 ఎకరాలు ఉంటే.. 5 ఎకరాల వరకు భూమికి భూమి ఇస్తారు. రెండు ఎకరాలకు పరిహారం ఇస్తారు. ఐదు ఎకరాలలోపు భూమి ఉంటే పరిహారంతో పాటు అంతో ఇంతో భూమి అందిస్తారు. దీనికోసం పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం ప్రాంతాల్లో సర్కార్ భూములు కొనుగోలు చేస్తోంది. గ్రామ గ్రామానికో దళారీ ఈ ప్రక్రియపైనా అధికార పార్టీ కీలక నేతలు, ప్రజాప్రతినిధుల కళ్లు పడ్డాయి. భూసేకరణ చేసే మండలాల్లో తమకు అనుకూలురైన రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన, అటవీ శాఖ అధికారులను నియమించుకున్నారు. గ్రామ గ్రామంలోనూ అధికార పార్టీ నేతలను దళారీలుగా మార్చుకుని అక్రమాలకు తెరతీశారు. భూసేకరణ కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (డీఎన్)ను జారీ చేయకముందే మామిడి తోటలు లేకున్నా ఉన్నట్లు.. కోకో తోటలు లేకున్నా సాగు చేస్తున్నట్లు.. పామాయిల్ తోటలు కన్పించకున్నా ఉన్నట్లు రికార్డులు సృష్టించారు. భూమితోపాటూ చెట్లకు పరిహారం మంజూరు చేయించుకుని.. భారీఎత్తున లబ్ధిపొందడానికి ఎత్తులు వేశారు. ఇదే వ్యూహంతో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయించారు. ఆ మేరకు పరిహారాన్ని మంజూరు చేస్తూ సర్కార్ డీడీ (డ్రాఫ్ట్ డిక్లరేషన్)ని జారీచేసింది. ఈ ఫొటో చూడండి.. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి వద్ద నిర్వాసితుల ఇళ్ల కోసం తొలగించిన వెదురు బొంగులు. సరిగ్గా లెక్కపెడితే 300లోపు ఉంటాయి. కానీ.. సర్వే నెంబరు 371/1లో 11.81, 372/1లో 5.43, 372/2లో 3.33, 422లో 7.17 వెరసి 27.74 ఎకరాల భూమిలో 9,250 వెదురు గుంపులు, టేకు చెట్లు ఉన్నట్లు చూపి రూ.4,16,78,278 పరిహారాన్ని టీడీపీ నేత భార్య కాకర్ల భాగ్యలక్ష్మికి అప్పనంగా మంజూరు చేశారు. పరిహారం చెల్లించాక.. సేకరించిన ఆ భూమిలో ఉన్న వృక్ష సంపద ప్రభుత్వానికే చెందాలి. నిర్వాసితులకు కేటాయిస్తే సంబంధిత గిరిజనులకు చెందాలి. కానీ.. వీటిని సంబంధిత భూ యజమానులే అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. లేని తోటలను ఉన్నట్లు చూపి రూ. వందల కోట్లు కాజేశారు గిరిజనులకు భూమికి బదులు భూమి ఇవ్వడానికి ఇప్పటికే 7,459 ఎకరాలను సేకరించారు. ఈ భూములకు ఇప్పటివరకూ రూ.864 కోట్ల మేర పరిహారం చెల్లించారు. అందులో లేని తోటలను ఉన్నట్లు చూపి రూ.150 కోట్లకుపైగా కాజేశారు. ఉదాహరణకు.. - బుట్టాయిగూడెం మండలం దొరమామిడిలో గిరిజనులకు భూమికి బదులు భూమి ఇవ్వడానికి రూ.89.90 కోట్ల వ్యయంతో 737.96 ఎకరాలను సేకరించారు. ఇందులో అధిక శాతం భూమి బోరు బావుల కింద ఆరు తడి పంటలు పండే భూమే. ఈ భూమిలో ఎక్కడా మామిడి తోటలు లేవు. సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో.. అదీ భూసేకరణ నోటిఫికేషన్ వెలువడానికి ముందు పామాయిల్ చెట్లను హడావుడిగా నాటారు. ఆ తర్వాత వాటిని కూడా తీసేశారు. కానీ.. ఈ భూముల్లో పామాయిల్, మామిడి తోటలు, వెదురు, టేకు తదితర చెట్లు ఉన్నట్లు చూపి అధిక మొత్తంలో పరిహారం పిండుకున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేత కాకర్ల సురేష్ చక్రం తిప్పినట్లు గిరిజన కౌలు రైతు సంఘం అధ్యక్షుడు కారం వాసు తెలిపారు. - అలాగే, జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి రెవెన్యూ పరిధిలో తాడువాయి, చల్లావారిగూడెం, మంగిశెట్టిగూడెం గ్రామాల పరిధిలో గిరిజనులకు భూమికి బదులుగా భూమి ఇవ్వడం కోసం తొలి విడతగా 711 ఎకరాల భూమిని రూ.159.97 కోట్లతో సేకరించడానికి నోటిఫికేషన్ జారీచేశారు. ఈ భూమిలో కూడా ఎక్కడా కోకో తోటలే లేవు. అయితే, పామాయిల్ తోటల్లో కోకో తోటలు ఉన్నట్లు రికార్డుల్లో చూపించారు. కానీ.. ఆ మూడు గ్రామాల్లో ఎక్కడా కనీసం ఒక్క కోకో చెట్టు కూడా లేకపోవడం గమనార్హం. మామిడి తోటలు, పొగాకు బ్యారన్లు ఉన్నట్లు రికార్డులు సృష్టించి, భారీఎత్తున ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఈ వ్యవహారంలో ఉండవల్లి సోమసుందర్ అనే టీడీపీ నేత చక్రం తిప్పారని రైతులు చెబుతున్నారు. - జీలుగుమిల్లి మండలం దర్భగూడెం, పి.నారాయణపురం, రౌతుగూడెం, స్వర్ణవారిగూడెం, ములగలంపల్లి, రామన్నగూడెంలలో కూడా గిరిజన నిర్వాసితుల కోసం 2621.2 ఎకరాల భూమిని రూ.524.42కోట్ల వ్యయంతో సేకరించారు. ఇందులో దర్భగూడెంలో సర్వే నెంబరు 294/1, 294/2లో 3.14 ఎకరాల భూమి ఉంది. ఇది పూర్తిగా కంకర క్వారీ భూమి. కానీ.. కేతిరెడ్డి రాఘవరెడ్డి అనే టీడీపీ నేత ఈ భూమిలో అప్పటికప్పుడు బోరువేసి, పామాయిల్ చెట్లు నాటించి.. రూ.65 లక్షలకుపైగా పరిహారాన్ని సొమ్ము చేసుకున్నాడు. జీలుగుమిల్లి గ్రామంలో సర్వే నెంబరు 89/4బీలో 1.83 ఎకరాలు చాకలి మాన్యం భూమిని, సర్వే నెంబరు 134/2లో 9.32 ఎకరాల మాదిగల మాన్యం భూమిని పసుపులేటి వెంకటరామయ్య అనే టీడీపీ నేత తనకు చెందినట్లుగా రికార్డులు సృష్టించి రూ.99.42 లక్షలు మింగేశాడు. గిరిజనులకు ద్రోహం చేశారు దర్భగూడెంలో దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను 1/70 (భూబదలాయింపు నిషేధం) చట్టాన్ని తుంగలో తొక్కి.. పీసా కమిటీలో తీర్మానించకుండా సర్కార్ సేకరించింది. సాగులో ఉన్న గిరిజనులను కాదని గిరిజనేతరులైన టీడీపీ నేతలకు పరిహారం ఇచ్చారు. దీనిపై గిరిజనులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను భూసేకరణ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ భూములను కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో నిర్వాసితులైన గిరిజనులకు భూమికి బదులు భూమి కింద సర్కార్ కేటాయిస్తోంది. సాగులో ఉన్న గిరిజనులకు.. నిర్వాసితులైన గిరిజనులకు మధ్య సర్కార్ చిచ్చు పెడుతోంది. గిరిజనులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం ద్రోహం చేయడం దారుణం. – ఊక సూర్యచంద్ర, పీసా కమిటీ సభ్యుడు, దర్భగూడెం, జీలుగుమిల్లి మండలం హైకోర్టు తీర్పు బేఖాతరు జీలుగుమిల్లి మండలంలో పాములవారిగూడెం, దర్భగూడెం, స్వర్ణవారిగూడెం తదితర ప్రాంతాల్లో గిరిజనుల భూములను గిరిజనేతరులు ఆక్రమించుకున్నారు. సాగులో గిరిజనులు ఉన్నా.. రికార్డులు గిరిజనేతరుల పేర్లతో సృష్టించారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించాం. ఆ భూములను సేకరించకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ అధికారులు ఏకపక్షంగా భూములను సేకరించి.. టీడీపీ నేతలకు పరిహారం ఇచ్చారు. గిరిజనులకు దక్కాల్సిన కోట్లాది రూపాయలను టీడీపీ నేతలు మింగేశారు. –గుజ్జు గంగాధర్, పాములవారిగూడెం, జీలుగుమిల్లి మండలం మా మధ్య చిచ్చుపెడతారా? గుర్రప్పగూడెంలో 75 ఎకరాల భూమిని మా గూడెంలోని గిరిజనులు సాగు చేసుకుంటున్నాం. మాకు పట్టాలు కూడా ఉన్నాయి. ఈ భూములు మావంటూ కొందరు గిరిజనేతరులు పేచీ పెడితే.. ట్రైబల్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాం. ట్రైబల్ ట్రిబ్యునల్ మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ.. టీడీపీ పెద్ద నేతల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మేం సాగుచేసుకుంటున్న భూములను సేకరించారు. రూ.8.50 కోట్లకుపైగా పరిహారాన్ని టీడీపీ నేతలు మింగేశారు. ఈ భూములను వేలేరుపాడు మండలం చిగురుమామిడికి చెందిన గిరిజనులకు కేటాయించారు. వారు మా భూములను స్వాధీనం చేసుకోవడానికి వస్తున్నారు. అన్నదమ్ముల్లా బతుకుతున్న గిరిజనుల మధ్య సర్కార్ చిచ్చుపెట్టింది. –యు. వెంకటేష్, గుర్రప్పగూడెం, బుట్టాయిగూడెం నిలువునా ముంచేశారు గుర్రప్పగూడెం, దొరమామిడిలో గిరిజనులమైన మేము భూములు సాగుచేసుకుంటున్నాం. పట్టాలు కూడా ఉన్నాయి. మా భూముల రికార్డులను తారుమారు చేసి.. స్థానిక టీడీపీ నేతలు పట్టాలు సృష్టించి మమ్మల్ని నిలువునా మోసం చేశారు. –కోరం సంక్రు, గుర్రప్పగూడెం, బుట్టాయిగూడెం. ప్రభుత్వమే మోసం చేస్తే ఇంక ఎవరికి చెప్పుకోవాలి? గిరిజన హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వమే మోసం చేస్తే మేం ఇంక ఎవరికి చెప్పుకోవాలి? మేం సాగు చేసుకుంటున్న భూములను మాకు తెలియకుండానే టీడీపీ నేతలు భూసేకరణ కింద అధికారులకు అప్పగించేసి పరిహారం కాజేశారు. ఈ భూములను వేలేరుపాడు మండలంలో నిర్వాసితులకు కేటాయించారు. మేం ఎవరినీ రానివ్వం. –ఉడత లక్ష్మణరావు, గుర్రప్పగూడెం, బుట్టాయిగూడెం మండలం -
భూసేకరణకు తుది నోటిఫికేషన్ విడుదల
అమరావతి: రాజధానిలో భూసేకరణకు తుది నోటిఫికేషన్ విడుదల అయింది. తాడేపల్లి మండలం పెనుమాకకు సంబంధించి 187ఎకరాల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే తుళ్లూరు మండలం కొండమరాజుపాలెంలో 32 ఎకాలకు నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 210 కుటుంబాలు ప్రభావితం అవుతాయని ఆ నోటిఫికేషన్లో ప్రభుత్వం వెల్లడించింది. -
రైతులకు భిక్ష వేస్తారా ?
-
రైతులకు భిక్ష వేస్తారా ?
ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి వడ్డే మండిపాటు భూసమీకరణకు వ్యతిరేకంగా ఫారం–2 ఇవ్వండి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూ దందా రైతుల తరుఫున పోరాటం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వెల్లడి మచిలీపట్నం : ‘భూసమీకరణలో రైతు నుంచి ఎకరం భూమి తీసుకుని 25 సెంట్ల భూమిని ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది... రైతులకు భిక్ష వేస్తారా? అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. బందరు పోర్టు, పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూ దోపిడీని నిరసిస్తూ భూ పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆశీర్వాద్ భవన్లో శనివారం రైతు సదస్సు నిర్వహించారు. వడ్డే మాట్లాడుతూ బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ పేరుతో 33,601 ఎకరాలు తీసుకునేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. నిర్మాణానికి 760 ఎకరాలు చాలని, గతంలోనే 450 ఎకరాలకు పైగా భూమిని పోర్టు నిర్మాణ సంస్థకు ప్రభుత్వం ఇచ్చేసిందని, అయితే ఇంత వరకు పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. పోర్టును ప్రైవేటు సంస్థకు కాకుండా విశాఖపట్నం పోర్టు అథారిటీకి అప్పగించాలని కోరారు. ప్రభుత్వ భూదందాను అడ్డుకునేందుకు ప్రజలంతా అక్టోబరు 4వ తేదీలోగా ఎంఏడీఏ అధికారులకు ఫారం–2ను అందజేయాలని సూచించారు. రాజకీయాలు పక్కన పెట్టండి రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా రైతులు ప్రభుత్వంపై పోరాటం చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. భూములు తీసుకునేందుకు ప్రభుత్వం కులాన్ని, మతాన్ని, పార్టీని, నాయకులను ప్రయోగిస్తుందని, అర్ధరాత్రి ఇంటి తలుపు తట్టి మంత్రులు బతిమలాడుతారని, రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. భూసమీకరణకు అభ్యంతరం తెలిపే ఫారం–2 ఇవ్వకుంటే భూసమీకరణకు అంగీకరించినట్లేనన్నారు. హైకోర్టు న్యాయవాది సుధాకరరెడ్డి మాట్లాడుతూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తోందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ భూములు కాపాడుకునేందుకు రైతులకు పోరాటమే శరణ్యమన్నారు. స్పష్టమైన హామీ ఇస్తేనే.. భూములు తీసుకోవాలంటే రైతులకు ఎంత మేర నష్టపరిహారం ఇస్తారు, భూములు కోల్పోయిన రైతులకు ఎక్కడ భూములు ఇస్తారు, పునరావాసం ఎక్కడ ఏర్పాటు చేస్తారు తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని అన్నారు. పరిశ్రమల స్థాపన కోసం భూములు ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఐ (ఎంఎల్) కార్యదర్శి మోదుమూడి రామారావు, ఏపీ రైతు కూలీ సంఘం ప్రతినిధి యద్దనపూడి సోనీ, ఉండవల్లికి చెందిన లక్ష్మీనరసమ్మ, పెనుమాకకు చెందిన రైతు సాంబయ్య, కోన గ్రామానికి చెందిన పెదబాబు ప్రసంగించారు. భూపరిరక్షణ పోరాట కమిటీ కన్వీనరు కొడాలి శర్మ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహన్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి మాగంటి హరిబాబు, వైఎస్సార్ సీపీ నాయకుడు మారుమూడి విక్టర్‌ప్రసాద్ పాల్గొన్నారు. భూసమీకరణకు భూములు ఇచ్చేది లేదని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. -
ఎయిర్‌పోర్టు భూసేకరణ ప్రక్రియ షురూ!
గన్నవరం: విమానాశ్రయ విస్తరణ కోసం ల్యాండ్ పూలింగ్‌లో అంగీకరించని రైతుల నుంచి భూసేకరణ చట్ట ప్రకారం భూములను తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా భూసేకరణ గ్రామాల్లో సామాజిక ప్రభావ మదింపు కోసం ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దారు ఎం. మాధురి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయా గ్రామాల్లోని పంచాయితీ కార్యాలయాల్లో జరిగే ఈ సభలకు నిర్వాసిత రైతులందరూ హాజరుకావాలని ఆమె కోరారు. ఎక్కడెక్కడ.. ఎప్పుడెప్పడు – సోమవారం ఉదయం 11 గంటలకు కేసరపల్లిలో, 27న ఉదయం 10కు జక్కులనెక్కలం, 12 గంటలకు పురుషోత్తపట్నంలో గ్రామసభలు జరుగుతాయి. –28న ఉదయం 10కు గన్నవరంలో, 12 గంటలకు చిన్నఆవుటపల్లిలో. – 29న ఉదయం 10కు అల్లాపురంలో, 12 గంటలకు అజ్జంపూడి. – 30వ తేది ఉదయం 10 గంటలకు బుద్దవరంలో ఈ గ్రామసభలు జరుగుతాయని తెలిపారు.