టీడీపీలోని మాజీ ఎమ్మెల్యేలే సూత్రధారులు | Former MLAs Of TDP Is Mastermind In Vishaka Lands Scam | Sakshi
Sakshi News home page

టీడీపీలోని మాజీ ఎమ్మెల్యేలే సూత్రధారులు

Published Sat, Nov 2 2019 7:45 AM | Last Updated on Sat, Nov 9 2019 1:12 PM

Former MLAs Of TDP Is Mastermind In Vishaka Lands Scam - Sakshi

దరఖాస్తుల స్వీకరణలో పాల్గొన్న సిట్‌ సభ్యులు వై.వి.అనురాధ, భాస్కరరావు, ఎస్‌డీసీ, లైజన్‌ ఆఫీసర్‌ శేష శైలజ

సాక్షి, మహారాణిపేట(విశాఖ దక్షిణ): గత ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన విశాఖ భూముల కుంభకోణంపై విచారణలో కీలక ఘట్టానికి శుక్రవారం తెరలేచింది. నగరం, పరిసర ప్రాంతాల్లో జరిగిన భూకుంభకోణాలు, రికార్డుల తారుమారు మీద వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాపు కమిటీ(సిట్‌) దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. మొదటి రోజు 19 కౌంటర్ల ద్వారా 79 వినతులను స్వీకరించింది. ఇందులో సిట్‌కు 14, నాన్‌ సిట్‌కు 65 ఫిర్యాదులందాయి. కాగా.. ఈ నెల 7వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్న భూ అక్రమాలను గుట్టురట్టు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ విజయ్‌కుమార్, మరో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి వైవీ అనురాధ, విశ్రాంత న్యాయమూర్తి టి.భాస్కరరావులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.

సిరిపురంలోని వుడా చిల్డ్రన్స్‌ థియేటర్‌ (చిల్డ్రన్‌ ఎరీనా)లో చేపట్టిన ఈ ప్రక్రియకు తొలిరోజు సిట్‌ చైర్మన్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ హాజరుకాలేదు. విశాఖపట్నం రెవెన్యూ డివిజన్‌లోని ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం, పెందుర్తి, పరవాడ, సబ్బవరం, గాజువాక, పెదగంట్యాడ, విశాఖపట్నం రూరల్, సీతమ్మధార, మహారాణిపేట, ములగాడ, గోపాలపట్నం మండలాల పరిధిలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూ అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే తెలుగుదేశం నేతలు, ప్రజాప్రతినిధులపై బాధితులు ఫిర్యాదులు చేశారు. తొలిరోజు అందిన 79 దరఖాస్తుల్లో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులుండటం గమనార్హం. 

సిరిపురం చిల్డ్రన్స్‌ ఎరీనాలో హెల్ప్‌డెస్క్‌లో మాట్లాడుతున్న ఫిర్యాదుదారులు

రికార్డుల తారుమారు– మాజీ ఎమ్మెల్యే వర్మ పాత్ర 
తెలుగుదేశం నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ, అతని అనుచరులు రెవెన్యూ అధికారుల సహకారంతో తమ స్థలాన్ని ఆక్రమించారని పిళ్లా పాపయ్య పాత్రుడు ఆరోపించారు. ఆనందపురం మండలం మామిడిలోవ పంచాయతీలో తమ తాతలు నరసింహపాత్రుడు, సీతారామ పాత్రుడులకు అప్పటి రాజులు 30 ఎకరాల సర్వీస్‌ ఇనాం భూములు ఇచ్చారని తెలిపారు. ఈ భూములను కొంత మంది రైతులు తమ పేరు మీద మార్చుకున్నారని, వారికి రెవెన్యూ అధికారులు సహకరించారన్నారు. అప్పటి ఆనందపురం తహసీల్దార్‌ నెహ్రూ బాబు, ఆర్డీవో వెంకటేశ్వర్లు అడంగల్, ఎఫ్‌ఎంబీ తదితర వాటిలో తమ తాత, తండ్రుల పేర్లు మార్పు చేశారని ఆరోపించారు. ఎప్పటి నుంచో ఈ భూములు తమ ఆధీనంలో ఉన్నాయని, తమ కుటుంబ సభ్యుల పేర్లు మార్పు వెనుక రెవెన్యూ అధికారులు పాత్ర ఉందన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వెనుక ఉండి కథ నడిపించారని, సర్వీస్‌ ఇనాం భూముల రికార్డులు తారుమారు చేశారన్నారు. గత సిట్‌లో ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదని, మళ్లీ ఫిర్యాదు చేస్తున్నామని పాత్రుడు వెల్లడించారు. రెవెన్యూ అధికారుల వల్ల తమ కుటుంబం ఎంతో నష్టపోయిందని వాపోయారు.  

దరఖాస్తులు సమర్పిస్తున్న ఫిర్యాదుదారులు 
మాజీ ఎమ్మెల్యే బండారు అన్యాయం చేశారు 
తన భూములు తనకు చెందకుండా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, తెలుగుదేశం నాయకులు అడ్డుతగిలారని పరవాడ మండలం ఈదులపాక బోనంగికి చెందిన జంగాల రమేష్‌ ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నియమించిన సిట్‌తో తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. సిట్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన తన సమస్యను విలేకరులకు వివరించారు. ‘పరవాడ మండలం ఈదులపాక బోనంగిలో జమీందారు జంగాల నారాయణమూర్తి పేరున 1000 ఎకరాలు ఉండేది. అందులో 610 ఎకరాలకు డబ్బులు చెల్లించి మా తాత కొనుగోలు చేశాడు. 1951లో కొంత మంది రెవెన్యూ అధికారులు వచ్చి ఎకనాల్జెమెంట్‌ ఇచ్చిన రెవెన్యూ రికార్డు తీసుకుని వెళ్లారు. నేటికీ ఆ రికార్డులు ఇవ్వలేదు. రికార్డుల కోసం అడిగితే లేవని సమాధానం చెబుతున్నారు. ఈ విషయమై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను కలిశాం.

తమ భూమి ఏపీఐఐసీలో భూసేకరణలో పోయిందని కొంత మంది అధికారులు తెలిపారు. దానికి నష్టపరిహారం ఇవ్వకుండా తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, మరో మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉంది. సెటిల్‌మెంట్‌ ద్వారా ఈ సమస్య పరిష్కారానికి అధికారులు సహకరించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో మా భూముల వ్యవహారంలో తలదూర్చవద్దని అప్పటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అందుకే ఏ అధికారి సహకరించలేదు.’అని రమేష్‌ వాపోయారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చక్కగా పరిపాలన సాగిస్తున్నారని, ఆయన మీద నమ్మకంతో న్యాయం జరుగుతుందని భావించి.. సిట్‌కు దరఖాస్తు చేసినట్టు వివరించారు. 

గజం కూడా లేకుండా చేశారు 
పరవాడ మండలం రావాడలో మాకు 40 ఎకరాల స్థలం ఉండేది. ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాల్లో ఉండేవాళ్లం. రికార్డులు ఉన్నాయి కదా అని ధీమా ఉండేది. కాని అన్ని రికార్డులు తారుమారు చేశారు. సర్వే నంబర్‌ 170, 171లో 8 ఎకరాలు, సర్వే నంబర్‌ 494లో 23 ఎకరాలు, సర్వే నంబర్‌ 115లో 6.50 ఎకరాలు, 471 సర్వే నంబర్‌లో నాలుగు ఎకరాల స్థలం ఉండేది. కొంత స్థలం ఎన్‌టీపీసీ భూ సేకరణలో పోయింది. తర్వాత కాలంలో రికార్డులు తారుమారు చేసి ఈ భూములను ఆక్రమించేశారు. ఇప్పుడు గజం కూడా లేకుండా పోయింది. 
– వి.సూర్యనారాయణ, రావాడ, పరవాడ  

న్యాయం చేయండి  
పెందుర్తి మండలం చీమాలపల్లిలో సర్వే నంబర్‌ 24/3డీ2లో 200 చదరపు గజాలు స్థలం గంటా సత్యవతి వద్ద కొనుగోలు చేశాం. జిరాయితీ అనడంతో స్థలం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాం. కొద్ది రోజుల తర్వాత అది ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదైంది. ఎలా చేరిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. మాలాగే మరో 100 మంది కొనుగోలు చేసి ఇబ్బంది పడుతున్నారు. న్యాయం చేయండి.  
– ఎక్కిరాల రామానుచారి, పెందుర్తి 

రాత్రికిరాత్రే పేర్లు మార్చేశారు 
పరవాడ మండలం పెదముషిడివాడలో 20 ఎకరాల భూమి మా ఆధీనంలో ఉంది. కానీ రాత్రికి రాత్రే వెబ్‌ల్యాండ్‌లో పేర్లు మారిపోయాయి. ఎలా మారాయో.. ఎందుకు మారాయో ఇప్పటికీ అర్థం కావడం లేదు. గత సిట్‌లో ఫిర్యాదు చేశాం. ఫలితం లేకపోయింది. మారిన పేర్లు, వారి ఆధార్‌ నంబర్లతో సహా ఫిర్యాదు చేశాం. పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లాం.  ఫలితం లేకపోయింది.  
– జి.నాగమణి బాబు, పెదముషిడివాడ, పరవాడ మండలం

ఒకే భూమి.. రెండు పాస్‌ పుస్తకాలు  
ఒకే భూమిపై ఇద్దరికి పాసు పుస్తకాలు ఇచ్చారు. పద్మనాభం మండలం అనంతవరంలో 9/1, 5/11, 5/19, 22/11, 26/7 సర్వే నంబర్లలో నా భార్య చలుమూరు ముత్యమాంబ పేరు మీద రెండు ఎకరాల స్థలానికి పాసు పుస్తకాలున్నాయి. ఈ భూమిపై ఎస్‌బీఐ నుంచి రుణం కూడా పొందాం. స్థానిక తహసీల్దార్‌ ఈ భూమికి మరొకరి పేరు మీద పాసు పుస్తకాలు మంజూరు చేశారు. రెవెన్యూ అధికారుల వల్ల తాము నష్టపోయాం. న్యాయం చేయండి.  
– చలుమూరు ఎర్నంనాయుడు, అనంతవరం, పద్మనాభం మండలం 

స్థలాన్ని ఆక్రమించేశారు 
నా తండ్రి ఏవై రత్నం లంకెలపాలెంలో విశాఖ వేలీ బిల్డింగ్‌ సొసైటీ వద్ద 153 సర్వే నంబర్‌లో 1198ఏ ఫ్లాటు కొనుగోలు చేశారు. రెవెన్యూ అధికారులు కూడా సర్వే చేసి ఆ స్థలం ఏవై రత్నానికే చెందుతుందని స్పష్టం చేశారు. కానీ స్థానిక వ్యక్తి ఒకరు ఆ స్థలం తనదంటూ బెదిరిస్తున్నారు.    
– వైఎస్‌ మణి, లంకెలపాలెం 

అధికారులు సమాధానం చెప్పాలి 
పెందుర్తి మండలం పులగానిపాలెం సర్వే నంబర్‌ 175/1లో నరవ పైడమ్మ పేరున 2.36 సెంట్ల భూమి రికార్డుల్లో చూపిస్తోంది. పులగానిపాలెం కొండ అంతా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆక్రమణకు గురైంది. నరవ పైడమ్మ పేరున ఇనాం భూమి ఎలా వచ్చింది. రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలి.
 – జి.అప్పారావు, న్యాయవాది, విశాఖ   

దేవాలయ భూమి హాంఫట్‌ 
రాంబిల్లి మండలం, ధారపాలేంలో కొలువైన ఉమారామలింగేశ్వర స్వామి ఆలయానికి చెందిన 113 ఎకరాల భూమి వేరే వారి పేర్ల మీద మారిపోయింది. కొంత మంది రికార్డులు తారుమారు చేసి తమ పేరున మార్పు చేసుకున్నారు. ఆలయానికి ఒక రూపాయి కూడా వారు శిస్తు చెల్లించడం లేదు. గతంలో ఉన్నతాధికారులు, లోకయుక్తాకు ఫిర్యాదు చేశాం. ఫలితం లేకపోయింది. సిట్‌ అధికారులు చర్యలు చేపట్టాలి.   
– సత్యనారాయణ, ధారపాలెం, రాంబిల్లి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement