సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీని కసరత్తు మొదలైంది. 158.6 కి.మీ. ఈ భాగానికి సమీకరించాల్సిన భూమి ఏయే సర్వే నంబర్లలో ఎంతెంత ఉందన్న వివరాల నమోదు పూర్తయింది. గెజిట్ జారీకి వీలుగా దీన్ని ఈ నెల 15న ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కేంద్రంలో అందజేయనున్నట్లు సమాచారం.
భూసేకరణలో ఇదే తొలి ప్రక్రియ. ఆ వివరాలను పరిశీలించి, కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకున్నాక గెజిట్ విడుదల చేయనున్నారు. ఆ తర్వాత భూసేకరణ వివరాలు ప్రజల ముంగిటికి అధికారికంగా రానున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి కేంద్రం అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో, ఇటీవలే దాని అలైన్‌మెంట్‌ను కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ రోడ్డుకు దాదాపు 4,400 ఎకరాల భూమి అవసరమవుతుందని గుర్తించారు. అలైన్‌మెంట్ ఆధారంగా ఈ భూమి ఏయే గ్రామాల పరిధిలో ఎంత అవసరమో ఆ వివరాలతో ఓ నివేదికను తాజాగా సిద్ధం చేశారు.
అభ్యంతరాలకు 21 రోజులు..
గెజిట్ విడుదల తర్వాత పత్రికా ముఖంగా ప్రచురించి ప్రజల ముంగిట ఉంచుతారు. ఈ జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు ప్రజలకు 21 రోజుల గడువు ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కాంపిటెంట్ అథారిటీ ముందు అభ్యంతరాలను వ్యక్తం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. మండలాలవారీగా (ఇంకా తేల్చలేదు) పబ్లిక్ హియరింగ్ సమావేశాలు (గ్రామసభ తరహా) ఏర్పాటు చేసి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆ మేరకు కాంపిటెంట్ అథారిటీ మార్పుచేర్పులకు అవకాశం కల్పించేందుకు దాదాపు నెల రోజుల సమయమివ్వనున్నారు.
ఆ తర్వాత రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో హద్దుల నిర్ధారణతో పాటు భూ వివరాలను నమోదుచేస్తారు. దీని కోసం ఒక్కో గ్రామానికి 10 మంది వరకు రెవెన్యూ సిబ్బందిని నియమించనున్నట్లు ఆ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ లెక్కన దాదాపు 2వేల మందిని ఈ అథారిటీకి అప్పగించనున్నారు. దీని అధారంగా మరో జాబితాను ప్రచురించి పత్రికాముఖంగా ప్రజల ముందు ఉంచుతారు. దీనిపైనా ప్రజా అభ్యంతరాలకు 2 నెలల గడువు ఇవ్వనున్నారు. ఆ అభ్యంతరాల ఆధారంగా పొరపాట్లను సరిదిద్దుతారు.
ఆ తర్వాత.. ఆ భూమిలోని చెట్లు, పైపులైన్లు, ఇతర ఆస్తుల వివరాలు సేకరించి ప్రచురిస్తారు. ఇక ఏ పట్టాదారుకు ఎంత పరిహారం ఇవ్వనున్నారో లెక్కించి ఆ వివరాలను కూడా బహిరం గంగా ప్రచురిస్తారు. దీనిపై కూడా అభ్యంతరాలు స్వీకరిస్తారు. పరిష్కరించగలిగినవి పరిష్కరించి.. వారికి రావాల్సిన పరిహారం వివరాలు పొందు పరుస్తూ (భూమి, అందులోని ఇతర ఆస్తులు కలిపి) అవార్డు పాస్ చేస్తారు. ఈ సందర్భంగా ఆ భూ యజమానుల లిఖితపూర్వక అంగీకారాన్ని అధికారులు సేకరిస్తారు. అంగీకరించని వారికి కూడా రెవెన్యూ అధికారులతో ఓ జాయింట్ ఖాతా తెరిచి అందులో పరిహారాన్ని జమచేస్తారు. వారి అభ్యంతరాలు వీగిపోయిన తర్వాత నిర్బంధంగా భూమిని సమీకరించి పరిహారాన్ని చెల్లిస్తారు.
ఏడాది నుంచి రెండేళ్లు పట్టే అవకాశం..
ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టులో ఇదే అత్యంత కీలక ప్రక్రియ. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు ఏడాది నుంచి రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. అనుకున్నది అనుకున్నట్లు సవ్యంగా సాగితే 6 నెలలు పడుతుందని అంచనా. కానీ.. న్యాయపరంగా, ఇతర ఇబ్బందులను అధిగమించేందుకు రెండేళ్ల వరకు సమయం పట్టే అవకాశం ఉంది.
కాంపిటెంట్ అథారిటీ..
భూసేకరణ ప్రక్రియకు ప్రత్యేకంగా ఓ కాంపిటెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం 4 జిల్లాల పరిధిలో ఉండనుంది. సాధారణంగా జిల్లా అదనపు కలెక్టర్ (పరిపాలన) ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి భూ సేకరణను పర్యవేక్షిస్తారు. ఈ రోడ్డు విషయంలో జాప్యం ఉండకూడదని అథారిటీని ఏర్పాటు చేస్తు న్నారు. ఇందులో ఆర్డీఓ స్థాయి (ఖరారు కాలేదు) ముగ్గురిని నియమించనున్నట్లు సమాచారం. దీని అనుమతి కోసం ఇటీవలే అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఒక్కో అధికారికి 50 కి.మీ. నిడివి అప్పగించనున్నట్లు ఓ రెవెన్యూ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఒక్కో అధికారికి మూడునాలుగు మండలాల పరిధి రానుంది.
పరిహారం..
ప్రభుత్వ విలువపై 3 రెట్ల విలువను పరిహారంగా లెక్కగట్టనున్నారు. లేదా స్థానికంగా ఇటీవల ఏదైనా ప్రాజెక్టు కోసం జరిగిన భూసేకరణలో లెక్కగట్టిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకునే వీలుంది. ఏడాదిలోపు పరిహారం అందివ్వలేని పక్షంలో 12 శాతం వడ్డీ కలుపుకొని చెల్లిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment