సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి అలైన్‌మెంటులో గుర్తించిన భూమిని తన పరిధిలోకి తీసుకుంటూ జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) 3డీ నోటిఫికేషన్‌లు జారీ చేసింది. యాదాద్రి–భువనగిరి, ఆందోల్–జోగిపేట, చౌటుప్పల్ అథారిటీ(కాంపిటెంట్ అథారిటీ ఫర్ లాండ్ అక్విజిషన్–కాలా)లకు సంబంధించి ఏప్రిల్‌లో మూడు గెజిట్‌లు జారీ చేయగా, తాజాగా భువనగిరి, ఆందోల్–జోగిపేటలోని అనుబంధ నోటిఫికేషన్‌లు, సంగారెడ్డి, గజ్వేల్, తూప్రాన్ కాలాలకు సంబంధించి 3డీ నోటిఫికేషన్‌లు జారీ చేసింది.
అలైన్‌మెంటు ఖరారు చేసిన తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు వీలుగా తొలుత జారీ చేసిన రెండు గెజిట్‌లలో దాదాపు 500 ఎకరాలకు సంబంధించిన భూముల వివరాలు గల్లంతైన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఇటీవలే గుర్తించి వాటికి మళ్లీ నోటిఫికేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. అలా గల్లంతైన భూములకు సంబంధించి మినహా మిగతా భూమలుకు సంబంధించి తుది గెజిట్ నోటిపికేషన్లు దాదాపు జారీ అయినట్టే. దీంతో ఈ భూములన్నీ ప్రైవేటు వ్యక్తుల ఆధీనం నుంచి ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలోకి చేరినట్టయింది.
భూ యజమానుల అభ్యంతరాలను తోసిపుచ్చిన ఎన్‌హెచ్‌ఏఐ: ఈ భూముల సేకరణ ప్రక్రియపై వాటి యజమానుల నుంచి వ్యక్తమైన అన్ని అభ్యంతరాలను ఎన్‌హెచ్‌ఏఐ తోసి పుచ్చింది. ఆయా అభ్యంతరాలకు సంబంధించి గ్రామ సభ ల్లో అధికారికంగా వెల్లడించిన సమాధానాలతో ఇక అభ్యంతరాలు రద్దయినట్టుగానే ఎన్‌హెచ్‌ఐఏ పరిగణిస్తుంది. ప్రజో పయోగానికి సంబంధించి రూపొందించిన ప్రాజెక్టు నిర్మాణానికి గాను ఈ భూములను సేకరించాలని నిర్ణయించినందున, ఆ ప్రాజెక్టు పనులు మందుకు సాగేందుకు వీలుగా భూములపై ఉన్న ప్రైవేటు యాజమాన్య హక్కులను రద్దు చేస్తున్నట్టుగా ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది. వెరసి ఆ భూములన్నీ కేంద్రప్రభుత్వ అధీనంలోకి చేరినట్టయింది.
గెజిట్‌లో ఇలా: ‘‘కేంద్ర భూసేకరణ చట్టం సెక్షన్ 3డీలోని సబ్ సెక్షన్(1) ప్రకారం.. నిర్ధారిత గ్రీన్‌ఫీల్డ్ హైవే దిగువ తెలి పిన సర్వే నెంబర్లలోని భూమిని కేటాయించాము. దాని కో సం సేకరించనున్నాము’’ ‘‘కేంద్ర భూసేకరణ చట్టం సెక్షన్ 3డీ సబ్‌సెక్షన్(2) నోటిఫికేషన్ విడుదలైన వెంటనే.. నిర్ధారి త భూమి పూర్తిగా కేంద్రప్రభుత్వ అధీనంలోకి వచ్చినట్టుగా పరిగణించాలి. ’’ అని గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రచురించింది.
158.62 కి.మీ.గాను 2 వేల హెక్టార్ల భూమి సేకరణ
రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తరభాగంలో 158.62 కి.మీ. నిడివికి గాను దాదాపు 2 వేల హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందుకు రూ.5170 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ మొత్తంలో సగ భాగం.. అంటే రూ.2585 కోట్లు భూసేకరణకు, రూ.363.43 కోట్లు స్తంభాలు లాంటి వాటిని తరలించేందుకు అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది.
నిధులు ముందే జమ కట్టే విషయంలో కేంద్ర–రాష్ట్రప్రభుత్వాల మధ్య అప్పట్లో అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత రాజీ కుదిరి రూ.100 కోట్ల మొత్తాన్ని జమ చేయటంతో 3 డీ నోటిషికేషన్ జారీకి మార్గం సుగమమైంది. 3ఏ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన ఏడాదిలోపు 3డీ గెజిట్ నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. ఈ నెలతో ఏడాది పూర్తి అవుతున్నందున 3డీ గెజిట్ నోటిఫికేషన్లను ఎన్‌హెచ్‌ఏఐ జారీ చేయటం విశేషం.
పూర్తి వివరాలతో నోటిఫికేషన్
రీజినల్ రింగురోడ్డు నిర్మించే అలైన్‌మెంట్ పరిధిలోకి వచ్చే భూములను గుర్తించి గతంలోనే సర్వే చేసిన అధికారులు.. తాజా గెజిట్ నోటిఫికేషన్‌లో ఊరు, సర్వే నెంబరు, భూమి విస్తీర్ణం, పట్టాదారు పేరు.. ఇలా పూర్తి వివరాలను గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రచురించారు.
Comments
Please login to add a commentAdd a comment