సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు ఉత్తరభాగం అలైన్‌మెంట్‌కు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆమోదం తెలిపింది. మూడు వారాల క్రితం తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేయగా తాజాగా దానికి మరో చిన్న సవరణ చేసి తుది అలైన్‌మెంట్‌కు ఆమోదముద్ర వేసింది. ఈ విషయం త్వరలోనే అధికారికంగా వెల్లడి కానుంది.
ఉత్తర భాగానికి కన్సల్టెన్సీ బాధ్యతలు చూస్తున్న కే అండ్ జే కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో నాలుగు అలైన్‌మెంట్ ఆప్షన్లను ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ కేంద్ర కార్యాలయానికి పంపగా.. ‘ఆప్షన్–ఏ’ను ఖరారు చేసింది. మూడేళ్ల క్రితం కన్సల్టెన్సీగా వ్యవహరించిన సంస్థ అలైన్‌మెంట్‌తో పోలిస్తే 1.2 కి.మీ. నిడివిని తగ్గిస్తూ ఈ అలైన్‌మెంట్ ఉంది. అయితే ఇందులో అత్యవసరంగా మరో సవరణ చేశారు. దీని ప్రకారం పాత అలైన్‌మెంట్ (మూడేళ్ల కిందటిది)కు కేవలం 200 మీటర్ల తేడాతో ఈ కొత్త అలైన్‌మెంట్‌ను 158.645 కి.మీ.గా నిర్ధారించారు.
నాలుగు జిల్లాలు.. 15 మండలాలు..
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం సంగారెడ్డి, యాదాద్రి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో నిర్మితం కానుంది. ఈ జిల్లాల పరిధిలోని 15 మండలాలను అనుసంధానిస్తూ రూపుదిద్దుకుంటుంది. 120 గ్రామాల పరిధిలో భూసమీకరణ జరగనుంది. ఇందులో 80–82 గ్రామాల నుంచి సింహభాగం భూమిని సమీకరించనుండగా వాటికి కి.మీ. లోపు దూరంలో ఉండే మరో 38–40గ్రామాల నుంచి స్వల్పంగా సమీకరిస్తారు. అలైన్‌మెంట్‌లో భాగంగా ఆయా గ్రామాల పేర్లను గుర్తించి కేంద్రానికి పంపారు. మరో నెల రోజుల్లో భూసమీకరణ ప్రక్రియ ప్రారం భం కానుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. రూ. 7,512 కోట్ల నిర్మాణ వ్యయం అవుతుం దని అంచనా వేస్తున్న ఈ ప్రాజెక్టుకు 4 వేల ఎకరాల భూమిని సమీకరించనున్నారు. భూసేకరణకే దాదాపు రూ. 1,800 కోట్ల వరకు ఖర్చు కానుంది.
ముందే వెల్లడించిన ‘సాక్షి’
ఎన్‌హెచ్‌ఏఐ తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేసిన విషయాన్ని పక్షం రోజుల కిందటే ‘సాక్షి’ఎక్స్‌క్లూజివ్‌గా వెల్లడించింది. మూడేళ్ల కిందట పాత కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన అలైన్‌మెంట్‌కు సవరణలు చేస్తూ ఆప్షన్–ఏను ఖరారు చేసిన విషయాన్ని పాఠకులకు అందించింది. ఇప్పుడు ఎన్‌హెచ్‌ఏఐ దాన్నే ఓకే చేసింది.
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం నిర్మాణ పరిధిలోకి వచ్చే మండలాలు..
► సంగారెడ్డి- సంగారెడ్డి, చౌటకూరు, హత్నూరు
► మెదక్- నర్సాపూర్, శివంపేట, తూప్రాన్
► సిద్దిపేట- గజ్వేల్, వర్గల్, మర్కూక్, జగదేవ్‌పూర్
► యాదాద్రి- తుర్కపల్లి, యాదాద్రి, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్
► 158.465 కిలోమీటర్లు- ఉత్తర భాగం రహదారి మొత్తం పొడవు
► 4,000-ఎకరాలు సమీకరించే భూమి
► రూ. 7,512 కోట్ల అంచనా వ్యయం
Comments
Please login to add a commentAdd a comment