పోలవరం ప్రాజెక్టు భూసేకరణ.. నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ అమలులో ప్రభుత్వ కీలక నేతలు, అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధులు.. నలుగురు ఐఏఎస్ అధికారుల ద్వారా సాగించిన దోపిడీ దందా ఇదీ. వీరందరూ కలిసి గిరిజనుల హక్కులను కాలరాశారు. భూసేకరణ చట్టం–2013, భూ బదలాయింపు చట్టం–1979, పీసా చట్టాలను తుంగలో తొక్కారు. భూసేకరణ నుంచీ పునరావాసం కల్పించే వరకూ అన్ని విభాగాల్లోనూ అనుకూలురైన అధికారులను నియమించుకున్నారు. ముంపు మండలాలు.. పునరావాసం కల్పించే మండలాలకు ఏరికోరి తమకు విధేయులైన అధికారులను రప్పించుకున్నారు. సొంత పార్టీ నేతలను దళారీలుగా మార్చేశారు. గిరిజనులకు దక్కాల్సిన పరిహారాన్ని కాజేసి.. పర్సంటేజీలను పంచుకుతిన్నారు.
పోలవరం ముంపు గ్రామాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు: రాష్ట్రం రూపురేఖలను సమూలంగా మార్చేస్తుందని భావిస్తున్న పోలవరం జలాశయంలో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏడు మండలాల పరిధిలోని 287 గ్రామాలు ముంపునకు గురవుతాయి. 1,05,601 కుటుంబాలవారు నిర్వాసితులుగా మారతారు. ఇందులో అధిక శాతం మంది గిరిజనులే. ముంపునకు గురయ్యే 1,39,859.68 ఎకరాల భూమిని సేకరించాలి. భూసేకరణ చట్టం–2013 అమలులోకి రాక ముందే లక్ష ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వం సేకరించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన భూమిని 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరించాలి.
ఆది నుంచి వ్యూహాత్మకంగా..
విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏడు ముంపు మండలాలను రాష్ట్రంలో విలీనం చేశారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముంపు మండలాల రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేశారు. ఆ తర్వాత భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూమిని సేకరిస్తామని.. అదే చట్టం ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని సర్కార్ ప్రకటించింది. ఇదే సమయంలో ముంపు మండలాలు, పునరావాసం కల్పించే మండలాలకు చెందిన టీడీపీ కీలక నేతలు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ ఎంపీ, మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ ముఖ్య నేతను, మరో చినబాబును కలిశారు.
భూ బదలాయింపు నిషేధ చట్టం (ఎల్‌టీఆర్)–1970 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూమిపై ఎలాంటి హక్కు ఉండదు. 1969కి ముందు పట్టా ఉన్న భూములకు ఈ చట్టం వర్తించదు. కౌలు రైతుల రూపంలో ఏజెన్సీలో చొరబడి గిరిజనుల భూములను కౌలుకు తీసుకుని.. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒకొక్కరు వందల ఎకరాల భూములను సొంతం చేసుకున్నారు. ఆ భూములకు పరిహారం ఇప్పించాలన్న ప్రతిపాదనకు ముఖ్య నేత అంగీకరించారు. తొలుత పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో భూములు సేకరించాలని నిర్ణయించారు. అదే క్రమంలో పశ్చిమగోదావరి కలెక్టర్‌గా కాటంనేని భాస్కర్‌ను, కేఆర్‌పురం ఐటీడీఏ పీవోగా షాన్‌మోహన్‌ను, భూసేకరణ అధికారిగా సీహెచ్ భానుప్రసాద్‌ను నియమించారు. ముంపు, పునరావాస మండలాల్లో అనుకూలమైన రెవెన్యూ అధికారులను నియమించుకున్నారు. వీరితోపాటు సీఆర్‌డీఏ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ సెక్రటేరియట్‌లో పనులన్నీ చక్కబెట్టారన్న ఆరోపణలున్నాయి.
గిరిజనుల హక్కులు అపహాస్యం
ఏజెన్సీ ప్రాంతాల్లో భూములు సేకరించాలంటే భూసేకరణ చట్టం–2013, ఎల్‌టీఆర్–1970, పీసా చట్టాల ప్రకారం గ్రామసభలు నిర్వహించాలి. సేకరించే భూముల వివరాలను సర్వే నెంబర్లు, నిర్వాసితుల పేర్లతో సహా వెల్లడించాలి. సభకు హాజరైన వారితో సంతకాలు తీసుకోవాలి. హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది అంగీకారం తీసుకుని భూమిని సేకరించాలి. భూములపై ఏవైనా కేసులు విచారణలో ఉంటే.. అలాంటి అంశాన్ని కూడా ప్రకటించాలి. కానీ.. సర్కార్ అటు ముంపు మండలాల్లోనూ ఇటు పునరావాసం కల్పించే మండలాల్లోనూ భూసేకరణపై గ్రామసభలు నిర్వహించిన దాఖలాలు లేవు. గ్రామసభలు నిర్వహిస్తే వాస్తవాలు బహిర్గతమవుతాయని అక్రమాలపై గిరిజనులు తిరుగుబాటు చేస్తారనే భయం వల్లే గ్రామసభలు నిర్వహించలేదు. భూసేకరణ నోటిఫికేషన్ (డీఎన్)ను, దాన్ని ఖరారు చేస్తూ జారీచేసే డ్రాఫ్ట్ డిక్లరేషన్ (డీడీ)లనూ పంచాయతీ కార్యాలయాల్లో ఉంచలేదు.
గిరిజనుల భూముల పరిహారం.. పచ్చచొక్కాలకు
రెవెన్యూ రికార్డులను తారుమారు చేసిన సర్కార్.. కౌలు రూపంలో గిరిజనుల భూములను కాజేసిన పచ్చచొక్కాలకే భూసేకరణ పరిహారం ఇచ్చేసింది. హైకోర్టు, గిరిజన న్యాయస్థానం (ట్రైబల్ ట్రిబ్యునల్)లో విచారణలో ఉన్న భూములకు కూడా గిరిజనేతరులకు పరిహారం ఇచ్చేశారంటే టీడీపీ నేతలు, అధికారులు ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారంలో అమరావతి సీఆర్‌డీఏ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ తోడల్లుడు కాకర్ల సురేశ్ (ఈయన బుట్టాయిగూడెం మండలం దొరమామిడికి చెందిన తెలుగుదేశం నాయకుడు, బుట్టాయిగూడెం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కూడా) అటు ప్రభుత్వ ముఖ్యనేతలకూ ఇటు ఉన్నతాధికారుల మధ్య దళారీగా వ్యవహరించారు. ముంపు మండలాలైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో 3,673 ఎకరాల గిరిజనుల భూములకు సంబంధించిన పరిహారాన్ని అధికార పార్టీకి చెందిన వారికి అప్పనంగా ఇచ్చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి ఎంపిక చేసిన పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ఏజెన్సీ మండలాల్లోనూ అదే రీతిలో వ్యవహరించారు.
- జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంలో 316.62 ఎకరాల భూమిని సేకరిస్తే.. ఇందులో 298 ఎకరాల భూమి గిరిజనులదే. కానీ.. కాకర్ల సురేశ్ సన్నిహితుడైన మండల టీడీపీ అధ్యక్షుడు ఉండవల్లి సోమసుందర్ ద్వారా భారీఎత్తున మామూళ్లు దండుకున్న ఉన్నతాధికారులు చినబాబు దన్నుతో అధికార పార్టీకి చెందినవారికి పరిహారం ఇచ్చేశారు. ఈ మండలంలో సేకరించిన 2,621.2 ఎకరాల భూమిలో 2,461 ఎకరాల భూమి గిరిజనులదే. కానీ.. ఇందులో 1,956 ఎకరాల పరిహారం నిధులను పచ్చచొక్కాలకు పంచేశారు.
- అలాగే, జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి రెవెన్యూ పరిధిలో సేకరించిన 711 ఎకరాల్లో 600 ఎకరాలకు పైగా భూమి గిరిజనులదే. కోర్టుల విచారణ పరిధిలో ఉన్న భూములతోపాటు గిరిజనుల భూములకు సంబంధించిన పరిహారాన్ని అధికార పార్టీ నేతలకు చెల్లించేశారు.
కౌలులోనూ కొల్లగొట్టారు
భూములు కోల్పోయిన గిరిజన రైతులకు ఒక్కొక్కరికి గరిష్టంగా ఐదు ఎకరాల భూమికి బదులుగా భూమిని సర్కార్ ఇవ్వాలి. దీని కోసమే బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లో 7,459 ఎకరాల భూమిని సేకరించారు. ఈ భూములను వేలేరుపాడు, కుకునూరు మండలాల్లో నిర్వాసితులకు కేటాయించారు. దాన్ని ముందే పసిగట్టిన టీడీపీ నేతలు.. ముంపు గ్రామాల్లో వాలిపోయారు. ఆ భూములను తమకు కౌలుకు ఇవ్వాలని.. ఎకరానికి రూ.7,500 చొప్పున కౌలు ఇస్తామని ఆశచూపారు. దానికి గిరిజనులు అంగీకరించడంతో ఆ డబ్బులు వారికి ఇచ్చేశారు. వర్జీనియా పొగాకు పండే ఆ భూములను తిరిగి ఎకరానికి రూ.30వేల చొప్పున ఇతరులకు కౌలుకు ఇచ్చారు. అంటే ఒక్కో ఎకరానికి రూ.22,500 పొందారు. ఎల్‌టీఆర్–1970 చట్టానికి ఇది విరుద్ధం. ఆ చట్టాన్ని అమలుచేయాల్సిన అధికారులే అధికార పార్టీ నేతలకు చుట్టాలుగా మారడంతో గిరిజనులు నిస్సహాయ స్థితిలో తల్లడిల్లుతున్నారు.
టీడీపీ నేతలు, అధికారులు కుమ్మక్కై దోచేశారు
సీఆర్‌డీఏ కమిషనర్ సీహెచ్ శ్రీధర్, బుట్టాయిగూడెం మండలం దొరమామిడికి చెందిన టీడీపీ నేత కాకర్ల సురేశ్ ఇద్దరూ తోడల్లుళ్లు. శ్రీధర్ ద్వారా కాకర్ల సురేశ్ ఐటీడీఏ పీవో షాన్‌మోహన్‌తో కుమ్మక్కై గిరిజనుల భూములను దోచుకుని.. పరిహారం మింగేశారు. అదీ చాలక ఆ భూములు కేటాయించిన నిర్వాసితుల గిరిజనులను దోచుకుంటున్నారు. వేలేరుపాడు, కుకునూరు మండలాలకు చెందిన గిరిజనులకు కేటాయించిన భూములను వారి వద్ద నుంచి ఎకరం రూ.7,500 చొప్పున కౌలుకు తీసుకుని.. రైతులకు రూ.30 వేలకు కౌలుకు ఇచ్చి దోచుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని గిరిజనులకు న్యాయం చేయాలి.
–కారం వాసు, జిల్లా కార్యదర్శి, గిరిజన కౌలు రైతుల సంఘం
గిరిజనుల హక్కులను కాలరాశారు
గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే వారిని దోపిడీ చేసింది. ప్రభుత్వ ముఖ్య నేతలు, టీడీపీ నేతలు గిరిజనులను దోచుకున్నారు. బుట్టాయిగూడెం మండలం కాకర్ల సురేశ్ సీఆర్‌డీ కమిషనర్ శ్రీధర్ తోడల్లుడు. ఆయనకు జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంకు చెందిన ఉండవల్లి సోమసుందర్ వంటి వారు జతకలిశారు. టీడీపీ ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యేల దన్నుతో టీడీపీ నేతలను దళారీలుగా మార్చుకుని.. ‘పశ్చిమ’ జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఐటీడీఏ పీవో షాన్‌మోహన్‌ల ద్వారా పరిహారం నిధులను కాజేశారు.
–టి.సుధాకర్, జిల్లా కార్యదర్శి, సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ
దోపిడీకి కారణం ప్రభుత్వం
నిర్వాసితులనూ.. ఇటు వారికి పునరావాసం కల్పించే మండలాల్లోనూ భూసేకరణలో ప్రభుత్వం భారీ దోపిడీకి తెరతీసింది. గిరిజనులకు దక్కాల్సిన పరిహారాన్ని టీడీపీ నేతలు, షాన్‌మోహన్ వంటి ఐఏఎస్ అధికారులు మింగేస్తున్నారు. కాకర్ల సురేశ్ గిరిజనుల నుంచి ఎకరం భూమిని రూ.7,500లకు కౌలుకు తీసుకుని.. ఇతరులకు రూ.30 వేలకు కౌలుకు ఇస్తున్నారు.
–ధర్ముల సురేశ్, జిల్లా కార్యదర్శి, అఖిల భారత రైతు కూలీ సంఘం
ఎకరం రూ.30 వేలకు కౌలుకు తీసుకున్నా
దొరమామిడిలో సేకరించిన 737 ఎకరాల భూమిని వేలేరుపాడు మండలం కాచారం, చిగురుమామిడిలకు చెందిన నిర్వాసితులైన గిరిజనులకు కేటాయించారు. వారి వద్ద కాకర్ల సురేశ్ ఎకరం రూ.7,500 చొప్పున గంపగుత్తగా కౌలుకు తీసుకుని ఎకరా రూ.30 వేల చొప్పున ఇతరులకు కౌలుకు ఇస్తున్నాడు. నేను కూడా ఆయన వద్దే ఎకరా రూ.30 వేల చొప్పున ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నా. –బొండుబాబు, రైతు, దొరమామిడి, బుట్టాయిగూడెం
- బుట్టాయిగూడెం మండలం దొరమామిడిలో సర్వే నెంబర్ 183/1లో 11.80, 465లో 8.89, 178లో 8.28, 471లో 6.03, 181లో 5.24, 464లో 8.55, 182లో 11.57, 187లో 4.89 ఎకరాల భూములపై గిరిజనులకు గిరిజనేతరులకు మధ్య ట్రైబల్ ట్రిబ్యునల్ వివాదం నడుస్తున్నా ఐటీడీవో పీవో షాన్‌మోహన్ భూసేకరణ అధికారి హోదాలో వాటిని పట్టించుకోకుండా పరిహారం ఇచ్చేచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మండలంలో దొరమామిడి రెవెన్యూ పరిధిలో సేకరించిన 737.96 ఎకరాల్లో అధిక శాతం భూములు హైకోర్టు, ట్రైబల్ ట్రిబ్యునల్ విచారణ పరిధిలో ఉన్నవే కావడం గమనార్హం. కానీ.. వాటిని అధికారులు పట్టించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment