
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి హైకోర్టు జారీచేసిన ఆదేశాలు అమలు చేయలేదన్న కేసుల్లో (రెండు వేర్వేరు) సింగిల్ జడ్జి నలుగురికి విధించిన జైలుశిక్ష అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. పునరావాసం, పునర్నిర్మాణం అమలు చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఆదేశాల్ని అమలు చేయలేదని రైతుల కోర్టు ధిక్కార వ్యాజ్యాలను సింగిల్ జడ్జి ఆమోదిస్తూ నలుగురికి జైలు శిక్ష విధించారు. ఈ తీర్పులను సవాల్ చేస్తూ రెండు వేర్వేరు వ్యాజ్యాలను బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం విచారించింది. సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేసిన ధర్మాసనం ప్రతివాదు లకు నోటీసులు జారీ చేసింది.
ఒక కేసులో తొగుట ఎస్సై ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు రెండో డివిజన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ టి.వేణులకు 2నెలలు జైలు, 2వేలు జరిమానా, మరో కేసులో కాళేశ్వరం ప్రాజెక్టు కనస్ట్రక్షన్ డివిజన్–7 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.బదరీనారాయణ, రాఘవ కనస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టు మేనేజర్ బి.శ్రీనివాస్‌రెడ్డిలకు 3 నెలలు జైలు శిక్ష, 3వేలు చొప్పున జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఆ నలుగురు సవాల్ చేశారు. ధర్మాసనం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment