సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు అనుమానమే నిజమైంది! ఓవైపు భారీస్థాయిలో భూసేకరణ చేస్తూ.. మరోవైపు చెల్లించాల్సిన పరిహారాన్ని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువగా చూపడంతో సందేహం వ్యక్తం చేసిన కోర్టు తమ రిజిస్ట్రార్ జనరల్ నుంచి అసలైన గణాంకాలు తెప్పించుకుంది. ఇందులో ప్రభుత్వాలు సమర్పించిన గణాంకాలకు, రిజిస్ట్రార్ జనరల్ సమర్పించిన గణాంకాలకు పొంతనే లేదని తేలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము చెల్లించాల్సిన పరిహారం కేవలం రూ.93.59 కోట్లు మాత్రమేనని చెప్పగా.. రిజిస్ట్రార్ జనరల్ లెక్కల ప్రకారం అది రూ.867 కోట్లుగా ఉంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం రూ.457 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పగా.. రిజిస్ట్రార్ జనరల్ వివరాల ప్రకారం ఆ మొత్తం రూ.906 కోట్లుగా తేలింది.
ప్రభుత్వాలు చెప్పిన వివరాలకు, రిజిస్ట్రార్ జనరల్ సమర్పించిన వివరాలకు ఇంత భారీ స్థాయిలో వ్యత్యాసం ఉండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అనుమానం వచ్చిందిలా..
భూ సేకరణ పరిహారం విషయంలో తాము ఇస్తున్న ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ అమలు చేయడం లేదని, దీంతో బాధితులు దాఖలు చేస్తున్న ఎగ్జిక్యూషన్ పిటిషన్లు (ఈపీ)లు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా పేరుకుపోతున్నాయంటూ అప్పటి మహబూబ్‌నగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.వెంకటకృష్ణయ్య ఉమ్మడి హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించింది. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ వ్యాజ్యం మొదట విచారణకు రాగా.. ఆయా ప్రభుత్వాలు ఎంతెంత పరిహారం చెల్లించాలో చెప్పాలంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఏపీ సర్కారు తాము రూ.93.59 కోట్లు మాత్రమే చెల్లించాలని చెప్పగా, తెలంగాణ ప్రభుత్వం రూ.457.78 కోట్లు చెల్లించాలని తెలిపింది.
ఒకవైపు ఇరు ప్రభుత్వాలు భారీ ఎత్తున భూ సేకరణ జరుపుతుండటం, మరోవైపు చెల్లించాల్సిన పరిహారం తక్కువగా ఉండటంతో ధర్మాసనానికి అనుమానం కలిగింది. ఉభయ రాష్ట్రాల్లోని కింది కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న ఎగ్జిక్యూషన్ పిటిషన్లు, చెల్లించాల్సిన మొత్తాల వివరాలను తమ ముందుంచాలని రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్‌ను ఇటీవల ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు ఆయన ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికలోని వివరాలను, ప్రభుత్వాలు సమర్పించిన వివరాలను పోల్చి చూసిన ధర్మాసనానికి భారీ వ్యత్యాసాలు కనిపించాయి. ఏపీ ప్రభుత్వం చెప్పిన దానికి, రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన వివరాలకు మధ్య ఏకంగా ఎనిమిది రెట్ల వ్యత్యాసం ఉండటాన్ని కోర్టు గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment