పోలవరం నిర్మాణ పనులు పున:ప్రారంభం | Polavaram Project construction works was Re-started | Sakshi
Sakshi News home page

మిషన్‌–2021

Published Sat, Nov 2 2019 3:47 AM | Last Updated on Sat, Nov 2 2019 9:11 AM

Polavaram Project construction works was Re-started - Sakshi

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే నిర్మాణ ప్రాంతంలో భూమి పూజ నిర్వహిస్తున్న మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ అధికారులు

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌: గోదావరి నదిలో వరద తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పున:ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వచ్చే ఏడాది జూన్‌లోగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. వచ్చే జూన్‌లో వరదలు ప్రారంభమైనా స్పిల్‌ వే మీదుగా నదిలోకి మళ్లించి.. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ను(ఈసీఆర్‌ఎఫ్‌) పనులను నిరంతరాయంగా కొనసాగించడం ద్వారా 2021 నాటికి ప్రాజెక్టును సాకారం చేయాలని సంకల్పించింది. 

పక్కా ప్రణాళికతో ముందుకు.. 
పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళిక రచించారు. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌కు సమాంతరంగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులను మే నెలలోగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలోగా 41.15 కాంటూర్‌ పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించే పనులను ఒక కొలిక్కి తీసుకురావాలని ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గోదావరిలో ప్రస్తుతం 1.21 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. మరో వారం రోజుల్లో తగ్గిపోనుంది. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ వద్ద వరద నీటిని తోడేసి.. బురద, బంక మట్టిని తొలగించి.. అప్రోచ్‌ రోడ్లను వేసి, కాంక్రీట్‌ పనులు చేపట్టనున్నారు.  

భూమి పూజ చేసిన ‘మేఘా’ ప్రతినిధులు 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో పనులు పున:ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జూన్‌ నుంచి పనులు నిలిచిపోయిన విషయం విదితమే. రివర్స్‌ టెండరింగ్‌లో తక్కువ ధరలకు పనులు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ ప్రతినిధులు శుక్రవారం ప్రాజెక్టు ప్రాంతంలో లాంఛనంగా పూజలు నిర్వహించారు. ఆ సంస్థ డీజీఎం వి.సతీష్, డీఎం పి.మురళి ప్రాజెక్టు స్పిల్‌వే ప్రాంతంలో ఉదయం 11.59 గంటలకు కొబ్బరికాయ కొట్టి భూమిపూజ నిర్వహించారు. గోదావరి నీటిలో పసుపు, కుంకుమ చల్లి పూజలు జరిపారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ఈఈ ఏసుబాబు మాట్లాడుతూ... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు ప్రారంభించినట్లు చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement