శ్రీశైలం నుంచి నాలుగు గేట్ల ద్వారా సాగర్‌కు విడుదలవుతున్న నీరు
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్ట్/ విజయపురిసౌత్: పరివాహక ప్రాంతాల్లో (బేసిన్‌లో) వర్షాలు తెరపి ఇవ్వడంతో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి నదుల్లో వరద తగ్గుముఖం పడుతోంది. వర్షపాత విరామం వల్ల ఉపనదుల్లో వరద తగ్గడంతో ఆదివారం గోదావరి ప్రవాహం సాధారణ స్థాయికి చేరుకుంది. భద్రాచలం వద్ద వరద మట్టం 30.9 అడుగులకు తగ్గింది. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్న జలాల్లో ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 8,50,469 క్యూసెక్కులు చేరుతున్నాయి.
ఇందులో గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 8,39,469 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు వరద మట్టం 11.7 అడుగులకు తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గిన నేపథ్యంలో సోమవారం ధవళేశ్వరం వద్ద ప్రవాహం మరింత తగ్గనుంది.
స్థిరంగా వంశధార, నాగావళి
వంశధార, నాగావళి నదుల్లో వరద స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 40,602 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 1,186, ఎడమ కాలువకు 142 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 30,186 క్యూసెక్కులను బ్యారేజ్ 16 గేట్లను 0.6 మీటర్ల మేర ఎత్తి బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి తోటపల్లి బ్యారేజ్‌లోకి 11,462 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 1,520 క్యూసెక్కులను విడుదల చేస్తూ, 6,979 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు నారాయణపురం ఆనకట్ట మీదుగా బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
శ్రీశైలం జలాశయంలోకి 2.16 లక్షల క్యూసెక్కులు
కృష్ణా, ఉపనదుల్లో వరద ప్రవాహం మరింతగా తగ్గింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,16,946 క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 18 వేలు, కల్వకుర్తి ద్వారా 1,600, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులు తరలిస్తున్నారు. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,954, స్పిల్ వే నాలుగు గేట్లను పదడుగులు ఎత్తి 1,11,564.. మొత్తం 1,74,518 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.6 అడుగుల్లో 213.4 టీఎంసీల నీటిని నిల్వచేస్తున్నారు.
నాగార్జునసాగర్‌లోకి 1,62,647 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 9,500, ఎడమ కాలువకు 8,108, ఏఎమ్మార్పీకి 1,800, వరద కాలువకు 400 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,967, స్పిల్ వే 14 గేట్లను ఐదడుగులు ఎత్తి 1,09,872.. మొత్తం 1,42,839 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 585.6 అడుగుల్లో 305.86 టీఎంసీల నీరు ఉంది. పులిచింతలలోకి 1,36,192 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ 8వేలు, స్పిల్ వే 5 గేట్లను మూడడుగులు ఎత్తి 1,15,665.. మొత్తం 1,23,665 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
ప్రస్తుతం పులిచింతలలో 169.81 అడుగుల్లో 38.08 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,59,148 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణాడెల్టాకు 13,898 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మిగిలిన 1,45,250 క్యూసెక్కులను 60 గేట్లను మూడడుగులు, 10 గేట్లను రెండడుగులు ఎత్తి çకడలిలోకి వదిలేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయిని డ్యామ్‌లలోకి వరద తగ్గడంతోసోమవారం శ్రీశైలంలోకి వచ్చే వరద మరింత తగ్గనుంది.
Comments
Please login to add a commentAdd a comment