♦ టీ ప్రాజెక్టులపై ఏపీ కాంగ్రెస్ నేతల తీరుపై హరీశ్ మండిపాటు
♦ పాలమూరు, డిండి ప్రాజెక్టులకు గత ప్రభుత్వమే జీవోలు ఇచ్చింది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్ర ప్రాంత పార్టీల కుట్రలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఏపీ నేతలు నోటికాడి ముద్దను తన్నుకుపోయే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వారి ప్రకటనలను తిప్పికొడుతూ మంత్రి హరీశ్ ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇన్నాళ్లూ లేనిపోని ఆరోపణలు చేస్తూ తెలంగాణ ప్రజల నోట్లో మట్టిగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. కానీ ప్రాజెక్టుల మీద అపార అనుభవం కలిగిన సీఎం కేసీఆర్ ఆ కుట్రలను లెక్క చేయకుండా, తనదైన శైలిలో సాగునీటి రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా టీడీపీతో జతకట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
అవి గత ప్రభుత్వ ప్రాజెక్టులే..
వాస్తవానికి పాలమూరు, డిండి ప్రాజెక్టులను అనుమతిస్తూ గత ప్రభుత్వ హయాంలోనే ఉత్తర్వులు విడుదలైనట్లు మంత్రి హరీశ్ గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో గత పాలకులు చేపట్టిన ప్రాజెక్టులను తెలంగాణకు అనుకూలంగా మార్చుకొని.. కట్టుకుంటామంటే అక్రమ ప్రాజెక్టులని ఎలా అంటారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో జీవో నం.72 విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
డిండి ఎత్తిపోతల పథకానికి ఏపీ ప్రభుత్వం 2007 జూలై7న జీవో నం. 159 జారీ చేసిన విషయం మరిచారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు లేనిపోని విమర్శలు చేస్తూ ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నీళ్ల విషయంలో గతంలో జరిగిన అన్యాయాలను సరిచేసుకుంటూ తమ వాటాను తాము ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే అడ్డుపడుతూ కేంద్రానికి లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. ఏపీ కాంగ్రెస్ నేతల ధర్నాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతల వైఖరేంటో స్పష్టం చేయాలని మంత్రి హరీశ్ డిమాండ్ చేశారు.
నోటికాడి ముద్దను తన్నుకు పోయే కుట్ర
Published Mon, Apr 25 2016 2:53 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
Advertisement
Advertisement