విజయవాడ: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద సోమవారం ఉదయం నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ రఘువీరా, కనుమూరి బాపిరాజు, దేవినేని రాజశేఖర్(నెహ్రూ) పెద్దసంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం పోరాడాలని నేతలు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల ధర్నాలకు టీడీపీ సర్కారు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోంది. మహా ధర్నాకు వెళుతున్న కాంగ్రెస్ నాయకులను తెనాలిలో పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.