రఘువీరా రెడ్డి
విజయవాడ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం పెథాయ్ తుపాను కారణంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి కోరారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రఘువీరా మాట్లాడుతూ..హుద్‌హుద్ నష్టం రూ.8 వేల కోట్లు అయితే, కేంద్రం ప్రకటించింది వెయ్యి కోట్లు మాత్రమేనని, ఇచ్చింది రూ.400కోట్లేనని వెల్లడించారు. తిత్లీ నష్టం రూ.3 వేల 4 వందల కోట్లని, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెథాయ్ తుపాను కారణంగా 7 జిల్లాల్లో రైతులు, చేతికి వచ్చే పంట నష్టపోయారని అన్నారు. తుపాను చలి తీవ్రతకు 25 మంది చనిపోగా..భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు.
పెథాయ్ తుపాను వల్ల 90 శాతం కౌలు రైతులే నష్టపోయారని చెప్పారు. రైతులకు బీమా కంపెనీలు నష‍్టపోయిన పంటకు బీమా చెల్లించాలని డిమాండ్ చేశారు. తుపాను కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. తడిచి రంగు మారిన ధాన్యం ఎఫ్‌సీఐ రంగంలోకి దిగి కొనుగోలు చేయాలని, అలాగే నష్టపరిహారాన్ని కౌలు చేసే రైతులకే చెల్లించాలని చెప్పారు. కార్పొరేట్ల రుణాలు మాఫీ చేస్తున్న కేంద్రం రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయరని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే రూ.2 లక్షల వరకు రైతు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో రైతుల పరిస్థితి బాగోలేదని, తక్షణమే రైతులను ఆదుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment