
సాక్షి, విజయవాడ : దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించే ఉద్ధేశ్యంతోనే టీడీపీతో చేతులు కలిపామని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశం మేరకు విజయవాడకు వచ్చానని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసేందుకు విజయవాడ వచ్చానన్నారు. బీజేపీని 2019 ఎన్నికల్లో ఓడించేందుకే ఈ రోజు దేశంలోని రాజకీయ పార్టీలన్నీ మహా కూటమిగా ఏర్పడుతున్నాయని చెప్పారు. దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెంది ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే మతతత్వపార్టీలను తరిమివేయాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, టీడీపీ కలవడం మంచి పరిణామమని పేర్కొన్నారు.
దేశ, రాష్ట్ర రాజకీయాలపై చంద్రబాబుతో చర్చించిన తర్వాతే రాహుల్ ఏపీకి వచ్చే తేదీలు ఖరారు చేస్తామన్నారు. అశోక్ గెహ్లాట్ తమకు దశ, దిశ నిర్దేశించారని, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కొన్ని సూచనలు చేశారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. అశోక్ గెహ్లాట్‌ని రఘువీరా రెడ్డి సన్మానించారు. అంతకు ముందు గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన అశోక్ గెహ్లాట్‌కు రాష్ట్ర మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ ఎంపి జెడి శీలం, సుంకర పద్మశ్రీ, నరహరశెట్టి నర్సింహారావు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. రఘువీరా, జేడీ శీలంతో కలిసి ప్రభుత్వ ప్రొటోకాల్ వాహనంలో అశోక్ గెహ్లాట్ విజయవాడ చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment