విజయవాడ: తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలాగా అబద్ధాలు చెప్పనని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాక్యానించారు. మోదీ అధికారం కోసం ప్రతి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానని అబద్ధాలు చెప్పారని గుర్తు చేశారు. ఆదివారం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశంపైనే ప్రసంగం ప్రారంభిస్తానని అన్నారు. ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ పార్లమెంటులో ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం ఐదేళ్లలో ఇచ్చిన హామీలు అమలు పరచలేదన్నారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీలు ప్రధాని మోదీపై ఎందుకు ఒత్తిడి తేలేకపోయాయని ప్రశ్నించారు. దేశంలో ఏపీని అగ్రగామిగా చేయాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందన్నారు. దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఉపాధి పథకం కింద లక్షల రూపాయల పనులతో పేదవారిలో వెలుగులు నింపామన్నారు. ఉపాధి హామీ డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని నీరుగార్చిందని విమర్శించారు.
నోట్ల రద్దు.. ఆర్ధిక వ్యవస్థ సర్వ నాశనం
నోట్ల రద్దుతో ఆర్ధిక వ్యవస్థను సర్వ నాశనం చేశారని ఆరోపించారు. గబ్బర్‌సింగ్ టాక్స్‌తో చిరు వ్యాపారస్తులు, తమ వ్యాపారాలు మూసుకునే విధంగా మోదీ వ్యవహరించారని విమర్శించారు. విజయ్ మాల్యా రూ. 10 వేల కోట్లతో విదేశాలకు పారిపోవడం వెనక ప్రభుత్వ పాత్ర ఉందన్నారు. రాఫెల్ కాంట్రాక్ట్‌లో కాపలాదారుడిగా ఉన్నానన్న మోదీ రూ.30 వేల కోట్లను మాత్రం అంబానీకి దోచిపెట్టారని ఆరోపించారు.
పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేద్దాం
పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేద్దామని రాహుల్ పిలుపునిచ్చారు. 20 శాతం ప్రజలు, రూ.12 వేల కన్నా తక్కువ జీతంతో కాలం వెళ్లదీస్తున్నారని, ఆధార్‌తో పేద ప్రజల వివరాలు సేకరిస్తామని, అధికారంలోకి రాగానే ఆ 20 శాతం ప్రజలకు సంవత్సరానికి రూ.72 వేలు అకౌంట్‌లో వేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పథకంతో పాటు ఇతర పథకాలను ఏవిధంగా అమలు చేశామో అదేవిధంగా ఈ పథకం కూడా అమలు చేసి తీరుతామన్నారు. ప్రతి యువకుడికి, నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అంబానీ ఎన్ని ఉద్యోగాలిచ్చాడో చెప్పాలి
అనిల్ అంబానీ తన కంపెనీలకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎన్ని ఉద్యోగాలిచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికలయ్యాక నిరుద్యోగ యువతకు బ్యాంకుల నుంచి డబ్బులిచ్చే పక్రియను మొదలుపెడతామన్నారు. ఏపీలో రైతులు ఎంత కష్టపడుతున్నారో తనకు తెలుసునన్నారు. శ్రీమంతులకు రుణమాఫీ చేసిన మోదీ రైతులకు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా అని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెండి.. రెండు రోజుల్లో రైతు రుణమాఫీ చేసి చూపిస్తామన్నారు.
మైనార్టీలు, దళితులపై దాడులు
దేశంలో మైనార్టీలు, దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని , దేశంలో ఎక్కడ చూసినా భయాందోళనే నెలకొన్నదని వ్యాఖ్యానించారు. దేశాన్ని కులాలు, మతాలుగా విడదీసి లబ్ది పొందాలని మోదీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఏపీలో ఎలా నీరు గార్చారో మీకు తెలుసునన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టాల హామీలను నెరవేర్చి తీరుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment