నువ్వా దీక్ష చేసేది | ys jagan mohan reddy dares chandrababu naidu to fight elections | Sakshi
Sakshi News home page

నువ్వా దీక్ష చేసేది

Published Fri, Jun 3 2016 1:39 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

నువ్వా దీక్ష చేసేది - Sakshi

నువ్వా దీక్ష చేసేది

నిండా అవినీతిలో మునిగిన
* వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపాటు  
* ‘అనంత’లో రెండోరోజు రైతుభరోసా యాత్ర

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘నవ నిర్మాణ దీక్ష పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దీక్ష చేయాలని చెబుతున్నారు. దీక్షపై పత్రికల్లో వచ్చిన ప్రకటనలను చదివితే, చంద్రబాబు ప్రజలను ఎంత ఘోరంగా అవహేళన చేస్తున్నారో అర్థమవుతోంది. అవినీతిరహిత రాష్ట్రం కోసం అంతా పాటుపడాలని ఆయన చెబుతున్నారు.

నిండా అవినీతిలో మునిగి, ఆ సొమ్ముతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో సహా అడ్డంగా దొరికిపోయారు. ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చింది. అయినా ఆ మనిషి ఇంకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడమంటే ప్రజలను అవహేళన చేయడమే. చంద్రబాబు కంటే దారుణమైన ముఖ్యమంత్రి ఇంకెవరూ ఉండరు’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.

అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న ఐదో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా రెండోరోజు గురువారం ఆయన తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో పర్యటించారు. యాడికి మండలం నగరూరులో ఆత్మహత్య చేసుకున్న రైతులు దాసరి కోదండరాముడు, రామసుబ్బారెడ్డి, పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడులో చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాలను జగన్ పరామర్శిం చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
 
రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు
‘‘నవ నిర్మాణ  దీక్షపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు ఉందా? సూట్‌కేసులను నల్లడబ్బుతో నింపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఇంతకంటే దారుణమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా? ఈ రెండేళ్లలో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు. ప్రజలు గమనిస్తున్నారనే జ్ఞానం లేకుండా ఏపీలో కూడా ఒక్కో ఎమ్మెల్యేకు రూ.40 కోట్ల దాకా ఇచ్చి ఇప్పటివరకూ 17 మందిని కొనుగోలు చే శారు. ఇంకా కొనుగోలు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇటీవల ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు కూడా ఇస్తారని  వింటున్నాం.

ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోంది? నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను కొనేస్తున్న మనిషి అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఇసుక నుంచి బొగ్గు కొనుగోళ్ల దాకా... కాంట్రాక్టుల నుంచి రాజధాని భూముల వరకూ ప్రతిదీ అవినీతే. చివరకు దేవుడి భూములను సైతం తక్కువ రేట్లకు బినామీలకు ఇచ్చి రూ.వందల కోట్లు జేబులోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిలోని సదావర్తి సత్రానికి తమిళనాడులో ఉన్న రూ.వెయ్యి కోట్ల విలువైన భూములను రూ.22 కోట్లకే దారాదత్తం చేశారు. గుడిని, గుడిలోని లింగాన్ని మింగేస్తున్నారు. ఇలాంటి మనిషి నవ నిర్మాణ దీక్ష పేరుతో అందరూ ప్రమాణం చేయాలని చెబుతున్నారు. నిజంగా నవ నిర్మాణ దీక్ష జరగాలంటే... చంద్రబాబు ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో కొట్టాలి. అప్పుడే ఆయనకు తెలిసొస్తుంది’’ అని వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు.
 
రెండేళ్లలో చేయని మోసం లేదు
‘‘ఈ రెండేళ్ల పాలనలో చంద్రబాబు చేయని మోసం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పారు. ఎన్నికలు అయిపోయాయి. మాఫీ మాట మరిచారు. రుణాలు మాఫీ కాక రైతులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. రూ.87 వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చెప్పారు. మాఫీ చేయకపోవడంతో రూ.87 వేల కోట్లకు వడ్డీనే రూ.25 వేల కోట్లు అయ్యింది.

ఈ వడ్డీలో మూడోవంతుకు కూడా సరిపోని విధంగా మాఫీ వర్తింపజేశారు. మాట తప్పిన మనిషికి నవ నిర్మాణ దీక్ష చేసే హక్కు ఉందా? పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడులో నాగరాజు అనే చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లి పరామర్శించా. వారికి రూ.40 వేలుఅప్పుంది. మాఫీ కాక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. కష్టపడి పనిచేస్తే తప్ప కడుపు నిండని పరిస్థితి డ్వాక్రా మహిళలది. వీరి రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికల్లో చంద్రబాబు చెప్పారు. కానీ చేయలేదు. దీంతో డ్వాక్రా మహిళలు బ్యాంకులకు రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్తున్నారు. ఇప్పుడు ముష్టి వేసినట్లు రూ.3 వేల రుణం ఇస్తానంటున్నారు. ఇలాంటి వ్యక్తికి నవ నిర్మాణ దీక్ష పేరిట ప్రతిజ్ఞ చేయించే నైతిక హక్కు ఉందా?’’ అని విపక్ష నేత నిలదీశారు.  
 
నిలదీస్తే అరెస్టు తప్పదని బాబు భయం
‘‘ఇంటికో ఉద్యోగం.. లేదంటే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పుడు ఉద్యోగమూ ఇవ్వలేదు, భృతీ చెల్లించలేదు. చంద్రబాబు పాలన అంతా మోసం, అబద్ధాలు తప్ప ఏమీ లేదు. చంద్రబాబు దగ్గరుండి ఓటు వేయించి రాష్ట్రాన్ని విడగొట్టారు. అప్పట్లో ఐదేళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్‌ను నీరుగారుస్తున్నారు. కేంద్రంలోని తన మంత్రులతో ప్రత్యేక హోదాపై అడిగించడం లేదు.

ప్రధాని మోదీకి అల్టిమేటం జారీ చేస్తే.. రెండేళ్లలో జరిగిన తన అక్రమాలతోపాటు కేసులను బయటికి తీసి అరెస్టు చేయిస్తారని చంద్రబాబు భయపడుతున్నారు. అలాగే కృ ష్ణా, గోదావరి నదులపై తెలంగాణ సీఎం కేసీఆర్ అ డ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నారు. అవి పూర్తయితే మనకు నీళ్లు రావని తెలిసినా కేసీఆర్‌ను ప్రశ్నించే పరిస్థితి లేదు. గట్టిగా నిలదీస్తే ఓటుకు కోట్లు కేసును బయటికి తీసి జైల్లో పెట్టిస్తారనే భయంతోనే కేసీఆర్‌ను చంద్రబాబు పల్లెత్తు మాట అనడం లేదు. ఇలాంటి వ్యక్తికి ప్రజలతో ప్రమాణం చేయించే హక్కు లేదు’’ అని ప్రతిపక్ష నేత జగన్ దుయ్యబట్టారు.
 
చంద్రబాబు పాలనపై ఆయనకే నమ్మకం లేదు
‘‘చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం లేదు. ఉంటే.. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన 17 మంది ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయడం లేదు? ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎందుకు ప్రజాతీర్పు కోరడం లేదు? మరోపార్టీ బీ-ఫాంపై గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన చంద్రబాబు తిరిగి ఎన్నికలకు వెళ్లలేకపోతున్నారంటే ఆయన పాలనపై ఆయనకే నమ్మకం లేదనే విషయం తెలుస్తోంది’’ అని జగన్ పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు నేతలు తెలంగాణలో ప్రాజెక్టుల కాంట్రాక్టులు తీసుకున్నారు కదా? అని ఓ విలేకరి ప్రశ్నించగా... ‘‘సీపీఐతోపాటు అన్ని పార్టీల్లో కాంట్రాక్టర్లు ఉన్నారు. వారే వేర్వేరు ప్రాంతాల్లో పనులు చేస్తుంటారు. నేను ప్రాజెక్టులు కట్టొద్దన్నానంటే, వారికి వ్యతిరేకంగా మాట్లాడినట్లే కదా! ప్రాజెక్టులు నిర్మించకపోతే కాంట్రాక్టర్లకు నావల్ల మేలు కాకుండా నష్టమే జరుగుతుంది. పది మందికి మేలు జరగడం ముఖ్యం, ఒకరికి నష్టం వస్తుందని వెనకడుగు వేయకూడదు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement