సాక్షి, హైదరాబాద్ : ‘ఒకరిద్దరి కోసం ప్రాజెక్టుల నిర్మాణాల్ని ఆపలేం. ప్రాజెక్టుల నిర్మాణం ప్రజల కోసమే. కోట్ల మంది దాహార్తిని శాశ్వతంగా తీరుస్తాయి. పైగా పర్యావరణ సమస్య పరిష్కారానికి ప్రాజెక్టులు దోహదపడతాయి. కొద్ది మంది కోసం ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోజాలం. అదే సమయం లో ప్రాజెక్టుల కోసం భూములిచ్చే రైతులకు సకాలంలో చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అని నీటి పారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దాఖలైన పలు కేసుల విచారణ సమయంలో హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రాజెక్టుల నిర్మాణాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.
ధిక్కార కేసులకు మినహాయింపు...
‘పునరావాసం, పునర్నిర్మాణం, పరిహారం చెల్లింపులను విచారిస్తాం. నీటి పారుదల ప్రాజెక్టులపై దాఖలైన 177 వ్యాజ్యాలన్నీ కలిపి విచారిస్తాం. అంతే కాకుండా ఇకపై వ్యాజ్యాలు దాఖలైతే వాటిని కూడా ఇక్కడికే నివేదించేలా హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం. అయితే సింగిల్ జడ్జి వద్ద తీర్పు వెలువరించాల్సిన మూడు కోర్టు ధిక్కార కేసులను మాత్రం మినహాయింపు ఇస్తున్నాం’అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం గురువారం ప్రకటించింది. భూమిని సేకరించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఎవరి అంగీకారంతోనో రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేదని, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని చట్టం కూడా చెబుతోందని ధర్మాసనం తేల్చి చెప్పింది.
సింగిల్ జడ్జి తీర్పును ఉల్లంఘిస్తూ ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో ప్రభుత్వం పనులు చేస్తోందంటూ దాఖలైన కోర్టు ధిక్కార వ్యాజ్యాలను, దీనిపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలను, నీటిపారుదల ప్రాజెక్టులపై దాఖలైన ఇతర కేసుల్ని, మొత్తం 177 కేసులన్నింటినీ కలిపి ఒకేసారి విచారించాలని ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లను గురువారం ధర్మాసనం విచారించింది.
ప్రాజెక్టుల నిర్మాణం జరగాల్సిందే...
‘వాతావరణంలో ప్రతికూల మార్పులు కనబడుతున్నాయి. వర్షాలు పడటం లేదు. నూరు శాతం వర్షాలు పడతాయని శాస్త్రవేత్తలు చెప్పడం లేదు. ఈసారి 93 శాతం రుతుపవనాలు వస్తాయని చెప్పడం అదృష్టమే. రాజస్తాన్ ఎడారిగా మారకుండా ఉండాలంటే నీటిని ఒడిసిపట్టే చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల నిర్మాణాలు జరగాల్సిందే. రాజస్తాన్‌లోని బనాస్ ప్రాజెక్టుపై దాఖలైన న్యాయ వివాదాల్ని పరిష్కరించిన ధర్మాసనంలో నేనున్నాను. ఆ ప్రాజెక్టుతో తొమ్మిది జిల్లాలకు నీరు అందింది’అని అదనపు ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. పరిహార ఒప్పంద పత్రాలు తెలుగులో ఉండేలా చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులకు వాటిని అందజేసే ముందు వాటిలోని విషయాల్ని తెలుగులోనే వివరించాలని పేర్కొంది. దీంతో బాధిత రైతులకు అన్నీ తెలుసుకునేందుకు వీలవుతుందని చెప్పింది.
పరిహారం తీసుకుని పోరాడండి...
‘భూ సేకరణ ప్రజల సమస్య. చట్టపరమైనది కాదు. పదేళ్ల కిత్రం అందుకోవాల్సిన రూ.5 లక్షల పరిహారాన్ని తీసుకుని న్యాయపోరాటం చేస్తే బాధితుడు నష్టపోడు. ఆ పరిహారం తీసుకోకుండా ఇప్పుడు రూ.8 లేదా 9 లక్షలు పరిహారం తీసుకుంటే అది రూ.5 లక్షలతో సమానం అవ్వదు. పరిహారం పెంపు కోసం పాతికేళ్ల వరకూ న్యాయపోరాటం చేయవచ్చు. ప్రాజెక్టు నిర్మాణం జరిగిపోతుంటే భూమి ఇవ్వకుండా ఎంతకాలం ఉంటారు. భూమిని సర్కార్ తీసుకోవాలని అనుకుంటే ఎవ్వరూ అడ్డకోలేరు’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఓ కథను ధర్మాసనం ఉదహరించింది. ‘గంగా నదిలో ఓ రైతు గొడ్డలి పడిపోయింది. గంగా మాత ప్రత్యక్షమై బంగారం, వెండి, రాగి గొడ్డళ్లు తెచ్చి ఇచ్చింది. అవి నావి కావని రైతు చెప్పాడు. దీంతో గంగా మాత పోయిన ఇనపు గొడ్డలితోపాటు బంగారు, వెండి, రాగి వాటిని కూడా రైతుకు ఇచ్చేస్తుంది. ఇక్కడ కూడా రైతులు తమకు ఏది కావాలో కోరాలి. కానిది అడగొద్దు. ఇచ్చింది తీసుకోవాలి. పట్టుదలకు పోవద్దు. హైకోర్టు మీకు న్యాయపరంగా అండగా నిలుస్తుంది’అని ధర్మాసనం హితవు చెప్పింది. ‘భూ సేకరణ కోసం రైతులు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. కుటుంబం కోసం వ్యక్తి. గ్రామం కోసం కుటుంబం. పట్టణం కోసం గ్రామం. రాష్ట్రం కోసం పట్టణం. చివరికి దేశం కోసం ఒక రాష్ట్రం త్యాగం చేయాలి. ఇది ఇప్పటి హితోపదేశం కాదు. మహాభారతంలోనే ఉంది. అయిదారు ఎకరాల కోసం ప్రాజెక్టుల్ని అడ్డుకోవడం ధర్మం కాదు. ప్రాజెక్టులు కూడా లక్షలాది మంది ప్రజల కోసమేనని గుర్తించాలి’అని వ్యాఖ్యానించింది.
పరిహారం అందజేత...
హైకోర్టులో 93 మంది పిటిషన్లు దాఖలు చేస్తే పరిహారం తీసుకోని 33 మందికి, కోర్టు ధిక్కార వ్యాజ్యాలు వేసిన ఆరుగురి చెందిన పరిహారాన్ని రూ.7.5 లక్షల చొప్పున వారి తరఫున వాదించే న్యాయవాది, న్యాయమూర్తుల సమక్షంలో అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు అందజేశారు. దీంతో మొత్తం 93 మందికి పరిహారం అందజేసినట్లు అయింది. ఇళ్ల నిర్మాణాలకు రూ.5 లక్షలు వద్దని చెప్పి తిరిగి తీసుకోడానికి సమ్మతిని తెలిపిన ఇద్దరికీ కూడా కోర్టులోనే చెక్కుల్ని అందజేశారు. అనసూయ అనే పిటిషనర్ భర్తతో విభేదించి పదేళ్లుగా విడిగా ఉంటున్నారని, భర్తకు పరిహారం ఇచ్చారని, ఆమెకు ఏదీ అందలేదని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించగా, ఈ అంశాన్ని పరిశీలిస్తామని అదనపు ఏజీ బదులిచ్చారు. ఏటిగడ్డ కిష్టాపూర్‌లో 2,500 ఎకరాల రైతులకు పరిహారం చెల్లించామని, ఆర్‌ఆర్ ప్యాకేజీ నోటీసులు ఇచ్చామని తెలిపారు. గృహాల సేకరణ అంశంపై ప్రాథమిక నోటీసు ఇచ్చామని వివరించారు. డిక్లకేషన్ ఇచ్చేందుకు రైతులు సహరించలేదని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు అదనపు ఏజీ బదులిచ్చారు. విచారణ జూన్ 18కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment