సాక్షి, సిద్దిపేట: కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణలో ఇక ముందు కరువన్నమాట ఉండబోదని, గోదావరి జలాలతో బీడు భూములన్నీ సస్యశ్యామలం అవుతాయని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్ ప్రధాన కాల్వల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గోదావరి నుంచి మల్లన్న సాగర్ వరకు జలాలు వచ్చాయని, త్వరలో కాల్వల ద్వారా చెరువులు, కుంటల్లోకి నింపుతామని పేర్కొన్నారు. ఇందుకోసం కాల్వల నిర్మాణాలు త్వరగా చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కాలంతో పని లేకుండా కాల్వల ద్వారా వ్యవసాయం చేసుకునే రోజులు వచ్చాయని పేర్కొన్నారు.
రైతులు నీటి వనరులను సద్వినియోగం చేసుకొని లాభసాటి పంటలు పండించాలని సూచించారు. గతంలో మాదిరిగా అందరూ ఒకే రకం పంటలు సాగు చేసి ఆగం కావద్దని కోరారు. సన్న రకం ధాన్యానికి మంచి డిమాండ్ ఉందని చెప్పారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న ప్రాంతాల్లో కూరగాయలు, పండ్ల తోటలు పెంచాలన్నారు. వ్యవసాయంతో పాటు, అనుబంధ పశుపోషణ, మత్స్య పరిశ్రమ కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. రైతులు వినూత్నంగా ఆలోచించినప్పుడే ఆర్థిక ప్రగతికి బాటలు పడతాయని పేర్కొన్నారు. ఇక ముందు ధనవంతులైన రైతులు తెలంగాణలో ఉన్నారనే సమాధానం రావాలని.. అప్పుడే నిజమైన మార్పు వచ్చినట్లని హరీశ్‌రావు అన్నారు. మంత్రి వెంట ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శుక్రవారం మల్లన్నసాగర్ ప్రధాన కాల్వల పనులను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు, తదితరులు
Comments
Please login to add a commentAdd a comment