గజ్వేల్: మల్లన్నసాగర్ ముంపు బాధితుల కోసం సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లి–సంగాపూర్ గ్రామాల పరిధిలో చేపట్టిన ఆర్‌అండ్‌ఆర్ (రిహాబిలిటేషన్ అండ్ రీ–సెటిల్‌మెంట్) కాలనీ పనులు వేగంగా సాగుతున్నాయి. ఒక్కో ఇంటిని రూ.5.04 లక్షల వ్యయంతో 5 వేల ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇందుకు సుమారు 450 ఎకరాల భూ సేకరణను యుద్ధ ప్రాతిపదికన జిల్లా యంత్రాంగం చేపట్టింది. అవసరమైతే మరో 50 ఎకరాలను సేకరించడానికి సన్నద్ధమవుతుంది. గతంలో సేకరించిన 300 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉండగా.. ఇటీవల మరో 150 ఎకరాల భూ సేకరణ పూర్తిచేశారు. వాటిల్లోనూ ప్లాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 5 వేల ఇళ్లకు లే–అవుట్ సిద్ధం చేశారు. ఎకరా విస్తీర్ణంలో 11 ఇళ్ల చొప్పున ఒక్కొక్కరికి 250 గజాల స్థలంలో ఇళ్ల నిర్మాణం, విశాలమైన రోడ్లు, ఇతర వసతులతో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం 800 ఇళ్లు పూర్తి కావస్తుండగా... మరో 1,200 ఇళ్ల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. ఎవరైనా నిర్వాసితులు ఇళ్లు వద్దనుకుంటే... ఇంటి స్థలంతో పాటు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందజేయనున్నారు. ఈ పనులు సుమారు రూ.400 కోట్లకు పైగా వ్యయంతో సాగుతున్నాయి. అవసరమైతే మరికొంత భూమిని కూడా సేకరించి కాలనీని అన్ని సౌకర్యాలతో ఆదర్శవంతంగా నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించడంతో అధికారులు ఆ దిశగా పనుల్లో వేగం పెంచారు. గజ్వేల్–సంగాపూర్–వర్గల్ రోడ్డు నుంచి గజ్వేల్–ముట్రాజ్‌పల్లి–రాజీవ్ రహదారుల మధ్య ఉన్న ఈ స్థలం అత్యంత విలువైందిగా మారడంతో మల్లన్నసాగర్ భూనిర్వాసితులు సైతం ఇదే స్థలాన్ని ఎంచుకున్నారు.
అధునాతన సౌకర్యాలు...
ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి ఇప్పటికే గజ్వేల్–వర్గల్, గజ్వేల్ రాజీవ్ రహదారి ప్రధాన రోడ్లు ఇరువైపులా ఉండగా.. అంతర్గత రోడ్లను సైతం విశాలంగా నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటి వరుసకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. డ్రైనేజీ, మంచినీరు, విద్యుదీకరణ తదితర పనులు కూడా వెంటవెంటనే పూర్తి చేయనున్నారు.
గజ్వేల్‌లో ‘రియల్ భూమ్’...
గజ్వేల్ పట్టణంలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీతో పాటు రాబోయే రోజుల్లో రీజినల్ రింగురోడ్డు రాబోతున్న నేపథ్యంలో ప్లాట్ల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రత్యేకించి ఐవోసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) మార్గం, ముట్రాజ్‌పల్లి మార్గాల్లోనే కాకుండా పట్టణంలోని ప్రధాన కాలనీల్లో భారీగా ప్లాట్ల ధరలు పెరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానికంగా ప్రాతినిధ్యం వహించడంతో నలువైపులా విస్తరిస్తున్న గజ్వేల్ పట్టణం సంగాపూర్, ముట్రాజ్‌పల్లి వైపు మరో నూతన పట్టణంగా ఏర్పాటు కాబోతుంది. ఇప్పటికే ఈ వైపు బాలుర, బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లు నిర్మాణం కాగా.. 1,250 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు దాదాపు పూర్తి కావస్తున్నాయి. మరోమైపు జర్నలిస్టుల ఇళ్ల కాలనీ కూడా పూర్తి కావస్తోంది.
అన్ని వసతులతో ఆర్‌అండ్‌ఆర్ కాలనీ..
మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు దేశంలోనే ఆదర్శంగా గజ్వేల్‌లో ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మాణం జరుగుతోంది. తమ విలువైన భూములను ఇచ్చి గ్రామాలను వదులుకున్న నిర్వాసితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందువల్లే మంచి ప్రమాణాలతో కాలనీ నిర్మిస్తున్నాం. వసతుల కల్పనకు పెద్దపీట వేశాం.
– విజయేందర్‌రెడ్డి, గజ్వేల్ ఆర్డీవో
Comments
Please login to add a commentAdd a comment