R and B
-
సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డా.బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ఆదివారం రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ సచివాలయం 5వ అంతస్తులోని 5F 11,12,13 గదుల వద్ద పూజలు నిర్వహించారు. తర్వాత మంత్రి కోమటిరెడ్డి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే 9 ఫైల్స్‌పై సంతకం చేశానని తెలిపారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేసిన వారికీ కృతజ్ఞతలు తెలిపారు. R&B శాఖ కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సీఎంతో చర్చించి కౌన్సిల్ హాల్‌ను షిఫ్ట్ చేస్తున్నమని తెలిపారు. ముఖ్యమంత్రి ఆ బాధ్యతలు తనకు అప్పగించారని పేర్కొన్నారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ముందు ఫెన్సింగ్ తీసేసి సుందరీకరణ చేస్తామని ఆయన వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలోని రోడ్లను రూ.100 కోట్లతో నాలుగు లైన్ల రోడ్లుగా మారుస్తున్నామని తెలిపారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కోమటిరెడ్డి తెలిపారు. రేపు(సోమవారం) తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అపాయింట్మెంట్ తీసుకుంటానని అన్నారు. తనకున్న పరిచాయలతో ఢిల్లీ నుంచి నిధులు తీసుకువస్తానని తెలిపారు. కొడంగల్ లింగంపల్లి-దుగ్యాల రోడ్డు, నేషనల్ హైవే రోడ్లు కూడా రావాల్సి ఉందని అందుకే 14 రోడ్లను.. నేషనల్ హైవే రోడ్లుగా గుర్తించాలని రేపు ఢిల్లీకి వెళ్తునట్లు తెలిపారు.హైదరాబాద్-విజయవాడ రోడ్‌ను ఆరు లైన్ల రోడ్‌గా మార్చాలని అన్నారు. నకిరేకల్ రోడ్డు అభివృద్ధి చేయాలని, హైదరాబాద్-కల్వకుర్తి రోడ్డును 4 లైన్లుగా మార్చాలని చెప్పారు. సెంట్రల్ రోడ్ నిఫ్రా స్ట్రక్చర్ నిధులు పెంచాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. మొత్తం ఐదు పనులను పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని అడుగుతానని పేర్కొన్నారు. ఎల్బీనగర్ మల్కాపురం వరకు, మల్కాపురం నుంచి సూర్యాపేట వరకు 6 లైన్ల రోడ్డు పనులు చేయాలన్నారు. పది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వస్తుందని తెలిపారు. -
రహదారుల నిర్మాణానికి మరోసారి టెండర్లు
సాక్షి, విజయవాడ : న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) ఆర్థిక సహకారంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో తలపెట్టిన 3 వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి మరోసారి టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు దాఖలైన బిడ్లు, ఈ టెండర్ల ప్రక్రియపై ఒక వర్గం మీడియాలో చాలా కథనాలు వచ్చాయని, వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదని రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు స్పష్టంచేశారు. మొత్తం రూ.6400 కోట్ల వ్యయంతో రహదారులు నిర్మాణానికి సంబంధించి... ఒకేసారి 13 ప్యాకేజీలకుగాను ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇది నామమాత్ర స్పందన కావడంతో ఈ టెండర్లు రద్దు చేసి, మరోసారి టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం ఇంత పారదర్శకంగా టెండర్లను నిర్వహిస్తున్నా.. తక్కువ బిడ్లు రావడం, కేవలం 14 సంస్థలు మాత్రమే టెండర్లలో పాల్గొనడం, కొన్ని మీడియాల్లో అసత్య కథనాలు రావడంతో టెండర్లను రద్దు చేసి, మళ్లీ పిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా వివక్ష లేకుండా, అందరికీ అవకాశం ఇవ్వాలని సీఎం గారు ఆదేశించినట్టు ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఇంకా ఏమన్నారంటే...: ఒకేసారి 13 జిల్లాలలో 13 ప్యాకేజీలకు టెండర్లు పిలిస్తే 25 బిడ్లు వచ్చాయి. అందరూ సమయానికి దాఖలు చేశారు.అర్హులైన కాంట్రాక్టర్లు ఎక్కడెక్కడ ఉన్నారన్నది చూస్తున్నాము. జాతీయ రహదారుల పనులు చేసే వారు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా చూస్తున్నాము. ఇప్పుడు కేవలం 14 కంపెనీలే ముందుకు రావడంపై కూడా సమీక్ష చేశాము. పారదర్శకంగా ప్రక్రియ: ఇప్పుడు ఈ–టెండర్ విధానం అమలు చేశాము. అన్ని నియమాలు పూర్తిగా పాటించాము. పూర్తి పారదర్శకంగా వ్యవహరించాము. ఇక ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనే విధంగా చర్యలు చేపడుతున్నాము. విదేశీ బ్యాంక్ (ఎక్స్టర్నల్) రుణం కాబట్టి, ఎక్కడా రాజీ పడకుండా పక్కాగా నియమావళి రూపొందించాము. ఎందుకంటే పని తీసుకోవడమే కాదు, పూర్తి చేయడంలో కూడా ఆ కంపెనీ ఆసక్తి చూపాలి. అదే విధంగా ఒక బిల్లు వస్తే తప్ప, రెండో పని చేసే విధంగా ఉండకూడదు. అదే విధంగా క్వాలిటీతో, వేగంగా పని చేయాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నియమావళి రూపొందించాము. కాంట్రాక్టర్లలో పోటీ పెరిగేలా..: కాంట్రాక్టర్లు పోటీ పడి వస్తే అవే నిధులతో ఇంకా ఎక్కువ రోడ్ల నిర్మాణం చేపట్టవచ్చు. రూ.6400 కోట్ల నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల కి.మీ రహదారుల నిర్మాణం చేయబోతున్నాం. టెండర్లలో ఎక్కువ సంస్థలు పాల్గొని ఇంకా బిడ్లు వస్తే, ఆ మొత్తంతోనే ఇంకొన్ని రహదారులు కూడా నిర్మించవచ్చు. ప్రజల్లో ఎక్కడా అనుమానాలకు తావునివ్వొద్దని సీఎం గారు చెప్పారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ కూడా అదే ప్రక్రియలో అమలు చేస్తున్నాం. అందుకే ఇప్పుడు టెండర్లు రద్దు చేసి రీటెండర్‌కు వెళ్లాలని సీఎం గారు ఆదేశించారు. అర్హత ఉన్న కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడబోతున్నాము. ఎలాంటి సందేహాలు వద్దు: సకాలంలో బిల్లులు ఇస్తారా? అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎక్స్టర్నల్ ఫండింగ్‌తో జరుగుతోంది కాబట్టి, బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండబోదని సీఎం గారు చెప్పారు. అందుకే అర్హులైన కాంట్రాక్టర్లు, ఆ సంస్థలతో మాట్లాడమని ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశాము. పక్కాగా జరిగిన టెండర్ల ప్రక్రియ: ఇప్పుడు రద్దు చేసిన టెండర్ల ప్రక్రియ పక్కాగా జరిగింది. ఎక్కడా ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదు. ఈ–టెండర్లు కాబట్టి, ఎన్ఐసీ ప్లాట్ఫామ్లో 25 మంది తమ బిడ్ అప్లోడ్ చేశారు. బ్యాంక్ గ్యారెంటీ కోసం హార్డ్ కాపీ ఇవ్వాలి. ఇక్కడ ఆ 25 మంది హార్డ్ కాపీలు ఇచ్చారు కాబట్టి, మాకు ఎక్కడా సందేహాలు లేవు. అయితే అంత తక్కువ మంది ఎందుకు పార్టిసిపేట్ చేశారన్నదే ఇక్కడ ప్రశ్న. ఎవరైనా, ఎక్కడైనా బెదిరించారా? అంటే అది కూడా లేదు. నిజానికి అలాంటి ఘటనలు ఎక్కడా చోటు చేసుకోలేదు. నిజానికి రద్దు చేయాల్సిన అవసరం లేదు: ఇప్పుడు దాఖలైన బిడ్లతో ముందుకు వెళ్లొచ్చు. రద్దు చేయవలసిన అవసరం లేదు. నిజానికి ఎన్డీబీ కూడా ఇప్పటి బిడ్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఒకేసారి 13 ప్యాకేజీలు ఇచ్చినప్పటికీ 14 సంస్థలు ముందుకు వచ్చాయి. గతంలో కూడా ఎక్కువ విలువ ఉన్న పనుల్లో కొన్ని సంస్థలే పాల్గొన్నాయి. విజయవాడ బైపాస్ రోడ్డు పనుల్లో కూడా ఒకటి, రెండు సంస్థేల పాల్గొన్నాయి. అయినా ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించాము. ఈసారి ఎక్కువ సంస్థలు బిడ్లు వేస్తే, పోటీ పెరిగి ఇంకా తక్కువకే పనులు చేపట్టే వీలుంది. ఆ విధంగా మిగిలే నిధులతో ఇంకా ఎక్కువ రహదారులు నిర్మించవచ్చు. అందుకే తొలి టెండర్లు రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
బాధ్యతలు చేపట్టిన మంత్రి శంకర్ నారాయణ
-
బాధ్యతలు చేపట్టిన మంత్రి శంకర్ నారాయణ
సాక్షి, అమరావతి: మంత్రి శంకర్ నారాయణ బుధవారం రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సదర్భంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని ఎదుర్లంక- జి.ముళ్లపాలెం రహదారి కొత్త వంతెన పనులకు సంబంధించిన ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ్ మాట్లాడుతూ.. ఆర్ అండ్ బి శాఖ మంత్రిగా బాధ్యతలను తీసుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ తనకు ఆర్ అండ్ బి శాఖ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల అమలులో తనను ముఖ్య భాగస్వామిని చేశారని పేర్కొన్నారు. మొదటి సారిగా గెలిచిన తనకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఈ రోజు కీలక శాఖలు ఎస్సీ, ఎస్టీ బలహీన, మైనారిటీ వర్గాలకు కేటాయించారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు వేల కిలోమీటర్ల రోడ్లు వేసేందుకు గాను రూ. 6400 కోట్లతో ఎన్డీబితో చేసుకున్న ఒప్పందంపై మొదటి సంతకము చేశానని పేర్కొన్నారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అదే విధంగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టారు. కర్నూలు జిల్లాలోని డోన్‌లో బాలికల రెసిడెన్సియల్ స్కూల్, బేతంచెర్లలో బాలుర రెసిడెన్సియల్ స్కూల్‌ను జానియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసే ఫైళ్లపై మంత్రి వేణుగోపాలకృష్ణ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. తను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన వరాలన పంచుతానని తెలిపారు. తమకు గుర్తింపు లేదని ఆత్మ నూన్యతతో ఉన్న బలహీనవర్గాలకు సీఎం వైఎస్ జగన్ పాలనలో గుర్తింపు ఉంటుందన్నారు. బలహీన వర్గాల సంఘల నాయకుల సమస్యను సరైన రీతిలో పరిష్కరిస్తామని తెలిపారు. మంత్రి శంకర్ నారాయణ వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను వేణుగోపాలకృష్ణకు కేటాయించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే క్రమంలో నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం పదవితోపాటు, రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. ధర్మాన వద్ద ఉన్న రోడ్లు, భవనాల శాఖను మంత్రి శంకర్ నారాయణకు కేటాయించారు. (గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా జకియా ఖానమ్, రవీంద్రబాబు) -
చకచకా ఆర్అండ్ఆర్ పనులు
గజ్వేల్: మల్లన్నసాగర్ ముంపు బాధితుల కోసం సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లి–సంగాపూర్ గ్రామాల పరిధిలో చేపట్టిన ఆర్అండ్ఆర్ (రిహాబిలిటేషన్ అండ్ రీ–సెటిల్మెంట్) కాలనీ పనులు వేగంగా సాగుతున్నాయి. ఒక్కో ఇంటిని రూ.5.04 లక్షల వ్యయంతో 5 వేల ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇందుకు సుమారు 450 ఎకరాల భూ సేకరణను యుద్ధ ప్రాతిపదికన జిల్లా యంత్రాంగం చేపట్టింది. అవసరమైతే మరో 50 ఎకరాలను సేకరించడానికి సన్నద్ధమవుతుంది. గతంలో సేకరించిన 300 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉండగా.. ఇటీవల మరో 150 ఎకరాల భూ సేకరణ పూర్తిచేశారు. వాటిల్లోనూ ప్లాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 5 వేల ఇళ్లకు లే–అవుట్ సిద్ధం చేశారు. ఎకరా విస్తీర్ణంలో 11 ఇళ్ల చొప్పున ఒక్కొక్కరికి 250 గజాల స్థలంలో ఇళ్ల నిర్మాణం, విశాలమైన రోడ్లు, ఇతర వసతులతో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం 800 ఇళ్లు పూర్తి కావస్తుండగా... మరో 1,200 ఇళ్ల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. ఎవరైనా నిర్వాసితులు ఇళ్లు వద్దనుకుంటే... ఇంటి స్థలంతో పాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందజేయనున్నారు. ఈ పనులు సుమారు రూ.400 కోట్లకు పైగా వ్యయంతో సాగుతున్నాయి. అవసరమైతే మరికొంత భూమిని కూడా సేకరించి కాలనీని అన్ని సౌకర్యాలతో ఆదర్శవంతంగా నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించడంతో అధికారులు ఆ దిశగా పనుల్లో వేగం పెంచారు. గజ్వేల్–సంగాపూర్–వర్గల్ రోడ్డు నుంచి గజ్వేల్–ముట్రాజ్‌పల్లి–రాజీవ్ రహదారుల మధ్య ఉన్న ఈ స్థలం అత్యంత విలువైందిగా మారడంతో మల్లన్నసాగర్ భూనిర్వాసితులు సైతం ఇదే స్థలాన్ని ఎంచుకున్నారు. అధునాతన సౌకర్యాలు... ఆర్అండ్ఆర్ కాలనీకి ఇప్పటికే గజ్వేల్–వర్గల్, గజ్వేల్ రాజీవ్ రహదారి ప్రధాన రోడ్లు ఇరువైపులా ఉండగా.. అంతర్గత రోడ్లను సైతం విశాలంగా నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటి వరుసకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. డ్రైనేజీ, మంచినీరు, విద్యుదీకరణ తదితర పనులు కూడా వెంటవెంటనే పూర్తి చేయనున్నారు. గజ్వేల్‌లో ‘రియల్ భూమ్’... గజ్వేల్ పట్టణంలో ఆర్అండ్ఆర్ కాలనీతో పాటు రాబోయే రోజుల్లో రీజినల్ రింగురోడ్డు రాబోతున్న నేపథ్యంలో ప్లాట్ల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రత్యేకించి ఐవోసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) మార్గం, ముట్రాజ్‌పల్లి మార్గాల్లోనే కాకుండా పట్టణంలోని ప్రధాన కాలనీల్లో భారీగా ప్లాట్ల ధరలు పెరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానికంగా ప్రాతినిధ్యం వహించడంతో నలువైపులా విస్తరిస్తున్న గజ్వేల్ పట్టణం సంగాపూర్, ముట్రాజ్‌పల్లి వైపు మరో నూతన పట్టణంగా ఏర్పాటు కాబోతుంది. ఇప్పటికే ఈ వైపు బాలుర, బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లు నిర్మాణం కాగా.. 1,250 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు దాదాపు పూర్తి కావస్తున్నాయి. మరోమైపు జర్నలిస్టుల ఇళ్ల కాలనీ కూడా పూర్తి కావస్తోంది. అన్ని వసతులతో ఆర్అండ్ఆర్ కాలనీ.. మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు దేశంలోనే ఆదర్శంగా గజ్వేల్‌లో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణం జరుగుతోంది. తమ విలువైన భూములను ఇచ్చి గ్రామాలను వదులుకున్న నిర్వాసితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందువల్లే మంచి ప్రమాణాలతో కాలనీ నిర్మిస్తున్నాం. వసతుల కల్పనకు పెద్దపీట వేశాం. – విజయేందర్‌రెడ్డి, గజ్వేల్ ఆర్డీవో -
నిధులున్నా.. నిర్లక్ష్యం
సాక్షి, మెట్పల్లి(కోరుట్ల): జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాల్టీలకు కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థికసంఘం ద్వారా గత డిసెంబర్లో రూ.9.34 కోట్ల నిధులు మంజూరు చేసింది. జగిత్యాలకు రూ.4.20కోట్లు, మెట్‌పల్లికి రూ.2.25కోట్లు, కోరుట్లకు రూ.2.89కోట్లను కేటాయించింది. ఈ నిధులతో ఆయా మున్సిపాలిటీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశానవాటికలు, మార్కెట్ల అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. నిధులు మంజూరై రెండు నెలలు గడిచినప్పటికీ జగిత్యాల, మెట్పల్లి మున్సిపాలిటీల్లో ఇంకా ఈ పనులను మొదలుపెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. టెండర్ దాటని వైనం రెండు మున్సిపాలిటీల్లో ఈ పనులకు సంబం ధించి ఇంకా టెండర్దశ కూడా పూర్తి కాలేదు. మెట్పల్లిలో పదిరోజుల క్రితం ఆన్లైన్ టెండర్లు పిలిచిన ఇంజినీరింగ్ విభాగం అధికారులు.. ప్రస్తుతం ఎన్నికల కోడ్ రావడంతో దానిని అక్కడితోనే నిలిపివేశారు. జగిత్యాలలో మాత్రం అక్కడి అధికారులు ఇంకా టెండర్ ప్రక్రియను కూడా ప్రారంభించకపోవడం గమనార్హం. అధికారుల తీరుపై విమర్శలు... వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ మార్చిలోనే విడుదలవుతుందనే కచ్చితమైన సమాచారం ఉన్నప్పటికీ అధికారులు పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను పూర్తి చేయకుండా జాప్యం ప్రదర్శించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోరుట్లలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో టెండర్ ప్రక్రియతోపాటు కౌన్సిల్ ఆమోదం వంటి వాటిని పూర్తి చేసి ఈ నెలలో కోడ్ రాక ముందే పనులను మొదలుపెట్టారు. కానీ జగిత్యాల, మెట్పల్లిలో అధికారులు అలా చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ ఎన్నికల కోడ్ మే 27 వరకు ఉంటుంది. ఆ లోపే మండల, జిల్లా పరిషత్‌లతోపాటు మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది సాధ్యం కాని పక్షంలో జూన్ నెలలో నిర్వహించాలనే ఆలోచన చేస్తోంది. దీనిని బట్టి చూస్తే మరో మూడు, నాలుగు నెలల పాటు ఈ పనులకు మోక్షం కలిగే అవకాశం లేదు. మొ త్తానికి అధికారుల నిర్లక్ష్యంతో సకాలంలో పనులు కాక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సాంకేతిక కారణాలతోనే జాప్యం సాంకేతిక కారణాలతోనే టెండర్ల ప్రక్రియను సకాలంలో పూర్తి చేయలేకపోయాం. గతంలో ఉన్న కమిషనర్ ఎక్కువ రోజులు సెలవులో ఉండడం..ప్రస్తుతం ఉన్న కమిషనర్ పేరు మీద డిజిటల్ కీ రావడంలో జాప్యం జరిగింది. ‘కీ’ వచ్చిన వెంటనే టెండర్లను పిలిచాం. కాని అంతలోనే ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది రాక ముందే టెండర్ల ప్రక్రియను పూర్తి చేయ డానికి ప్రయత్నించాం. సాధ్యం కాలేదు. కోడ్ అనంతరం పనులు మొదలుపెడతాం. – అరుణ్, ఏఈ, మెట్పల్లి -
16 మంది ఎంపీలతో కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
బాన్సువాడ: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని, ఆంధ్రలో పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు కేటాయించగా, తెలంగాణ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన కాళేశ్వరానికి నయాపైసా నిధులు ఇవ్వలేదని రాష్ట్ర రోడ్డు, రవాణా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొని, కేంద్రం పై ఒత్తిడి పెంచుతామన్నారు. శనివారం ఆయన బాన్సువాడకు విచ్చేసిన సందర్భంగా పోచారం భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో టీఆర్ఎస్ నా యకులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును అప్పులు చేసి నిర్మిస్తున్నామని, కేంద్రం నిధులు ఇస్తే ఎంతో సునాయసంగా పనులు పూర్తయ్యేవన్నారు. రాష్ట్రంలో 3,225 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారని, దీనికి నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఎన్ని రకాల ఒత్తిడి తెచ్చినా పట్టించుకోలేదని, వచ్చే ఎన్నికల్లో 15 టీఆర్ఎస్, ఒక మజ్లిస్ స్థానంలో అభ్యర్థులను గెలిపిస్తే, కేంద్రం మెడలు వంచి నిధులు తెప్పించుకోవచ్చన్నారు. స్పీకర్ పోచారం తండ్రితో సమానులు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తన తండ్రి వేముల సురేందర్‌రెడ్డి మంచి మిత్రులని, వారు గతంలో టీడీపీలో అన్నదమ్ముల్లా కలిసి పనిచేశారని మంత్రి వేముల అన్నారు. 40 ఏళ్లుగా మా కుటుంబాల మధ్య అనుబంధం కొనసాగుతోందని, స్పీకర్ తనకు తండ్రి సమా నులన్నారు. స్పీకర్‌గా ఆయన, శాసన సభా వ్యవహారాల మంత్రిగా తాను కలిసి పనిచేయడం అదృష్టమన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, దేశాయిపేట సొసైటీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మోహన్ నాయక్, మహ్మద్ ఎజాస్, బాలకిషన్ పాల్గొన్నారు. -
ఊరికి దారేది..?
సాక్షి, సిర్పూర్(టి): మండలంలోని గ్రామాల రోడ్లు అధ్వానంగా మారాయి. ఏళ్లు గడుస్తున్నా రోడ్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో రోడ్లు గుంతలమయమైన ప్రతీ రోజు ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు ఊళ్లలోకి వెళ్లేందుకు రోడ్లు ఉన్నాయా? అన్న పరిస్థితి నెలకొంది. ఇది పరిస్థితి.. మండలంలోని ఇటిక్యాలపహాడ్ గ్రామం మండలకేంద్రం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉండగా జ్యోతినగర్ ప్రధాన రహదారి నుంచి రోడ్డు పూర్తిగా ఇసుకతో ఉండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. ఇటిక్యాలపహాడ్ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వాహనాల రాకపోకలు కొనసాగడంలేదు. మండలంలోని చీలపల్లి గ్రామం మండలకేంద్రం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉండగా, రోడ్డు మట్టికొట్టుకుపోయి కంకరతేలడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. లోనవెల్లి గ్రామానికి రోడ్డు వసతి ఉన్నప్పటికీ బీటీరోడ్డు పూర్తిగా కంకరతేలింది. సిర్పూర్(టి)–కౌటాల ప్రధాన రహదారి వెంబడి కర్జపల్లి క్రాస్‌రోడ్డు నుంచి లోనవెల్లి గ్రామం వరకు 4 కిలోమీటర్ల దూరం రోడ్డు పూర్తిగా కంకరతేలి గుంతలమయంగా మారింది. అదేవిధంగా డోర్పల్లి గ్రామానికి వెళ్లే 4 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారి వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం.. గుంతలు, మట్టి, ఇసుక రోడ్లతో ప్రతీ రోజు ఇబ్బందులకు గురవుతున్నా అధికారులు మాత్రం మరమ్మతు చర్యలు చేపట్టడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట అత్యవసర సమయాల్లో గ్రామాల నుంచి మండలకేంద్రానికి, పట్టణాలకు వెళ్లేందుకు పడే ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతుందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వసతి లేని గ్రామాలకు రోడ్డు వసతి కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తరుచూ వాహనాల మరమ్మతులు... మండల కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉండటంతో వాహనాలు తరుచూ మరమ్మతులు చేయించాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. ఇటిక్యాలపహాడ్ గ్రామానికి వెళ్లే రహదారిలో మూడు వాగులు ఉండటంతో వాహనాల్లో ప్రయాణికులను వాహనాల నుంచి దింపి వాగులు దాటిస్తున్నారు. వాగుల్లో వాహనాలు కూరుకుపోవడంతో తరచూ వాహనాలు పాడవుతున్నాయని, దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొంటున్నారు. ఇబ్బందులకు గురవుతున్నాం లోనవెల్లి క్రాస్‌రోడ్డు నుంచి లోనవెల్లి గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా గుంతలు ఏర్పడి కంకరతేలింది. మండలంలోని చీలపల్లి, ఇటిక్యాలపహాడ్, డోర్పల్లి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు అధికారులు రోడ్డు వసతి కల్పించాలి. – ప్రసాద్, లోనవెల్లి అధికారులు స్పందించాలి మండలంలోని గ్రామాలకు వెళ్లేందుకు ప్రధాన రహదారులు గుండా వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయాల్లో వాహనాల రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. ఏళ్లుగా రోడ్డు వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి. – సురేశ్, సిర్పూర్(టి) -
ఇక చంద్రబాబు ఇంటికి నిధులు ఇవ్వలేం!
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయాలకు లెక్కలేనంతగా పారుతున్న నిధుల వరదకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రోడ్ నెంబరు 65లో నూతనంగా నిర్మించిన సీఎం ఇంటికి నిధులు ఇక కేటాయించలేమని రహదారులు, భవనాల శాఖ తేల్చింది. సీఎం ఇంటికి సీసీ కెమేరాల నిమిత్తం రూ. 20 లక్షలు కేటాయించాలని ఆర్‌అండ్‌బీకి ప్రతిపాదనలు అందాయి. ఈ ఫైల్‌ను ఆర్‌అండ్‌బీలోని ఎలక్ట్రికల్ విభాగానికి పంపించారు. అయితే ఇప్పటికే ఎలక్ట్రికల్ విభాగం నుంచి సీసీ కెమేరాలకు, సోలార్ ఫెన్సింగ్ కోసం రూ. 12 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. లేక్ వ్యూ అతిధి గృహం, మదీనాగూడలోని ఫాం హౌస్, నాలుగేళ్ల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 24లో అద్దెకున్న ఇంటికి, నారావారిపల్లెలోని ఇంటికి ఈ నిధులు ఖర్చు చేశారు. సాధారణంగా సీఎం చంద్రబాబు అధికారికంగా క్యాంపు కార్యాలయంగా ఉపమోగిస్తున్న దానికే నిధుల్ని ఖర్చు చేసేందుకే ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తుంది. అధికారికంగా ఉండవల్లి కరకట్ట పక్కనున్న నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా గుర్తించారు. ఇక్కడ ఇప్పటికే సీసీటీవీ కెమేరాలు బిగించేందుకు గాను రూ. కోటి ఖర్చు చేశారు. హైదరాబాద్‌లో లేక్ వ్యూ అతిధి గృహాన్ని మొట్ట మొదటిసారిగా క్యాంపు కార్యాలయంగా గుర్తించడంతో అక్కడ సీసీటీవీ కెమెరాలను బిగించేందుకు, ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ. 3 కోట్లు వ్యయం చేశారు. ఆ తర్వాత మదీనాగూడలో ఫాం హౌస్‌కు, అద్దెకున్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు–24లో నివాసాలకు సీసీకెమేరాలు బిగించాలని నిధులు కేటాయించారు. సీఎం సొంత జిల్లా చిత్తూరులోని నారావారిపల్లెకు రూ. 36 లక్షలు కేటాయించారు. అయితే సీసీటీవీలకు నిధుల కేటాయింపునకు అభ్యంతరాలు వ్యక్తం కాగా, ఉన్నత స్థాయిలోనే జోక్యం చేసుకుని నిధుల విడుదలకు అనుమతులిప్పిచ్చారు. మళ్లీ హైదరాబాద్‌లోని సీఎం ఇంటికి సీసీ కెమెరాలకు గాను ఇప్పుడు రూ. 20 లక్షలకు ప్రతిపాదనలు పంపడంపై ఆర్అండ్బీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఇంటికి నిధుల విడుదలకు ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమవుతాయనే ఉద్ధేశంతో నిధుల మంజూరుకు అధికారులు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. అయితే నిధుల విడుదలకు సీఎంవో నుంచి ఒత్తిళ్లు అధికమవుతున్నాయని ఆర్అండ్బీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. సీఎం విలాసవంతమైన ఖర్చులపై లేఖరాసి పొగాకు రైతు ఆత్మహత్య సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయాలు, విలాసవంతంగా చేస్తున్న ఖర్చుపై గతంలో పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పొగాకు రైతు సుబ్బారావు లేఖ ద్వారా ప్రశ్నించి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన అప్పట్లో జాతీయ మీడియాలో సంచలనమైంది. సీఎం క్యాంపు కార్యాలయాల ఖర్చుపై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. చంద్రబాబు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. -
ముందస్తు ఒప్పందాల ప్యాకేజీ
ఆర్అండ్ఆర్ జాబితాలో రెవెన్యూ, రేషన్‌డీలర్ల మాయాజాలం అనర్హులతో ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకునేలా అవగాహన అడ్డగోలుగా, ఓటర్ ఐడీ, రేషన్‌కార్డుల జారీ నిజమైన నిర్వాసితులకు మొండిచెయ్యి వేలేరుపాడు: పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా అర్హులైన నిర్వాసితుల జాబితా ఖరారులో గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు, రేషన్ షాపు డీలర్లు కీలకపాత్ర పోషించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమందితో ముందస్తు ఒప్పందాలు చేసుకున్న వీరు నిజమైన అర్హులను తొక్కిపట్టారు. పరిహారం వచ్చాక ఫిఫ్టీ,ఫిఫ్టీ పంచుకునే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే అర్హుల పేర్లు గల్లంతయ్యాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. స్థానిక, స్థానికేతరులు ఎవరో తేల్చే పనిని గ్రామాల్లో వీఆర్ఏ, రేషన్ షాపు డీలర్లకు అప్పగించడంతో వారి ఇష్టారాజ్యమైంది. వారితో ఒప్పందం చేసుకున్న వారి పేర్లు జాబితాలో అర్హులుగా వచ్చాయి. అన్ని ఆధారాలు ఉన్న అనేక మంది నిర్వాసితుల పేర్లు మాత్రం గల్లంతయ్యాయి. మొదట్లో ఒకటికి నాలుగు సార్లు సర్వేలు చేశామని, ఇంటింటికీ తిరిగి డేటా సేకరించామని గొప్పలు పోతున్న అధికారులు, పెళ్లి అయిన వారికి కానట్లు, కాని వారికి అయినట్లు, స్థానికులను స్థానికేతరులుగా, బయటివారిని స్థానికులుగా, బతికి ఉన్న వాళ్లు చనిపోయినట్లు, గిరిజనులను గిరిజనేతరులుగా చూపారు. అలాగే ఉపాధి హామీ పనికెళ్లే కూలీలకు జాబ్‌కార్డులు ఉన్నా, వితంతు, వృధ్ధాప్య పెన్షన్లు ప్రతీ నెలా వస్తున్నా అలాంటి వారి పేర్లు జాబితా నుంచి తొలగించారు. దీంతో నిర్వాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రకటించిన జాబితా వివరాలపై నిర్వాసితులు ప్రశ్నిస్తే, నోరెళ్ల బెడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ తప్పిదాలన్నీ వారి అక్రమాలకు నిదర్శనంగా చెప్పవచ్చు. కనీసం బాధితులు చెప్పేది వినిపించుకోకుండా సాక్షాత్తు ఉన్నతాధికారులే ఏకపక్షంగా వాదించడం నిర్వాసితుల్ని మరింత కుంగదీస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29,545 కుటుంబాలు తమ ఇళ్లు కోల్పోతున్నాయి. ఇందులో పదివేల గిరిజన కుటుంబాలుండగా, 19,545 గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలున్నాయి. జూన్ 12న గ్రామసభలు నిర్వహించి, అభ్యంతరాలు స్వీకరించారు. అర్హులను గుర్తించేందుకు వడపోత ప్రక్రియ చేపట్టారు. ఇందులో 3430 మంది నకిలీ నిర్వాసితులుగా విఆర్ఏలు, రేషన్ షాపు డీలర్లే గుర్తించారు. ఈ రెండు మండలాల్లో 26,115 మంది నిర్వాసితులు అర్హులుగా నిర్ధారించారు. ఆ తర్వాత మళ్లీ ఇంటి స్ధిరాస్తి విలువలు లేకుండా కేవలం వ్యక్తిగత ప్యాకేజీ మాత్రమే ప్రకటించారు. ఇందులో కుక్కునూరు మండలంలో సుమారు 2500 మంది, వేలేరుపాడు మండలంలో సుమారు 1500 మంది అర్హులను అనర్హులుగా ప్రకటించారు. వ్యక్తిగత ప్యాకేజీ కింద గిరిజనులకైతే 7.26లక్షలు, గిరిజనేతరులకైతే 6.36 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే మొదటి జాబితాలతో అర్హులుగా వచ్చిన అనేక మంది స్థానికుల పేర్లు, ప్రస్తుత జాబితాలో అనర్హులుగా ప్రకటించడం గమనార్హం. పథకం ప్రకారమే అంతా చేసారు... రెవెన్యూ అధికారులు ముందస్తు పథకం ప్రకారమే అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పునరావాస ప్యాకేజీ ప్రకటించక ముందే ఈ రెండు మండలాల తహశీల్దార్లు కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన సమయంలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 16వేల 191 రేషన్‌కార్డులుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 18వేల 474కు పెరిగింది. అంటే 2,283 కుటుంబాలు పెరిగాయి. వేలేరుపాడు మండలంలో రెండేళ్ల క్రితం 6041 కార్డులుండగా ప్రస్తుతం 7,393, కుక్కునూరు మండలంలో 10150 ఉండగా, 11081కు పెరిగాయి. ఇవి కాకుండా అసలు రేషన్కార్డులులేని వందలాది కుటుంబాలున్నాయి. ఈ ప్రాంతం నుంచి 30, 40 ఏళ్ల క్రితం అనేక కుటుంబాల వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఇలాంటి వారికి కూడా రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు జారీ చేసారు. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. అప్పట్లో ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పెన్షన్ వస్తున్నా స్థానికురాలిని కాదంట: వలగాని సావిత్రి, వేలేరుపాడు నేను 50 ఏళ్లుగా వేలేరుపాడులో నివాసముంటున్నా. నా భర్త అప్పలయ్య ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందారు. నాకు సంతానం లేదు. బాలుడిని దత్తత తీసుకొని పెంచుకున్నాను. నాకు రేషన్ కార్డు, ఓటర్ కార్డు ఉంది. ప్రతీ నెలా రేషన్ తీసుకుంటున్నా, రోజూ ఉపాధి కూలి పనికెళ్తున్నా, బ్యాంక్‌లో ఉపాధి వేతనం పొందుతున్నాను. వితంతు పెన్షన్ వస్తోంది. ఇలాంటి అన్ని ఆధారాలు ఉన్నా జాబితాలో నాన్ లోకల్‌గా ప్రకటించారు. ఇదెక్కడి అన్యాయ మండి. జాబ్‌కార్డు ఉన్నా నాన్‌లోకల్‌గా ప్రకటించారు: కొంబత్తిన కృష్ణార్జున్‌రావు, కట్కూరు, వేలేరుపాడు మండలం మా తాతముత్తాల నుండి కట్కూరులో నివాసముంటున్నా. 2007లో నా పట్టా పొలానికి పరిహారం వచ్చింది. నాకు జాబ్ కార్డు, రేషన్, ఓటర్ఐడీ, ఆధార్‌కార్డు లాంటి అన్ని ఆధారాలు ఉన్నాయి. నన్ను నాన్రెసిడెన్స్గా ఎలా ప్రకటించారు. గ్రామంలో విచారించండి. పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం: సారే రామారావు, రుద్రమకోట, æవేలేరుపాడు మండలం నేను యాభై ఏళ్లుగా మా తాతముత్తాతల నుంచి రుద్రమకోటలో నివాసముంటున్నాను. కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. రేషన్,కార్డు, ఓటర్ఐడీ ఉంది. వృధ్ధాప్య పెన్షన్ వస్తోంది. నా వయసు 72 సంవత్సరాలు. అయినా అధికారులు జాబితాలో నాన్‌లోకల్‌గా ప్రకటించారు. కొండరెడ్డినని కూడా కనికరించలేదు: కెచ్చెల సీత, కట్కూరు ‡ నన్ను కొండరెడ్డినని కూడా కనికరించలేదు. 20 ఏళ్లుగా రేషన్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ ఆర్అండ్ఆర్ జాబితాలో స్థానికేతరురాలిగా ప్రకటించారు.అధికారుల కళ్లకు మా కుటుంబాలు కనబడటంలేదా..? -
ముంచేశారు...
అవివాహితలకు పెళ్లయినట్లు రికార్డులు... నాన్‌రెసిడెన్షియల్ జాబితాలో స్థానికులు ఆర్అండ్ఆర్ జాబితా గందరగోళం అధికారుల అడ్డగోలు ఎంట్రీలు పోలవరం నిర్వాసితుల్లో అలజడి సాక్షి ప్రతినిధి, ఏలూరు, వేలేరుపాడు: నిర్వాసితులను ముంచేశారు. పోలవరం ప్రాజెక్టు పరిహారం విషయంలోనే కాకుండా ఆర్ అండ్ ఆర్‌లో కూడా నిర్వాసితులకు అన్యాయం జరిగింది. అధికారులు తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలు వారి పట్ల శాపంగా మారుతున్నాయి. భూసేకరణ జరిగిన ప్రాంతంలో పుట్టి పెరిగి ఉద్యోగ రీత్యా బయటకు వెళ్లిన వారిని సైతం స్థానికులుగానే గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నా వాటన్నిటిని తోసి రాజన్నారు. తమను మేనేజ్ చేసిన వారిని లోకల్‌గా, మిగిలిన వారిని నాన్‌లోకల్‌గా గుర్తించి పెద్దస్థాయిలో అక్రమాలకు తెరలేపారు. వ్యక్తిగత పరిహారం జాబితాను మంగళవారం ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పెట్టింది. దీన్ని చూసిన వారు గగ్గోలు పెడుతున్నారు. పోలవరం నిర్వాసితుల ఇండ్ల పరిహారం ప్యాకేజీ జాబితా అంతా గజిబిజి గందరగోళంగా ఉంది. వ్యక్తిగత పరిహారం జాబితాను ప్రకటించిన అధికారులు ఇండ్ల (ఇంటి విలువ) పరిహారం ప్రకటింలేదు. ఈ జాబితాలో కొంతమంది స్థానికులకు రేషన్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు అన్ని ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ, నాన్రెసిడెన్షియల్గా ప్రకటించారు. మరి కొంతమంది యువతులకు అసలు పెళ్లిళ్లు కానప్పటికీ, పెళ్లిళ్లు అయినట్లు (మ్యారీడ్)గా ప్రకటించారు. అన్ని ఆధారాలు ఉన్నా పెద్ద సంఖ్యలో స్ధానిక నిర్వాసితుల పేర్లు మాత్రం గల్లంతయ్యాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29,545 కుటుంబాలు తమ ఇళ్లు కోల్పోతున్నాయి. ఇందులో పదివేల గిరిజన కుటుంబాలుండగా, మిగిలిన 19,545 గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలు. అయితే పది నెలల క్రితం సర్వే చేసిన అధికారులు నిర్వాసితులు నివాసముండే పూరిపాకలు, పెంకుటిళ్లు, ఆర్సీసీ స్లాబ్ బిల్డింగ్లు, రేకులున్న ఇండ్లు, ఇవే కాకుండా 35 ఏళ్ల క్రితం నిర్మించిన మద్రాసు టెర్రర్స్ ఇండ్లు (టేకు కమ్మెలపై స్లాబ్ వేసిన ఇండ్లు) నమోదు చేసారు. ఇంటి పొడవు, వెడల్పులకు మాత్రమే కొలతలు తీసుకున్నారు. అప్పట్లో ఇళ్ల విలువను అధికారులు వెల్లడించలేదు. ఇంటి విలువ వేయాల్సిన ఆర్అండ్బీ అధికారులు కూడా ఈ ఇళ్లను అసలు పరిశీలించలేదు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు బోర్లను పరిశీలించలేదు. ఫారెస్ట్, హార్టికల్చర్ అధికారులు ఏ ఒక్కరు రాలేదు. అయినా అప్పట్లో తక్కువ ఇంటి విలువలతో కూడిన జాబితా ప్రకటించారు. జూన్ 12వ తేదీన గ్రామసభలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించారు. ఆ తర్వాత మళ్లీ తాజాగా ఇంటి స్ధిరాస్తి విలువలు లేకుండా కేవలం వ్యక్తిగత ప్యాకేజీ మాత్రమే ప్రకటించారు. దీని వల్ల అనేక మంది నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. జగన్నాథపురం గ్రామానికి చెందిన ముతిక ముత్తేశ్వరి భర్త అప్పారావు అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతి చెందాడు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. భర్త మృతి చెందినప్పటి æనుంచి అక్కడే కిరాణా షాపు నడుపుకుంటూ జీవిస్తోంది. అమెను స్థానికేతరురాలిగా ప్రకటించారు. ఈమె బతుకుబండి భారంగా లాగిస్తోంది. స్ధానికంగా అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఈమె కుటుంబాన్ని నాన్రెసిడెన్ష్గా ప్రకటించారు. అర్హులకు చెయ్యిచ్చారు... ఈ రెండు మండలాల్లో అనేక మంది స్థానికుల పేర్ల ఎదురుగా జాబితాలో నష్టపరిహారం సున్నాగా చూపించారు. గతంలో అర్హులుగా ప్రకటించిన స్థానికుల పేర్లు ప్రస్తుత జాబితాలో అనర్హులుగా వచ్చాయి. గతంలో అనర్హులుగా ప్రకటించిన స్థానికేతరుల పేర్లు అర్హులుగా వచ్చాయి. దీని వెనుక భారీ కుంభకోణం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. కానోళ్లకు పెళ్లిళ్లు చేశారు...æ ఆర్ అండ్ ఆర్ నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన యువతులకు పెళ్లి కాకుంటేనే వ్యక్తిగత ప్యాకేజీ పొందే అవకాశం ఉంది. వేలేరుపాడు మండల కేంద్రంలో, జగన్నాథపురం, పాతపూచిరాల, రుద్రమకోట ఇంకా అనేక గ్రామాల్లో 18 నుంచి 20 ఏళ్ల యువతులకు పెళ్లిళ్లు కానప్పటికీ అయినట్లు జాబితాలో ప్రకటించారు. అలాగే గతంలో పెళ్లిళ్లు అయినవాళ్ల పేర్లు మాత్రం పెళ్లి కానట్లు ప్రస్తుత జాబితాలో చూపించారు. ఫలితంగా వాస్తవంగా పెళ్లికాని యువతులు వ్యక్తిగత ప్యాకేజీ కోల్పోయో పరిస్థితి నెలకొంది. 40 ఏళ్లుగా ఉంటున్నా నాన్‌లోకల్‌గా ప్రకటించారు: అప్జల్ పాష , వేలేరుపాడు నేను నా కుటుంబం నలభై ఏళ్ళుగా వేలేరుపాడులో స్ధిర నివాసముంటున్నాం. నాకు రేషన్ కార్డు, అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ జాబితాలో నాన్రెసిడెన్స్గా చూపించారు. నాకు నలుగురు అమ్మాయిలు. ఇందులో ఇద్దరికి పెళ్లిళ్లు చేసాను. ఇద్దరికి ఇంకా పెళ్లి చేయకుండానే వారిని వివాహితలుగా ప్రకటించారు. ఇది అన్యాయం. అందరికీ న్యాయం చేస్తాం: పి కోటేశ్వరరావు జాయింట్ కలెక్టర్ అర్హులకు ఎవరికీ అన్యాయం జరగదు. అందరికీ న్యాయం జరిగేలా చూస్తాం. నకిలీ ధ్రువపత్రాలతో ప్యాకేజీ పొందాలని చూస్తే అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. -
జిల్లాలో రహదారుల అభివృద్ధికి రూ.139 కోట్లు
కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో రోడ్లు భవనాల శాఖకు సంబంధించి రూ.189 కోట్లతో 29 పనులు చేపట్టామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్లో రోడ్లు భవనాల శాఖాధికారులతో కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో రహదారులకు సంబంధించి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా ప్రయాణానికి అనువుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. 29 పనుల్లో 26 పనులు ప్రగతిలో ఉన్నాయని వాటిని నిర్ధేశించిన సమయానికి పూర్తి చేసేలా సంబంధితాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నరసాపురం కాలువపై నిర్మించే మార్టేరు బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలన్నారు. కాలువలో నీళ్లు ఉన్నాయని పనులు మందకొడిగా సాగుతున్నాయనే మాట చెప్పకుండా పనులపై శ్రద్ధ వహించాలని చెప్పారు. నిడదవోలు సెక్షన్ పరిధిలో చిట్యాల దుద్దుకూరు రోడ్డు, గోపాలపురం సెక్షన్ పరిధిలోని గోపాలపురం దొండపూడి రోడ్డులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చింతలపూడి సెక్షన్ పరిధిలో ఉన్న ప్రగఢవరం నాగిరెడ్డిగూడెం రోడ్డు పనులు, ఏలూరు మేడిశెట్టివారిపాలెం రోడ్డు పనులను నిర్ధేశించిన సమయానికి పూర్తి చేయాలన్నారు. మొగల్తూరు సెక్షన్ సీతారామపురం పేరుపాలెం వరకు రోడ్డు పనిని అక్టోబరు నాటికి పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్అండ్బీ ఎస్ఈ నిర్మలను ఆదేశించారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పనులు సంవత్సరాల తరబడి జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు, కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేసి చేపట్టే పనులను సకాలంలో పూర్తి చేసేలా చూడాలన్నారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ నిర్మల, డీఈలు, ఏఈలు, ఈఈలు పాల్గొన్నారు. పరిశ్రమల ప్రోత్సాహకానికి రూ.40 కోట్ల రాయితీ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో వివిధ పరిశ్రమలకు ప్రభుత్వ ప్రొత్సాహకం కింద 300 యూనిట్లకు చెందిన 1196 దరఖాస్తుదారులకు రూ.40 కోట్ల రాయితీని అందించనున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందకు ప్రభుత్వం వివిధ రాయితీలను అందిస్తోందన్నారు. వాటిని సకాలంలోఅందించాలని సూచించారు. ఈ విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా చేయాలని అటువంటప్పుడే పరిశ్రమలు ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతారని చెప్పారు. అపరిష్కృతంగా ఉన్న 116 క్లైయిమ్స్ను వచ్చే వారం నాటికి పరిష్కరించే దిశగా పరిశ్రమల శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సింగిల్ విండో కింద పరిశ్రమల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడంలో సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెరగాలని కలెక్టరు సూచించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ టి.త్రిమూర్తులు, డెప్యూటీ డైరెక్టర్ ఆదిశేషు, కమర్షియల్ ట్యాక్స్ సీటీఓ కేదారేశ్వరరావు, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్రాంచ్ మేనేజర్ సుబ్బారెడ్డి, డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏలూరు మోహనరావు, కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీరు వేంటేశ్వరరావు, ఏడీఈ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. తప్పుడు నివేదికలు ఇస్తే అధికారులపై కేసులు ఏలూరు రూరల్: పంచాయతీ భవనాల నిర్మాణానికి సహకరించకపోతే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టబోమని జిల్లా కలెక్టర్ కాటంనేని స్పష్టం చేశారు. బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేదినరావుపాలెం, గోగుంట, జి.కొత్తపల్లి తదితర గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి నిదులు మంజూరు చేసిన ఎందుకు పనులు ప్రారంభించలేదని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అధికారులు స్థలాల కేటాయింపు జరగలేదన్నారు. దీనిపై భాస్కర్ మాట్లాడుతూ గ్రామస్తులంతా కలిసి భవన నిర్మాణం చేపట్టిన నాడే ఆ గ్రామాల్లో ఇతర అభివృద్ధి పనులు చేయాలని ఆదేశించారు. తప్పుడు నివేదిక ఇస్తే 420 కేసు జిల్లాలో 181 కిలోమీటర్లు సీసీరోడ్డు వేశామని అధికారులు నివేదక ఇచ్చారని, ఆన్లైన్లో కేవలం 70 కిలోమీటర్లు మాత్రమే రోడ్డు అభివృద్ధి జరిగినట్టు నమోదు చేశారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ రోడ్లపై తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై 420 కేసు పెడతానని హెచ్చరించారు. పనుల వేగం పెంచాలన్నారు. మరో 2 వేల కిలోమీటర్ల మేర రోడ్డు వేయాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో 72 వేల పంట కుంటలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ నిధులతో తవ్విన పంట కుంటలను రైతులు పూడ్చివేస్తున్నారని అన్నారు. పూడ్బివేసిన కుంటలకు చేపట్టిన ఖర్చు మొత్తాన్ని రికవరీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓ కట్టా హైమావతి, డ్వామా పీడీ వెంకటరమణ, హౌసింగ్ పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
6 నెలల్లో..రీజనల్ రింగ్ రోడ్డు!
♦ కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు ♦ సమగ్ర ప్రాజెక్టు నివేదికకు కేంద్రం ఆమోదం తప్పనిసరి.. ♦ అనుమతి కోసం రోడ్లు భవనాల శాఖ నిరీక్షణ ♦ 285 కి.మీ. మార్గంలో రూ.5 వేల కోట్లతో నిర్మాణం అలైన్మెంట్ ఖరారు: ఆర్అండ్బీ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు ఆవల మరో మణిహారం రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) పనులపై కదలిక వచ్చింది. సుమారు 285 కి.మీ. మార్గంలో నాలుగు వరుసల్లో రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీకి అవసరమైన అనుమతులు కోరుతూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు కేంద్ర రహదారులు, హైవేల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఆ శాఖ అనుమతి, మార్గదర్శకాల ప్రకారం ఆరు నెలల్లో డీపీఆర్ సిద్ధం చేయనున్నట్లు ఆర్అండ్బీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. చౌటుప్పల్, సంగారెడ్డి, షాద్‌నగర్, కంది తదితర ప్రాంతాలను కలుపుతూ వెళ్లే రీజినల్ రింగ్ రోడ్డు.. ఆయా ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేయనుంది. ఆర్ఆర్ఆర్తో ఆయా ప్రాంతాల్లో రవాణా, వాణిజ్య, విద్య, పారిశ్రామిక అవకాశాలు మెరుగుపడనున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డుతో నగరంలోని పది ప్రధాన రహదారులు అనుసంధానం కానుండటం విశేషం. ఇదీ రీజినల్ రింగ్‌రోడ్డు ప్రతిపాదన.. 152 కి.మీ. సంగారెడ్డి–నర్సాపూర్–తూ్రప్రాన్– గజ్వేల్–జగదేవ్‌పూర్– భువనగిరి–చౌటుప్పల్ 133 కి.మీ. చౌటుప్పల్–ఇబ్రహీంపట్నం– ఆమన్‌గల్–షాద్‌నగర్–చేవెళ్ల– శంకర్పల్లి–కంది అలైన్మెంట్, భూసేకరణే కీలకం.. రీజినల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభించాలంటే తుది అలైన్మెంట్ ఖరారు, భూసేకరణ, బాధితులకు పరిహారం చెల్లింపు వంటి అంశాలు కీలకంగా మారాయి. ఆయా ప్రాంతాల్లో భూముల విలువ కోట్లకు చేరుకోవడంతో నాలుగు వరుసల రహదారి ఏర్పాటుకు అవసరమైన భూములను సేకరించడం వ్యయ ప్రయాసలతో కూడినదని రోడ్లు, భవనాల శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్రం అలైన్మెంట్ ఖరారు, డీపీఆర్ తయారీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన పక్షంలో కన్సల్టెన్సీని నియమించి డీపీఆర్‌ను సిద్ధంచేసి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులను త్వరితగతిన చేపడతామని పేర్కొంటున్నాయి. తుది అలైన్మెంట్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉంటాయని చెపుతున్నాయి. షాద్‌నగర్–కంది మార్గంలో ఇప్పటికే నాలుగు వరుసల రహదారి అందుబాటులో ఉందని.. ఈ మార్గంలో రహదారిని మరింత విస్తరించాలా? వద్దా? అన్న అంశాలపైనా కసరత్తు చేయాల్సి ఉందని పేర్కొన్నాయి. ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పది రాష్ట్ర రహదారులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపాయి. ఇప్పటికే సంగారెడ్డి–చౌటుప్పల్ మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినట్లు వివరించాయి. -
రోడ్ల నిర్మాణంలో ఆస్ట్రేలియా టెక్నాలజీ
గజ్వేల్‌లో ప్రయోగాత్మకంగా అమలు భారీగా తగ్గనున్న నిర్మాణ వ్యయం గజ్వేల్: రోడ్ల నిర్మాణంలో ఆస్ట్రేలియా టెక్నాలజీ రాబోతుంది. ప్రత్యేకంగా తయారు చేసిన రసాయన మిశ్రమంతో మట్టిని గట్టిపరిచి రోడ్డు నిర్మాణానికి అనువుగా తయారు చేయడం ద్వారా కంకర వాడకాన్ని తగ్గించనున్నారు. ఫలితంగా నిర్మాణ వ్యయం 30 నుంచి 40 శాతం తగ్గనుంది. ఈ కొత్త పద్ధతిని తొలిసారిగా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఆర్అండ్బీ శాఖ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ ప్రయోగం దేశంలోనే మొదటిదని అధికారులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా టెక్నాలజీతో రోడ్డు నిర్మిస్తే ఖర్చు తగ్గించవచ్చనే భావనకు వచ్చిన ఆర్అండ్బీ శాఖ.. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గజ్వేల్–దౌల్తాబాద్ రహదారిపై ఆరెపల్లి వద్ద ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్లే–క్రేట్ సంస్థ ప్రతినిధులు బారీ, బిరియాన్లు కొత్త టెక్నాలజీని గురువారం ప్రయోగాత్మకంగా చూపారు. సిద్దిపేట జిల్లా ఆర్అండ్బీ ఈఈ బాల్‌నర్సయ్య, గజ్వేల్ డిప్యూటీ ఈఈ బాలప్రసాద్లతో కలసి తమ కంపెనీ తయారు చేసిన క్లే–క్రేట్ రసాయనాన్ని 10 వేల లీటర్ల వాటర్ ట్యాంకులో 30 లీటర్లు కలిపారు. ఆ తర్వాత రోడ్డు నిర్మాణం జరుగుతున్న చోట మట్టిని ముందుగా రోటోవేటర్‌తో కదిలించి.. దానిపై రసాయన మిశ్రమం కలిగిన నీటిని చల్లారు. ఆ తర్వాత రోటోవేటర్‌తో తిప్పి.. రోలర్‌తో తొక్కించారు. ఫలితంగా మట్టి గట్టిపడింది. దీనివల్ల రోడ్డు నిర్మాణంలో సహజంగా 45 సెంటీమీటర్ల లేయర్‌తో కంకర వాడతారు. కానీ ఈ మిశ్రమంతో మట్టిని తొక్కించి రోలర్‌తో గట్టి పర్చడం వల్ల మట్టి గట్టిపడుతుంది. దీనివల్ల కంకర వాడకం 6 నుంచి 8 సెంటీ మీటర్లకు తగ్గిపోతుంది. ఫలితంగా కిలోమీటర్ పొడవున అవసరమయ్యే కంకర పరిమాణం భారీగా తగ్గిపోతుంది. సహజంగానే ఖర్చు తగ్గిపోనుంది. -
డబుల్ ట్రబుల్
మూడోసారి టెండర్లకు ఆర్అండ్బీ సమాయత్తం రెండు సార్లు టెండర్లు పిలిచినా స్పందన కరువు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లకు చెన్నై సంస్థ నుంచి స్పందన లేదు.. నిజామాబాద్ :ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి జిల్లాలో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. సిద్ధిపేట్ జిల్లా సీఎం దత్తర గ్రామాల్లో ఈ లబ్ధిదారుల కల ఇటీవల సాకారమైన నేపథ్యంలో జిల్లాలో ఈ గృహాల కోసం దరఖాస్తులు చేసుకున్న వేలాది మంది లబ్ధిదారుల్లో ఆసక్తి నెలకొంది. జిల్లాలో ఇప్పటివరకు ఈ గృహ నిర్మాణ పనులు ప్రారంభానికే నోచుకోవడం లేదు. ఈ గృహాల నిర్మాణానికి ప్రభుత్వం నిర్దేశించిన యూనిట్ వ్యయానికి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. జిల్లాలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 1,500 గృహాలు, నిజామాబాద్ రూరల్ పరిధిలో 700, ఆర్మూర్ నియోజకవర్గంలో 865, బాల్కొండ నియోజకవర్గంలో 800 ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఈ గృహాల నిర్మాణ బాధ్యతను ఆర్అండ్బీ శాఖకు అప్పగించారు. వీటి నిర్మాణానికి ఇప్పటివరకు రెండు పర్యాయాలు అధికారులు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాలేదు. దీంతో మూడోసారి టెండర్లు పిలిచేందుకు ఆర్అండ్బీ అధికారులు సమాయత్తమవుతున్నారు. టెండరు కమిటీ నిర్ణయం తీసుకుంటే మూడోసారి టెండర్లు పిలుస్తామని ఆర్అండ్బీ పర్యవేక్షక ఇంజినీర్ మధుసూదన్‌రెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ గృహాలు నిర్మించే కాంట్రాక్టర్లకు ఉచితంగా ఇసుక తీసుకునేందుకు అనుమతించింది. అలాగే సిమెంట్ కూడా తక్కువ ధరకు సరఫరా చేయాలని నిర్ణయించింది. దీంతో ఈసారి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. కానీ.. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి ఇచ్చే యూనిట్ వ్యయం ఏ మాత్రం సరిపోదని కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు. దీంతో ఈ గృహాల నిర్మాణం పట్టలెక్కడం లేదు. తద్వారా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల కల సాకారం కావడంలో జాప్యం జరుగుతోంది. ఒక్క దోమలెడిగిలో శ్రీకారం బోధన్ నియోజకవర్గంలోని మండలాలతోపాటు రుద్రూరు, కోటగిరి, వర్ని మండలాల్లో ఈ గృహాల నిర్మాణం బాధ్యతలను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించారు. ఇప్పటివరకు ఒక్క కోటగిరి మండలం దోమలెడిగి గ్రామంలో కేవలం 40 గృహాల నిర్మాణానికి మాత్రం అధికారులు శ్రీకారం చుట్ట గలిగారు. రుద్రూర్ మండలం అక్బర్‌నగర్‌లో 40 గృహాలకు కాంట్రాక్టరు ముందుకొచ్చినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. గ్రామాల్లో ఒక్కో గృహం నిర్మాణానికి రూ.5.04 లక్షలు, పట్టణాల్లో రూ.5.30 లక్షలు యూనిట్ వ్యయంగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈ గృహాలకు రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కోసం గ్రామాల్లో రూ.1.25 లక్షలు, పట్టణాల్లో రూ.75 వేలు వెచ్చించాలని నిర్ణయించింది. స్పందనలేని చెన్నై కంపెనీ.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో ప్రీ ఫ్యాబ్రికేషన్ పద్ధతిలో ఈ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టే అంశంపై జిల్లా అధికార యంత్రాంగం నెల రోజుల క్రితం పరిశీలించింది. ఈ మేరకు చెన్నైకి చెందిన కెఫ్ అనే నిర్మాణ సంస్థ ప్రతినిధులు కలెక్టర్ యోగితారాణాను కలిసి సమావేశమయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు ఈ గృహాల ప్లానింగ్‌ను ఈ కంపెనీకి పంపారు. నెల రోజులు దాటినా ఈ కంపెనీ నుంచి స్పందన రానట్లు సమాచారం. లేఅవుట్ కన్సల్టెన్సీకీ బిల్లులు లేవు.. ఈ డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి ఆర్అండ్బీ పరిధిలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో 39 లే అవుట్లు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్‌లో రెండు లేఅవుట్లు, రూరల్ నియోజకవర్గంలో 17 లేఅవుట్లు, ఆర్మూర్‌లో 11 లేఅవుట్లు, బాల్కొండలో తొమ్మిది లేఅవుట్లు ఉన్నాయి. అలాగే పంచాయతీరాజ్ పరిధిలోని బోధన్ నియోజకవర్గంలో కూడా పలుచోట్ల లేఅవుట్లు ఉన్నాయి. ఈ లేఅవుట్లు, సర్వే నిర్వహించే బాధ్యతలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. లేఅవుట్ చేసిన ఈ సంస్థలకు ఇవ్వాల్సిన బిల్లులు కూడా ఆగిపోయినట్లు సమాచారం. -
నిన్నొదలా
నిన్నొదలా - ప్రభుత్వ క్వార్టర్లలో అనర్హుల తిష్ట - పదవీ విరమణ చేసి ఖాళీ చేయని 175 మంది ఉద్యోగులు - 30 గృహాల్లో ప్రైవేట్ వ్యక్తుల జీవనం - ఆర్నెల్ల క్రితం కలెక్టర్‌కు నివేదించిన ఆర్అండ్బీ అధికారులు - ఆదేశాలకే పరిమితమైన ఉన్నతాధికారి విచారణ ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్మించిన ఆర్అండ్బీ క్వార్టర్స్‌లో అనర్హులు దర్జాగా నివసిస్తున్నారు. పదవీ విరమణ చేసినా ఉద్యోగులతో పాటు కొందరు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇక్కడే నివాసం ఏర్పచుకుని ఖాళీ చేయడం లేదు. కొత్తవారికి గృహాలను కేటాయించడానికి ఇక్కట్లు తప్పడం లేదు. ఆరు నెలల క్రితం ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌కు నివేదించారు. ఆయన ఓ ఉన్నతాధికారి ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించినా ఇంత వరకు దానిపై స్పందన లేదు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం క్వాటర్స్ కోసం నిరీక్షిస్తున్నా ఖాళీ ఏర్పడటం లేదు. - కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు కర్నూలు నగరంలో ప్రభుత్వ ఉద్యోగుల నివాసం కోసం ఆర్అండ్బీ ఆధ్వర్యంలో ఏ,బీ,సీ క్వార్టర్లు ఉన్నాయి. ఏక్యాంపులో 58, బీక్యాంపులో 643, సీక్యాంపులో 248 కార్టర్లు ఉన్నాయి. మూడు క్యాంపుల్లో కలసి మొత్తం 949 క్వార్టర్లు ఉన్నాయి. వీటిలో మౌలిక వసతుల కల్పన బాధ్యత అర్అండ్బీ శాఖది. ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపు పని మాత్రం రెవెన్యూ అధికారుల కిందకు వస్తుంది. కర్నూలు నగరంలో పనిచేసే ఉద్యోగులకు వీటిని కేటాయిస్తారు. ఒక్కో క్యాంపులో ఏ, బీ, సీ, డీ, ఈ టైపు క్వార్టర్లు ఉంటాయి. ఏ, బీ టైపులో రికార్డు అసిస్టెంట్లు, సీ టైపులో సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, డీ,ఈ టైపుల్లో జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. ఆయా క్వార్టర్లలో నివాసం ఉండే అధికారుల హెచ్ఆర్ఏ ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. ఉద్యోగం చేస్తున్నంత కాలం సిబ్బంది ఏ, బీ, సీ క్యాంపుల్లో నివాసం ఉండవచ్చు. అయితే కొందరు ఉద్యోగులు పదవి విరమణ చేసినా ఖాళీ చేయడంలేదు. పలుమార్లు అర్అండ్బీ అధికారులు తాఖీదులు ఇచ్చినా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం 175 మంది అధికారులు పదవి విరమణ చేసి కూడా క్వార్టర్లను ఖాళీ చేయడంలేదని అధికారులు గుర్తించారు. వీరితో క్వార్టర్లను ఖాళీ చేయించాలని అధికారులు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌కు నివేదించారు. అయినా ఇంతవరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో దర్జాగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే క్వార్టర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మొండి చేయి మిగులుతోంది. దీంతో వారు బయట ప్రైవేట్ ఇళ్ల అద్దెకు ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు కేటాయింపు.. మరోవైపు కొన్ని క్వార్టర్లను ప్రైవేట్ వ్యక్తులకు కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం చేయనివారు దాదాపు 30–40 మంది అక్కడ తిష్టవేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నతా«ధికారులతో తమకున్న పరిచయంతో అక్కడ క్వార్టర్లను కేటాయించుకుంటున్నారు. దీంతో నిజమైన ఉద్యోగులకు గదులు కేటాయించడంలో జాప్యం జరుగుతోంది. కలెక్టర్‌కు నివేదించాం : సిద్ధారెడ్డి, డీఈ కొందరు ఉద్యోగులు పదవీ విరమణ చేసినా ఖాళీ చేయడం లేదు. ఈ విషయాన్ని గుర్తించి కలెక్టర్‌కు నివేదించాం. కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అయితే ఇంతవరకు వారికి ఖాళీ చేయించాలని ఎలాంటి ఆదేశాలు రాలేదు. 24కేఎన్ఎల్25/25ఏ : బీక్యాంపులోని ప్రభుత్వ క్వార్టర్లు -
ఆర్‌అండ్‌బీకి పంచాయతీరాజ్ రోడ్లు
- అప్పగించేందుకు ప్రభుత్వ అంగీకారం - తొలుత 33 రోడ్ల అప్పగింత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన రహదారుల పనులు చేపట్టిన రోడ్లు భవనాల శాఖ తాజాగా పంచాయతీరాజ్ రోడ్లపై కన్నేసింది. హైవేలతో సరైన అనుసంధానం లేని మండల కేంద్రాలకు సంబంధించిన రోడ్లను అభివృద్ధి చేసే బాధ్యతను స్వీకరించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు పంచాయతీరాజ్ శాఖ అధీనంలో ఉన్న ఇలాంటి రోడ్ల ను ఇకనుంచి తానే నిర్వహిస్తానని ముందుకొచ్చింది. అందుకు ప్రభుత్వమూ అంగీకరించింది. ఈ క్రమంలో తొలుత 33 రోడ్లను ఆ శాఖకు అప్పగించనుంది. సోమవారం జరిగే ఓ సమావేశంలో దీనికి సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న మండల కేంద్రాలను సమీపంలోని హైవేలకు రెండు వరసల రోడ్లతో అనుసంధానించనుంది. ఈ తరహా రోడ్ల నిర్మాణానికి నిధుల అవసరం ఎక్కువగా ఉండటం, ప్రత్యేక నిర్మాణ పద్ధతులను అవలంభించాల్సి ఉన్నందున అది పంచాయతీరాజ్ శాఖకు కష్టంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అలాంటి అన్ని రోడ్లను దశలవారీగా రోడ్లు భవనాల శాఖకు అప్పగించబోతోంది. అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాజధాని నగరానికి రెండు వరసలతో అనుసంధాన రోడ్ల నిర్మాణంతోపాటు దాదాపు 370 వంతెనల నిర్మాణ పనులతో బిజీగా ఉన్న రోడ్లు భవనాల శాఖ ఈ కొత్త రోడ్ల బాధ్యత ఎలా నిర్వహిస్తుందన్నది సందేహంగా మారింది. గతంలో పంచాయతీరాజ్ రోడ్లను తీసుకుని వాటి పనులను పూర్తి చేసేందుకు సంవత్సరాల కొద్ది సమయం తీసుకుంది. తమ పరిధిలో ఉండిఉంటే వాటిని ఓ స్థాయికి తెచ్చేవారమని, ఆర్అండ్బీ తీసుకున్నతర్వాత మామూలు నిర్వహణను కూడా చేయలేదని అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇప్పుడు కొత్తగా తీసుకోబోయే రోడ్ల విషయంలో ఆర్అండ్బీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలని పరిశీలకులు అంటున్నారు. -
బెజవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే క్వార్టర్స్
విజయవాడ : విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్ ఆవరణలో ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసుకు దగ్గర్లోని స్టేట్ గెస్ట్‌హౌస్ ఆవరణలో ఉన్న బ్లాక్-2 భవనం పడగొట్టి దాని స్థానంలో నూతన భవనం నిర్మించే ప్రతిపాదనపై అంచనాలు తయారుచేశారు. కొత్తగా 10 అంతస్థుల భవనాలు 130 గదులతో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో రోడ్లు, భవనాల శాఖ ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపింది. విమానాశ్రయానికి కూడా అనువుగా ఉండే విజయవాడలో రాజధాని తుళ్లూరుకు అతి దగ్గర్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన బ్లాక్ 2 భవనం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఈ భవనంలో పైన నాలుగు గదులు, కింద ఒక సూట్ నిరుపయోగంగా ఉన్నాయి. కొత్త భవనం నిర్మించేందుకు ఆర్అండ్బి అధికారులు ప్లాన్లు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. త్వరలో ఈ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తామని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇళ్ల కోసం మంత్రులు గాలింపు చంద్రబాబు మంత్రుల నివాసాలు, క్యాంపు కార్యాలయాలను కూడా విజయవాడలో ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర మంత్రులు బరంపార్కులో తమ నివాసాలను ఏర్పాటుచేసుకోవాలని భావిస్తున్నారు. మరికొందరు మంత్రులు విజయవాడ నగరంలో ప్రైవేటు ఇళ్లను అద్దెకు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. -
ఏసీబీ దృష్టికి ఆర్అండ్బీ అధికారుల లీలలు
ప్రైస్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఎడాపెడా అంచనా వ్యయం పెంపు సాక్షి, హైదరాబాద్: ఆ భవననిర్మాణ అంచనా వ్యయం రూ.12 కోట్లని టెండర్ ప్రకటనలో వెల్లడించారు. ఆ తర్వాత రూ.20 కోట్లకు పరిపాలన అనుమతులు మం జూరు చేశారు. కానీ తర్వాత దాన్ని రూ.39.97 కోట్లకు పెంచేశారు. నిర్మాణ వైశాల్యాన్ని పెంచాల్సి వచ్చిందంటూ రూ.67.30 కోట్లకు అంచనా వ్యయాన్ని పెం చారు. ప్రైస్ అడ్జస్ట్మెంట్ పేరుతో రూ.13 కోట్లు కేటాయించారు. ఇవన్నీ ఎర్ర మంజిల్‌లోని రోడ్లు, భవనాల శాఖ సొంత భవన నిర్మాణంలో వింతలు. ఆర్అండ్బీ భవన నిర్మాణంలో భారీ అవినీతి చోటు చేసుకుందని, ప్రైస్ అడ్జస్ట్మెంట్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయినా ఇంకా ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో ఈ వ్యవహారంపై దృష్టి సారించాలంటూ తాజాగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు ఫిర్యాదులందాయి. సదరు కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా అధికారులు చక్రం తిప్పుతున్నారని ఇటీవలి కాలంలో ఆ నిర్మాణ సంస్థకు దక్కిన పనుల వివరాలను ‘రోడ్లు, భవనాల శాఖ శ్రేయోభిలాషులు’ పేరుతో కొందరు ఏసీబీకి అందించారు. ఒకే కాంట్రాక్టర్‌కు పనులెలా.. టెండర్ ప్రకారమే పనులు కేటాయిస్తున్నట్టు పైకి చెప్పుకొంటున్నా అధికారులు కూడబలుక్కుని ఒకే కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా చక్రం తిప్పుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మలక్‌పేటలో ప్రభుత్వ ఉద్యోగులకు 224 ఇళ్లతో కూడిన కాలనీ నిర్మాణం(రూ.48.95 కోట్లు), ఎర్రమంజిల్‌లో ఆర్అండ్బీ సొంత భవన సముదాయం (రూ.67.30 కోట్లు), సిటీ సివిల్ కోర్డుల ప్రాంగణంలో భవన నిర్మాణం (రూ.8.20 కోట్లు), క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో భవన నిర్మాణాలు (రూ.9 కోట్లు), అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ భవనంలో పనులు (రూ.2.67 కోట్లు), విభజన నేపథ్యంలో సచివాలయంలో నిర్మాణ పనులు (రూ.4 కోట్లు), బీఆర్కే భవనంలో కలరింగ్ పనులు (రూ.99.5 లక్షలు), హైకోర్టు ప్రహరీ నిర్మాణ పనులు (రూ.90 లక్షలు).. ఇలా కొన్ని వివరాలను అందులో అందజేశారు. మెటీరియల్ ధరలు అనూహ్యంగా పెరిగితే ప్రైస్ అడ్జస్ట్మెంట్ పేరుతో కాస్ట్ ఎస్కలేషన్‌కు అవకాశం కల్పిస్తారు. సకాలంలో పనులు చేయాలని, అంచనా వ్యయంలో 5 శాతానికి మించరాదని నిబంధనలు ఉంటాయి. కానీ ఆర్అండ్బీ సొంత భవనం విషయంలో నిబంధనలు తోసిరాజని.. సకాలంలో పనులు జరగకున్నా ఏకంగా 20 శాతం మేర మొత్తాన్ని ప్రైస్ అడ్జస్ట్మెంట్ కింద చెల్లించినట్టు ఫిర్యాదులో వివరించారు. -
‘పుష్కర రోడ్ల’కు గడువు గండం
సాక్షి, రాజమండ్రి : పుష్కర మహాపర్వం సందర్భంగా జిల్లాలో తలపెట్టిన రోడ్ల అభివృద్ధి సకాలంలో పూర్తి కావడం కష్టసాధ్యంగా కనిపిస్తోంది. టెండరు ప్రక్రియ నిబంధనల ప్రకారం పను లు నిర్వహించేందుకు కాంట్రాక్టర్లకు కనీస గడువు ఇవ్వాల్సి ఉంటుంది. అధికారుల ఒత్తిడితో ముందుగానే చేసినా అది కాంట్రాక్టర్లకు, అధికారులకు కూడా సాంకేతిక సమస్యలు తెచ్చిపెడుతుంది. ఒక పని చేయాలంటే కాంట్రాక్టరుకు మూడునెలలు కనీస గడువు ఉంటుంది. అదీ పని విలువను బట్టి ఉంటుంది. ఈ నిబంధనకు విరుద్దంగా టెండర్లు పిలవకూడదు. ఇదే అధికారులకు చిక్కులు తెచ్చి పెడుతోంది. ఆర్అండ్బీ శాఖ రూ.330 కోట్లు వ్యయమయ్యే రోడ్ల పనులను జిల్లాలో చేపడుతోంది. వీటిలో కొన్ని పనుల వ్యయం రూ.30 కోట్లు మించి ఉంది. వీటికి కనీస గడువు ఆరు నుంచి తొమ్మిది నెలలు ఇవ్వాలి. కానీ పుష్కర పనులు చేపట్టి పూర్తి చేసేందుకు కేవలం నాలుగు నెలల వ్యవధే ఉంది. అదనపు పనులు సూచించిన సీఎం ఆర్అండ్బీ శాఖకు ముందస్తుగా ప్రభుత్వం రూ.87.50 కోట్ల పనులు మంజూరు చేసింది. ఇవికాక రెండు నెలల క్రితం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి స్వయంగా మరికొన్ని పనులు సూచించారు. వీటికయ్యే వ్యయం రూ.333 కోట్లు. ఈ నిధులతో సుమారు 42 పనులు చేపడుతున్నారు. వీటిలో 33 పనులకు టెండర్లు పిలిచారు. ఇంకా తొమ్మిది పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. కాగా ఈ తొమ్మిది పనుల్లోనే కీలకంగా చేపట్టాల్సిన మూడు రోడ్లు ఉన్నాయి. ప్రధానంగా రాజమండ్రి -భద్రాచలం రోడ్డును విమానాశ్రయం ఉన్న మధురపూడి వరకూ 13 కిలోమీటర్లు నాలుగు లేన్లుగా మార్చాలని సీఎం సూచించారు. పై మూడు పనులకు రూ. 100 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. చిక్కంతా ఇక్కడే.. టెండరు నిబంధనల ప్రకారం రూ.ఐదు కోట్ల విలువైన పని చేపట్టే సమయంలో కాంట్రాక్టరుకు కనీస వ్యవధి ఆరు నెలలు ఇస్తారు. పది కోట్ల కన్నా ఎక్కువ విలువైన పని చేస్తే తొమ్మిది నెలల, అంకన్నా ఎక్కువ సమయం ఉంటుంది. ఈ పనుల కేటాయింపులో అంత పనిని నిర్ణీత సమయంలో చేసే ఆర్థిక స్థోమత చట్టబద్దంగా కాంట్రాక్టర్‌కు ఉందా అనేదీ పరిగణిస్తారు. కొన్ని అత్యవసర సమయాల్లో పనుల నెలరోజుల్లో పూర్తిచేసే వెసులుబాటు ఉంటుంది. కానీ అవి రూ.కోటి కన్నా తక్కువవి అయి ఉంటాయి. పుష్కరాలకు కేవలం మూడు నెలల్లో పరిమితికి మించి పనులు చేపట్టేందుకు సాంకేతికంగా నిబంధనలు అనుకూలించవని అధికారులు అందోళనకు గురవుతున్నారు. విమానాశ్రయ రోడ్డు విస్తరణ పని అంచనా విలువే రూ.33 కోట్లు ఉంది. ఈ పనిని రెండు దశల్లో చేపడుతున్నారు. మొద టి దశలో ఐదు కిలోమీటర్ల విస్తరణకు రూ.ఐదు కోట్లు కేటాయించగా, రెండవ దశలో రూ.28 కోట్లతో మరో ఏడు కిలోమీటర్లు విస్తరిస్తారు. రెండవ దశ పనులకు ఇంకా టెండర్లు పిలవాలి. కాంట్రాక్టర్ల విముఖత కేవలం నాలుగు నెలల్లో రూ.కోట్ల విలువైన పనులు చే యాలంటే చట్టపరమైన చిక్కులతో పాటు, మెటీరియల్ సమస్యలు కూడా తలెత్తుతాయనే భయంతో కాంట్రాక్టర్లు పెద్ద రోడ్డుపనులకు ముందుకు రావడం లేదు. ఇదే కారణంతో గోదావరి గట్టు వెడల్పుకు పిలిచిన 2 పనులకు ఎవరూ టెండర్లు వేయలేదు. అంతే కాక అధికారులు అనుమతి ఇచ్చారని పనులు చేస్తే ఫైనాన్షియల్ టర్నోవర్‌పై కూడా ప్రభావం చూపుతుందని భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు పనులకు కూడా గడువు సమస్య తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
అడుగడుగునా నిర్లక్ష్యం...
బొబ్బిలి: బొబ్బిలి పట్టణం, మండలంలో ఆర్అండ్బీ అధికారులు నిర్లక్ష్యం వల్ల వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. బొబ్బిలి నుంచి బలిజిపేటకు పిరిడి మీదుగా వెళ్లే దారి లో అడుగుకో మలుపు ఉంది. గొల్లపల్లి దాటిన తరువాత శివడ వలస వెళ్లినంతవరకూ ఎన్ని మలుపులు ఉన్నాయో లెక్కేలేదు. చివరకు పిరిడి గ్రామంలో కూడా ఈ మలుపులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇన్ని మలుపులు ఉన్నా ఎక్కడా హెచ్చరిక బోర్డు పెట్టలేదు. బొబ్బిలి నుంచి చింతాడ మీదుగా బలిజిపేట వెళ్లే రహదారికి కూడా ఇదే పరిస్థితి. బొబ్బిలి మండలం పిరిడి, కలవరాయి, కోమటిపల్లిల వద్ద కాలేజీలు అధికంగా ఉన్నాయి. కానీ బస్సులు పెద్దగా లేకపోవడంతో ఉన్న బస్సుల్లోనే వీరు వేలాడుతూ ప్రయాణించాల్సి వస్తోంది. స్పీడ్ బ్రేకర్లేవీ..? రామభద్రపురం: విశాఖ నుంచి రాయగడ, శ్రీకాకుళంనుంచి జ యపూర్ వెళ్లే వాహనాలు రామభద్రపురం జంక్షన్‌పై నుంచి వెళ్తాయి. అయితే ఇక్కడ జాగ్రత్త చర్యలేవీ తీసుకోలేదు. ఆరికతోట వద్ద ప్రమాదకర మలుపు ఉన్నప్పటికీ ప్రభుత్వం సిగ్నల్ బోర్డులు పెట్టలేదు. ఇటీవల రోడ్డు పక్కన ఉన్న మండల కార్యాలయం వద్ద శ్రావణి అనే మహిళ కారు ఢీకొని చనిపోయింది. అక్కడ స్పీడ్ బ్రేకర్, సిగ్నల్ బోర్డు లేకపోవడమే దీనికి కారణమని స్థానికులంటున్నారు. జాతీయ రహదారి పక్కనే స్కూళ్లు, హాస్టళ్లు ఉన్నా స్కూల్ జోన్ బోర్డులేవీ కనిపించవు. దినదిన గండం బాడంగి: మండలంలో ప్రధాన రోడ్లు, కల్వర్టులు అధ్వానంగా ఉన్నాయి. వీటిపై ప్ర యాణం దినదిన గండంగా మారుతోంది. పాల్తేరు -వాడాడకు బస్సు సౌకర్యం ఉన్నా రోడ్డు మట్టిరోడ్డును తలపిస్తుంది. కోడూ రు -షికారుగంజి రోడ్డు కూడా అక్కడక్కడా పాడైపోవడంతో బస్సుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఆకులకట్ట గ్రామం శివారులో గల చెరువు గట్టుపై మలుపు మరింతప్రమాదకరంగా మారింది. కానీ ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. భీమవరం-ముగడ మధ్యలో చినమంతపొలం వద్ద రోడ్డు కల్వర్టు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆదమరిస్తే అంతే... తెర్లాం రూరల్: మండలంలో పలు గ్రామాల వద్ద ఉన్న కల్వర్టులు ప్రయాణికులను భయపెడుతున్నాయి. ఇక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తెర్లాం-బొబ్బిలి ఆర్ అండ్ బీ రోడ్డులో తెర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దాటిన తరువాత ఉన్న మంగళి గెడ్డ కాలువపై గతంలో నిర్మించిన కాజ్‌వేకు రెండు వైపులా రక్షణ గోడలు లేవు. రాజాం-రామభద్రపురం రాష్ట్రీయ రహదారిని ఆనుకొని టెక్కలివలస, పెరుమాళి, నెమలాం జంక్షన్, డి.గదబవలస, పణుకువలస జంక్షన్, వెలగవలస, రంగప్పవలస, తెర్లాం జంక్షన్, ఎంఆర్ అగ్రహారం, కూనాయవలస గ్రామాలు ఉన్నా యి. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వాహనాల రాకపోకలు ఉంటాయి. కానీ ప్రమాదాల నివారణకు అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం. -
కలెక్టర్ మాటకు పక్షం రోజులు
సిద్దిపేట టౌన్ : సర్కార్ బడుల తీరును ప్రజలు పరిశీలించడానికి తద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పాఠశాలలోని సమస్యలను పరిష్కరించడానికి వీలుగా అన్ని పాఠశాలల ముందు రెండు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటుకు ఇన్చార్జ్ కలెక్టర్ శరత్ వీడియో కాన్ఫరెన్సులో 15 రోజుల క్రితం విద్యాధికారులకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కానీ వీటి నిర్మాణానికి నిధులు ఎలా వస్తాయో చెప్పలేదు. విద్యాధికారులు నిధుల విషయమై ఆర్ అండ్‌బీ, పంచాయతీ రాజ్ అధికారులను సంప్రదిస్తే తమకు ఎలాంటి ఉత్తర్వులు లేవని చేతులెత్తేస్తున్నారు. దీంతో పాఠశాల నిర్వహణ నిధులు కూడా విడుదల కానీ స్కూల్స్ స్పీడ్ బ్రేకర్లను, సైన్ బోర్డులను ఎలా ఏర్పాటు చేయాలో తెలియక ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నాయి. రూ. ఐదు కోట్ల నిధులు అనివార్యం.. సిద్దిపేట డివిజన్లో 162 హైస్కూల్స్, సుమారు 500 ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లో అన్ని పాఠశాలల ముందు వీటిని ఏర్పాటు చేయాలంటే సుమారు రూ. 5 కోట్ల నిధులు అనివార్యం. కానీ నిధులు ఎలా వస్తాయో తెలియక అటూ ప్రధానోపాధ్యాయులు, ఇటూ విద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. చాలీచాలని స్కూల్ గ్రాంట్స్‌తో కనీస అవసరాలనే తీర్చలేకపోతున్నామని ఈ క్రమంలో వీటిని ఎలా నిర్మిస్తామని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. -
టీడీపీ భూస్థాపితం ఖాయం
పలమనేరు, న్యూస్‌లైన్: మాజీ మంత్రి పట్నం సుబ్బ య్య తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో కొండంత బలం వచ్చిందని పలువు రు మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద సోమవారం సుబ్బయ్యకు పార్టీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలమనేరు అసెంబ్లీ అభ్యర్థి అమరనాథ రెడ్డి మాట్లాడుతూ సుబ్బయ్య లాంటి సీనియర్ నాయకులు తమ పార్టీలోకి రావడం చాలా సంతోషకరమన్నారు. ఆయన రాకతో పార్టీకి మరింత బలం పెరిగిం దన్నారు. ఇదే సమయంలో పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ భూస్థాపితం కావడం తథ్యమన్నారు. జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకు దళిత నేతలంతా ఏకతాటిపైకి రావడం, ముస్లిం మైనారిటీలు అండగా నిలవడం, బడుగు బలహీన వర్గాలు తమ పార్టీని అక్కున చేర్చుకోవడం పార్టీకి ఎంతగానో మేలు చేస్తుందన్నారు. చంద్రబాబు కుమ్మక్కు, కుట్ర లు నచ్చక ఎంతోమంది సీనియర్లు ఆ పార్టీని వీడుతున్నారని చెప్పారు. ఇప్పటిదాకా టీడీపీ ఈ ప్రాం తంలో సజీవంగా ఉందంటే దానికి కారణం సుబ్బయ్య కృషేనన్నారు. అలాంటి వ్యక్తి తమ పార్టీలోకి రావడం తన కు ఎంతగానో మేలు చేకూరుస్తుందన్నారు. అనంతరం చిత్తూరు మాజీ ఎమ్మెల్యే మనోహర్ మాట్లాడుతూ సుబ్బయ్య రాకతో పలమనేరు అసెంబ్లీ ఎన్నికల్లో అమరనాథరెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నా రు. టీడీపీ డబ్బున్న వారితో నిండిపోయిందని విమర్శించారు. వేపంజేరి మాజీ ఎమ్మెల్యే గాంధీ మాట్లాడు తూ వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. అందు కే ప్రజల మద్దతు వైఎస్ఆర్సీపీకి ఉందన్నారు. సుబ్బ య్య పార్టీలోకి రావడం తమకందరికీ సంతోషాన్ని కలిగించిందన్నారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం వైఎస్ఆర్ సీపీతోనే సాధ్యమన్నారు.అనంతరం మాజీమంత్రి సుబ్బయ్య మాట్లాడారు. ఇంతమంది మిత్రుల మధ్య తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం చాలా ఆనందించదగ్గ విషయమన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. పలమనేరులో అమరనాథరెడ్డి గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ హేమంత్‌కుమార్ రెడ్డి, సీవీ.కుమార్, ఖాజా, రవీంద్ర, శ్యామ్, మూర్తి, కమాల్, ఖాజా, ఎలి జర్,మోహన్ రెడ్డి, ఏకే.మూర్తి, కిషోర్, షబ్బీర్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్వోబీకి లైన్ క్లియర్
మట్టెవాడ, న్యూస్‌లైన్ : వరంగల్ రైల్వేగేటుపై వై ఆకారంలో నిర్మించే ఆర్వోబీ (రైల్ ఓవర్ బ్రిడ్జి)కి లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు బ్రిడ్జి నిర్మాణంపై ఉన్న కేసును గురువారం హై కోర్టు కొట్టివేసింది. ఆర్వోబీ వల్ల నష్టపోతున్నామంటూ పరిహారం చెల్లించడంతోపాటు బ్రిడ్జి డిజైన్ మార్చాలని బట్టలబజార్, బీటు బజార్ వ్యాపారులు హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసింది. దీని వల్ల బ్రిడ్జి నిర్మాణం నిమిత్తం అటు బీటు బజార్, ఇటు కరీమాబాద్ వైపు పిల్లర్ల కోసం గోతులు తీసిన తర్వాత పనులు ఆగిపోయాయి. సుమారు 15 నెలలుగా పనులు జరగకుండా ఉండడం తో అండర్ రైల్వేగేట్, కరీమాబాద్ రోడ్డులో ప్రయాణం సాగక ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీటు బజార్ వైపు గుంతలో పడి ఒకరు, కరీమాబాద్ వైపు తీసిన గుంతలో పడి ఇద్దరు మృత్యువాత పడ్డారు. వందలాది మంది ప్రయాణికులు, పాదచారులు గుంతల్లోపడి గాయాలపాలయ్యా రు. ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైంది. మూడు వైపులా ఆర్వోబీ పనులు వరంగల్ రైల్వేగేటు నుంచి బీటు బజార్, కరీమాబాద్, ఖమ్మం రోడ్ వైపు వై ఆకారంలో నిర్మించే బ్రిడ్జి కోసం 60కోట్లు మంజూరయ్యాయి. అందులో బ్రిడ్జి నిర్మాణానికి 28కోట్లు, ఆస్తులు కోల్పోయిన వారికి 32 కోట్లు ప్రభుత్వం కెటాయిం చింది. ఈ మూడు వైపులా ఎటు 470 మీటర్ల చొప్పున మొత్తం 1410 మీటర్ల మేర ఆర్వోబీ నిర్మాణం జరుగనుంది. బ్రిడ్జి పైన 30 ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఫలించిన పోరాటాలు ఎన్నో ఏండ్ల పోరాటాల ఫలితంగా మంజూరైన ఆర్వోబీ పనులు ప్రారంభించిన రెండు నెలలకే ఆగిపోయాయి. బ్రిడ్జి నిర్మాణంపై వ్యాపారులు వేసిన కేసు ఎత్తివేయాలని, పనులు తిరిగి చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆర్వోబీ పరిరక్షణ సమితి కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కలెక్ట ర్, ఆర్అండ్బీ అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రా లు అందజేశారు. మరో వైపు బీటు బజార్‌లోని పలు హమాలీ, ఆటో ట్రాలీ కార్మికులు సైతం ఆందోళనలు చేపట్టారు. ఒకప్పు డు ఆర్వోబీ వద్దని నిరసన తెలిపిన పలువురు వ్యాపారులు కూడా వ్యాపారాలకు తీవ్ర నష్టం కలుగుతోందన్న విషయం తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్వోబీ నిర్మాణంపై ఉన్న కేసు కొట్టివేయడంతో ప్రజలు, వ్యాపారులు, హమాలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో పనులు ప్రారంభం : రాజేశ్వర్‌రెడ్డి, డీఈఈ, ఆర్అండ్ బీ, వరంగల్ ఆర్వోబీపై ఉన్న కేసు కొట్టివేశారు. మరో రెండు మూడు రోజు ల్లో పనులు ప్రారంభమవుతాయని ఆర్ అండ్ బీ డీఈఈ రాజేశ్వర్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. కరీమాబాద్‌లో సంబరాలు ఆర్వోబీపై కేసు కొట్టివేయడంతో నగరంలోని కరీమాబాద్ చెట్ల వారిగడ్డ వద్ద ఆర్వోబీ పరిరక్షణ సమితి కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో గురువారం బానాసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ న్యాయదేవత ప్రజల పక్షం ఉన్నందునే ఆర్వోబీపై వేసిన కేసు కోట్టి వేయబడిందని, పనులు వెంటనే పారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గోనె రాజయ్య, ఆవునూరి రామ్మూర్తి, మాటిశెట్టి మురళి, క్యాతం రాజేందర్, కోరె సుభాష్, వంటల మల్లమ్మ, రమాదేవి, లక్క న ర్సింగం, దస్తగిర్, కాలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
మాకేంటి..?
బొబ్బిలి, న్యూస్‌లైన్: పిల్లలు ఆడుకునేందుకు అవకాశం కల్పించమంటే ‘మాకేటి’ అని చేయి జాపుతున్నారు. ప్లాన్‌కు ఆమోద ముద్ర వేయాలంటే ఒక నెల అద్దె సొమ్ము ఆమ్యామ్యాగా ఇమ్మంటున్నారు. కొలతలు తీయాలంటే రూ. ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకూ అవుతుందని బేరమాడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా పిల్లలు, అంగన్వాడీ కార్యకర్తలు అవస్థలు పడవలసి వస్తోంది. పట్టణాల్లో ఉండే అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని సదుపాయాలూ కల్పించాలని, పిల్లలకు ఆటపాటలు నేర్పాలని ప్రభుత్వం సంకల్పించింది. దీని కోసం విధివిధానాలను ప్రకటించింది. మారిన నిబంధనల ప్రకారం రెండు పూటలా కేంద్రాన్ని నిర్వహిస్తూ పిల్లలకు ఆటపాటలు నేర్పాలి. మరుగుదొడ్లు వంటి సదుపాయాలున్న ఇళ్లను అద్దెకు తీసుకుని అందులో కేంద్రాలను నిర్వహించాలి. ఇది అమలులోకి వస్తే... ఇంతవరకూ ఇరుకు గదుల్లో, ఎటువంటి సదుపాయాలూ లేని ఇళ్లలో మగ్గిపోతున్న పిల్లలకు కొంత సౌకర్యంగా ఉంటుంది. ఈ నింబంధనలు ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని విజయనగరం పురపాలక సంఘంలో 127 అంగన్వాడీ కేంద్రాలు, బొబ్బిలి మున్సిపాలిటీలో 104 కేంద్రాలు, పార్వతీపురం మున్సిపాలిటీలో 55 కేంద్రాలు, సాలూరు పురపాలక సంఘంలో 102 కేంద్రాలున్నాయి. వీటిని చిన్న చిన్న ఇళ్లల్లో నిర్వహిస్తున్నారు. వీటికి ప్రస్తుతం రూ 750 ఇంటి అద్దెగా చెల్లిస్తున్నారు. అయితే పై సదుపాయాలుంటే మూడు వేల రూపాయలు అద్దె ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్అండ్బీ అధికారులు కొలతలు తీసి, ఆమోద ముద్ర వేస్తేనే అద్దె నిర్ణయించి మంజూరు చేయడానికి, కొత్త భవనాల్లోకి కేంద్రాలను మార్చడానికి వీలవుతుంది. దీని కోసం కొంతమంది అధికారులు... అంగన్వాడీ కార్యకర్తల నుంచి భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారని సమాచారం. అద్దెకు తీసుకున్న ఇళ్లకు సంబంధించిన ప్లాన్లు వేయడానికి, వాటిని ఆర్అండ్బీ శాఖ ద్వారా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి సొమ్ము డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. దీని కోసం ఇప్పటికే ప్రైవేటుగా ప్లాన్లు గీసేవారితో ఆర్అండ్బీ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్లానులు గీయడానికి ఒక్కొక్క కేంద్రానికి ఏడు వందల రూపాయల నుంచి వేయి రూపాయలు, ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి ఒకనెల అద్దె చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇస్తామన్నా.. ఆర్అండ్బీ అధికారులు లెక్కల ప్రకారమైతే ఎంత పెద్ద ఇల్లు అయినా రూ 15 వందల నుంచి రూ 2 వేలు దాటి అద్దె నిర్ణయించే పరిస్థితి లేకపోవడం, బయట అద్దెలు అంతకు రెండింతలు ఉండడంతో ఏమి చేయాలో అంగన్వాడీ కార్యకర్తలకు పాలుపోవడం లేదు. ఇప్పటికే ఐసీడీఎస్ అధికారులు ఒత్తిడితో ఇళ్లను అద్దెకు తీసుకున్న వారు సొంతంగాఅద్దె డబ్బులు చెల్లించుకొనే పరిస్థితి దాపురించింది. అదీ కాక ప్లానులు గీస్తామంటే ఎవరూ ఇళ్లను అద్దెకు ఇవ్వడం లేదు. కొత్త అద్దెలు రావాలంటే కేంద్రానికి సంబంధించి పూర్తి స్థాయి ఇంటి ప్లానులు జత చేయాలని ఆంక్షలు ఉండడం కార్యకర్తలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. పిల్లలు ఆడుకోవడానికి మైదానం ఉండాలని అధికారులు చెబుతుంటే, ఇళ్ల ముందు ఉండే ఖాళీ జాగాలను లెక్కల్లోకి తీసుకోకుండా కొలతలు వేస్తుండడంపై కూడా కార్యకర్తలు మండిపడుతున్నారు.