రోడ్ల నిర్మాణంలో ఆస్ట్రేలియా టెక్నాలజీ
గజ్వేల్‌లో ప్రయోగాత్మకంగా అమలు
భారీగా తగ్గనున్న నిర్మాణ వ్యయం
గజ్వేల్: రోడ్ల నిర్మాణంలో ఆస్ట్రేలియా టెక్నాలజీ రాబోతుంది. ప్రత్యేకంగా తయారు చేసిన రసాయన మిశ్రమంతో మట్టిని గట్టిపరిచి రోడ్డు నిర్మాణానికి అనువుగా తయారు చేయడం ద్వారా కంకర వాడకాన్ని తగ్గించనున్నారు. ఫలితంగా నిర్మాణ వ్యయం 30 నుంచి 40 శాతం తగ్గనుంది. ఈ కొత్త పద్ధతిని తొలిసారిగా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ శాఖ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ ప్రయోగం దేశంలోనే మొదటిదని అధికారులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా టెక్నాలజీతో రోడ్డు నిర్మిస్తే ఖర్చు తగ్గించవచ్చనే భావనకు వచ్చిన ఆర్‌అండ్‌బీ శాఖ.. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గజ్వేల్–దౌల్తాబాద్ రహదారిపై ఆరెపల్లి వద్ద ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్లే–క్రేట్ సంస్థ ప్రతినిధులు బారీ, బిరియాన్‌లు కొత్త టెక్నాలజీని గురువారం ప్రయోగాత్మకంగా చూపారు.
సిద్దిపేట జిల్లా ఆర్‌అండ్‌బీ ఈఈ బాల్‌నర్సయ్య, గజ్వేల్ డిప్యూటీ ఈఈ బాలప్రసాద్‌లతో కలసి తమ కంపెనీ తయారు చేసిన క్లే–క్రేట్ రసాయనాన్ని 10 వేల లీటర్ల వాటర్ ట్యాంకులో 30 లీటర్లు కలిపారు. ఆ తర్వాత రోడ్డు నిర్మాణం జరుగుతున్న చోట మట్టిని ముందుగా రోటోవేటర్‌తో కదిలించి.. దానిపై రసాయన మిశ్రమం కలిగిన నీటిని చల్లారు. ఆ తర్వాత రోటోవేటర్‌తో తిప్పి.. రోలర్‌తో తొక్కించారు. ఫలితంగా మట్టి గట్టిపడింది. దీనివల్ల రోడ్డు నిర్మాణంలో సహజంగా 45 సెంటీమీటర్ల లేయర్‌తో కంకర వాడతారు. కానీ ఈ మిశ్రమంతో మట్టిని తొక్కించి రోలర్‌తో గట్టి పర్చడం వల్ల మట్టి గట్టిపడుతుంది. దీనివల్ల కంకర వాడకం 6 నుంచి 8 సెంటీ మీటర్లకు తగ్గిపోతుంది. ఫలితంగా కిలోమీటర్ పొడవున అవసరమయ్యే కంకర పరిమాణం భారీగా తగ్గిపోతుంది. సహజంగానే ఖర్చు తగ్గిపోనుంది.