సాక్షి, రాజమండ్రి : పుష్కర మహాపర్వం సందర్భంగా జిల్లాలో తలపెట్టిన రోడ్ల అభివృద్ధి సకాలంలో పూర్తి కావడం కష్టసాధ్యంగా కనిపిస్తోంది. టెండరు ప్రక్రియ నిబంధనల ప్రకారం పను లు నిర్వహించేందుకు కాంట్రాక్టర్లకు కనీస గడువు ఇవ్వాల్సి ఉంటుంది. అధికారుల ఒత్తిడితో ముందుగానే చేసినా అది కాంట్రాక్టర్లకు, అధికారులకు కూడా సాంకేతిక సమస్యలు తెచ్చిపెడుతుంది. ఒక పని చేయాలంటే కాంట్రాక్టరుకు మూడునెలలు కనీస గడువు ఉంటుంది. అదీ పని విలువను బట్టి ఉంటుంది. ఈ నిబంధనకు విరుద్దంగా టెండర్లు పిలవకూడదు. ఇదే అధికారులకు చిక్కులు తెచ్చి పెడుతోంది. ఆర్‌అండ్‌బీ శాఖ రూ.330 కోట్లు వ్యయమయ్యే రోడ్ల పనులను జిల్లాలో చేపడుతోంది. వీటిలో కొన్ని పనుల వ్యయం రూ.30 కోట్లు మించి ఉంది. వీటికి కనీస గడువు ఆరు నుంచి తొమ్మిది నెలలు ఇవ్వాలి. కానీ పుష్కర పనులు చేపట్టి పూర్తి చేసేందుకు కేవలం నాలుగు నెలల వ్యవధే ఉంది.
అదనపు పనులు సూచించిన సీఎం
ఆర్‌అండ్‌బీ శాఖకు ముందస్తుగా ప్రభుత్వం రూ.87.50 కోట్ల పనులు మంజూరు చేసింది. ఇవికాక రెండు నెలల క్రితం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి స్వయంగా మరికొన్ని పనులు సూచించారు. వీటికయ్యే వ్యయం రూ.333 కోట్లు. ఈ నిధులతో సుమారు 42 పనులు చేపడుతున్నారు. వీటిలో 33 పనులకు టెండర్లు పిలిచారు. ఇంకా తొమ్మిది పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. కాగా ఈ తొమ్మిది పనుల్లోనే కీలకంగా చేపట్టాల్సిన మూడు రోడ్లు ఉన్నాయి. ప్రధానంగా రాజమండ్రి -భద్రాచలం రోడ్డును విమానాశ్రయం ఉన్న మధురపూడి వరకూ 13 కిలోమీటర్లు నాలుగు లేన్లుగా మార్చాలని సీఎం సూచించారు. పై మూడు పనులకు రూ. 100 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది.
చిక్కంతా ఇక్కడే..
టెండరు నిబంధనల ప్రకారం రూ.ఐదు కోట్ల విలువైన పని చేపట్టే సమయంలో కాంట్రాక్టరుకు కనీస వ్యవధి ఆరు నెలలు ఇస్తారు. పది కోట్ల కన్నా ఎక్కువ విలువైన పని చేస్తే తొమ్మిది నెలల, అంకన్నా ఎక్కువ సమయం ఉంటుంది. ఈ పనుల కేటాయింపులో అంత పనిని నిర్ణీత సమయంలో చేసే ఆర్థిక స్థోమత చట్టబద్దంగా కాంట్రాక్టర్‌కు ఉందా అనేదీ పరిగణిస్తారు. కొన్ని అత్యవసర సమయాల్లో పనుల నెలరోజుల్లో పూర్తిచేసే వెసులుబాటు ఉంటుంది. కానీ అవి రూ.కోటి కన్నా తక్కువవి అయి ఉంటాయి. పుష్కరాలకు కేవలం మూడు నెలల్లో పరిమితికి మించి పనులు చేపట్టేందుకు సాంకేతికంగా నిబంధనలు అనుకూలించవని అధికారులు అందోళనకు గురవుతున్నారు. విమానాశ్రయ రోడ్డు విస్తరణ పని అంచనా విలువే రూ.33 కోట్లు ఉంది. ఈ పనిని రెండు దశల్లో చేపడుతున్నారు. మొద టి దశలో ఐదు కిలోమీటర్ల విస్తరణకు రూ.ఐదు కోట్లు కేటాయించగా, రెండవ దశలో రూ.28 కోట్లతో మరో ఏడు కిలోమీటర్లు విస్తరిస్తారు. రెండవ దశ పనులకు ఇంకా టెండర్లు పిలవాలి.
కాంట్రాక్టర్ల విముఖత
కేవలం నాలుగు నెలల్లో రూ.కోట్ల విలువైన పనులు చే యాలంటే చట్టపరమైన చిక్కులతో పాటు, మెటీరియల్ సమస్యలు కూడా తలెత్తుతాయనే భయంతో కాంట్రాక్టర్లు పెద్ద రోడ్డుపనులకు ముందుకు రావడం లేదు. ఇదే కారణంతో గోదావరి గట్టు వెడల్పుకు పిలిచిన 2 పనులకు ఎవరూ టెండర్లు వేయలేదు. అంతే కాక అధికారులు అనుమతి ఇచ్చారని పనులు చేస్తే ఫైనాన్షియల్ టర్నోవర్‌పై కూడా ప్రభావం చూపుతుందని భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు పనులకు కూడా గడువు సమస్య తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
‘పుష్కర రోడ్ల’కు గడువు గండం
Published Thu, Feb 19 2015 12:20 AM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM
Advertisement
Advertisement