రహదారులు నెత్తురోడాయి...
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రహదారులు నెత్తురోడాయి. ఇరు రాష్ట్రాల్లో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 16మంది దుర్మరణం చెందారు. సుమారు 60మందికి పైగా గాయపడ్డారు. విశాఖ జిల్లాలో ఏడుగురు, నెల్లూరు ముగ్గురు, గుంటూరు ముగ్గురు, మెదక్ జిల్లాలో ఇద్దరు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. మరోవైపు గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
విశాఖ జిల్లా మధురవాడలోని మారికవలస వద్ద ఈరోజు ఉదయం ఓ ఆర్టీసీ బస్సు...ఆటోను ఢీకొనటంతో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. గుంటూరు జిల్లా చౌడవరం దగ్గర జరిగిన ఆటో ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8మంది గాయపడ్డారు. మెదక్ జిల్లా సిద్ధిపేటలో జరిగిన బైక్ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. అంతేకాకుండా విశాఖ జిల్లా కసింకోట మండలంలో జాతీయరహదారిపై రెండు బస్సులు ఢీ కొనడంతో 50 మంది గాయపడ్డారు.
అలాగే విశాఖ జిల్లా కశింకోట మండలం నర్సింగబిల్లి వద్ద ఈరోజు ఉదయం ప్రమాదం జరిగింది. పుష్కర భక్తులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు... ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 25మంది గాయపడ్డారు. వీరిలో 19మందికి యలమంచిలి కమ్యూనిటీ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఆరుగురిని అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రులంతా విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం మామిడిపల్లి గ్రామస్తులుగా తెలుస్తోంది.
నెల్లూరు జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును... లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.... పలువురికి గాయాలయ్యాయి. గూడూరు మండలం వెందోడుకు చెందిన కొంతమంది బస్సును బుక్ చేసుకుని పుష్కరాలకు బయల్దేరారు. అయితే బస్సు బోగోలు మండలం కడనూతల దగ్గరకు వచ్చే రిపేరైంది.
దీంతో బస్సును పక్కన ఆపి మెకానిక్‌కోసం డ్రైవర్ వెళ్లాడు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది. బస్సు వెనుక సీట్లో ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా... మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మరో ఇద్దరికి సీరియస్‌గా ఉంది. వీరిని నెల్లూరుకు తరలించారు. గాయపడ్డవారికి కావలి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువు కబళించింది. పత్తిపాడు మండలం ఓములనాయుపాలెం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గరు మృతి చెందారు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన కొంతమంది పుష్కరాలు వెళ్లారు. గోదావరిలో పుణ్యస్నానం చేసి.. తిరిగి స్వస్థలాలకు బయల్దేరారు. అయితే మార్గమధ్యలోనే ప్రమాదం జరిగింది. లారీని తప్పించబోయిన ఓ ఆటో... మరో ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా...ఆరుగురు గాయపడ్డారు.
వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురం శివారులో టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏటూరునాగారం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వరంగల్‌కు తరలించారు. రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరికి చెందిన కొంతమంది టాటా ఏస్ వాహనంలో మంగపేట పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలు చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.మలాపురం శివారులో వీరి వాహనం... ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి బోల్తాపడింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇక మెదక్ జిల్లా సిద్ధిపేటలో జరిగిన బైక్ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు.