పుష్కర విషాదాలు | Road Accidents in Godavari Pushkaralu | Sakshi
Sakshi News home page

పుష్కర విషాదాలు

Published Thu, Jul 23 2015 12:40 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Road Accidents in Godavari Pushkaralu

 గోదావరి పుష్కర విషాదాలు జిల్లా వాసులను వెంటాడుతున్నాయి. పుణ్యం వస్తుందని వెళ్లిన భక్తులు రోడ్డు ప్రమాదాల పాలవుతున్నారు. మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. వేర్వేరు ప్రదే శాల్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ క్షతగాత్రురాలు కూడా తనువు చాలించింది.
 
 బొంతుపేట వాసి దుర్మరణం
 లావేరు: తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి సమీపంలో జాతీయ రహదారిపై బుధ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని బొం తుపేట గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త బొం తు శ్రీనివాసరావు(42) దుర్మరణం చెందారు. గ్రామానికి చెందిన సుమారు 20 మంది బొలోరో లగేజీ వాహనంలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గోదావరి పుష్కర స్నానానికి బయలుదేరి వెళ్లారు. అదే వాహనంలో మృతుడు శ్రీనివాసరావుతో పాటు భార్య భారతి, కుమారుడు పూర్ణచంద్రరరావు, కుమార్తె వసుధలు బయలు దేరారు. బుధవారం వేకువ జామున 3 గంటల సమయంలో వర్షం పడుతుండటంతో కత్తిపూడి సమీపంలో వాహనాన్ని పక్కన నిలిపి పరదాను సరిచేసి వాహనంలోకి తిరిగి ఎక్కేలోగా వెనుక నుంచి వస్తున్న ట్రక్కువ్యాన్ శ్రీనివాసరావును బలంగా ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో వాహనంలో ఉన్నవారంతా భయాందోళన చెందారు. అక్కడే ఉన్న భార్యాపిల్లలు భోరున విలపించారు. శ్రీనివాసరావు మృతివార్త తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పుణ్యకార్యానికి వెళ్తే కుమారుడిని అందని లోకానికి దేవుడు తీసుకుపోయాడంటూ తల్లి తవిటమ్మ భోరున విలపిస్తోంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే  బొంతుపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బొంతు సూర్యనారాయణ, శిగురుకొత్తపల్లి సర్పంచ్ మీసాల రామినాయుడులు బయలుదేరి ప్రమాదస్థలానికి వెళ్లి మృతేదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు.
 
 లారీ బోల్తాపడి..
 సరుబుజ్జిలి: గోదావరి పుష్కరాలకు లారీపై వెళ్తూ  సరుబుజ్జిలి మండలం కూనజమ్మన్నపేట గ్రామానికి చెందిన కూన అప్పలనాయుడు(65) మృతి చెందాడు.  కుటుంబ సభ్యులు తెలి పిన వివరాల ప్రకారం.. మృతుడు అప్పలనాయుడు గ్రామానికి చెందిన మరికొంతమందితో కలసి శ్రీకాకుళం కొత్తరోడ్డు నుంచి గొట్టాలు తీసుకెళ్లే లారీపై బయలుదేరాడు. విశాఖ జిల్లా నక్కపల్లి ప్రాంతం వచ్చేసరికి లారీ బోల్తా కొట్టడంతో   గొట్టాలు మీదపడి ఊపిరాడక మరణించాడు. ఆయనకు భార్య వెంకటరత్నం, ఇద్దరుకుమారులు మోహపరావు, వాసుదేవరావు ఉన్నారు.
 
 పుష్కరాల నుంచి తిరిగి వస్తూ...
 పాతపట్నం: రాజమండ్రి పుష్కర స్నానాలకు వెళ్లి వస్తుండగా తుని దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం రొమదల గ్రామానికి చెందిన పొట్నూరు కమలమ్మ (60) మృతి చెందింది. గ్రామానికి చెందిన 40 మంది సోమవారం రాత్రి ప్రత్యేక బస్సులో పుష్కర స్నానానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్న భోజనం కోసం తుని వద్ద ఆగారు. భోజనం చేసి తిరిగి బస్సువద్దకు వచ్చేందుకు రోడ్డు దాటుతుండగా కమలమ్మను బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు.
 
 వీఆర్వోకు గాయాలు
 జలుమూరు: గోదావరి పుష్కరాలు నుంచి వస్తుండగా పాగోడు వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో  చల్లవానిపేట వీఆర్వో అర్.త్యాగరాజుకు కుడిచేయి విరిగిపోయింది. స్వగ్రామం బుడితి వెళ్తుండగా పాగోడు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ డీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. త్యాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ బి.గణపతిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 ఊపిరాడక..
 జి.సిగడాం: మండలంలోని ఎందువ పంచాయతీ నర్సింపురం గ్రామానికి చెందిన వి.పారమ్మ(55) రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్ వద్ద ఊపిరి అందక మృతి చెందినట్టు  కుటుంబ సభ్యులు తెలిపారు. జనం రద్దీగా ఉండడంతో మెట్లపైనే కుప్పకూలి తనవు చాలించిందన్నారు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.
 
 పుష్కర క్షతగాత్రురాలు మృతి
  ప్రమాద ఘటన రోజే భర్త మృతి
 పోలాకి: రాజమండ్రి పుష్కరాలకు వెళ్తూ విశాఖజిల్లా సబ్బవరం సమీపంలో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డ బోర సరస్వతి చికిత్సపొందుతూ కేజీహెచ్‌లో బుధవారం మృతి చెందింది.  పోలాకి మండలం రాళ్లపాడు గ్రా మానికి చెందిన బోర యర్రప్పడు, సరస్వతి దంపతులు సమీప బంధువులతో కలసి ఈనెల 15న పుష్కరయాత్రకు బయలుదేరారు. వారు ప్రయాణించే టాటామ్యాజిక్ వాహనం ప్రమాదానికి గురికావడంతో భర్త యర్రప్పడు అక్కడికక్కడే మృతి చెందగా, భార్య సరస్వతి తలకు బలమైన గాయమైంది. చికిత్స నిమిత్తం ఆమెను విశాఖపట్నంలోని ఆస్పత్రిలో చేర్చినా ఫలితం లేకపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దంపతులిద్దరూ పుష్కర ప్రమాదంలో మృతి చెందడంతో రాళ్లపాడు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement