ఇక చంద్రబాబు ఇంటికి నిధులు ఇవ్వలేం!  | Chandrababu home can not be funded says R and B | Sakshi
Sakshi News home page

ఇక చంద్రబాబు ఇంటికి నిధులు ఇవ్వలేం! 

Published Thu, Sep 20 2018 4:20 AM | Last Updated on Thu, Sep 20 2018 7:53 AM

Chandrababu home can not be funded says R and B - Sakshi

హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసం

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయాలకు లెక్కలేనంతగా పారుతున్న నిధుల వరదకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రోడ్‌ నెంబరు 65లో నూతనంగా నిర్మించిన సీఎం ఇంటికి నిధులు ఇక కేటాయించలేమని రహదారులు, భవనాల శాఖ తేల్చింది. సీఎం ఇంటికి సీసీ కెమేరాల నిమిత్తం రూ. 20 లక్షలు కేటాయించాలని ఆర్‌అండ్‌బీకి ప్రతిపాదనలు అందాయి. ఈ ఫైల్‌ను ఆర్‌అండ్‌బీలోని ఎలక్ట్రికల్‌ విభాగానికి పంపించారు. అయితే ఇప్పటికే ఎలక్ట్రికల్‌ విభాగం నుంచి సీసీ కెమేరాలకు, సోలార్‌ ఫెన్సింగ్‌ కోసం రూ. 12 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. లేక్‌ వ్యూ అతిధి గృహం, మదీనాగూడలోని ఫాం హౌస్, నాలుగేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 24లో అద్దెకున్న ఇంటికి, నారావారిపల్లెలోని ఇంటికి ఈ నిధులు ఖర్చు చేశారు.

సాధారణంగా సీఎం చంద్రబాబు అధికారికంగా క్యాంపు కార్యాలయంగా ఉపమోగిస్తున్న దానికే నిధుల్ని ఖర్చు చేసేందుకే ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తుంది. అధికారికంగా ఉండవల్లి కరకట్ట పక్కనున్న నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా గుర్తించారు. ఇక్కడ ఇప్పటికే సీసీటీవీ కెమేరాలు బిగించేందుకు గాను రూ. కోటి ఖర్చు చేశారు. హైదరాబాద్‌లో లేక్‌ వ్యూ అతిధి గృహాన్ని మొట్ట మొదటిసారిగా క్యాంపు కార్యాలయంగా గుర్తించడంతో అక్కడ సీసీటీవీ కెమెరాలను బిగించేందుకు, ఫెన్సింగ్‌ ఏర్పాటుకు రూ. 3 కోట్లు వ్యయం చేశారు. ఆ తర్వాత మదీనాగూడలో ఫాం హౌస్‌కు, అద్దెకున్న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబరు–24లో నివాసాలకు సీసీకెమేరాలు బిగించాలని నిధులు కేటాయించారు.

సీఎం సొంత జిల్లా చిత్తూరులోని నారావారిపల్లెకు రూ. 36 లక్షలు కేటాయించారు. అయితే సీసీటీవీలకు నిధుల కేటాయింపునకు అభ్యంతరాలు వ్యక్తం కాగా, ఉన్నత స్థాయిలోనే జోక్యం చేసుకుని నిధుల విడుదలకు అనుమతులిప్పిచ్చారు. మళ్లీ హైదరాబాద్‌లోని సీఎం ఇంటికి సీసీ కెమెరాలకు గాను ఇప్పుడు రూ. 20 లక్షలకు ప్రతిపాదనలు పంపడంపై ఆర్‌అండ్‌బీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఇంటికి నిధుల విడుదలకు ఆడిట్‌ అభ్యంతరాలు వ్యక్తమవుతాయనే ఉద్ధేశంతో నిధుల మంజూరుకు అధికారులు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. అయితే నిధుల విడుదలకు సీఎంవో నుంచి ఒత్తిళ్లు అధికమవుతున్నాయని ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

సీఎం విలాసవంతమైన ఖర్చులపై లేఖరాసి పొగాకు రైతు ఆత్మహత్య
సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయాలు, విలాసవంతంగా చేస్తున్న ఖర్చుపై గతంలో పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పొగాకు రైతు సుబ్బారావు లేఖ ద్వారా ప్రశ్నించి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన అప్పట్లో జాతీయ మీడియాలో సంచలనమైంది. సీఎం క్యాంపు కార్యాలయాల ఖర్చుపై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. చంద్రబాబు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement