సీఎం నివాసానికి 'వంద'నం
తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం.. తాత్కాలిక నివాసం.. క్యాంపు కార్యాలయం.. ఇలా రకరకాల పేర్లు చెబుతూ ఇప్పటి వరకు దాదాపు వంద కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో సీఎం నివాసం నిర్మాణంలో ఉంది. ప్రస్తుతానికి అద్దె ఇంట్లో ఉంటున్నారు. విజయవాడలో క్యాంపు కార్యాలయం ఉంది. ఉండవల్లిలో కృష్ణానది కరకట్టన ఓ ప్రైవేటు భవనం సీఎం నివాసానికి ఎంపిక చేశారు. వీటన్నిటికీ చంద్రబాబు పదవిలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో ఈ ఖర్చు చేసినట్లు సమాచారం.
ఉండవల్లిలోని లింగమనేని ఎస్టేట్స్ సీఎం అధికారిక నివాసానికి ఎంపిక చేసినట్లుగా వార్తలకెక్కింది. ఇక్కడ ప్రత్యేక విద్యుత్తు సబ్‌స్టేషన్, సెల్ ఫోన్ టవర్లు, రహదార్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. 30 సెంట్ల స్థలంలో రూ. 5 కోట్ల వ్యయంతో విద్యుత్తు సబ్‌స్టేషన్ పనులు చకాచకా ప్రారంభించారు. సెల్‌ఫోన్ టవర్లు ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం రెండు టవర్లు ఏర్పాటు కానున్నాయి. ఒకటి బీఎస్‌ఎన్‌ఎల్‌ది కాగా, మరో టవర్ ఎయిర్‌టెల్, వోడా, ఐడియాలకు సంబంధించినదిగా చెబుతున్నారు. ఒక టవర్ ఏర్పాటుకు రూ. 70-80 లక్షల మధ్య ఖర్చవుతుంది. ఈ రెండు టవర్లకు కలిపి రూ. 1.6 కోట్ల వరకు ఖర్చు కానుంది.
భవిష్యత్తులో వీటి నిర్వాహణకు సైతం ప్రభుత్వం కొంత భరించాల్సి ఉంటుందని సెల్ ఫోన్ కంపెనీ వర్గాల సమాచారం. ఇక్కడి రహదారుల నిర్మాణానికి రూ. 48 కోట్లకు పైగానే ఖర్చవుతుందని అంచనా. కృష్ణానదిపై భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక బోట్లు, అదనపు సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. వీటికి కూడా మరో రూ. 5 కోట్లకు పైగానే కేటాయించాల్సి రావచ్చంటూ ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అతిథి గృహం మరమ్మతులకు, అక్కడ వినియోగించే సామగ్రికి రూ. 5-7 కోట్ల మధ్య ఖర్చవుతున్నట్లు సమాచారం.