చంద్రబాబు ఆ ఇంట్లో చేరడం న్యాయమా?
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటివరకూ చంద్రబాబు ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదని, ఆయన ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని మండిపడ్డారు. సీపీఐ రామకృష్ణ సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ విదేశీ సంస్థలకు కట్టబెట్టేందుకే రాష్ట్రంలో లక్షల ఎకరాలు భూ సేకరణ చేస్తున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు చంద్రబాబు తీసుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. రాయలసీమ విద్యార్థులకు శాపంగా మారిన 120 జీవో రద్దు చేయాలన్నారు. వివాదాస్పదంగా నిర్మించిన ఇంట్లో చంద్రబాబు చేరడం న్యాయమా? అని రామకృష్ణ ప్రశ్నించారు.
సాక్షాత్తూ సీఎం అంతటి వ్యక్తే కృష్ణానది కరకట్టపై అక్రమ భవనాన్ని తన నివాసంగా మార్చుకుంటే ఇక అక్రమాలకు అడ్డు చెప్పేది ఎవరని, నదీ గర్భంలో అక్రమంగా భవనాలు నిర్మించారంటూ టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గగ్గోలు పెట్టారని, అక్రమ భవనాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని, తాను నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్ అక్రమమో, సక్రమమో సీఎం చెప్పాలన్నారు. రైతులు హాయిగా ఉన్నారంటూ చంద్రన్న రైతుయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.