నిన్నొదలా | gave thee | Sakshi
Sakshi News home page

నిన్నొదలా

Published Thu, Nov 24 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM

నిన్నొదలా

నిన్నొదలా

నిన్నొదలా
 
- ప్రభుత్వ క్వార్టర్లలో అనర్హుల తిష్ట
- పదవీ విరమణ చేసి ఖాళీ చేయని 175 మంది ఉద్యోగులు
- 30 గృహాల్లో ప్రైవేట్‌ వ్యక్తుల జీవనం
- ఆర్నెల్ల క్రితం కలెక్టర్‌కు నివేదించిన ఆర్‌అండ్‌బీ అధికారులు
- ఆదేశాలకే పరిమితమైన ఉన్నతాధికారి విచారణ 
   
ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్మించిన ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్‌లో అనర్హులు దర్జాగా నివసిస్తున్నారు. పదవీ విరమణ చేసినా ఉద్యోగులతో పాటు కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు కూడా ఇక్కడే నివాసం ఏర్పచుకుని ఖాళీ చేయడం లేదు. కొత్తవారికి గృహాలను కేటాయించడానికి ఇక్కట్లు తప్పడం లేదు. ఆరు నెలల క్రితం ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌కు నివేదించారు. ఆయన ఓ ఉన్నతాధికారి ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించినా ఇంత వరకు దానిపై స్పందన లేదు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం క్వాటర్స్‌ కోసం నిరీక్షిస్తున్నా ఖాళీ ఏర్పడటం లేదు. 
- కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు
 
కర్నూలు నగరంలో ప్రభుత్వ ఉద్యోగుల నివాసం కోసం ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో ఏ,బీ,సీ క్వార్టర్లు ఉన్నాయి. ఏక్యాంపులో 58, బీక్యాంపులో 643, సీక్యాంపులో 248 కార్టర్లు ఉన్నాయి. మూడు క్యాంపుల్లో కలసి మొత్తం 949 క్వార్టర్లు ఉన్నాయి. వీటిలో మౌలిక వసతుల కల్పన బాధ్యత అర్‌అండ్‌బీ శాఖది. ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపు పని మాత్రం రెవెన్యూ అధికారుల కిందకు వస్తుంది. కర్నూలు నగరంలో పనిచేసే ఉద్యోగులకు వీటిని కేటాయిస్తారు. ఒక్కో క్యాంపులో ఏ, బీ, సీ, డీ, ఈ టైపు క్వార్టర్లు ఉంటాయి. ఏ, బీ టైపులో రికార్డు అసిస్టెంట్లు, సీ టైపులో సీనియర్‌ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, డీ,ఈ టైపుల్లో జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. ఆయా క్వార్టర్లలో నివాసం ఉండే అధికారుల హెచ్‌ఆర్‌ఏ ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. ఉద్యోగం చేస్తున్నంత కాలం సిబ్బంది ఏ, బీ, సీ క్యాంపుల్లో నివాసం ఉండవచ్చు. అయితే కొందరు ఉద్యోగులు పదవి విరమణ చేసినా ఖాళీ చేయడంలేదు. పలుమార్లు అర్‌అండ్‌బీ అధికారులు తాఖీదులు ఇచ్చినా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం 175 మంది అధికారులు పదవి విరమణ చేసి కూడా క్వార్టర్లను ఖాళీ చేయడంలేదని అధికారులు గుర్తించారు. వీరితో క్వార్టర్లను ఖాళీ చేయించాలని అధికారులు జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌కు నివేదించారు. అయినా ఇంతవరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో దర్జాగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే క్వార్టర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మొండి చేయి మిగులుతోంది. దీంతో వారు బయట ప్రైవేట్‌ ఇళ్ల అద్దెకు ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. 
 
ప్రైవేట్‌ వ్యక్తులకు కేటాయింపు..
మరోవైపు కొన్ని క్వార్టర్లను ప్రైవేట్‌ వ్యక్తులకు కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం చేయనివారు దాదాపు 30–40 మంది అక్కడ తిష్టవేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు ఉన్నతా«ధికారులతో తమకున్న పరిచయంతో అక్కడ క్వార్టర్లను కేటాయించుకుంటున్నారు. దీంతో నిజమైన ఉద్యోగులకు గదులు కేటాయించడంలో జాప్యం జరుగుతోంది. 
  
కలెక్టర్‌కు నివేదించాం : సిద్ధారెడ్డి, డీఈ
కొందరు ఉద్యోగులు పదవీ విరమణ చేసినా ఖాళీ చేయడం లేదు. ఈ విషయాన్ని గుర్తించి కలెక్టర్‌కు నివేదించాం. కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. అయితే ఇంతవరకు వారికి ఖాళీ చేయించాలని ఎలాంటి ఆదేశాలు రాలేదు.    
24కేఎన్‌ఎల్‌25/25ఏ : బీక్యాంపులోని ప్రభుత్వ క్వార్టర్లు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement