బెజవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే క్వార్టర్స్
విజయవాడ : విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్ ఆవరణలో ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసుకు దగ్గర్లోని స్టేట్ గెస్ట్‌హౌస్ ఆవరణలో ఉన్న బ్లాక్-2 భవనం పడగొట్టి దాని స్థానంలో నూతన భవనం నిర్మించే ప్రతిపాదనపై అంచనాలు తయారుచేశారు. కొత్తగా 10 అంతస్థుల భవనాలు 130 గదులతో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో రోడ్లు, భవనాల శాఖ ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపింది.
విమానాశ్రయానికి కూడా అనువుగా ఉండే విజయవాడలో రాజధాని తుళ్లూరుకు అతి దగ్గర్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన బ్లాక్ 2 భవనం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఈ భవనంలో పైన నాలుగు గదులు, కింద ఒక సూట్ నిరుపయోగంగా ఉన్నాయి. కొత్త భవనం నిర్మించేందుకు ఆర్‌అండ్‌బి అధికారులు ప్లాన్లు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. త్వరలో ఈ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తామని అధికార వర్గాల ద్వారా తెలిసింది.
ఇళ్ల కోసం మంత్రులు గాలింపు
చంద్రబాబు మంత్రుల నివాసాలు, క్యాంపు కార్యాలయాలను కూడా విజయవాడలో ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర మంత్రులు బరంపార్కులో తమ నివాసాలను ఏర్పాటుచేసుకోవాలని భావిస్తున్నారు. మరికొందరు మంత్రులు విజయవాడ నగరంలో ప్రైవేటు ఇళ్లను అద్దెకు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.