ప్రైస్ అడ్జస్ట్‌మెంట్ పేరుతో ఎడాపెడా అంచనా వ్యయం పెంపు
సాక్షి, హైదరాబాద్: ఆ భవననిర్మాణ అంచనా వ్యయం రూ.12 కోట్లని టెండర్ ప్రకటనలో వెల్లడించారు. ఆ తర్వాత రూ.20 కోట్లకు పరిపాలన అనుమతులు మం జూరు చేశారు. కానీ తర్వాత దాన్ని రూ.39.97 కోట్లకు పెంచేశారు. నిర్మాణ వైశాల్యాన్ని పెంచాల్సి వచ్చిందంటూ రూ.67.30 కోట్లకు అంచనా వ్యయాన్ని పెం చారు. ప్రైస్ అడ్జస్ట్‌మెంట్ పేరుతో రూ.13 కోట్లు కేటాయించారు. ఇవన్నీ ఎర్ర మంజిల్‌లోని రోడ్లు, భవనాల శాఖ సొంత భవన నిర్మాణంలో వింతలు. ఆర్‌అండ్‌బీ భవన నిర్మాణంలో భారీ అవినీతి చోటు చేసుకుందని, ప్రైస్ అడ్జస్ట్‌మెంట్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయినా ఇంకా ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో ఈ వ్యవహారంపై దృష్టి సారించాలంటూ తాజాగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు ఫిర్యాదులందాయి. సదరు కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా అధికారులు చక్రం తిప్పుతున్నారని ఇటీవలి కాలంలో ఆ నిర్మాణ సంస్థకు దక్కిన పనుల వివరాలను ‘రోడ్లు, భవనాల శాఖ శ్రేయోభిలాషులు’ పేరుతో కొందరు ఏసీబీకి అందించారు.
ఒకే కాంట్రాక్టర్‌కు పనులెలా..
టెండర్ ప్రకారమే పనులు కేటాయిస్తున్నట్టు పైకి చెప్పుకొంటున్నా అధికారులు కూడబలుక్కుని ఒకే కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా చక్రం తిప్పుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మలక్‌పేటలో ప్రభుత్వ ఉద్యోగులకు 224 ఇళ్లతో కూడిన కాలనీ నిర్మాణం(రూ.48.95 కోట్లు), ఎర్రమంజిల్‌లో ఆర్‌అండ్‌బీ సొంత భవన సముదాయం (రూ.67.30 కోట్లు), సిటీ సివిల్ కోర్డుల ప్రాంగణంలో భవన నిర్మాణం (రూ.8.20 కోట్లు), క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో భవన నిర్మాణాలు (రూ.9 కోట్లు), అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ భవనంలో పనులు (రూ.2.67 కోట్లు), విభజన నేపథ్యంలో సచివాలయంలో నిర్మాణ పనులు (రూ.4 కోట్లు), బీఆర్‌కే భవనంలో కలరింగ్ పనులు (రూ.99.5 లక్షలు), హైకోర్టు ప్రహరీ నిర్మాణ పనులు (రూ.90 లక్షలు).. ఇలా కొన్ని వివరాలను అందులో అందజేశారు. మెటీరియల్ ధరలు అనూహ్యంగా పెరిగితే ప్రైస్ అడ్జస్ట్‌మెంట్ పేరుతో కాస్ట్ ఎస్కలేషన్‌కు అవకాశం కల్పిస్తారు. సకాలంలో పనులు చేయాలని, అంచనా వ్యయంలో 5 శాతానికి మించరాదని నిబంధనలు ఉంటాయి. కానీ ఆర్‌అండ్‌బీ సొంత భవనం విషయంలో నిబంధనలు తోసిరాజని.. సకాలంలో పనులు జరగకున్నా ఏకంగా 20 శాతం మేర మొత్తాన్ని ప్రైస్ అడ్జస్ట్‌మెంట్ కింద చెల్లించినట్టు ఫిర్యాదులో వివరించారు.
ఏసీబీ దృష్టికి ఆర్‌అండ్‌బీ అధికారుల లీలలు
Published Mon, May 18 2015 2:13 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement