ముంచేశారు...
ముంచేశారు...
Published Tue, Aug 29 2017 9:39 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
అవివాహితలకు పెళ్లయినట్లు రికార్డులు...
నాన్‌రెసిడెన్షియల్ జాబితాలో స్థానికులు
ఆర్‌అండ్‌ఆర్ జాబితా గందరగోళం
అధికారుల అడ్డగోలు ఎంట్రీలు
పోలవరం నిర్వాసితుల్లో అలజడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు, వేలేరుపాడు:
నిర్వాసితులను ముంచేశారు. పోలవరం ప్రాజెక్టు పరిహారం విషయంలోనే కాకుండా ఆర్ అండ్ ఆర్‌లో కూడా నిర్వాసితులకు అన్యాయం జరిగింది. అధికారులు తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలు వారి పట్ల శాపంగా మారుతున్నాయి. భూసేకరణ జరిగిన ప్రాంతంలో పుట్టి పెరిగి ఉద్యోగ రీత్యా బయటకు వెళ్లిన వారిని సైతం స్థానికులుగానే గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నా వాటన్నిటిని తోసి రాజన్నారు. తమను మేనేజ్ చేసిన వారిని లోకల్‌గా, మిగిలిన వారిని నాన్‌లోకల్‌గా గుర్తించి పెద్దస్థాయిలో అక్రమాలకు తెరలేపారు. వ్యక్తిగత పరిహారం జాబితాను మంగళవారం ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పెట్టింది. దీన్ని చూసిన వారు గగ్గోలు పెడుతున్నారు. పోలవరం నిర్వాసితుల ఇండ్ల పరిహారం ప్యాకేజీ జాబితా అంతా గజిబిజి గందరగోళంగా ఉంది. వ్యక్తిగత పరిహారం జాబితాను ప్రకటించిన అధికారులు ఇండ్ల (ఇంటి విలువ) పరిహారం ప్రకటింలేదు. ఈ జాబితాలో కొంతమంది స్థానికులకు రేషన్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు అన్ని ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ, నాన్‌రెసిడెన్షియల్‌గా ప్రకటించారు. మరి కొంతమంది యువతులకు అసలు పెళ్లిళ్లు కానప్పటికీ, పెళ్లిళ్లు అయినట్లు (మ్యారీడ్)గా ప్రకటించారు. అన్ని ఆధారాలు ఉన్నా పెద్ద సంఖ్యలో స్ధానిక నిర్వాసితుల పేర్లు మాత్రం గల్లంతయ్యాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29,545 కుటుంబాలు తమ ఇళ్లు కోల్పోతున్నాయి. ఇందులో పదివేల గిరిజన కుటుంబాలుండగా, మిగిలిన 19,545 గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలు. అయితే పది నెలల క్రితం సర్వే చేసిన అధికారులు నిర్వాసితులు నివాసముండే పూరిపాకలు, పెంకుటిళ్లు, ఆర్‌సీసీ స్లాబ్ బిల్డింగ్‌లు, రేకులున్న ఇండ్లు, ఇవే కాకుండా 35 ఏళ్ల క్రితం నిర్మించిన మద్రాసు టెర్రర్స్ ఇండ్లు (టేకు కమ్మెలపై స్లాబ్ వేసిన ఇండ్లు) నమోదు చేసారు. ఇంటి పొడవు, వెడల్పులకు మాత్రమే కొలతలు తీసుకున్నారు. అప్పట్లో ఇళ్ల విలువను అధికారులు వెల్లడించలేదు. ఇంటి విలువ వేయాల్సిన ఆర్‌అండ్‌బీ అధికారులు కూడా ఈ ఇళ్లను అసలు పరిశీలించలేదు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు బోర్‌లను పరిశీలించలేదు. ఫారెస్ట్, హార్టికల్చర్ అధికారులు ఏ ఒక్కరు రాలేదు. అయినా అప్పట్లో తక్కువ ఇంటి విలువలతో కూడిన జాబితా ప్రకటించారు. జూన్ 12వ తేదీన గ్రామసభలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించారు. ఆ తర్వాత మళ్లీ తాజాగా ఇంటి స్ధిరాస్తి విలువలు లేకుండా కేవలం వ్యక్తిగత ప్యాకేజీ మాత్రమే ప్రకటించారు. దీని వల్ల అనేక మంది నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. జగన్నాథపురం గ్రామానికి చెందిన ముతిక ముత్తేశ్వరి భర్త అప్పారావు అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతి చెందాడు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. భర్త మృతి చెందినప్పటి æనుంచి అక్కడే కిరాణా షాపు నడుపుకుంటూ జీవిస్తోంది. అమెను స్థానికేతరురాలిగా ప్రకటించారు. ఈమె బతుకుబండి భారంగా లాగిస్తోంది. స్ధానికంగా అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఈమె కుటుంబాన్ని నాన్‌రెసిడెన్ష్‌గా ప్రకటించారు.
అర్హులకు చెయ్యిచ్చారు...
ఈ రెండు మండలాల్లో అనేక మంది స్థానికుల పేర్ల ఎదురుగా జాబితాలో నష్టపరిహారం సున్నాగా చూపించారు. గతంలో అర్హులుగా ప్రకటించిన స్థానికుల పేర్లు ప్రస్తుత జాబితాలో అనర్హులుగా వచ్చాయి. గతంలో అనర్హులుగా ప్రకటించిన స్థానికేతరుల పేర్లు అర్హులుగా వచ్చాయి. దీని వెనుక భారీ కుంభకోణం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు.
కానోళ్లకు పెళ్లిళ్లు చేశారు...æ
ఆర్ అండ్ ఆర్ నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన యువతులకు పెళ్లి కాకుంటేనే వ్యక్తిగత ప్యాకేజీ పొందే అవకాశం ఉంది. వేలేరుపాడు మండల కేంద్రంలో, జగన్నాథపురం, పాతపూచిరాల, రుద్రమకోట ఇంకా అనేక గ్రామాల్లో 18 నుంచి 20 ఏళ్ల యువతులకు పెళ్లిళ్లు కానప్పటికీ అయినట్లు జాబితాలో ప్రకటించారు. అలాగే గతంలో పెళ్లిళ్లు అయినవాళ్ల పేర్లు మాత్రం పెళ్లి కానట్లు ప్రస్తుత జాబితాలో చూపించారు. ఫలితంగా వాస్తవంగా పెళ్లికాని యువతులు వ్యక్తిగత ప్యాకేజీ కోల్పోయో పరిస్థితి నెలకొంది.
40 ఏళ్లుగా ఉంటున్నా నాన్‌లోకల్‌గా ప్రకటించారు: అప్జల్ పాష , వేలేరుపాడు
నేను నా కుటుంబం నలభై ఏళ్ళుగా వేలేరుపాడులో స్ధిర నివాసముంటున్నాం. నాకు రేషన్ కార్డు, అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ జాబితాలో నాన్‌రెసిడెన్స్‌గా చూపించారు. నాకు నలుగురు అమ్మాయిలు. ఇందులో ఇద్దరికి పెళ్లిళ్లు చేసాను. ఇద్దరికి ఇంకా పెళ్లి చేయకుండానే వారిని వివాహితలుగా ప్రకటించారు. ఇది అన్యాయం.
అందరికీ న్యాయం చేస్తాం: పి కోటేశ్వరరావు జాయింట్ కలెక్టర్
అర్హులకు ఎవరికీ అన్యాయం జరగదు. అందరికీ న్యాయం జరిగేలా చూస్తాం. నకిలీ ధ్రువపత్రాలతో ప్యాకేజీ పొందాలని చూస్తే అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
Advertisement
Advertisement