సాక్షి, తిరుపతి: తిరుపతి ఎంపీ చింతామోహన్ ఆదివారం కార్యకర్తలతో ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సమావేశం ఏర్పాటు చేసుకోగా, సమైక్యవాదులు ముట్టడించారు. మీడియాతో మాట్లాడాలని బయటకు వచ్చిన ఎంపీని రాజీనామా చేయాలని సమైక్యాంధ్రపరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వచ్చిన ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఎంపీ వెంట ఉన్న ఆయన అనుచరులు, కాంగ్రెస్ నాయకులు సమైక్యాంధ్ర పరిరక్షణ పేరుతో ముట్టడికి వచ్చిన టీడీపీ నాయకులు శాప్స్ రాజారెడ్డి, కోడూరు బాలకృష్ణను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మొదట మీ నాయకుడు చంద్రబాబును రాజీనామా చేయమనండి, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది, మాట్లాడింది మీరే, మీ నాయకుడిని నిలదీయండి’ అని విరుచుకుపడ్డారు.
పీసీసీ కార్యదర్శి ఊకా విజయకుమార్, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, మాజీ కౌన్సిలర్లు టీకే బ్రహ్మానందం, కుడితి సుబ్రమణ్యం, నర్సింహులు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగభూషణం వారిపై విరుచుకుపడ్డారు. దీంతో ఆర్‌అండ్‌బీ ఆవరణలో కొద్దిసేపు అరుపులు కేకలు, నినాదాలు, ప్రతినినాదాలతో వాతావరణం వేడెక్కింది. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు ఎంపీ చుట్టూ భద్రత వలయంలా నిలబడ్డారు. సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించాలని, తక్షణం ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా సమైక్యాంధ్ర నినాదాలతో వంద బైక్‌ల్లో వచ్చిన స్కూటర్ మెకానిక్‌లు కాంగ్రెస్ సమావేశం జరుగుతున్న ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ బయటకు వచ్చి బైక్ హారన్లు, నినాదాలతో హోరెత్తించారు.
వీరందరూ లోపలికి వస్తే అదుపు చేయటం కష్టమని భావించిన పోలీసులు గెస్ట్‌హౌస్ గేట్లు మూసివేసి ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఉదయం నుంచి ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్‌ఐలు 30 మందికి పైగా కానిస్టేబుళ్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకు ముందు 11.40 గంటల నుంచి 12.10 వరకు ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ వీధిలో వాహనాలను పోలీసులు ఆపేయటంతో రోడ్డుపైనే ధర్నా చేశారు. సమైక్యాంధ్ర జిందాబాద్, ఎం.పీ చింతామోహన్ బయటకు రావాలి, రాజీనామా చేయాలి అంటూ నినాదాలు వినిపించారు. ఈస్టు సీఐ గిరిధర్, అలిపిరి సీఐ రాజశేఖర్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
నేను ఉత్తుత్తి రాజీనామా చేయను: ఎం.పీ చింతా
అనంతరం ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ తాను ఉత్తుత్తి రాజీనామాలు చేయనని, కేవలం కొందరు రాజకీయ ప్రయోజనాలు, ప్రచారం కోసం ఉత్తుత్తి రాజీనామాల నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రకు తాను కట్టుబడి ఉన్నానని, తిరుపతిలో ఉద్యమాలు చేస్తున్నవారు ఉద్యమాలు విడిచిపెట్టి ప్రశాంతంగా తన వద్దకు వస్తే రెండు మూడు రోజుల్లో ప్రధాని వద్దకు తీసుకె ళ్లి ఈ ప్రాంతపువాసుల మనోగతం తెలియజేస్తామన్నారు. ఇందుకోసం అవసరమైతే ఒక రైలు బోగి నిండేంత జనాన్ని ఢిల్లీకి తీసుకెళతానన్నారు. రాజీనామా చేస్తే ఒకే సెకన్‌లో ఆమోదం పొందే విధంగా ఉండాలని, ఆ విధంగా తాను 1988లో చేశానని పేర్కొన్నారు. ఎవరో కొందరు వచ్చి నినాదాలు చేసినంత మాత్రాన రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.
ఎంపీ చింతామోహన్‌కు సమైక్య సెగ
Published Mon, Aug 5 2013 3:48 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement
Advertisement