డబుల్ ట్రబుల్
మూడోసారి టెండర్లకు ఆర్‌అండ్‌బీ సమాయత్తం
రెండు సార్లు టెండర్లు పిలిచినా స్పందన కరువు
ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లకు చెన్నై సంస్థ నుంచి స్పందన లేదు..
నిజామాబాద్ :ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి జిల్లాలో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. సిద్ధిపేట్ జిల్లా సీఎం దత్తర గ్రామాల్లో ఈ లబ్ధిదారుల కల ఇటీవల సాకారమైన నేపథ్యంలో జిల్లాలో ఈ గృహాల కోసం దరఖాస్తులు చేసుకున్న వేలాది మంది లబ్ధిదారుల్లో ఆసక్తి నెలకొంది. జిల్లాలో ఇప్పటివరకు ఈ గృహ నిర్మాణ పనులు ప్రారంభానికే నోచుకోవడం లేదు. ఈ గృహాల నిర్మాణానికి ప్రభుత్వం నిర్దేశించిన యూనిట్ వ్యయానికి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. జిల్లాలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 1,500 గృహాలు, నిజామాబాద్ రూరల్ పరిధిలో 700, ఆర్మూర్ నియోజకవర్గంలో 865, బాల్కొండ నియోజకవర్గంలో 800 ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఈ గృహాల నిర్మాణ బాధ్యతను ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించారు. వీటి నిర్మాణానికి ఇప్పటివరకు రెండు పర్యాయాలు అధికారులు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాలేదు. దీంతో మూడోసారి టెండర్లు పిలిచేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు సమాయత్తమవుతున్నారు.
టెండరు కమిటీ నిర్ణయం తీసుకుంటే మూడోసారి టెండర్లు పిలుస్తామని ఆర్‌అండ్‌బీ పర్యవేక్షక ఇంజినీర్ మధుసూదన్‌రెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ గృహాలు నిర్మించే కాంట్రాక్టర్లకు ఉచితంగా ఇసుక తీసుకునేందుకు అనుమతించింది. అలాగే సిమెంట్ కూడా తక్కువ ధరకు సరఫరా చేయాలని నిర్ణయించింది. దీంతో ఈసారి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. కానీ.. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి ఇచ్చే యూనిట్ వ్యయం ఏ మాత్రం సరిపోదని కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు. దీంతో ఈ గృహాల నిర్మాణం పట్టలెక్కడం లేదు. తద్వారా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల కల సాకారం కావడంలో జాప్యం జరుగుతోంది.
ఒక్క దోమలెడిగిలో శ్రీకారం
బోధన్ నియోజకవర్గంలోని మండలాలతోపాటు రుద్రూరు, కోటగిరి, వర్ని మండలాల్లో ఈ గృహాల నిర్మాణం బాధ్యతలను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించారు. ఇప్పటివరకు ఒక్క కోటగిరి మండలం దోమలెడిగి గ్రామంలో కేవలం 40 గృహాల నిర్మాణానికి మాత్రం అధికారులు శ్రీకారం చుట్ట గలిగారు. రుద్రూర్ మండలం అక్బర్‌నగర్‌లో 40 గృహాలకు కాంట్రాక్టరు ముందుకొచ్చినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. గ్రామాల్లో ఒక్కో గృహం నిర్మాణానికి రూ.5.04 లక్షలు, పట్టణాల్లో రూ.5.30 లక్షలు యూనిట్ వ్యయంగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈ గృహాలకు రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కోసం గ్రామాల్లో రూ.1.25 లక్షలు, పట్టణాల్లో రూ.75 వేలు వెచ్చించాలని నిర్ణయించింది.
స్పందనలేని చెన్నై కంపెనీ..
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో ప్రీ ఫ్యాబ్రికేషన్ పద్ధతిలో ఈ డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టే అంశంపై జిల్లా అధికార యంత్రాంగం నెల రోజుల క్రితం పరిశీలించింది. ఈ మేరకు చెన్నైకి చెందిన కెఫ్ అనే నిర్మాణ సంస్థ ప్రతినిధులు కలెక్టర్ యోగితారాణాను కలిసి సమావేశమయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు ఈ గృహాల ప్లానింగ్‌ను ఈ కంపెనీకి పంపారు. నెల రోజులు దాటినా ఈ కంపెనీ నుంచి స్పందన రానట్లు సమాచారం.
లేఅవుట్ కన్సల్టెన్సీకీ బిల్లులు లేవు..
ఈ డబుల్ బెడ్‌రూం ఇళ్లకు సంబంధించి ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో 39 లే అవుట్‌లు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్‌లో రెండు లేఅవుట్లు, రూరల్ నియోజకవర్గంలో 17 లేఅవుట్లు, ఆర్మూర్‌లో 11 లేఅవుట్లు, బాల్కొండలో తొమ్మిది లేఅవుట్లు ఉన్నాయి. అలాగే పంచాయతీరాజ్ పరిధిలోని బోధన్ నియోజకవర్గంలో కూడా పలుచోట్ల లేఅవుట్లు ఉన్నాయి. ఈ లేఅవుట్‌లు, సర్వే నిర్వహించే బాధ్యతలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. లేఅవుట్ చేసిన ఈ సంస్థలకు ఇవ్వాల్సిన బిల్లులు కూడా ఆగిపోయినట్లు సమాచారం.