Housing construction work
-
పట్టణ పేదల ఇళ్లలో ప్రజాధనం ఆదాకు ‘రివర్స్’
సాక్షి, అమరావతి: పట్టణ పేదల ఇళ్ల నిర్మాణ పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పక్క రాష్ట్రాల్లో జీఎస్టీతో కలిపి పట్టణ పేదల ఇళ్ల నిర్మాణ పనులను చదరపు అడుగుకు రూ.1,500 నుంచి రూ.1,600 చొప్పున అప్పగిస్తే రాష్ట్రంలో మాత్రం చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున గృహాల నిర్మాణ పనులను టీడీపీ సర్కార్ కట్టబెట్టింది. పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామనే సాకుతో గత సర్కార్ భారీ దోపిడీకి పాల్పడిందని నిపుణుల కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తే భారీ ఎత్తున ప్రజాధనం ఆదా అవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రివర్స్ టెండరింగ్ ద్వారా చదరపు అడుగుకు రూ.500 చొప్పున ఆదా అయ్యే అవకాశం ఉందని.. దీనివల్ల పట్టణ పేదలకు భారీ ఎత్తున ఊరట లభిస్తుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రజాధనం భారీగా ఆదా... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పీఎంఏవై కింద ఐదు లక్షల ఇళ్లను మంజూరు చేసింది. రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తే.. 300 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఒక్కొక్క ఇంటికి చదరపు అడుగుకు రూ.500 ప్రకారం రూ.1.50 లక్షల చొప్పున ఆదా అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే 365, 430 చ.అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో ఖజానాకు మరికొంత ఆదా అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ లెక్కన రూ.వేల కోట్లకుపైగా ప్రజాధనం ఆదా అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. టెక్నాలజీ సాకు... ఉపకరణాల కొనుగోళ్లలో అక్రమాలు రాష్ట్రంలో టీడీపీ సర్కార్ పట్టణ పేదలకు 225 ప్రాంతాల్లో 4,54,909 గృహాలను నిర్మించి ఇచ్చే పనులను 34 ప్యాకేజీలుగా కింద విభజించి 2017 ఏప్రిల్‌లో ఈపీసీ(ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో టెండర్లు పిలిచింది. పట్టణాల్లో పేదలకు సొంతింటిని చేకూర్చడం కోసం ఒక్కో ఇంటికి కేంద్రం పీఏంఏవై కింద రూ.1.50 లక్షలు ఇస్తే రాష్ట్రం రూ.1.50 లక్షలు ఇస్తుంది. అంటే ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.మూడు లక్షలు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నిధులతో సాంప్రదాయ పద్ధతుల్లో ఇళ్లను నిర్మించే అవకాశం ఉంది. కానీ టీడీపీ సర్కార్ వ్యవహరించిన విధానాల వల్ల 300 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఇంటి వ్యయం రూ.5.72 లక్షలకు(లబ్ధిదారునిపై భారం రూ.2.72 లక్షలు), 365 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఇంటి వ్యయం రూ.6.74 లక్షలకు (లబ్ధిదారునిపై భారం రూ.3.74 లక్షలు), 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఇంటి వ్యయం రూ.7.71 లక్షలకు (లబ్ధిదారునిపై భారం రూ.4.71 లక్షలు) పెరిగింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ విచారించింది. షీర్ వాల్ టెక్నాలజీ, ఉపకరణాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడటం వల్ల ఇళ్ల నిర్మాణ పనుల వ్యయం రూ.25,170.99 కోట్లకు చేరుకుందని నిపుణుల కమిటీ నిర్థారిస్తూ ఈ ఏడాది జూలై 17న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. హుద్‌హుద్ ఇళ్లలో మిగిలిన పనులకే టెండర్లు విశాఖ జిల్లాలో హుద్‌హుద్ తుపాన్ బాధితుల కోసం 800 మిగిలిపోయిన ఇళ్ల పనుల కోసం రూ.8,53,50,387 వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. దీంతో యూనిట్ వ్యయం రూ.1,06,687 అవుతోందని, కొత్త పనులైతే యూనిట్ ధర ఎక్కువగా ఉండేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘సాక్షి’ ఆదివారం సంచికలో మిగిలిన పనులకు బదులుగా హుద్‌హుద్ ఇళ్లు కొత్త పనులుగా ప్రచురితమైంది. పాఠకులు ఈ మార్పును గమనించాల్సిందిగా కోరుతున్నాం -
డబుల్ ట్రబుల్
మూడోసారి టెండర్లకు ఆర్అండ్బీ సమాయత్తం రెండు సార్లు టెండర్లు పిలిచినా స్పందన కరువు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లకు చెన్నై సంస్థ నుంచి స్పందన లేదు.. నిజామాబాద్ :ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి జిల్లాలో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. సిద్ధిపేట్ జిల్లా సీఎం దత్తర గ్రామాల్లో ఈ లబ్ధిదారుల కల ఇటీవల సాకారమైన నేపథ్యంలో జిల్లాలో ఈ గృహాల కోసం దరఖాస్తులు చేసుకున్న వేలాది మంది లబ్ధిదారుల్లో ఆసక్తి నెలకొంది. జిల్లాలో ఇప్పటివరకు ఈ గృహ నిర్మాణ పనులు ప్రారంభానికే నోచుకోవడం లేదు. ఈ గృహాల నిర్మాణానికి ప్రభుత్వం నిర్దేశించిన యూనిట్ వ్యయానికి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. జిల్లాలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 1,500 గృహాలు, నిజామాబాద్ రూరల్ పరిధిలో 700, ఆర్మూర్ నియోజకవర్గంలో 865, బాల్కొండ నియోజకవర్గంలో 800 ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఈ గృహాల నిర్మాణ బాధ్యతను ఆర్అండ్బీ శాఖకు అప్పగించారు. వీటి నిర్మాణానికి ఇప్పటివరకు రెండు పర్యాయాలు అధికారులు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాలేదు. దీంతో మూడోసారి టెండర్లు పిలిచేందుకు ఆర్అండ్బీ అధికారులు సమాయత్తమవుతున్నారు. టెండరు కమిటీ నిర్ణయం తీసుకుంటే మూడోసారి టెండర్లు పిలుస్తామని ఆర్అండ్బీ పర్యవేక్షక ఇంజినీర్ మధుసూదన్‌రెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ గృహాలు నిర్మించే కాంట్రాక్టర్లకు ఉచితంగా ఇసుక తీసుకునేందుకు అనుమతించింది. అలాగే సిమెంట్ కూడా తక్కువ ధరకు సరఫరా చేయాలని నిర్ణయించింది. దీంతో ఈసారి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. కానీ.. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి ఇచ్చే యూనిట్ వ్యయం ఏ మాత్రం సరిపోదని కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు. దీంతో ఈ గృహాల నిర్మాణం పట్టలెక్కడం లేదు. తద్వారా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల కల సాకారం కావడంలో జాప్యం జరుగుతోంది. ఒక్క దోమలెడిగిలో శ్రీకారం బోధన్ నియోజకవర్గంలోని మండలాలతోపాటు రుద్రూరు, కోటగిరి, వర్ని మండలాల్లో ఈ గృహాల నిర్మాణం బాధ్యతలను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించారు. ఇప్పటివరకు ఒక్క కోటగిరి మండలం దోమలెడిగి గ్రామంలో కేవలం 40 గృహాల నిర్మాణానికి మాత్రం అధికారులు శ్రీకారం చుట్ట గలిగారు. రుద్రూర్ మండలం అక్బర్‌నగర్‌లో 40 గృహాలకు కాంట్రాక్టరు ముందుకొచ్చినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. గ్రామాల్లో ఒక్కో గృహం నిర్మాణానికి రూ.5.04 లక్షలు, పట్టణాల్లో రూ.5.30 లక్షలు యూనిట్ వ్యయంగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈ గృహాలకు రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కోసం గ్రామాల్లో రూ.1.25 లక్షలు, పట్టణాల్లో రూ.75 వేలు వెచ్చించాలని నిర్ణయించింది. స్పందనలేని చెన్నై కంపెనీ.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో ప్రీ ఫ్యాబ్రికేషన్ పద్ధతిలో ఈ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టే అంశంపై జిల్లా అధికార యంత్రాంగం నెల రోజుల క్రితం పరిశీలించింది. ఈ మేరకు చెన్నైకి చెందిన కెఫ్ అనే నిర్మాణ సంస్థ ప్రతినిధులు కలెక్టర్ యోగితారాణాను కలిసి సమావేశమయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు ఈ గృహాల ప్లానింగ్‌ను ఈ కంపెనీకి పంపారు. నెల రోజులు దాటినా ఈ కంపెనీ నుంచి స్పందన రానట్లు సమాచారం. లేఅవుట్ కన్సల్టెన్సీకీ బిల్లులు లేవు.. ఈ డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి ఆర్అండ్బీ పరిధిలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో 39 లే అవుట్లు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్‌లో రెండు లేఅవుట్లు, రూరల్ నియోజకవర్గంలో 17 లేఅవుట్లు, ఆర్మూర్‌లో 11 లేఅవుట్లు, బాల్కొండలో తొమ్మిది లేఅవుట్లు ఉన్నాయి. అలాగే పంచాయతీరాజ్ పరిధిలోని బోధన్ నియోజకవర్గంలో కూడా పలుచోట్ల లేఅవుట్లు ఉన్నాయి. ఈ లేఅవుట్లు, సర్వే నిర్వహించే బాధ్యతలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. లేఅవుట్ చేసిన ఈ సంస్థలకు ఇవ్వాల్సిన బిల్లులు కూడా ఆగిపోయినట్లు సమాచారం.