సాక్షి, విజయవాడ : న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) ఆర్థిక సహకారంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో తలపెట్టిన 3 వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి మరోసారి టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు దాఖలైన బిడ్లు, ఈ టెండర్ల ప్రక్రియపై ఒక వర్గం మీడియాలో చాలా కథనాలు వచ్చాయని, వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదని రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు స్పష్టంచేశారు. మొత్తం రూ.6400 కోట్ల వ్యయంతో రహదారులు నిర్మాణానికి సంబంధించి... ఒకేసారి 13 ప్యాకేజీలకుగాను ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇది నామమాత్ర స్పందన కావడంతో ఈ టెండర్లు రద్దు చేసి, మరోసారి టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం ఇంత పారదర్శకంగా టెండర్లను నిర్వహిస్తున్నా.. తక్కువ బిడ్లు రావడం, కేవలం 14 సంస్థలు మాత్రమే టెండర్లలో పాల్గొనడం, కొన్ని మీడియాల్లో అసత్య కథనాలు రావడంతో టెండర్లను రద్దు చేసి, మళ్లీ పిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా వివక్ష లేకుండా, అందరికీ అవకాశం ఇవ్వాలని సీఎం గారు ఆదేశించినట్టు ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు.
ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఇంకా ఏమన్నారంటే...:
ఒకేసారి 13 జిల్లాలలో 13 ప్యాకేజీలకు టెండర్లు పిలిస్తే 25 బిడ్లు వచ్చాయి. అందరూ సమయానికి దాఖలు చేశారు.అర్హులైన కాంట్రాక్టర్లు ఎక్కడెక్కడ ఉన్నారన్నది చూస్తున్నాము. జాతీయ రహదారుల పనులు చేసే వారు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా చూస్తున్నాము. ఇప్పుడు కేవలం 14 కంపెనీలే ముందుకు రావడంపై కూడా సమీక్ష చేశాము.
పారదర్శకంగా ప్రక్రియ:
ఇప్పుడు ఈ–టెండర్ విధానం అమలు చేశాము. అన్ని నియమాలు పూర్తిగా పాటించాము. పూర్తి పారదర్శకంగా వ్యవహరించాము. ఇక ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనే విధంగా చర్యలు చేపడుతున్నాము. విదేశీ బ్యాంక్ (ఎక్స్‌టర్నల్) రుణం కాబట్టి, ఎక్కడా రాజీ పడకుండా పక్కాగా నియమావళి రూపొందించాము. ఎందుకంటే పని తీసుకోవడమే కాదు, పూర్తి చేయడంలో కూడా ఆ కంపెనీ ఆసక్తి చూపాలి. అదే విధంగా ఒక బిల్లు వస్తే తప్ప, రెండో పని చేసే విధంగా ఉండకూడదు. అదే విధంగా క్వాలిటీతో, వేగంగా పని చేయాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నియమావళి రూపొందించాము.
కాంట్రాక్టర్లలో పోటీ పెరిగేలా..:
కాంట్రాక్టర్లు పోటీ పడి వస్తే అవే నిధులతో ఇంకా ఎక్కువ రోడ్ల నిర్మాణం చేపట్టవచ్చు. రూ.6400 కోట్ల నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల కి.మీ రహదారుల నిర్మాణం చేయబోతున్నాం. టెండర్లలో ఎక్కువ సంస్థలు పాల్గొని ఇంకా బిడ్లు వస్తే, ఆ మొత్తంతోనే ఇంకొన్ని రహదారులు కూడా నిర్మించవచ్చు. ప్రజల్లో ఎక్కడా అనుమానాలకు తావునివ్వొద్దని సీఎం గారు చెప్పారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ కూడా అదే ప్రక్రియలో అమలు చేస్తున్నాం. అందుకే ఇప్పుడు టెండర్లు రద్దు చేసి రీటెండర్‌కు వెళ్లాలని సీఎం గారు ఆదేశించారు. అర్హత ఉన్న కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడబోతున్నాము.
ఎలాంటి సందేహాలు వద్దు:
సకాలంలో బిల్లులు ఇస్తారా? అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎక్స్‌టర్నల్ ఫండింగ్‌తో జరుగుతోంది కాబట్టి, బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండబోదని సీఎం గారు చెప్పారు. అందుకే అర్హులైన కాంట్రాక్టర్లు, ఆ సంస్థలతో మాట్లాడమని ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశాము.
పక్కాగా జరిగిన టెండర్ల ప్రక్రియ:
ఇప్పుడు రద్దు చేసిన టెండర్ల ప్రక్రియ పక్కాగా జరిగింది. ఎక్కడా ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదు. ఈ–టెండర్లు కాబట్టి, ఎన్‌ఐసీ ప్లాట్‌ఫామ్‌లో 25 మంది తమ బిడ్ అప్‌లోడ్ చేశారు. బ్యాంక్ గ్యారెంటీ కోసం హార్డ్ కాపీ ఇవ్వాలి. ఇక్కడ ఆ 25 మంది హార్డ్ కాపీలు ఇచ్చారు కాబట్టి, మాకు ఎక్కడా సందేహాలు లేవు. అయితే అంత తక్కువ మంది ఎందుకు పార్టిసిపేట్ చేశారన్నదే ఇక్కడ ప్రశ్న. ఎవరైనా, ఎక్కడైనా బెదిరించారా? అంటే అది కూడా లేదు. నిజానికి అలాంటి ఘటనలు ఎక్కడా చోటు చేసుకోలేదు.
నిజానికి రద్దు చేయాల్సిన అవసరం లేదు:
ఇప్పుడు దాఖలైన బిడ్లతో ముందుకు వెళ్లొచ్చు. రద్దు చేయవలసిన అవసరం లేదు. నిజానికి ఎన్‌డీబీ కూడా ఇప్పటి బిడ్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఒకేసారి 13 ప్యాకేజీలు ఇచ్చినప్పటికీ 14 సంస్థలు ముందుకు వచ్చాయి. గతంలో కూడా ఎక్కువ విలువ ఉన్న పనుల్లో కొన్ని సంస్థలే పాల్గొన్నాయి. విజయవాడ బైపాస్ రోడ్డు పనుల్లో కూడా ఒకటి, రెండు సంస్థేల పాల్గొన్నాయి. అయినా ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించాము. ఈసారి ఎక్కువ సంస్థలు బిడ్లు వేస్తే, పోటీ పెరిగి ఇంకా తక్కువకే పనులు చేపట్టే వీలుంది. ఆ విధంగా మిగిలే నిధులతో ఇంకా ఎక్కువ రహదారులు నిర్మించవచ్చు. అందుకే తొలి టెండర్లు రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment