జిల్లాలో రహదారుల అభివృద్ధికి రూ.139 కోట్లు
జిల్లాలో రహదారుల అభివృద్ధికి రూ.139 కోట్లు
Published Thu, Jul 27 2017 12:56 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కలెక్టర్ కాటంనేని భాస్కర్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో రోడ్లు భవనాల శాఖకు సంబంధించి రూ.189 కోట్లతో 29 పనులు చేపట్టామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్‌లో రోడ్లు భవనాల శాఖాధికారులతో కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో రహదారులకు సంబంధించి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా ప్రయాణానికి అనువుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. 29 పనుల్లో 26 పనులు ప్రగతిలో ఉన్నాయని వాటిని నిర్ధేశించిన సమయానికి పూర్తి చేసేలా సంబంధితాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నరసాపురం కాలువపై నిర్మించే మార్టేరు బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలన్నారు. కాలువలో నీళ్లు ఉన్నాయని పనులు మందకొడిగా సాగుతున్నాయనే మాట చెప్పకుండా పనులపై శ్రద్ధ వహించాలని చెప్పారు. నిడదవోలు సెక‌్షన్ పరిధిలో చిట్యాల దుద్దుకూరు రోడ్డు, గోపాలపురం సెక‌్షన్ పరిధిలోని గోపాలపురం దొండపూడి రోడ్డులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చింతలపూడి సెక‌్షన్ పరిధిలో ఉన్న ప్రగఢవరం నాగిరెడ్డిగూడెం రోడ్డు పనులు, ఏలూరు మేడిశెట్టివారిపాలెం రోడ్డు పనులను నిర్ధేశించిన సమయానికి పూర్తి చేయాలన్నారు. మొగల్తూరు సెక‌్షన్ సీతారామపురం పేరుపాలెం వరకు రోడ్డు పనిని అక్టోబరు నాటికి పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నిర్మలను ఆదేశించారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పనులు సంవత్సరాల తరబడి జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు, కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేసి చేపట్టే పనులను సకాలంలో పూర్తి చేసేలా చూడాలన్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నిర్మల, డీఈలు, ఏఈలు, ఈఈలు పాల్గొన్నారు.
పరిశ్రమల ప్రోత్సాహకానికి రూ.40 కోట్ల రాయితీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో వివిధ పరిశ్రమలకు ప్రభుత్వ ప్రొత్సాహకం కింద 300 యూనిట్లకు చెందిన 1196 దరఖాస్తుదారులకు రూ.40 కోట్ల రాయితీని అందించనున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందకు ప్రభుత్వం వివిధ రాయితీలను అందిస్తోందన్నారు. వాటిని సకాలంలోఅందించాలని సూచించారు. ఈ విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా చేయాలని అటువంటప్పుడే పరిశ్రమలు ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతారని చెప్పారు. అపరిష్కృతంగా ఉన్న 116 క్లైయిమ్స్‌ను వచ్చే వారం నాటికి పరిష్కరించే దిశగా పరిశ్రమల శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సింగిల్ విండో కింద పరిశ్రమల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడంలో సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెరగాలని కలెక్టరు సూచించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ టి.త్రిమూర్తులు, డెప్యూటీ డైరెక్టర్ ఆదిశేషు, కమర్షియల్ ట్యాక్స్ సీటీఓ కేదారేశ్వరరావు, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్రాంచ్ మేనేజర్ సుబ్బారెడ్డి, డెప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏలూరు మోహనరావు, కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీరు వేంటేశ్వరరావు, ఏడీఈ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు నివేదికలు ఇస్తే అధికారులపై కేసులు
ఏలూరు రూరల్: పంచాయతీ భవనాల నిర్మాణానికి సహకరించకపోతే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టబోమని జిల్లా కలెక్టర్ కాటంనేని స్పష్టం చేశారు. బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేదినరావుపాలెం, గోగుంట, జి.కొత్తపల్లి తదితర గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి నిదులు మంజూరు చేసిన ఎందుకు పనులు ప్రారంభించలేదని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అధికారులు స్థలాల కేటాయింపు జరగలేదన్నారు. దీనిపై భాస్కర్ మాట్లాడుతూ గ్రామస్తులంతా కలిసి భవన నిర్మాణం చేపట్టిన నాడే ఆ గ్రామాల్లో ఇతర అభివృద్ధి పనులు చేయాలని ఆదేశించారు.
తప్పుడు నివేదిక ఇస్తే 420 కేసు
జిల్లాలో 181 కిలోమీటర్లు సీసీరోడ్డు వేశామని అధికారులు నివేదక ఇచ్చారని, ఆన్‌లైన్‌లో కేవలం 70 కిలోమీటర్లు మాత్రమే రోడ్డు అభివృద్ధి జరిగినట్టు నమోదు చేశారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ రోడ్లపై తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై 420 కేసు పెడతానని హెచ్చరించారు. పనుల వేగం పెంచాలన్నారు. మరో 2 వేల కిలోమీటర్ల మేర రోడ్డు వేయాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో 72 వేల పంట కుంటలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ నిధులతో తవ్విన పంట కుంటలను రైతులు పూడ్చివేస్తున్నారని అన్నారు. పూడ్బివేసిన కుంటలకు చేపట్టిన ఖర్చు మొత్తాన్ని రికవరీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డిఆర్‌ఓ కట్టా హైమావతి, డ్వామా పీడీ వెంకటరమణ, హౌసింగ్ పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement