ముందస్తు ఒప్పందాల ప్యాకేజీ | advance pacage aggrment | Sakshi
Sakshi News home page

ముందస్తు ఒప్పందాల ప్యాకేజీ

Published Sun, Sep 3 2017 12:59 AM | Last Updated on Sun, Sep 17 2017 6:18 PM

ముందస్తు ఒప్పందాల ప్యాకేజీ

ముందస్తు ఒప్పందాల ప్యాకేజీ

ఆర్‌అండ్‌ఆర్‌ జాబితాలో రెవెన్యూ, రేషన్‌డీలర్ల మాయాజాలం 
అనర్హులతో ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకునేలా అవగాహన
అడ్డగోలుగా, ఓటర్‌ ఐడీ, రేషన్‌కార్డుల జారీ
నిజమైన నిర్వాసితులకు మొండిచెయ్యి 
వేలేరుపాడు:
పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో భాగంగా అర్హులైన నిర్వాసితుల జాబితా ఖరారులో గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు, రేషన్‌ షాపు డీలర్లు కీలకపాత్ర పోషించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమందితో ముందస్తు ఒప్పందాలు చేసుకున్న వీరు నిజమైన అర్హులను తొక్కిపట్టారు. పరిహారం వచ్చాక ఫిఫ్టీ,ఫిఫ్టీ పంచుకునే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే అర్హుల పేర్లు గల్లంతయ్యాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. స్థానిక, స్థానికేతరులు ఎవరో తేల్చే పనిని గ్రామాల్లో వీఆర్‌ఏ, రేషన్‌ షాపు డీలర్లకు అప్పగించడంతో వారి ఇష్టారాజ్యమైంది. వారితో ఒప్పందం చేసుకున్న వారి పేర్లు జాబితాలో అర్హులుగా వచ్చాయి. అన్ని ఆధారాలు ఉన్న అనేక మంది నిర్వాసితుల పేర్లు మాత్రం గల్లంతయ్యాయి.  మొదట్లో ఒకటికి నాలుగు సార్లు సర్వేలు చేశామని, ఇంటింటికీ తిరిగి డేటా సేకరించామని గొప్పలు పోతున్న అధికారులు, పెళ్లి అయిన వారికి కానట్లు, కాని వారికి అయినట్లు, స్థానికులను స్థానికేతరులుగా, బయటివారిని స్థానికులుగా, బతికి ఉన్న వాళ్లు చనిపోయినట్లు, గిరిజనులను గిరిజనేతరులుగా చూపారు. అలాగే ఉపాధి హామీ పనికెళ్లే కూలీలకు జాబ్‌కార్డులు ఉన్నా, వితంతు, వృధ్ధాప్య పెన్షన్‌లు ప్రతీ నెలా వస్తున్నా  అలాంటి వారి పేర్లు జాబితా నుంచి తొలగించారు. దీంతో నిర్వాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రకటించిన జాబితా వివరాలపై నిర్వాసితులు ప్రశ్నిస్తే, నోరెళ్ల బెడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ తప్పిదాలన్నీ వారి అక్రమాలకు నిదర్శనంగా చెప్పవచ్చు. కనీసం బాధితులు చెప్పేది వినిపించుకోకుండా సాక్షాత్తు ఉన్నతాధికారులే ఏకపక్షంగా వాదించడం నిర్వాసితుల్ని మరింత కుంగదీస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29,545 కుటుంబాలు తమ ఇళ్లు కోల్పోతున్నాయి. ఇందులో పదివేల గిరిజన కుటుంబాలుండగా, 19,545 గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలున్నాయి. జూన్‌ 12న గ్రామసభలు నిర్వహించి, అభ్యంతరాలు స్వీకరించారు. అర్హులను గుర్తించేందుకు వడపోత ప్రక్రియ చేపట్టారు.  ఇందులో 3430 మంది నకిలీ నిర్వాసితులుగా విఆర్‌ఏలు, రేషన్‌ షాపు డీలర్లే గుర్తించారు. ఈ రెండు మండలాల్లో 26,115 మంది నిర్వాసితులు అర్హులుగా నిర్ధారించారు. ఆ తర్వాత మళ్లీ ఇంటి స్ధిరాస్తి విలువలు లేకుండా కేవలం వ్యక్తిగత ప్యాకేజీ మాత్రమే ప్రకటించారు. ఇందులో కుక్కునూరు మండలంలో సుమారు 2500 మంది,  వేలేరుపాడు మండలంలో సుమారు 1500 మంది అర్హులను అనర్హులుగా ప్రకటించారు. వ్యక్తిగత ప్యాకేజీ కింద  గిరిజనులకైతే 7.26లక్షలు, గిరిజనేతరులకైతే 6.36 లక్షలు  చెల్లించాల్సి ఉంది. అయితే మొదటి జాబితాలతో అర్హులుగా వచ్చిన అనేక మంది స్థానికుల పేర్లు, ప్రస్తుత జాబితాలో అనర్హులుగా ప్రకటించడం గమనార్హం.  
పథకం ప్రకారమే అంతా చేసారు...
రెవెన్యూ అధికారులు ముందస్తు  పథకం ప్రకారమే అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పునరావాస ప్యాకేజీ ప్రకటించక ముందే ఈ రెండు మండలాల తహశీల్దార్‌లు కొత్తగా రేషన్‌ కార్డులు జారీ చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన సమయంలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 16వేల 191 రేషన్‌కార్డులుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 18వేల 474కు పెరిగింది. అంటే 2,283 కుటుంబాలు పెరిగాయి. వేలేరుపాడు మండలంలో రెండేళ్ల క్రితం 6041 కార్డులుండగా ప్రస్తుతం 7,393, కుక్కునూరు మండలంలో 10150 ఉండగా, 11081కు పెరిగాయి. ఇవి కాకుండా అసలు రేషన్‌కార్డులులేని వందలాది కుటుంబాలున్నాయి. ఈ ప్రాంతం నుంచి 30, 40 ఏళ్ల క్రితం అనేక కుటుంబాల వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఇలాంటి వారికి కూడా రేషన్‌ కార్డులు, ఓటర్‌ ఐడీలు జారీ చేసారు. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. అప్పట్లో ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.  
పెన్షన్‌ వస్తున్నా స్థానికురాలిని కాదంట: 
వలగాని సావిత్రి, వేలేరుపాడు   
నేను 50 ఏళ్లుగా వేలేరుపాడులో నివాసముంటున్నా. నా భర్త అప్పలయ్య ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందారు. నాకు సంతానం లేదు. బాలుడిని దత్తత తీసుకొని పెంచుకున్నాను. నాకు రేషన్‌ కార్డు, ఓటర్‌ కార్డు ఉంది. ప్రతీ నెలా రేషన్‌ తీసుకుంటున్నా, రోజూ ఉపాధి కూలి పనికెళ్తున్నా, బ్యాంక్‌లో ఉపాధి  వేతనం పొందుతున్నాను. వితంతు పెన్షన్‌ వస్తోంది. ఇలాంటి అన్ని ఆధారాలు ఉన్నా జాబితాలో నాన్‌ లోకల్‌గా ప్రకటించారు. ఇదెక్కడి అన్యాయ మండి.
జాబ్‌కార్డు ఉన్నా నాన్‌లోకల్‌గా ప్రకటించారు: 
కొంబత్తిన కృష్ణార్జున్‌రావు, కట్కూరు, వేలేరుపాడు మండలం  
మా తాతముత్తాల నుండి కట్కూరులో నివాసముంటున్నా. 2007లో నా పట్టా పొలానికి పరిహారం వచ్చింది. నాకు జాబ్‌ కార్డు, రేషన్, ఓటర్‌ఐడీ, ఆధార్‌కార్డు లాంటి అన్ని ఆధారాలు ఉన్నాయి. నన్ను నాన్‌రెసిడెన్స్‌గా ఎలా ప్రకటించారు. గ్రామంలో విచారించండి.   
పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం: 
సారే రామారావు, రుద్రమకోట, æవేలేరుపాడు మండలం 
నేను యాభై ఏళ్లుగా మా తాతముత్తాతల నుంచి రుద్రమకోటలో నివాసముంటున్నాను. కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను.   రేషన్,కార్డు, ఓటర్‌ఐడీ ఉంది. వృధ్ధాప్య పెన్షన్‌ వస్తోంది. నా వయసు 72 సంవత్సరాలు. అయినా అధికారులు జాబితాలో నాన్‌లోకల్‌గా ప్రకటించారు. 
కొండరెడ్డినని కూడా కనికరించలేదు: 
కెచ్చెల సీత, కట్కూరు ‡
నన్ను కొండరెడ్డినని కూడా కనికరించలేదు. 20 ఏళ్లుగా రేషన్, ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డులు ఉన్నప్పటికీ ఆర్‌అండ్‌ఆర్‌ జాబితాలో స్థానికేతరురాలిగా ప్రకటించారు.అధికారుల కళ్లకు మా కుటుంబాలు కనబడటంలేదా..?
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement