సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డా.బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ఆదివారం రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ సచివాలయం 5వ అంతస్తులోని 5F 11,12,13 గదుల వద్ద పూజలు నిర్వహించారు. తర్వాత మంత్రి కోమటిరెడ్డి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే 9 ఫైల్స్‌పై సంతకం చేశానని తెలిపారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేసిన వారికీ కృతజ్ఞతలు తెలిపారు. R&B శాఖ కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
సీఎంతో చర్చించి కౌన్సిల్ హాల్‌ను షిఫ్ట్ చేస్తున్నమని తెలిపారు. ముఖ్యమంత్రి ఆ బాధ్యతలు తనకు అప్పగించారని పేర్కొన్నారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ముందు ఫెన్సింగ్ తీసేసి సుందరీకరణ చేస్తామని ఆయన వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలోని రోడ్లను రూ.100 కోట్లతో నాలుగు లైన్ల రోడ్లుగా మారుస్తున్నామని తెలిపారు.
ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కోమటిరెడ్డి తెలిపారు. రేపు(సోమవారం) తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అపాయింట్‌మెంట్ తీసుకుంటానని అన్నారు. తనకున్న పరిచాయలతో ఢిల్లీ నుంచి నిధులు తీసుకువస్తానని తెలిపారు. కొడంగల్ లింగంపల్లి-దుగ్యాల రోడ్డు, నేషనల్ హైవే రోడ్లు కూడా రావాల్సి ఉందని అందుకే 14 రోడ్లను.. నేషనల్ హైవే రోడ్లుగా గుర్తించాలని రేపు ఢిల్లీకి వెళ్తునట్లు తెలిపారు.హైదరాబాద్-విజయవాడ రోడ్‌ను ఆరు లైన్ల రోడ్‌గా మార్చాలని అన్నారు.
నకిరేకల్ రోడ్డు అభివృద్ధి చేయాలని, హైదరాబాద్-కల్వకుర్తి రోడ్డును 4 లైన్లుగా మార్చాలని చెప్పారు. సెంట్రల్ రోడ్ నిఫ్రా స్ట్రక్చర్ నిధులు పెంచాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. మొత్తం ఐదు పనులను పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని అడుగుతానని పేర్కొన్నారు. ఎల్బీనగర్ మల్కాపురం వరకు, మల్కాపురం నుంచి సూర్యాపేట వరకు 6 లైన్ల రోడ్డు పనులు చేయాలన్నారు. పది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment