అడుగడుగునా నిర్లక్ష్యం...
బొబ్బిలి: బొబ్బిలి పట్టణం, మండలంలో ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్లక్ష్యం వల్ల వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. బొబ్బిలి నుంచి బలిజిపేటకు పిరిడి మీదుగా వెళ్లే దారి లో అడుగుకో మలుపు ఉంది. గొల్లపల్లి దాటిన తరువాత శివడ వలస వెళ్లినంతవరకూ ఎన్ని మలుపులు ఉన్నాయో లెక్కేలేదు. చివరకు పిరిడి గ్రామంలో కూడా ఈ మలుపులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇన్ని మలుపులు ఉన్నా ఎక్కడా హెచ్చరిక బోర్డు పెట్టలేదు. బొబ్బిలి నుంచి చింతాడ మీదుగా బలిజిపేట వెళ్లే రహదారికి కూడా ఇదే పరిస్థితి. బొబ్బిలి మండలం పిరిడి, కలవరాయి, కోమటిపల్లిల వద్ద కాలేజీలు అధికంగా ఉన్నాయి. కానీ బస్సులు పెద్దగా లేకపోవడంతో ఉన్న బస్సుల్లోనే వీరు వేలాడుతూ ప్రయాణించాల్సి వస్తోంది.
స్పీడ్ బ్రేకర్లేవీ..?
రామభద్రపురం: విశాఖ నుంచి రాయగడ, శ్రీకాకుళంనుంచి జ యపూర్ వెళ్లే వాహనాలు రామభద్రపురం జంక్షన్‌పై నుంచి వెళ్తాయి. అయితే ఇక్కడ జాగ్రత్త చర్యలేవీ తీసుకోలేదు. ఆరికతోట వద్ద ప్రమాదకర మలుపు ఉన్నప్పటికీ ప్రభుత్వం సిగ్నల్ బోర్డులు పెట్టలేదు. ఇటీవల రోడ్డు పక్కన ఉన్న మండల కార్యాలయం వద్ద శ్రావణి అనే మహిళ కారు ఢీకొని చనిపోయింది. అక్కడ స్పీడ్ బ్రేకర్, సిగ్నల్ బోర్డు లేకపోవడమే దీనికి కారణమని స్థానికులంటున్నారు. జాతీయ రహదారి పక్కనే స్కూళ్లు, హాస్టళ్లు ఉన్నా స్కూల్ జోన్ బోర్డులేవీ కనిపించవు.
దినదిన గండం
బాడంగి: మండలంలో ప్రధాన రోడ్లు, కల్వర్టులు అధ్వానంగా ఉన్నాయి. వీటిపై ప్ర యాణం దినదిన గండంగా మారుతోంది. పాల్తేరు -వాడాడకు బస్సు సౌకర్యం ఉన్నా రోడ్డు మట్టిరోడ్డును తలపిస్తుంది. కోడూ రు -షికారుగంజి రోడ్డు కూడా అక్కడక్కడా పాడైపోవడంతో బస్సుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఆకులకట్ట గ్రామం శివారులో గల చెరువు గట్టుపై మలుపు మరింతప్రమాదకరంగా మారింది. కానీ ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. భీమవరం-ముగడ మధ్యలో చినమంతపొలం వద్ద రోడ్డు కల్వర్టు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది.
ఆదమరిస్తే అంతే...
తెర్లాం రూరల్: మండలంలో పలు గ్రామాల వద్ద ఉన్న కల్వర్టులు ప్రయాణికులను భయపెడుతున్నాయి. ఇక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తెర్లాం-బొబ్బిలి ఆర్ అండ్ బీ రోడ్డులో తెర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దాటిన తరువాత ఉన్న మంగళి గెడ్డ కాలువపై గతంలో నిర్మించిన కాజ్‌వేకు రెండు వైపులా రక్షణ గోడలు లేవు. రాజాం-రామభద్రపురం రాష్ట్రీయ రహదారిని ఆనుకొని టెక్కలివలస, పెరుమాళి, నెమలాం జంక్షన్, డి.గదబవలస, పణుకువలస జంక్షన్, వెలగవలస, రంగప్పవలస, తెర్లాం జంక్షన్, ఎంఆర్ అగ్రహారం, కూనాయవలస గ్రామాలు ఉన్నా యి. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వాహనాల రాకపోకలు ఉంటాయి. కానీ ప్రమాదాల నివారణకు అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం.