Officers Neglected
-
ఆరు రోజులుగా తాగునీరు బంద్
కె.కొత్తపల్లి గ్రామంలో ఆరు రోజుల నుంచి తాగునీటి సరఫరా బంద్ అయ్యింది. ఆలూరు శివారులో ఉన్న సంప్ నుంచి ఈ గ్రామానికి తాగునీటి సరఫరా కావాల్సి ఉంది. సంప్ వద్ద తాత్కాలికంగా పని చేస్తున్న వర్కర్ ఇటీవల విధుల నుంచి తప్పుకొన్నాడు. అతని స్థానంలో మరొకరిని నియమించే విషయంలో పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామస్తులు పొలాలకెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామన్నారు. అధికారులు స్పందించి తాగునీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
సమస్యలపై గళం
ముందు నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాం: అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ గుండ్లకమ్మ ముంపు గ్రామాలకు సంబంధించి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోశయ్య హయాంలో దేవుడి మాన్యం భూముల్లో పట్టాలు ఇచ్చేందుకు అంగీకరించకపోయినా జీవో ఇప్పించాం. పట్టాలను అర్హులైన వారికి త్వరగా ఇవ్వాలని సూచించాం. కానీ అధికారులు జాప్యం చేస్తున్నారు. మొత్తం 48 మంది వద్దనుంచి 24 లక్షలు వసూలు చేసినట్లు పేర్లతో సైతం మా వద్దకు బాధితులు వచ్చారు. తక్షణమే ధేనువుకొండ ప్రాంత నిర్వాసితులకు పట్టాలు పంపిణీ చేయాలి. అక్రమంగా డబ్బులు దండుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సామాజిక కార్యకర్తలు నియంతల్లా వ్యవహరిస్తున్నారు: వై.పాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాలను లబ్ధిదారులకు అందించేందుకు అన్ని జిల్లాలకంటే మన జిల్లాలోనే పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రూపొందించిన ప్రణాళిక బాగుంది. కానీ గ్రామ కమిటీల పేరుతో సామాజిక కార్యకర్తలు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అధికారులను సైతం శాసిస్తున్నారు. దీనివల్ల సామాన్యమైన పేదవారికి లబ్ధి చేకూరకుండా పోతోంది. చెంచులు, సుగాలీలు నివాసం ఉండే ప్రాంతాలలోని వారికి వైద్య సహాయక చర్యలు అందించేందుకు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ద్వారా ఎంపీ నిధులను ఇప్పించాం. తక్షణమే అంబులెన్స్‌ను కొనుగోలుచేసి వారికి వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలి. మత్తు వైద్యుడు లేకపోతే ఎలా : కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కందుకూరు ఏరియా వైద్యశాలలో పిల్లల వార్డును పూర్తిగా మూసేశారు. మరో వార్డుది ఇదే పరిస్థితి. ఉలవపాడులో అయితే ఏకంగా స్టోర్రూములో అడుగు మేర నీరు నిలిచిపోతోంది. దానికితోడు మత్తు ఇంజక్షన్ ఇచ్చే వైద్యుడు లేకపోతే ఎలా?ఇక వైద్యుల కొరత సరేసరి. నీటి పారుదలపై అంత నిర్లక్ష్యమా: సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సీఈ, ఎస్ఈలందరూ ఇదే సమావేశంలో ఉన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి వారివద్ద సరైన సమాచారం లేదు. సర్వసభ్య సమావేశం నిర్వహించే ముందే యాక్షన్ టేకెన్ రిపోర్టుపై అరగంట చర్చ నిర్వహించాలి. మంత్రి ఉన్నా మాకు ఉపయోగమేంటి: మారం వెంకటరెడ్డి, తాళ్ళూరు జెడ్పీటీసీ మా నియోజకవర్గానికి మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఓబీసీలో నీటి పరిమాణం తగ్గిపోయింది. చివరి భూములకు నీరందే పరిస్థితులు లేవు. మంత్రి నియోజకవర్గమైనా ఒరిగిందేముంది. పరిహారం ఇవ్వకుండా ఎన్నాళ్ళు : దుగ్గెంపూడి వెంకటరెడ్డి, పెద్దారవీడు జెడ్పీటీసీ ప్రాజెక్టుకు అవసరమని రైతుల నుంచి భూములు తీసేసుకున్నారు. కానీ రైతులకు మాత్రం డబ్బులు పంపిణీ చేయలేదు. ఇప్పటికైనా రైతుల సమస్యపై స్పందించాలి. ఆస్పత్రికి వెళ్లాలంటేనే బాధగా ఉంది: కంచర్ల శ్రీకాంత్ చౌదరి, జెడ్పీటీసీ సభ్యుడు కందుకూరు కందుకూరు ఏరియా వైద్యశాలలో వైద్య పరీక్షలకు అవసరమైన సామగ్రి ఉండడంలేదు. ఎక్స్‌రేలకు బయటకు పంపించి రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నిధుల కొరత ఉంటే అధికారులెలా పనిచేస్తారు: పట్టభద్రుల శాసనమండలి సభ్యుడు యండపల్లి శ్రీనివాసరెడ్డి వెలుగొండ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు అవసరమంటే రూ.75 కోట్లు ఇస్తే అధికారులు మాత్రం ఎలా పనిచేయగలరు. సమష్టిగా ముందుకు వెళితేనే నిర్మాణం పూర్తి చేసుకోగలం. ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథక సమాచారమేదీ: పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు ఎన్టీర్ ఆరోగ్య సేవా పథక సమాచారమేదీ. దీనిపై విస్తృత ప్రచారం నిర్వహించాలి. పర్చూరు ఆసుపత్రిలో కనీసం నీరు కూడా లేదు. ఇక వైద్యులు ఆపరేషన్లు ఎలా నిర్వహిస్తారు. తక్షణమే అవసరమైన నిధులకోసం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ప్రైవేటు భవనంలోకి ఆసుపత్రి మార్చుతారా?: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం, కంభం, వై.పాలెం, దోర్నాల తదితర ప్రాంతాల్లో ఏ చిన్న ప్రమాదం జరిగినా రక్తం కోసం ఒంగోలు వరకు రావాల్సి వస్తోంది. అందుకే కంభంలో రక్త నిల్వల కేంద్రం, గిద్దలూరులో బ్లడ్ బ్యాంకు ఏర్పాటుపై ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చాను. గిద్దలూరు ఏరియా వైద్యశాలను 50 పడకల ఆసుపత్రి నుంచి 100 పడకల ఆసుపత్రికి మార్చారు. కూలిపోయే భవనంలో ఆస్పత్రిని నిర్మించడం ప్రమాదకరం. దీనికి ప్రత్యామ్నాయంగా సీమాంక్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు దృష్టి సారించాలి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి తెలియకుండా నిధులు డ్రా చేస్తే తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. పేద ప్రజల అభ్యున్నతికే ప్రభుత్వం కట్టుబడి ఉంది: కనిగిరి శాసనసభ్యుడు కదిరి బాబూరావు మా ప్రభుత్వం పేదల పక్షానే ఉంది. అట్టడుగు వర్గాలకు సైతం న్యాయం చేసేందుకే సామాజిక కార్యకర్తలను నియమించామే తప్ప అడ్డుకోవడానికి కాదు. గతంలో ఇందిరమ్మ కమిటీలు వేసినపుడు ఈ ప్రశ్నలు ఏమయ్యాయి. గురవాజీపేట ఆస్పత్రిలో పేకాట ఆడుకుంటున్నారు. అధికారులు గమనించాలి. వెలిగొండను పూర్తిచేసేది మా ప్రభుత్వమే: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌రావు వెలిగొండ ప్రాజెక్టు కోసం బడ్జెట్లో రూ.75 కోట్లు చూపినా వాస్తవానికి రూ.130 కోట్లు ఖర్చు చేశాం. ఎట్టి పరిస్థితుల్లో ఏడాదిలోగా తొలిదశ పూర్తిచేసి నీళ్లిస్తాం. ఇందులో ఎటువంటి సందేహంలేదు. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది మా ప్రభుత్వమే. తిరిగి పూర్తిచేసి ప్రారంభించేది కూడా మా ప్రభుత్వమే. రాజకీయంగా మాట్లాడడం సరికాదు. సీఎం ప్రకటన అలా ఉంటే మీ ప్రకటన ఇలానా: మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను పూర్తిచేసి ఏడాదిలోగా పంటలకు నీరందిస్తామని సీఎం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. సీఈ మాత్రం 2016 డిసెంబర్ నాటికి లేదా 2017 నాటికి అంటున్నారు. ఏది వాస్తవం. ఖచ్చితంగా ఎప్పటిలోగా తొలిదశను పూర్తిచేస్తారో చెప్పండి. ఇది జిల్లా అభివృద్ధిలో కీలకమైన అంశం. రాజకీయాలకు అతీతంగా అవసరమైన నిధులు సాధించుకునేందుకు జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన సీఎంను కలుద్దాం. ప్రజాప్రతినిధులందరూ కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నా. సేవలు లేకుండా వైద్యులెందుకు: కొండపి శాసనసభ్యుడు డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి చాలా ఆసుపత్రుల్లో వైద్యులుంటున్నారు కానీ వైద్య సేవలందడం లేదు. ప్రధానంగా దంత వైద్యానికి సంబంధించిన పరికరాలు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. -
అడుగడుగునా నిర్లక్ష్యం...
బొబ్బిలి: బొబ్బిలి పట్టణం, మండలంలో ఆర్అండ్బీ అధికారులు నిర్లక్ష్యం వల్ల వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. బొబ్బిలి నుంచి బలిజిపేటకు పిరిడి మీదుగా వెళ్లే దారి లో అడుగుకో మలుపు ఉంది. గొల్లపల్లి దాటిన తరువాత శివడ వలస వెళ్లినంతవరకూ ఎన్ని మలుపులు ఉన్నాయో లెక్కేలేదు. చివరకు పిరిడి గ్రామంలో కూడా ఈ మలుపులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇన్ని మలుపులు ఉన్నా ఎక్కడా హెచ్చరిక బోర్డు పెట్టలేదు. బొబ్బిలి నుంచి చింతాడ మీదుగా బలిజిపేట వెళ్లే రహదారికి కూడా ఇదే పరిస్థితి. బొబ్బిలి మండలం పిరిడి, కలవరాయి, కోమటిపల్లిల వద్ద కాలేజీలు అధికంగా ఉన్నాయి. కానీ బస్సులు పెద్దగా లేకపోవడంతో ఉన్న బస్సుల్లోనే వీరు వేలాడుతూ ప్రయాణించాల్సి వస్తోంది. స్పీడ్ బ్రేకర్లేవీ..? రామభద్రపురం: విశాఖ నుంచి రాయగడ, శ్రీకాకుళంనుంచి జ యపూర్ వెళ్లే వాహనాలు రామభద్రపురం జంక్షన్‌పై నుంచి వెళ్తాయి. అయితే ఇక్కడ జాగ్రత్త చర్యలేవీ తీసుకోలేదు. ఆరికతోట వద్ద ప్రమాదకర మలుపు ఉన్నప్పటికీ ప్రభుత్వం సిగ్నల్ బోర్డులు పెట్టలేదు. ఇటీవల రోడ్డు పక్కన ఉన్న మండల కార్యాలయం వద్ద శ్రావణి అనే మహిళ కారు ఢీకొని చనిపోయింది. అక్కడ స్పీడ్ బ్రేకర్, సిగ్నల్ బోర్డు లేకపోవడమే దీనికి కారణమని స్థానికులంటున్నారు. జాతీయ రహదారి పక్కనే స్కూళ్లు, హాస్టళ్లు ఉన్నా స్కూల్ జోన్ బోర్డులేవీ కనిపించవు. దినదిన గండం బాడంగి: మండలంలో ప్రధాన రోడ్లు, కల్వర్టులు అధ్వానంగా ఉన్నాయి. వీటిపై ప్ర యాణం దినదిన గండంగా మారుతోంది. పాల్తేరు -వాడాడకు బస్సు సౌకర్యం ఉన్నా రోడ్డు మట్టిరోడ్డును తలపిస్తుంది. కోడూ రు -షికారుగంజి రోడ్డు కూడా అక్కడక్కడా పాడైపోవడంతో బస్సుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఆకులకట్ట గ్రామం శివారులో గల చెరువు గట్టుపై మలుపు మరింతప్రమాదకరంగా మారింది. కానీ ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. భీమవరం-ముగడ మధ్యలో చినమంతపొలం వద్ద రోడ్డు కల్వర్టు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆదమరిస్తే అంతే... తెర్లాం రూరల్: మండలంలో పలు గ్రామాల వద్ద ఉన్న కల్వర్టులు ప్రయాణికులను భయపెడుతున్నాయి. ఇక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తెర్లాం-బొబ్బిలి ఆర్ అండ్ బీ రోడ్డులో తెర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దాటిన తరువాత ఉన్న మంగళి గెడ్డ కాలువపై గతంలో నిర్మించిన కాజ్‌వేకు రెండు వైపులా రక్షణ గోడలు లేవు. రాజాం-రామభద్రపురం రాష్ట్రీయ రహదారిని ఆనుకొని టెక్కలివలస, పెరుమాళి, నెమలాం జంక్షన్, డి.గదబవలస, పణుకువలస జంక్షన్, వెలగవలస, రంగప్పవలస, తెర్లాం జంక్షన్, ఎంఆర్ అగ్రహారం, కూనాయవలస గ్రామాలు ఉన్నా యి. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వాహనాల రాకపోకలు ఉంటాయి. కానీ ప్రమాదాల నివారణకు అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం. -
చక్కెర కావాలా నాయనా!
బుచ్చిరెడ్డిపాళెం : కర్మాగార అధికారుల నిర్లక్ష్యం, జిల్లా అధికారుల పర్యవేక్షణ లేమితో కోవూరు చక్కెర కర్మాగారంలో చక్కెర అమ్మకాల్లో గోల్మాల్ జరిగింది. కలెక్టర్, జేసీ సమక్షంలో జరగాల్సిన అమ్మకాలు కర్మాగారం అధికారులే జరిపారు. నగదును డీడీల రూపంలో తీసుకోకుండా చెక్ తీసుకున్నారు. తీరా చెక్ బౌన్స్ కావడంతో జాగ్రత్తపడేందుకు మరో ఆలోచన చేశారు. విషయాన్ని గోప్యంగా ఉంచి జిల్లా అధికారుల వద్దకు అమ్మకాల వ్యవహారాన్ని తీసుకెళ్లారు. రెండు సీజన్ల నిల్వ చక్కెరకు మళ్లీ తాజాగా సోమవారం టెండర్లు పిలిచారు. వివరాల్లోకి వెళితే.... కోవూరు చక్కెర కర్మాగారం పరిధిలో 2012-13 సంవత్సరానికి 2,428 హెక్టార్లలో చెరకును సాగుచేశారు. అందుకు సంబంధించి 1.73 లక్షల మెట్రిక్ టన్నులకు కర్మాగారం అగ్రిమెంట్ జరిగింది. అయితే కర్మాగారంలో ఎక్కువసార్లు బ్రేక్‌డౌన్ జరగ డంతో కేవలం 89,356 మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ జరిగింది. దీంతో అగ్రిమెంట్ జరిగిన మిగతా 84వేల మెట్రిక్ టన్నుల చెరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా చక్కెర కర్మాగారాలకు తరలింది. ఇదిలా ఉంటే అగ్రిమెంట్ కాని చెరకు 55 వేల మెట్రిక్ టన్నుల చెరకు కర్మాగారం పరిధిలో ఉంది. దానిని కూడా మహబూబ్‌నగర్, ఖమ్మం, కృష్ణా, చిత్తూరు జిల్లాలోని చక్కెర కర్మాగారాలకు రైతులు తరలించారు. అయితే కోవూరు చక్కెర కర్మాగారంలో క్రషింగ్ జరిగిన 89,356 మెట్రిక్ టన్నుల చెరకుకు 63,515 క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి జరిగింది. కలెక్టర్ జోక్యంతో ఇందులో 59,519 క్వింటాళ్ల చక్కెర అమ్మకాలు జరిగాయి. 3,996 క్వింటాళ్ల చక్కెర మిగిలిపోయింది. అలాగే 2011-12 గాను కర్మాగారంలో 1,06,406 మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ కాగా 80వేల క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి జరిగింది. అందులో అమ్మకాలు పోగా 248 క్వింటాళ్ల చక్కెర మిగిలింది. దీంతో రెండు సీజన్లకు గాను 4,244 క్వింటాళ్ల చక్కెర నిల్వ ఉన్నట్లు అధికారుల లెక్కల్లో తేలింది. అధికారుల నిర్లక్ష్యం ఇలా.. సహాయ చక్కెర కమిషనర్ సత్యనారాయణ హయాంలో 4,244 క్వింటాళ్లకు సంబంధించి అమ్మకాలు జరిపేందుకు ప్రయత్నాలు జరిగాయి. అవి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు సంబంధం లేకుండా జరిగినట్లు సమాచారం. అయితే చక్కెరను కొనేందుకు వచ్చిన ముగ్గురు కొనుగోలుదారుల్లో ఇద్దరు డీడీలు తీసుకురాగా, మరో వ్యక్తి చెక్‌బుక్‌తో వచ్చాడు. అయితే డీడీలు తెచ్చిన వ్యక్తులు కిలో రూ.18.19 లెక్కన చక్కెర కొనుగోలుకు రాగా, మరో వ్యక్తి దాదాపు రూ.25 వరకు కొనేందుకు సిద్ధమయ్యారని సమాచారం. దీంతో ఆ వ్యక్తికే చక్కెరను అధికారులు అమ్మారు. ఆ సమయంలో అతను కేవలం చెక్‌ను మాత్రమే అధికారులకు ఇచ్చాడు. అయితే అతను కొన్న రెండు రోజులకే మార్కెట్లో ధర అమాంతంగా పడిపోవడంతో చ క్కెరను తరలించేందుకు ముందుకు రాలేదు. ఇదే సమయంలో కొన్న వ్యక్తి ఇచ్చిన చెక్‌ను బ్యాంకులో జమచేయగా అది కాస్తా బౌన్స్ అయ్యింది. కొన్నవ్యక్తి ఎవరో తెలియక, కోర్టులో కేసు వేయలేక అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. తాజాగా జాయింట్ కలెక్టర్ సమక్షంలో మళ్లీ నిల్వ ఉన్న 4,244 క్వింటాళ్ల చక్కెరకు టెండర్లు పిలిచారు. వీటిలో మంచి చక్కెర 767 క్వింటాళ్లు ఉండగా తడిసిన చక్కెర 3,767 క్వింటాళ్లు ఉంది. వీటిలో సోమవారం సాయంత్రం 3,767 క్వింటాళ్లకు కిలో రూ.16.10 లెక్కన టెండరు ఖరారైంది. దీనిపై బుధవారం జాయింట్ కలెక్టర్ ఆమోదం లభించింది. అయితే మిగిలిన మంచి చక్కెర 767 బస్తాలకు జనవరి 20న పర్చేసింగ్ కమిటీ సభ్యులు, జేసీ కూర్చుని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వేబిల్లు పరిస్థితి ఏమిటో..? ఇప్పుడు చక్కెరను తరలించేందుకు వే బిల్లులు తప్పనిసరిగా మారాయి. వేబిల్లుల ప్రక్రియ కర్మాగారం అధికారులు చేస్తారా, కొనుగోలుదారుడు తెచ్చుకుంటాడా అన్న అంశం సంశయంగా మారింది. దీంతో చక్కెర తరలింపులో జాప్యం నెలకొంది. ఇప్పటికైనా కోవూరు చక్కెర కర్మాగారంలో అవకతవలపై జరుగుతున్న గోల్‌మాల్‌పై కలెక్టర్ జానకి, జాయింట్ కలెక్టర్ రేఖారాణి దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
‘ఫిట్’..ఫట్!
రోడ్డుపైకి 151 కండీషన్ లేని స్కూలు బస్సులు నిబంధనలు కాలరాస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు మేల్కొనని ఆర్టీఏ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు: ఆర్టీఓ విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ప్రైవేట్ పాఠశాలల ప్రచారపర్వం ముగిసి, పిల్లల మార్పుచేర్పు కూడా జరిగిపోయింది. కానీ చిన్నారులను స్కూళ్లకు తీసుకెళ్లే బస్సు ఫిట్నెస్ మాత్రం పూర్తికాలేదు. కండీషన్‌లేని బస్సులు రోడ్డుపై తిరుగుతూనే ఉన్నాయి. ఒక్కో బస్సులో రెండింతల విద్యార్థులను కుక్కి స్కూళ్లకు తీసుకెళ్తున్నా.. పట్టించుకునేవారు లేరు. అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్‌స్కూళ్ల యాజమాన్యాల లాభార్జన.. వెరసి విద్యార్థుల భద్రత గాల్లోదీపంగా మారింది . సాక్షి, మహబూబ్‌నగర్/క్రైం: విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపే స్కూలుబస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. జిల్లావ్యాప్తంగా ఉన్న 794 బస్సులకు గాను ఇప్పటి 643 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా 151 బస్సులు కండిషన్ లేకుండానే రోడ్డుపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. దీంతో వందలాది మంది విద్యార్థులు సురక్షితం లేని ప్రయాణం మధ్య చదువుకుంటున్నారని తెలిసింది. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తరువాత కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు. ముందుగానే వాహనాల తనిఖీ బాధ్యతను విస్మరిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభం కాకముందే పిల్లలను తీసుకెళ్లే స్కూలు బస్సుల ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేసి ధ్రువీకరణపత్రాలు జారీచేయాలి. ఆ తర్వాత కూడా రవాణాశాఖ నిబంధనలకు అనుగుణంగా తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ జిల్లా రవాణాశాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేయలేదు. 40 కేసులు..లక్ష జరిమానా! జిల్లాలో ఐదువేలకు పైగా ప్రైవేట్‌స్కూళ్లు బస్సులు ఉన్నాయి. వీటిలో కొన్నింటిలో ఒక్కోస్కూల్లో రెండు నుంచి ఐదుబస్సుల వరకు ఉన్నాయి. ఇలా జిల్లావ్యాప్తంగా 794 బస్సులు ఉన్నట్లు ఆర్టీఏ లెక్కలు చెబుతున్నాయి. అయితే వీటిలో చాలా కండీషన్‌లేని బస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఒక బస్సులో 42 మంది విద్యార్థులు, మినీ బస్సులో 24 మంది విద్యార్థులను కూర్చోబెట్టాలి. కానీ ఒక్కోబస్సులో 50 మంది చిన్నారులను కుక్కుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటివరకు 40కేసులు నమోదుచేసి.. రూ.లక్ష వరకు జరిమానా విధించారు. సాధారణంగా ఒక స్కూలు బస్సు 15 ఏళ్ల లోపు మాత్రమే రోడ్డుపై తిరిగాలి. కానీ మారుమూల ప్రాంతాలైన కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నారాయణపేట, కొడంగల్ తదితర ప్రాంతాల్లో అక్కడక్కడ తిప్పుతున్నట్లు సమాచారం. ఇవీ నిబంధనలు నర్సరీ నుంచి పదో తరగతులను నిర్వహించే పాఠశాలల బస్సులు తప్పనిసరిగా కిటికీలకు ఇనుపగ్రిల్స్ను ఏర్పాటు చేయాలి. బస్సుబ్రేకుల కండీషన్లో ఉన్నాయో? లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉన్న డ్రైవర్లనే స్కూలు బస్సులను నడిపేందుకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు నియమించాలి.బస్సు డ్రైవర్ వయస్సు 60 ఏళ్లకు మించరాదు.బస్సు నడిపే వ్యక్తి డ్రైవింగ్ సామర్థ్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అనుమానాలు ఉంటే వారిని మార్చాలి.ఇందుకోసం బస్సు వెనకభాగంలో ఎడమవైపు పాఠశాల యాజమాన్యం ఫోన్ నంబర్‌ను రాయాలి.బస్సుల్లో చెక్కసీట్లకు బదులు కుషన్ ఉన్న సీట్లను అమర్చాలి.బస్సులో ప్రయాణించే విద్యార్థుల కదలికలు డ్రైవర్ గమనించేందుకు అనువుగా రియల్మిర్రర్ను ఏర్పాటు చేయాలి.బస్సుల్లో సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను తీసుకుపోరాదు.అత్యవసర ద్వారం, ప్రథమచికిత్స పెట్టెలు బస్సులో అందుబాటులో ఉండాలి. ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగితే, వాటిని నివారించేందుకు అగ్నిమాపక యంత్రం నర్సరీ నుంచి ఐదోతరగతి వరకు విద్యార్థులను తరలించే బస్సుల్లో పిల్లలు సులువుగా కిందికి దిగేందుకు వీలుగా మరోమెట్టును కిందివైపునకు అమర్చాలి. ఫిట్నెస్ టెస్టులు త్వరలో పూర్తి స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌కు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. ఇంకా 150బస్సులను పరీక్షించాల్సి ఉంది. ఇప్పటికే అధికారులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించాం. అలాగే నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. రవాణా నిబంధనల అమలు కోసం త్వరలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం.. పిల్లల తల్లిదండ్రులు కూడా వారి బాధ్యతగా స్కూల్బస్సులపై నిఘా ఉంచాలి. ఏమైనా అనుమానాలుంటే తక్షణం ఫిర్యాదు చేయొచ్చు. - ఎల్.కిష్టయ్య, ఆర్టీఓ, మహబూబ్‌నగర్ -
భార్య కళ్లెదుటే...
పూసపాటిరేగ : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.. ఓ రైతు ప్రాణాన్ని బలిగొంది. నేలకూలిన స్తంభాన్ని పునరుద్ధరించకపోవడం.. ఇది గమనించని రైతు వేలాడుతున్న వైర్లను పొరపాటున తగలడం.. వెరసి భార్య కళ్ల ముందే ఆ భర్త విగతజీవిగా మారాడు. మండలంలోని చల్లవానితోట పంచాయతీ పరిధి లక్ష్మీదేవితోట కల్లాలులో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పతివాడ ప్రకాశరావు(45)తోపాటు అతని భార్య అన్నపూర్ణ నువ్వుసాగు గొప్పుకు వెళ్లారు. ఇద్దరూ గొప్పు తవ్వుతుండగా.. సమీపంలో విరిగిన విద్యుత్ స్తంభానికి ఉన్న వైర్లు ప్రకాశరావుకు తగిలాయి. వైర్లలో విద్యుత్ ప్రవహిస్తుండడంతో ఆయన షాక్‌కు గురయ్యూడు. సమీపంలోనే గొప్పు తవ్వుతున్న భార్య.. అతనిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యంకాలేదు. ఆమె కళ్ల ముందే గిలగిలా కొట్టుకుంటూ ప్రకాశరావు విగతజీవిగా మారాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారం రోజుల క్రితం స్తంభం నేలకొరిగినా... వారం రోజుల క్రితం వచ్చిన గాలులకు తాడిచెట్టు విరిగి విద్యుత్ స్తంభంపై పడింది. దీంతో స్తంభం నేలకూలింది. అప్పటి నుంచి ఈ స్తంభానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే, బుధవారం ఉదయం నేలమీద ఉన్న స్తంభానికి విద్యుత్ సరఫరా అవడంతో ప్రకాశరావు విద్యుదాఘాతానికి గురై, సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండుప్రాణం గాలిలో కలిసిపోయిందని మృతుని బంధువులతోపాటు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, మాజీ ఎంపీపీ మహంతి చిన్నంనాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు పతివాడ అప్పలనాయుడు, ఇజ్జరోతు ఈశ్వరరావు, మాజీ సర్పంచ్ ఎంవీజీ శంకరరావు, గ్రామ వైస్ సర్పంచ్ అప్పలనాయుడు పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి, పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేశారు.